రివ్యూ: సముద్ర పుత్రుడు
సినిమా: సముద్ర పుత్రుడు(ఆక్వామెన్‌)
నటీనటులు: జేసన్‌ మొమోవా, ఆంబర్‌ హర్డ్‌, విల్లెమ్‌ డఫో, ప్యాట్రిక్‌ విల్సన్‌, నికోల్‌ కిడ్మన్‌
సంగీతం: రూపర్ట్‌ గ్రెగ్సన్‌, విలియమ్స్‌
కూర్పు: కిర్క్‌ మోర్రీ
సినిమాటోగ్రఫీ: డాన్‌ బర్గెస్‌
నిర్మాణ సంస్థ: వార్నర్‌ బ్రదర్స్‌ పిక్చర్స్‌, డీసీ ఫిలింస్‌, ది సాఫ్రాన్‌ కంపెనీ
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జేమ్స్‌ వాన్‌
విడుదల: 14-12-2018


సూపర్‌హీరో కాన్సెప్ట్‌తో తెరకెక్కే చిత్రాలంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన హాలీవుడ్‌ చిత్రం ‘ఆక్వామెన్‌’. జేమ్స్‌ వాన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగులో ‘సముద్ర పుత్రుడు’ టైటిల్‌తో విడుదల చేశారు. ‘సముద్ర పుత్రుడు’ పాత్రలో ప్రముఖ హాలీవుడ్‌ నటుడు జేమ్స్‌ మొమోవా నటించారు. భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? యాక్షన్‌ ప్రియులను ఏ మేరకు అలరించింది?

* కథేంటంటే..
అట్లానా (నికోల్‌ కిడ్మన్‌) అనే యువతి సముద్రం ఒడ్డున స్పృహ కోల్పోయి ఉంటుంది. అక్కడి లైట్‌ హౌస్‌కు వాచ్‌మెన్‌గా పనిచేస్తూ కొన్నేళ్లుగా జీవనం సాగిస్తున్న టామ్‌ కర్రీ అనే వ్యక్తి‌ ఆమెను కాపాడతాడు. తాను కాపాడింది సాధారణ యువతిని కాదని, ఏడు సముద్ర రాజ్యాల్లో ఒకటైన అట్లాంటిస్‌ మహారాణి అట్లానా అని తెలుసుకుంటాడు. తనకు ఇష్టం లేని పెళ్లి చేయడం వల్లే భూమి మీదకు పారిపోయి వచ్చినట్లు అట్లానా చెబుతుంది. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. వీరికి కలిగిన సంతానమే ఆర్థర్‌ కర్రీ అలియాస్‌ సముద్ర పుత్రుడు (జేమ్స్‌ మొమోవా). సంతోషంగా ఉన్న వీరి కుటుంబాన్ని అట్లాంటిస్‌కు చెందిన కొందరు దుండగులు దాడి చేసి మహారాణి అట్లానాను ఎత్తుకుపోవాలని చూస్తారు. తన భర్త, కుమారుడిని కాపాడుకునేందుకు అట్లానా వారికి లొంగిపోవాలనుకుంటుంది. సముద్రం, భూమి అనే రెండు ప్రపంచాలను ఒక్కటి చేయగలిగేది ఆర్థర్‌ కర్రీనేనని అట్లానా తన భర్తకు చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆర్థర్‌ తన తల్లిని కలుసుకునేందుకు అట్లాంటాకు ఎలా వెళ్లాడు? నీటిలోనూ, భూమిపై జీవించగలిగే శక్తులు ఉన్నాయని అతనికి ఎలా తెలిసింది? అట్లాంటాకు వెళ్లిన తర్వాత ఏం జరిగింది? తదితర విషయాలు తెరపై చూడాల్సిందే.


* ఎలా ఉందంటే..
సూపర్‌హీరోల కథలతో గతంలో చాలా చిత్రాలు వచ్చాయి. కానీ, ‘ఆక్వామెన్‌‌’ వాటన్నింటి కంటే భిన్నం. భూమిపైనా, నీటిలోనూ జీవించగల శక్తులు కలిగిన వ్యక్తిగా ఆక్వామెన్‌ పాత్ర డీసీ కామిక్స్‌లో చిన్నారులను విశేషంగా అలరించింది. ఇప్పుడు అది వెండితెరపై మరింత భారీదనంతో తీసుకొచ్చాడు దర్శకుడు వాన్‌. ముఖ్యంగా ఆక్వామెన్‌ పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంటుంది. అదే సమయంలో ఇది ఒక సూపర్‌హీరో చిత్రంగానే కాకుండా కథానాయికల పాత్రలు, ఇతర తారాగణాన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఈ సినిమా కోసం ఎవ్వరూ చూడని ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టించామని గతంలో జేమ్స్‌ వాన్‌ వెల్లడించారు. అందుకు తగినట్టుగానే సినిమాలోని సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రతి సన్నివేశంలో చిత్ర బృందం పడిన కష్టం కనపడుతుంది. మరీ ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాలు, సముద్ర గర్భంలో జరిగే యుద్ధ సన్నివేశాలు, భారీ జంతువులు అబ్బుర పరుస్తాయి. అయితే, ఆయా సన్నివేశాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించాడు దర్శకుడు. దీంతో సినిమా నిడివి పెద్దదిగా అనిపిస్తుంది.


* ఎవరెలా చేశారంటే..
ఇందులో నటించిన ప్రతీ ఒక్కరి పాత్ర సినిమాకు ప్రాణం పోసింది. టైటిల్‌ పాత్రలో నటించిన జేమ్స్‌ మొమోవా నటన ఆకట్టుకుంటుంది. సూపర్‌హీరో అంటే ఇలాగే ఉంటాడేమో అన్నంతగా ఆయన పాత్రలో ఒదిగిపోయి నటించారు. ఈ పాత్ర కోసం మొమోవా పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. భూమిపైనా, నీటిలోనూ తెరకెక్కించిన యుద్ధ సన్నివేశాల్లో ఆయన నటన అలరిస్తుంది. ఆంబర్‌ హర్డ్‌, నికోల్‌ కిడ్మన్‌ అందంగా కన్పించారు.

డీసీ కామిక్స్‌ నుంచి కథను తీసుకున్నా, దర్శకుడు జేమ్స్‌ వాన్‌ తనదైన హంగులు జోడించి సినిమాను తీశారు. ముఖ్యంగా మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీతో తెరకెక్కించిన సన్నివేశాలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. ‘అవతార్‌2’లోనూ ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్నే దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ వినియోగిస్తున్నారు. అంతకన్నా ముందే వాన్‌ ఈ టెక్నాలజీతో నీటి అడుగును సన్నివేశాలను అద్భుతంగా చూపించాడు. నిజంగా సముద్ర గర్భంలో యుద్ధం జరిగితే ఇలాగే ఉంటుందా? అనేంతగా సన్నివేశాలు ఉన్నాయి. ఇక యుద్ధాల కోసం వినియోగించే సముద్ర జంతువులను చూస్తే, ఒళ్లు గగురుపొడవాల్సిందే. హాలీవుడ్‌ చిత్రాలు నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిని పనిలేదు.


బలాలు
+ నటీనటులు
+ వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌
+ నిర్మాణ విలువలు

బలహీనతలు
- నిడివి ఎక్కువగా ఉండటం
- కొన్ని చోట్ల అతకని సన్నివేశాలు

* చివరగా..
‘సముద్ర పుత్రుడు’ ఒక విజువల్‌ వండర్‌!Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.