రివ్యూ: స్పైడర్‌ మ్యాన్‌ ఫార్‌ ఫ్రం హోం
నటీనటులు: టామ్‌ హోలాండ్‌, జెండాయా, శామ్యూల్‌ జాక్సన్‌, జేక్‌ గైలెన్‌ హాల్‌, జాన్‌ ఫావ్రో, జేకబ్‌ బాటలాన్‌, స్మూవ్‌, కోబీ స్మల్డర్స్‌ తదితరులు
సంగీతం: మైఖేల్‌ గియాచినో
సినిమాటోగ్రఫీ: మాథ్యూ లాయిడ్‌
కూర్పు: డాన్‌ లెబెంటల్‌
నిర్మాణ సంస్థ: కొలంబియా పిక్చర్స్‌, మార్వెల్‌ స్టూడియోస్‌, పాస్కల్‌ పిక్చర్స్‌
కథ: క్రిస్‌ మెక్‌ కెన్నా, ఎరిక్‌ సామర్స్‌
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జాన్‌ వాట్స్‌
విడుదల తేదీ: 05-07-2019
కొన్ని ఫిక్షన్‌ పాత్రలకు ఎప్పటికీ ఆదరణ తగ్గదు. అలాంటి వాటిలో స్పైడర్‌మ్యాన్‌ ఒకటి. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ ఈ సినిమాలను ఎంజాయ్‌ చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ‘అవెంజర్స్‌ ఎండ్‌గేమ్’ అనంతరం చోటు చేసుకున్న సన్నివేశాలతో తెరకెక్కించిన చిత్రం ‘స్పైడర్‌మ్యాన్‌: ఫార్‌ ఫ్రం హోం’ అంటూ చిత్రబృందం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది. అదీకాకుండా ప్రపంచవ్యాప్తంగా సినిమా ఈరోజు విడుదలైతే.. కేవలం మన భారత్‌లో మాత్రం ఒకరోజు ముందుగానే విడుదల చేశారు. మరి అంతగా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ స్పైడర్‌మ్యాన్‌ ఏం చేశాడో చూద్దాం.


* కథేంటంటే..
పీటర్‌ పార్కర్‌ (టామ్‌ హోలాండ్‌ అలియాస్‌ స్పైడర్‌మ్యాన్‌) తన స్నేహితులతో కలిసి విహారయాత్ర నిమిత్తం యూరప్‌ వెళ్లాలనుకుంటాడు. తానే స్పైడర్‌మ్యాన్ అన్న విషయాలను ఎవ్వరికీ తెలీకుండా జాగ్రత్తపడుతూ స్నేహితులతో ఎంజాయ్‌ చేయాలనుకుంటాడు. అతనికి మిషెల్‌ (జెండాయా) అంటే ఇష్టం. ఎలాగైనా ఆమెకు తన ప్రేమ విషయాన్ని వ్యక్త పరచాలనుకుంటాడు. ఇంతలో నిక్‌ ఫ్యూరీ (శామ్యుల్‌ జాక్సన్‌).. పీటర్‌ను పిలిపించి ఓ పనిని అప్పగిస్తాడు. ఇందుకు మిస్టీరియో (జేక్‌ గైలెన్‌హాల్‌ అలియాస్‌ క్వెంటిన్‌) కూడా సాయం చేస్తాడని చెప్తాడు. ఆ తర్వాత పీటర్‌కు ఓ షాకింగ్‌ విషయం తెలుస్తుంది. అదేంటి? నిక్‌ ఫ్యూరీ.. పీటర్‌కు అప్పగించిన పనేంటి? పీటర్‌, జెండాయా ఒక్కటయ్యారా? తదితర విషయాలను తెరపై చూడాల్సిందే.


* ఎలా ఉందంటే..
పీటర్‌ పార్కర్‌, అతని ఫెండ్స్‌ కలిసి యూరప్‌ ట్రిప్‌నకు బయలుదేరుతున్న సన్నివేశాలతో సినిమాను ప్రారంభించాడు దర్శకుడు జాన్‌. తొలి భాగం ఫన్నీగా సాగిపోతుంది. ఎప్పుడైతే నిక్‌ ఫ్యూరీ.. పీటర్‌ జీవితంలోకి వస్తాడో అక్కడి నుంచి కథ ఆసక్తికరంగా ఉంటుంది. ప్రథమార్ధంలో సముద్రం నుంచి భయంకరమైన మనిషి ప్రజలపై దాడి చేయడం వంటి సన్నివేశాలు ఆసక్తి కలిగిస్తాయి. అతని నుంచి ప్రజలను కాపాడటానికి మిస్టీరియో వస్తాడు. కానీ, అతనెవరో స్పైడర్‌మ్యాన్‌కు మాత్రం తెలీదు. ద్వితీయార్ధంలో మిస్టీరియో గురించి పీటర్‌కు, పీటర్‌ గురించి జెండాయాకు ఓ షాకింగ్‌ విషయం తెలుస్తుంది. దాంతో కథ మరింత రసవత్తరంగా సాగుతుంది. అయితే ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. చివర్లో మిస్టీరియో.. పీటర్‌ గురించి బయటపెట్టే సీక్రెట్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. డ్రోన్లతో సాగే ఫైటింగ్‌ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇవి యాక్షన్‌ ప్రియులను అలరిస్తాయి.


* ఎవరెలా చేశారంటే..
టామ్‌ హోలాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఉన్న ప్రతీ సన్నివేశాన్ని ప్రేక్షకుడు ఎంజాయ్‌ చేస్తాడు. జెండాయా తన అందంతో ఆకట్టుకుంది. టామ్‌‌, జెండాయా కెమిస్ట్రీ బాగుంది. శామ్యుల్‌, జేక్‌ అద్భుతంగా నటించాడు. తనదైన హాస్యంతో అక్కడక్కడా నవ్వులు పూయించాడు. మిగతావారంతా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ‘స్పైడర్‌మ్యాన్‌’కు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు జాన్‌ వాట్స్‌ ఆ స్థాయిలోనే సినిమాను తీర్చిదిద్దాడు. స్పైడర్‌మ్యాన్‌ సాహసాలు, ప్రత్యర్థులతో ఫైట్స్‌ విశేషంగా అలరిస్తాయి. నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చింది. ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాల్లో మరింత ఉత్కంఠ కలిగించేలా అనుభూతిని పంచాయి. మూడు భారీ నిర్మాణ సంస్థలు తెరకెక్కించిన సినిమా కావడంతో ఆ స్థాయిలోనే నిర్మాణ విలువలు ఉన్నాయి.


బలాల

+ యాక్షన్‌ ఘట్టాలు
+ టామ్‌ హోలాండ్‌, జెండాయా కెమిస్ట్రీ
+ నిర్మాణ విలువలు

బలహీనతలు
- ద్వితీయార్ధంలో అక్కడక్కడా సాగదీసినట్లుగా అనిపించే కొన్ని సన్నివేశాలు

* చివరగా..
ఈ ‘స్పైడర్‌మ్యాన్‌’ కూడా అదరగొట్టేశాడు!Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.