రివ్యూ: ఎక్స్‌ట్రాక్షన్‌

చిత్రం: ఎక్స్‌ట్రాక్షన్‌


నటీనటులు:
క్రిస్‌ హ్యామ్స్‌వర్త్‌, రణదీప్‌ హుడా, ప్రియాంన్షు, రుద్రాక్ష జైశ్వాల్‌, గాల్‌స్విఫ్ట్‌ ఫర్హానీ, నేహా మహాజన్‌, పంకజ్‌ త్రిపాఠి తదితరులు

సంగీతం: హెన్రీ జాక్‌మెన్‌, అలెక్స్‌ బ్లేచర్‌

సినిమాటోగ్రఫీ: న్యూటన్‌ థామస్‌ సెగెల్‌

ఎడిటింగ్‌: పీటర్‌ బి. ఇల్లిస్‌, అస్లాన్‌

కథ, స్క్రీన్‌ప్లే: ఆండీ పార్క్స్‌, జోయ్‌రుస్సో, ఆంథోని రుస్సో

నిర్మాత: ఆంథోనీ రుస్సో, జోయ్‌రుస్సో, క్రిస్‌ హ్యామ్స్‌వర్త్‌

దర్శకత్వం: సామ్‌ హార్‌గ్రేవ్‌

విడుదల:  నెట్‌ఫ్లిక్స్‌  (ఏప్రిల్‌  24, 2020)కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. షూటింగ్‌లు లేవు. థియేటర్లు మూతపడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సగటు సినీ ప్రేక్షకుడికి వినోదాన్ని పంచేవి టెలివిజన్‌ ఛానళ్లు, ఓటీటీ ఫ్లాట్‌ఫాంలు, సామాజిక మాధ్యమాలు. దీంతో ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలను తాము విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పలు ఓటీటీ వేదికలు చెబుతున్నాయి. థియేటర్‌లో విడుదల సాధ్యం కాదనుకున్న కొన్ని సినిమాలను ఇప్పటికే ఓటీటీ వేదికలపై విడుదల చేస్తున్నారు. అలా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్‌ వేదికగా విడుదలైన చిత్రం ‘ఎక్‌ట్రాక్షన్‌’. అవెంజర్స్‌ బృందంలో ఒకడైన ‘థోర్‌’ పాత్రధారి క్రిమ్‌ హ్యామ్స్‌ వర్త్‌ ఇందులో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు, భారతీయనటులు రణ్‌దీప్‌ హుడా, ప్రియాంన్షు, పంకజ్‌ త్రిపాఠిలు నటించడం విశేషం. ఇంకో విశేషమేంటంటే భారతీయ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేశారు. మరి తాజాగా విడుదలైన ‘ఎక్‌ట్రాక్షన్‌’ ఎలా ఉంది? క్రిస్‌ హ్యామ్స్‌ వర్త్‌ యాక్షన్‌ అదరగొట్టాడా?


కథేంటంటే:
ఓవీ మహాజన్ సీనియర్‌‌(పంకజ్‌ త్రిపాఠి) భారత్‌లో నేర సామ్రాజ్యానికి అధిపతి. జైల్లో ఉంటాడు. అతని కుమారుడు ఓవీ మహాజన్‌ జూనియర్‌(రుద్రాక్ష జైశ్వాల్‌)కు శత్రువుల నుంచి ఆపద ఉండటంతో సాజు (రణ్‌దీప్‌ హుడా) సంరక్షణలో ఉంచుతాడు. ఒకరోజు పార్టీకి వెళ్లిన ఓవీ మహాజన్‌ జూనియర్‌ను బంగ్లాదేశ్‌లోని నేర సామ్రాజ్యానికి అధిపతి అయిన ఆమిర్‌ ఆసిఫ్‌(ప్రియాంన్షు) కిడ్నాప్‌ చేస్తాడు. విషయం తెలిసిన ఓవీ మహాజన్‌ సీనియర్‌.. సాజును హెచ్చరించి, తన కుమారుడిని ఎలాగైన తీసుకురావాలని చెబుతాడు. దీంతో అతనితో పాటు డబ్బు కోసం ఎలాంటి సాహసమైనా చేసే ఒక బృందాన్ని కలిసి విషయం చెబుతాడు. ఆ పిల్లాడిని కాపాడేందుకు ఆ బృందం సాహసవంతుడైన టేలర్‌ రేక్‌(క్రిస్‌ హ్యామ్స్‌వర్త్‌)ను బంగ్లాదేశ్‌కు పంపుతుంది. మరి ఆమిర్‌ అపహరించిన ఓవీ మహాజన్‌ జూనియర్‌ను టేలర్‌ ఎలా రక్షించాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన అడ్డంకులు ఏంటి? ఓవీని ప్రాణాలతో రక్షించాడా? అన్నది నెట్‌ఫ్లిక్స్‌లో చూడాలి.ఎలా ఉందంటే:

