రివ్యూ: లెజెండ్‌ ఆఫ్‌ టార్జాన్‌
article imageనటీనటులు: అలెగ్జాండర్‌ స్కార్స్‌గార్డ్‌.. శామ్యూల్‌ ఎల్‌. జాక్సన్‌.. మార్గోట్‌ రాబీ.. జిమ్‌ బ్రాడ్‌బెంట్‌ తదితరులు
సినిమాటోగ్రఫీ: హెన్రీ బ్రహమ్‌
కథ: ఆడమ్‌ కోజడ్‌.. క్రేగ్‌ బ్రివర్‌
దర్శకత్వం: డేవిడ్‌యేట్స్‌.
నిర్మాతలు: జెర్రీ విన్‌ట్రాబ్‌.. డేవిడ్‌ బరూన్‌.. ఎలన్‌ రిచీ.. టోనీ లుడ్‌విగ్‌
విడుదల తేదీ: 01-07-2016

చింపాజీలు.. అడవి జంతువులతో పెరిగి ఆఫ్రికా అడవుల్లో సాహసాలు చేసే టార్జాన్‌ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పటికే టార్జాన్‌పై వచ్చిన సినిమాలు.. కార్టూన్లు ప్రేక్షకుల మనసును దోచుకున్నాయి. మంచి ఆదరణ పొందాయి. చాలా రోజుల విరామం తర్వాత ‘ది లెజెండ్‌ ఆఫ్‌ టార్జాన్‌’ పేరుతో శుక్రవారం మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దామా..!

కథేంటి?
ఆఫ్రికాలోని కాంగో అడవుల్లోని సంపదను బెల్జియం రాజు లియోపోల్డ్‌ దోచుకుంటుంటాడు. తన అనుచరుడు లియోన్‌ రోమ్‌ని సైన్యంతో వెళ్లి కాంగోలోని ప్రజలను బానిసలుగా మార్చుకోవాలని ఆదేశిస్తాడు. దీంతో లియోన్‌ అక్కడి వజ్రాల గనులను కొల్లగొట్టేందుకు స్థానికంగా ఉన్న ఓ తెగ నాయకుడు ఎంబొంగతో కలిసి ఒప్పందం చేసుకుంటాడు. ఈ ఒప్పందం ప్రకారం అక్కడి తెగ వారు టార్జాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు.

కానీ టార్జాన్‌ అడవులకు దూరంగా ఇంగ్లండ్‌లో తన భార్య జేన్‌తో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. టార్జాన్‌ని ఎలాగైనా అడవులకు రప్పించాలనుకున్న ఉద్దేశంతో జెన్‌ని కిడ్నాప్‌ చేస్తాడు లియోన్‌. తన భార్యతో పాటు.. కాంగో ప్రజలను కాపాడేందుకు టార్జాన్‌ తిరిగి అడవులకి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అసలు టార్జాన్‌కి వాళ్లకు మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి? వారి ఆగడాలను టార్జాన్‌ ఎలా ఎదుర్కొన్నాడు? తదితర విషయాలను తెరపై చూడాల్సిందే.
article imageఎలా ఉందంటే?
టార్జాన్‌.. జేన్‌క్లేటన్‌గా ఇంగ్లండ్‌లో తన భార్యతో కలిసి జీవిస్తుంటాడు. అదే సమయంలో టార్జాన్‌ అడవిలో లేకపోవడంతో అక్కడి విలన్లు అరాచకాలు సృష్టిస్తుంటారు. ఈ కథంతా కాస్త నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే టార్జాన్‌ శత్రువులను వెతుక్కుంటూ తిరిగి అడవుల్లోకి వెళ్తాడో అప్పుడే కథలో వేగం పుంజుకుంటుంది గొరిల్లా ఫైట్‌ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. యాక్షన్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

ఇందులో మనకు రెండు కథలు కనిపిస్తాయి. ఇంగ్లండ్‌కి చెందిన రాజ కుటుంబం ఓ బాలుడిని పొరపాటున అడవిలో వదిలివెళితే అతను చింపాంజీలతో కలిసి ఎలా పెరిగాడనేది ఒకటి. ఇంగ్లండ్‌లో తన భార్యతో కలిసి టార్జాన్‌.. జాన్‌ క్లేటన్‌గా జీవించడం మరొకటి. అయితే ఈ రెండు వెంటవెంటనే వస్తుండటం ప్రేక్షకులకు కథలో లీనమవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ సినిమాలో జంతువుల యానిమేషన్‌ మరి ఆకట్టుకునేలా వుండదు. మార్గోట్‌ రాబీ కూడా జెనీగా ఫర్వాలేదనిపించింది.

బలాలు
+ యాక్షన్‌ సన్నివేశాలు
+ సంగీతం

బలహీనతలు
- జంతువుల యానిమేషన్‌

చివరగా.. అంచనాలను అందుకోలేని టార్జాన్‌

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.