
గాత్రధారులు: ఎలిన్ డి జెనిరెస్.. అల్బర్ట్ బ్రూక్స్.. ఎడ్ ఓ నీల్.. కైట్లిన్ ఒల్సన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: జెరిమి లాస్కీ
సంగీతం: థామస్ న్యూమ్యాన్
కథ: ఆండ్రూ స్టాంటన్.. బాబ్ పీటర్సన్
నిర్మాణం: వాల్ట్ డిస్నీ పిక్చర్స్.. పిక్సర్ యానిమేషన్ స్టూడియోస్
దర్శకత్వం: ఆండ్రూ స్టాంటన్
విడుదల తేదీ: 17-06-2016
చిన్నారులకు కార్టూన్ కథలు బాగా నచ్చుతాయి. యానిమేషన్ చిత్రాలంటే.. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టపడతారు. అందుకే హాలీవుడ్లో యానిమేషన్ చిత్రాలను రూ. వేల కోట్లతో భారీ స్థాయిలో తెరకెక్కిస్తుంటారు. వసూళ్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. 2003లో 94 మిలియన్ డాలర్లతో తెరకెక్కిన ‘ఫైండింగ్ నెమో’ 935 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. సముద్రంలోని ఓ చేపల కుటుంబం నుంచి తప్పిపోయిన నెమో అనే చేప కోసం వెతుకులాట నేపథ్యంలో ఆ చిత్రం తెరకెక్కి ఘన విజయం సాధించింది. తాజాగా.. దీనికి సీక్వెల్గా ‘ఫైండింగ్ డోరి’ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం!
కథేంటీ..?
జెన్నీ.. ఛార్లీ అనే చేప దంపతులకు డోరి అనే కుమార్తె ఉంటుంది. డోరికి ఉన్న మతిమరుపు వల్ల ఓ రోజు తల్లిదండ్రుల నుంచి తప్పిపోతుంది. దీంతో తిరిగి ఎలాగైనా తన తల్లిదండ్రుల దగ్గరికి చేరాలని ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో మర్లిన్ అనే మగ చేప తారసపడుతుంది. దాంతో ప్రేమలో పడి అక్కడే మర్లిన్.. నెమో చేపలతో స్థిరపడిపోతుంది. ఓ రోజు నెమో స్కూల్లో ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు తన తల్లిదండ్రుల విషయం గుర్తొస్తుంది. దీంతో మర్లిన్.. నెమో సాయంతో తల్లిదండ్రుల కోసం వెతుకులాట ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో వీరు ముగ్గురు ప్రమాదంలో చిక్కుకుంటారు. ఆ ప్రమాదం నుంచి వారు ఎలా తప్పించుకున్నారు? తర్వాత ఏం జరిగింది? డోరి తన తల్లిదండ్రులను కలుసుకుందా? లేదా అన్న విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
.jpg)
ఎలా ఉందంటే..?
‘ఫైండింగ్ నెమో’.. ‘ఫైండింగ్ డోరి’.. రెండింట్లోనూ ఒకే కాన్సెప్ట్. ‘ఫైండింగ్ నెమో’లో తప్పిపోయిన చేప పిల్ల కోసం తండ్రి చేప అన్వేషిస్తే.. ఈ చిత్రంలో తప్పిపోయిన డోరి తన తల్లిదండ్రుల కోసం అన్వేషిస్తుంది. మొదటి చిత్రంలో ఉన్న చాలా పాత్రలు ఈ చిత్రంలోనూ కనిపిస్తాయి. యానిమేషన్ పాత్రలే అయినా కుటుంబం.. ప్రేమానురాగాలను చక్కగా చూపించారు. జలచరాలు కారుని వెంబడించడం.. ఆక్టోపస్ కారుని నడపడం వంటి కొన్ని సన్నివేశాలు చూసేందుకు సరదాగా ఉంటాయి. చిత్రంలో ఎక్కువ భాగం మరైన్ ల్యాబ్ అండ్ ఎక్వెరియం థీమ్ పార్కు చుట్టు నడుస్తోంది. ఇందులో పాత్రలు.. ప్రదేశాలను యానిమేషన్లో చక్కగా చిత్రీకరించారు. గాత్రధారులు పాత్రలకు వాయిస్ ఇవ్వడంలో నూరు శాతం న్యాయం చేకూర్చారు. సంగీతం కూడా బాగా ఆకట్టుకుంటుంది. దర్శకుడి ప్రతిభను మెచ్చుకోవాల్సిందే.
బలాలు
+ పాత్రలు.. చక్కని యానిమేషన్
+ కథ
+ సంగీతం
బలహీనతలు
- స్లో నరేషన్
- స్క్రీన్ప్లే
చివరగా: ‘ఫైండింగ్ డోరి’ని ఫన్ కోసం చూడొచ్చు
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.