ఇదొక యాక్షన్‌ థ్రిల్లర్‌. ఇలాంటి జానర్‌లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కథానాయకుడు ఒక మిషన్‌ కోసం రంగంలోకి దిగడం. శత్రువుల నుంచి ఎదురయ్యే అడ్డంకులను తన భుజ బలం, బుద్ధి బలంతో అధిగమించడం చాలా సినిమాల్లో చూశాం. ఇది కూడా అంతే. అయితే, పరిస్థితులు విషమించి తన ప్రాణాల మీదకు వస్తే, మిషన్‌ మధ్యలో ఆపేసి వచ్చేయొచ్చు. ఓవీ మహాజన్‌ను కాపాడి ప్రాణాలతో తీసుకురావాలన్నది టేలర్‌ లక్ష్యం. అందుకు అతనికి అడ్డువచ్చిన ప్రతి ఒక్కరినీ చంపేస్తాడు. సినిమా మొదలైన కొద్దిసేపటికే ఓవీ కిడ్నాప్‌ కావడం తదితర సన్నివేశాలతో నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు. టేలర్‌ మిషన్‌ ప్రారంభించిన తర్వాత ఓవీని అక్కడి నుంచి ఎలా తప్పిస్తాడన్న ఉత్కంఠ ప్రేక్షకుడిలో కలుగుతుంది. ఈ క్రమంలో అడ్డు వచ్చిన వారిని చంపుకొంటూ వెళ్తాడు టేలర్‌. ఈ సన్నివేశాలన్నీ యాక్షన్‌ ప్రియులను మాత్రమే అలరించేలా ఉన్నాయి. కొన్ని చోట్ల పబ్జీ గేమ్‌ రియల్‌గా ఆడుతున్నారా? అనిపిస్తుంది. ఎక్కువ తుపాకులకు పని పెట్టాడు దర్శకుడు. దాని బదులు తెలివిగా ట్రాప్‌ చేయడం, బాండ్‌ సినిమా తరహాలో అత్యాధునిక వస్తువులు వినియోగించడం చేసి ఉంటే ఆయా సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా ఉండేవి.


ఒకానొక సమయంలో టేలర్‌కు ఉన్న అన్ని దారులు మూసుకుపోతాయి. అలాంటి పరిస్థితుల్లో బాలుడిని చంపి, అక్కడి నుంచి వెళ్లిపోమని టేలర్‌కు సలహా ఇస్తాడు అతని స్నేహితుడు. ఆ అవకాశం ఉన్నా, టేలర్‌ ఓవీ ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. మిషన్‌ మొదలు పెట్టిన దగ్గరి నుంచి చివరి వరకూ టేలర్‌ పోరాటం చేస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు ఇంకా ఎంతమందిని టేలర్‌ చంపుకొంటూ వెళ్తాడన్న విసుగు ప్రేక్షకుడికి వస్తుంది. క్లైమాక్స్‌ వచ్చే సరికి హింస మరింత పెరుగుతుంది. అందరూ ఊహించిన క్లైమాక్స్‌తో సినిమా ముగుస్తుంది. సినిమా ప్రారంభం నుంచి చాలా లాజిక్‌ పాయింట్లను వదిలేశాడు దర్శకుడు. ఓవీ మహాజన్‌ సీనియర్‌, ఆమిర్‌ ఆసిఫ్‌లను రెండు దేశాలకు చెందిన నేర సామ్రాజ్యాధినేతలు మాత్రమే చూపించాడు? వీరి మధ్య ఏం జరిగిందన్న విషయాన్ని చెప్పలేదు. టేలర్‌ గతాన్ని కూడా అతని మాటల ద్వారానే చెప్పించాడు. స్పెషల్ఎయిర్‌ సర్వీస్‌ రిజిమెంట్‌ సర్వీస్‌కు చెందిన టేలర్‌కు ఎందుకు డబ్బుకోసం ఏ పనైనా చేయడానికి సిద్ధపడ్డడాన్న విషయం చెప్పలేదు. ‘నాకు డబ్బు ఎంతో ముఖ్యం’ అంటూ రెండు మూడు చోట్ల చెప్పించాడంతే.ఎవరెలా చేశారంటే:

