రివ్యూ: వై చీట్‌ ఇండియా
రివ్యూ: వై చీట్‌ ఇండియా
సినిమా పేరు: వై చీట్‌ ఇండియా(హిందీ)
నటీనటులు: ఇమ్రాన్‌ హష్మీ, శ్రియ ధన్వంతరి, స్నిగ్దాదీప్‌ ఛటర్జీ తదితరులు
సంగీతం: రోచక్‌ కోహ్లీ, గురు రాంధవా
సినిమాటోగ్రాఫీ: ఆల్ఫోన్స్‌ రాయ్‌
కూర్పు: దీపిక కల్రా
నిర్మాణ సంస్థ: టి సరీస్‌ ఫిలింస్‌, ఎలిప్సిస్‌ ఎంటర్‌టైన్‌మెంట్, ఇమ్రాన్‌ హష్మీ ఫిలింస్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సౌమిక్‌ సేన్‌
విడుదల తేదీ: 18-01-2019

                                 

బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో ఇమ్రాన్‌ హాష్మీకి ‘సీరియల్‌ కిస్సర్‌’ అనే పేరుంది. ఎందుకంటే ఆయన సినిమాల్లో శృంగారభరితమైన సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆ ఇమేజ్‌ను పక్కనబెట్టి ‘వై చీట్‌ ఇండియా’ అనే సామాజిక అంశంతో తెరకెక్కిన కథను ఎంపికచేసుకున్నారు. ఇమ్రాన్‌ గతంలో నటించిన సినిమాలు ఒక ఎత్తైతే ఈ సినిమా మరో ఎత్తు. ఇలాంటి పాత్రలో ఇమ్రాన్‌ గతంలో నటించలేదు. భారతదేశ విద్యా వ్యవస్థలో జరుగుతున్న కుంభకోణం నేపథ్యంలో దర్శకుడు సౌమిక్‌ సేన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చాలా కాలం తర్వాత ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇమ్రాన్‌ ఈ చిత్రంతో విజయం అందుకుంటారా? చూద్దాం.* కథేంటంటే..
రాకేశ్‌ (ఇమ్రాన్‌) పరీక్షల నిర్వాహణలో స్కాంలకు పాల్పడుతుంటాడు. కష్టపడకుండా మార్కులు సులువుగా రావాలని అనుకునే విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని వారి స్థానంలో మధ్యతరగతికి చెందిన తెలివైన విద్యార్థులను కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తుంటాడు. అలా చేసినందుకు గానూ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటాడు. అలా అర్హతలేని విద్యార్థులను పరీక్షలు రాయకుండానే పాస్‌ చేయిస్తుంటాడు. ఇలాంటి స్కాంలు చేస్తే దొరికిపోలేం అనుకుంటూ జీవిస్తున్న ఇమ్రాన్‌కు ఒక్కసారిగా షాకింగ్‌ ఘటన ఎదురవుతుంది. ఇమ్రాన్‌ చేస్తున్న మోసం ఓ విద్యార్థి పొరపాటుతో బయటపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఇమ్రాన్‌ ఎలా పట్టుబడ్డాడు? తదితర విషయాలు తెరపైనే చూడాలి.


* ఎలా ఉందంటే..
ఓ వ్యవస్థ దేశాన్ని ఎలా మోసం చేస్తుందో ఈ చిత్రంలో చూపించారు దర్శకుడు సౌమిక్‌. కథకు సరిపోయే టైటిలే పెట్టారు. అసలైతే ఈ చిత్రానికి తొలుత ‘చీట్‌ ఇండియా’ అనే టైటిల్‌ను పెట్టారు. కానీ ‘ఇండియాను మోసం చేయండి’ అని టైటిల్‌ సూచిస్తున్నట్లు ఉందని సెన్సార్‌ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. దాంతో ‘వై చీట్‌ ఇండియా’ అని పేరు మార్చారు. విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందో అద్దంపట్టినట్లుగా ఈ చిత్రంలో చూపించారు. సినిమాలో ఇమ్రాన్‌ది ఓ రకంగా మోసపూరితమైన పాత్రే అయినా అతను విద్యావ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలను అడిగే విధానం ఆలోచింపజేసేలా ఉంటుంది. విద్యా వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉంది, ఎంత పక్కాగా మోసాలు చేస్తున్నారో ఈ కథలో సూటిగా వివరించిన విధానం బాగుంది. కానీ విద్యా వ్యవస్థకు సంబంధించి దేశంలో పలు స్కాంలు జరిగాయి. వాటిలో ఏదో ఒకదానిని ఎంచుకుని ఉంటే సినిమా సహజంగా ఇంకా బాగా వచ్చేది. సొంతంగా రాసుకున్న సన్నివేశాలను తెరకెక్కించడంతో అక్కడక్కడా ఫోకస్‌ తప్పినట్లుగా అనిపిస్తుంది.


* ఎవరెలా చేశారంటే..
ఇందులో ప్రధాన పాత్రలో నటించిన ఇమ్రాన్‌ హష్మీ నటనకు నూటికి నూరు మార్కులు పడతాయి. ఇందులో స్నిగ్దాదీప్‌ ఛటర్జీ ఇంజినీరింగ్‌‌ విద్యార్థి పాత్రలో ఇమిడిపోయారు. శ్రియ ధన్వంతరి పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. కానీ ఉన్నంతలో చక్కగా నటించారు. సినిమాలో పాటలకు ప్రాధాన్యం లేదు కానీ నేపథ్య సంగీతం బాగానే కుదిరింది. నిర్మాణ విలువలు సంస్థలకు తగ్గట్టుగానే రిచ్‌గా ఉన్నాయి.

బలాలు:
+ ఇమ్రాన్‌ హష్మీ నటన
+ కాన్సెప్ట్‌

బలహీనతలు:
- అక్కడక్కడా సన్నివేశాల్లో ఫోకస్‌ మిస్సవడం

* చివరగా..
విద్యా వ్యవస్థలోని చీటింగ్‌ మాఫియా..‘వై చీట్‌ ఇండియా’Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.