రివ్యూ: ఫ్రోజెన్‌ 2
సినిమా: ఫ్రోజెన్‌ 2

వాయిస్‌ ఓవర్‌: నిత్యామేనన్‌, సితార, ప్రియదర్శి తదితరులు

దర్శకులు: జెన్నీఫర్‌ లీ, క్రిస్‌ బక్‌

సంగీత దర్శకుడు: క్రిస్టోఫీ బెక్‌

నిర్మాణ సంస్థ: డిస్నీ పిక్చర్స్‌

నిర్మాత: పీటర్‌ డెల్‌ వెకో

సంగీతం: రాబర్ట్‌ లోపెజ్‌, క్రిస్టెన్‌ ఆండర్సన్‌-లోపెజ్‌ (పాటలు),  

క్రిస్టోఫీ బెక్‌  (నేపథ్యం)

విడుదల తేదీ: 22-11-2019

దేనినైనా సరే మంచుగడ్డగా మార్చేసే అద్భుత శక్తులున్న యువరాణి ఎల్సా. ఆమె ముద్దుల చెల్లెలు అన్నా, తుంటరి పనులతో నవ్వించే మంచు మనిషి ఓలఫ్‌.. ఆరేళ్ల క్రితం వచ్చిన ‘ఫ్రోజెన్‌’లో వీరు చేసిన సందడి, సాహసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.2 బిలియన్‌ డాలర్లు రాబట్టింది. ఇన్నేళ్ల తర్వాత ‘ఫ్రోజెన్‌’కు సీక్వెల్‌గా రూపొందిన ‘ఫ్రోజెన్‌ 2’ విడుదలైంది. తెలుగులో ఎల్సా పాత్రకు నిత్యా మేనన్‌, చిన్నప్పటి ఎల్సాగా మహేశ్‌బాబు కుమార్తె సితార, ఓలఫ్‌ పాత్రకు నటుడు ప్రియదర్శి డబ్బింగ్‌ చెప్పడంతో చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ పాత్రలు ఎలా వినోదం పంచాయి? సాహసాలతో అలరించాయా?


కథేంటంటే:
అరెండెల్‌ రాణి ఎల్సాకు సుదూర ప్రాంతంలోని అడవి నుంచి విచిత్రమైన రాగాలు వినిపిస్తుంటాయి. తన అద్భుత శక్తుల వెనుక ఉన్న మర్మాన్ని తెలుసుకోమని అవి పిలుస్తుంటాయి. దీంతో ఎల్సా తన సోదరి అన్నాతో కలిసి అడవిలోకి బయలుదేరుతుంది. వీరికి ఓలఫ్‌తోపాటు ఇతర మిత్రులు కూడా తోడవుతారు. ఈలోపు ప్రకృతి శక్తుల ఆగ్రహం వల్ల తమ రాజ్యం అరెండెల్‌ ప్రమాదంలో పడిందని, ఆ ఆగ్రహానికి కారణం తెలుసుకుంటేనే తమ రాజ్యాన్ని కాపాడుకోగలమని ఎల్సాకు అర్థమవుతుంది. అప్పుడు ఎల్సా ఏం చేసింది? ఆమె తన అద్భుత శక్తుల వెనుక ఉన్న మర్మమేంటో తెలుసుకుందా? ఆమెకు ఎదురైన సమస్యను ఎదుర్కోవడానికి తన శక్తులు సరిపోతాయా? అనే విషయాలను తెరపై చూడాలి.

ఎలా ఉందంటే:
సీక్వెల్‌లో దర్శకులు సోదరీమణులు ఎల్సా, అన్నాలోని సరికొత్త కోణాల్ని చూపించారు. ప్రమాదంలో ఉన్న తమ అరెండెల్‌ రాజ్యాన్ని కాపాడే క్రమంలో ఎల్సా, అన్నా కనిపెట్టే రహస్యాలు, చేసే సాహసాలు ఆసక్తికరంగా ఉంటాయి. చూపు తిప్పుకోలేనంత అందమైన విజువల్స్‌ సినిమాకు ప్రధాన బలం. సినిమాలో పాటలపై ప్రధాన దృష్టి పెట్టిన దర్శకులు కథ, కథనాలపై ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేది. ప్రత్యేకించి తెలుగులో సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి అనువదించిన పాటలు విసుగు తెప్పిస్తాయి. కానీ, ఇంగ్లిషు సినిమాల్ని తెలుగులో డబ్‌ చేసినప్పుడు ఇది సాధారణమే. డబ్బింగ్‌ విషయంలో దర్శక, నిర్మాతలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంగ్లిషులో ఉన్న డైలాగ్‌ను నేరుగా అనువదించకుండా.. తెలుగు యాసను జత చేసి చక్కగా రాశారు. దీని వల్ల పాత్రల మధ్య వచ్చే సంభాషణలు ప్రేక్షకుడికి ఉత్సుకతను తీసుకొస్తాయి. సముద్ర గర్భం, మంచు పర్వతాలు, అడవులు, విచిత్రమైన జీవులు.. ఇలా ఎన్నో దృశ్యాలు, పాత్రలను సుందర మనోహరంగా తెరకెక్కించారు. దీంతో ఈ సినిమా చిన్నారులతోపాలు పెద్దల హృదయాల్ని కూడా దోచుకుంటుంది.

ఎవరెలా చేశారంటే:
మహేశ్‌బాబు కుమార్తె సితార ఎల్సా చిన్నప్పటి పాత్రకు స్వరం ఇచ్చింది. తన కోసం సినిమాకు వెళ్లిన అభిమానులకు కాస్త నిరాశే. సితార పాప డబ్బింగ్‌ కాసేపు మాత్రమే వినపడుతుంది. ఇక యువతి ఎల్సా పాత్రకు నిత్యా మేనన్‌ గాత్రం ఇచ్చారు. ఆమె డబ్బింగ్‌ వినసొంపుగా ఉంది. ఓలఫ్‌ పాత్రకు నటుడు ప్రియదర్శి తెలుగులో డబ్బింగ్‌ చెప్పారు. తెలంగాణ యాసలో ఆయన డైలాగ్‌ డెలివరీ కడుపుబ్బా నవ్విస్తుంది. దీంతో ఆ పాత్రతో ప్రేమలో పడక తప్పదు. డిస్నీ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్‌ సుందరంగా కనిపిస్తుంది. దర్శకుల పనితనం మెప్పిస్తుంది.

బలాలు
+ అద్భుతమైన విజువల్స్‌

+ ఎల్సా, అన్నా సాహసాలు

+ వినోదం


బలహీనతలు
- పాటలు

- కథ, కథనం

చివరిగా..:

‘ఫ్రోజెన్‌ 2’.. ఓ అందమైన ప్రయాణం


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.