ఈ సినిమాలో పాత్రలు చాలా తక్కువ. టేలర్‌గా కీలక పాత్రలో కనిపించిన క్రిస్‌ హ్యామ్స్‌ వర్త్‌, ఓవీ మహాజన్‌ జూనియర్‌గా నటించిన రుద్రాక్షలు ఎక్కువగా కనిపిస్తారు. ఈ సినిమాకు ప్రధాన బలం క్రిస్‌ హ్యామ్స్‌వర్త్‌. ‘థోర్‌’గా అందరికీ అతడు పరిచయం. దీంతో అతడి అభిమానులు క్రిస్‌ నుంచి ఎలాంటి యాక్షన్‌ కథను ఆశిస్తారో అలాంటి కథే ఇది. సినిమా మొత్తం తన భుజంపైనే వేసుకొని మోశాడు క్రిస్‌. బాలుడిగా నటించిన రుద్రాక్ష జైశ్వాల్‌ పర్వాలేదు. ఇక ఈ సినిమాలో చెప్పుకోదగిన నటుల్లో రణ్‌దీప్‌ హుడా ఒకరు. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్నా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చినవి రెండు మూడు మాత్రమే ఉన్నాయి. ‘ఎక్స్‌ట్రాక్షన్‌’తో ఆ లోటు తీరుతుందని రణ్‌దీప్‌ ఆశించాడు. అయితే, అతడి పాత్ర యాక్షన్‌ సన్నివేశాలకే పరిమితమైంది. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు మిషన్‌లోకి దిగిన రణ్‌దీప్‌ చివరిలో చూస్తున్న ప్రేక్షకుడికి బాధ కలిగిస్తుంది. మిగిలిన నటులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

సాంకేతిక బృందమంతా హాలీవుడ్‌కు చెందిన వాళ్లు కావడంతో అదంతా తెరపై కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాకు ప్రధాన బలం, సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం. ముఖ్యంగా న్యూటన్‌ థామస్‌ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఛేజింగ్‌ సన్నివేశాలు అలరిస్తాయి. సింగిల్‌ టేక్‌ సన్నివేశాలు చాలా చోట్ల కనిపిస్తాయి. ఇక హెన్రీ నేపథ్య సంగీతం సినిమా మరో ప్రధాన ఆకర్షణ. దర్శకుడిగా సామ్‌ హ్యార్‌గ్రేవ్‌కు ఇదే మొదటి చిత్రం. ‘కెప్టెన్‌: అమెరికా సివిల్‌ వార్‌’, ‘అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌’లకు స్టంట్‌ కో-ఆర్డినేటర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో ఈ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలను చక్కగా తీర్చిదిద్దాడు. ఇంకో మంచి విషయం ఏంటంటే, అందరూ హాలీవుడ్‌ నటులే కాకుండా బాలీవుడ్‌ నటులు కూడా ఇందులో కనిపించడం సగటు భారతీయ ప్రేక్షకుడికి ఉపశమనం కలిగించే అంశం. యాక్షన్‌ సినిమాలు ఇష్టపడే వారికి మాత్రం ఈ లాక్‌డౌన్‌ వేళ ఈ సినిమా తప్పకుండా కాలక్షేపాన్నిస్తుంది.

బలాలు 

+ క్రిస్‌ హ్యామ్స్‌వర్త్‌ 

+ పోరాట సన్నివేశాలు 

+ సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం

బలహీనతలు

- కథలో కొత్తదనం లేకపోవడం


- మితి మీరిన హింస

చివరిగా: లాక్‌డౌన్‌ వేళ యాక్షన్‌ ప్రియులను అలరించే ‘ఎక్స్‌ట్రాక్షన్‌’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.