రివ్యూ: అవెంజర్స్‌- ఇన్ఫినిటీవార్‌
చిత్రం: అవెంజర్స్‌ ఇన్ఫినిటీవార్‌
నటీనటులు: రాబర్ట్‌ డౌనీ జూనియర్‌.. క్రిస్‌ హేమ్స్‌వర్త్‌.. మార్క్‌ రఫెలో.. క్రిస్‌ ఎవాన్స్‌.. స్కార్లెట్‌ జొహాన్సన్‌.. టామ్‌ హొలాండ్‌.. విన్‌ డీసిల్‌.. క్రిస్‌ ప్రాట్‌ తదితరులు
సంగీతం: అలెన్‌ సిల్వస్ట్రీ
సినిమాటోగ్రఫీ: ట్రెంట్‌ ఆప్లాచ్‌
ఎడిటింగ్‌: జెఫ్రీ ఫోర్డ్‌, మాథ్యూస్‌
నిర్మాత: కెవిన్‌ ఫిజీ
దర్శకత్వం: ఆంథోని రుస్సో.. జియో రుస్సో..
బ్యానర్‌: మార్వెల్‌ స్టూడియోస్‌
విడుదల తేదీ: 27-04-2018

సూపర్‌ హీరోల చిత్రాలకు హాలీవుడ్‌లో కొదవలేదు. ముఖ్యంగా ‘స్పైడర్‌మ్యాన్‌’, ‘సూపర్‌మ్యాన్‌’, నుంచి నిన్న మొన్నటి ‘బ్లాక్‌ పాంథర్‌’ వరకూ అందరూ బాక్సాఫీస్‌ను కళకళలాడించిన వాళ్లే. ఇలాంటి చిత్రాలకు పుట్టినిల్లు మార్వెల్‌ స్టూడియోస్‌. ఇప్పటి వరకూ దాదాపు 17 సూపర్‌హీరో చిత్రాలను ఆ సంస్థ నిర్మించింది. ఈ వేసవిలో వినోదాల విందును పంచడానికి మార్వెల్‌ తీసుకొచ్చిన సరికొత్త యాక్షన్‌, సూపర్‌ హీరోస్‌ చిత్రం ‘అవెంజర్స్‌ ఇన్ఫినిటీవార్‌’. ఈ శుక్రవారం విడుదలైన ‘అవెంజర్స్‌..’ ఎలా ఉంది? గత చిత్రాలకు దీటుగా అభిమానులను అలరించిందా?

కథేంటంటే: టైటాన్‌కు చెందిన భారీకాయుడు థానోస్‌. తనంత గొప్ప వ్యక్తి ఈ విశ్వంలో లేడని, మిగిలిన వాళ్లంతా తినడానికి తప్ప దేనికీ పనికిరారని అతడి అభిప్రాయం. అందుకే ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవాలని భావిస్తాడు. అలా చేయాలంటే అత్యంత శక్తిమంతమైన ఆరు ఇన్ఫినిటీ స్టోన్స్‌ను సంపాదించాలి. అవి అక్కడక్కడా ఉంటాయి. వాటిని సాధించే ప్రయత్నం మొదలు పెడతాడు. ఆ క్రమంలో గార్డియన్స్‌.. ఇతర సూపర్‌హీరోలు థానోస్‌ను అడ్డుకునేందుకు యత్నిస్తుంటారు. మరి థానోస్‌ చివరకు శక్తివంతమైన రాళ్లను సొంతం చేసుకున్నాడా? అతడి ప్రయత్నాలను సూపర్‌హీరోలు ఏవిధంగా అడ్డుకున్నారన్నదే ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీవార్‌’.

ఎలా ఉందంటే: ఒక విలన్‌.. అతను ప్రపంచాన్ని నాశనం చేయాలనుకోవడం. అతడి చర్యలను సూపర్‌హీరోలు అడ్డుకోవడం. మార్వెల్‌ విడుదల చేసిన గత చిత్రాలన్నీ దాదాపు ఇదే ప్లాట్‌తో కొనసాగుతాయి. ‘కెప్టెన్‌ అమెరికా: సివిల్‌వార్‌’లో సూపర్‌ హీరోలు రెండు బృందాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పోరాడటం మనం చూశాం. ఇప్పుడు వారంతా ప్రపంచాన్ని అంతం చేయాలనుకున్న థానోస్‌పై ఎలా పోరాడారన్నదానిని ప్రధాన ఇతివృత్తంగా తీసుకున్నాడు దర్శకుడు. అందుకు అనుగుణంగా సన్నివేశాలను అల్లుకుంటూ వెళ్లాడు. అయితే, థానోస్‌పై పోరాడే విషయంలో వాళ్లు బృందాలుగానే పోరాడుతారు. సూపర్‌ హీరోల చిత్రాలంటే యాక్షన్‌కు కొదవ ఉండదు. అందుకు తగినట్లుగానే భారీ యాక్షన్‌ సన్నివేశాలతో సినిమాను తీర్చిదిద్దారు. స్టార్క్‌, స్ట్రేంజ్‌, స్పైడర్‌ మ్యాన్‌, యాంట్‌ మ్యాన్‌లు కలిసి పోరాడే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. ఇక గార్డియన్స్‌, బ్లాక్‌ పాంథర్‌, హల్క్‌ ఒక బృందంగా థానోస్‌ను ఎదుర్కొంటారు. ఆయా సన్నివేశాల్లో విజువల్‌ ఎఫెక్ట్స్‌ను చాలా చక్కగా చూపించారు. థోర్‌ ర్యాంగ్‌రాక్‌లో మాదిరిగా బ్రూస్‌ బ్యానర్‌ (హల్క్‌)‌తో అక్కడక్కడా నవ్వులు పూయించారు.

