రివ్యూ:వార్‌
చిత్రం: వార్‌
నటీనటుటు: హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ఫ్రాఫ్‌, వాణి కపూర్‌, అశుతోష్‌, తదితరులు
దర్శకత్వం: సిద్ధార్థ్‌ ఆనంద్‌
నిర్మాత: ఆదిత్య చోప్రా
నిర్మాణ సంస్థ: యష్‌ రాజ్ ఫిలింస్‌
విడుదల తేదీ: 02-10-2019


బాలీవుడ్‌ కండల వీరులు హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ తొలిసారి కలిసి నటించిన చిత్రం కావడం, దానికితోడు వారిద్దరూ పోటాపోటీగా తలపడే పాత్రల్లో నటించడంతో ‘వార్‌’పై ఆసక్తి ఏర్పడింది. దీంతోపాటు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని లొకేషన్లలో తెరకెక్కించడంతో అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో హృతిక్‌, టైగర్‌ మధ్య పోరాట సన్నివేశాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో ట్రైలర్‌లో చూపించారు. అప్పట్నుంచి అభిమానులు సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో బుధవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది..? హృతిక్‌రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారా? 

కథేంటంటే
: సైనికాధికారి కబీర్‌(హృతిక్‌) కొన్ని కారణాల వల్ల రెబెల్‌గా మారుతాడు. అతణ్ని ముట్టుబెట్టడానికి మరో సైనికాధికారి ఖలీద్‌ని (టైగర్‌) రంగంలోకి దింపుతారు. ఖలీద్‌ గతంలో కబీర్‌ వద్దే యుద్ధవిద్యల్లో శిక్షణ తీసుకుని ఉంటాడు. అందుకే అతణ్ని గురువుగా భావిస్తుంటాడు. ఇప్పుడు గురువుతోనే తలపడాల్సిన పరిస్థితి. ఈ గురుశిష్యుల సమరంలో ఎవరు గెలిచారు? కబీర్‌ ఎందుకు రెబల్‌గా మరాడు అన్నది తెరపై చూడాలి.

ఎలా ఉందంటే: యాక్షన్‌ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో హృతిక్‌‌, టైగర్‌ నటన ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. వీరిద్దరి మధ్య చిత్రీకరించిన ఫైట్‌ సన్నివేశాలు యాక్షన్‌ ప్రియులను మైమరిపిస్తాయి. ప్రథమార్ధంలోని కొన్ని ట్విస్ట్‌లు ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తాయి. ద్వితీయార్ధంలో కథలోని మలుపు తెలిసిపోయాక చిత్రం సాదాసీదాగా అనిపిస్తుంది. దీంతో సినిమా రోటీన్‌గా ఉన్న భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. దర్శకుడు ఎక్కువగా యాక్షన్‌ సన్నివేశాల మీద ఆసక్తి చూపించి.. కథ మీద అంతగా దృష్టి పెట్టలేదనిపిస్తుంది. వాణీ కపూర్‌ పాత్రను యాక్షన్‌ సన్నివేశాల మధ్య రిలీఫ్‌ కోసమే వాడుకున్నట్లుగా ఉంది.ఎవరెలా చేశారంటే: ‘సూపర్‌30’ విజయం తర్వాత హృతిక్‌ నటించిన చిత్రమిది. ఇందులోను ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మరోవైపు హృతిక్‌, టైగర్‌ మధ్య చిత్రీకరించిన యాక్షన్‌ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ఈ సినిమాలో వాణీకపూర్‌ది చిన్నపాత్ర. గ్లామర్‌ సన్నివేశాల కోసం మాత్రమే ఆమెని ఉపయోగించుకున్నట్లు అనిపిస్తుంది. పరిధి మేరకు ఆమె చక్కగా నటించారు. అశుతోష్‌ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా అనిపించాయి. కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు హలీవుడ్‌ చిత్రాలను తలపించాయి. ‘వార్‌’ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ‘మిషన్‌ ఇంపాజిబుల్’, ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరీయస్‌’ చిత్రాల్లోని సన్నివేశాలకు తగ్గట్టుగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం సినిమాని మరోస్థాయికి తీసుకువెళ్లింది.


బలాలు
+ హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ నటన,
+ యాక్షన్‌ సన్నివేశాలు
బలహీనతలు 
- కథ మీద అంతగా దృష్టి పెట్టకపోవడం


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.