కేవలం యాక్షన్‌ సన్నివేశాలు మాత్రమే కాదు. కాస్త సెంటిమెంట్‌ను కూడా దట్టించాడు దర్శకుడు. ఒక ఇన్ఫినిటీ స్టోన్‌ కోసం తన సొంత కూతురినే థానోస్‌ చంపుకోవడం, థానోస్‌కు అవసరమైన మరో స్టోన్‌ విజిన్‌ తలపై ఉండటంతో తనని అంతం చేయాల్సిందిగా తన స్నేహితురాలిని కోరే సన్నివేశాలు భావోద్వేగంతో నడుస్తాయి. ఇక థోర్‌ తన కొత్త ఆయుధంతో తిరిగి వచ్చేటప్పుడు ఎలివేషన్‌ సీన్‌ ఓ కమర్షియల్‌ సినిమాకు తగ్గని రీతిలో ఉంటుంది. సూపర్‌హీరోస్‌ సినిమాలంటే అమితంగా ఇష్టపడుతూ వాటిని చూసేవారికి తప్పకుండా నచ్చుతుంది. అయితే, హల్క్‌ను ఎక్కువగా ఇష్టపడేవారికి మాత్రం ఈ చిత్రం నిరాశను మిగులుస్తుంది. చాలా తక్కువ సన్నివేశాల్లో హల్క్‌ కనపడతాడు. కెప్టెన్‌ అమెరికా కూడా కనిపించేది తక్కువే. అన్నట్లు తెలుగు వెర్షన్‌లో థానోస్‌కు యువ కథానాయకుడు రానా డబ్బింగ్‌ చెప్పడం విశేషం. రానా వాయిస్‌తో థానోస్‌ సంభాషణలు పలకడం ప్రేక్షకుడిని సరికొత్త సరదాను పంచుతుంది.

ఎవరెలా చేశారంటే: ఎప్పటిలాగే సూపర్‌హీరోల పాత్రల్లో ఆయా నటులు ఒదిగిపోయారు. అయితే, ఈసారి తెరపై కొత్తగా కనిపించిన విలన్‌ థానోస్‌. జోష్‌ బ్రోలిన్‌ అందులో చక్కగా నటించాడు. ఇక ఐరన్‌మ్యాన్‌గా కనిపించే రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ ముఖంలో కాస్త కళ తప్పింది. బహుశా ఎప్పటి నుంచో ఆ పాత్రను ఆయన చేస్తుండటం, వయసు మీద పడటం కూడా కావచ్చు. దర్శకుడు ఆంథోనీ రుస్సో, జోయ్‌ రుస్సోలు ఎంచుకున్న కథ బాగున్నా, దాన్ని తీర్చిదిద్దిన విధానం ఎన్నో అంచనాలతో వెళ్లిన ప్రేక్షకుడిని కాస్త నిరాశ పరుస్తుంది. అయితే యాక్షన్‌ ప్రియులను మాత్రం ఏమాత్రం నిరాశ పరచదు. ఒక కమర్షియల్‌ సినిమాకు ఉండాల్సిన అన్ని జాగ్రత్తలను చిత్ర బృందం తీసుకుంది. అయితే అందరు సూపర్‌హీరోలకు సమాన ప్రాధాన్యం ఇవ్వలేదోమో అనిపిస్తుంది. బహుశా అలా ఇస్తూ పోతే సినిమా నిడివి పెరిగిపోతుందని భావించి ఉంటారు. సినిమాకు ముగింపు ఇచ్చిన విధానం చూస్తే సీక్వెల్‌ తీసుకొస్తారేమో అనిపిస్తుంది. అలెన్‌ సిల్వస్ట్రీ నేపథ్య సంగీతం యాక్షన్‌సన్నివేశాలకు ప్రాణం పోసింది. థోర్‌ తన కొత్త ఆయుధంతో తిరిగి వచ్చేటప్పుడు థియేటర్‌ ఈలలు, చప్పట్లతో మార్మోగిపోతుంది. సాంకేతికంగా సినిమాను అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దారు. మార్వెల్‌ స్టూడియోస్‌ గత చిత్రాలకు దీటుగా సినిమాను తెరకెక్కించింది.

బలాలు
+ యాక్షన్‌ సన్నివేశాలు
+ ద్వితీయార్ధం
+ అక్కడక్కడా నవ్వులు, పంచ్‌లు

బలహీనతలు
- ప్రథమార్ధం
- కొందరు సూపర్‌హీరోలకు మాత్రమే పెద్దపీట

చివరిగా: యాక్షన్‌ ప్రియులను ఆకట్టుకున్న ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీవార్‌’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.