రివ్యూ: ‘డెడ్‌మెన్‌ టెల్‌ నో టేల్స్‌’
article imageనటీనటులు: జానీ డెప్‌.. జేవియర్‌ బెర్డెమ్‌.. జెఫ్రీ రష్‌.. బ్రెంటన్‌ థ్వయిట్స్‌ తదితరులు
కథ.. స్క్రీన్‌ప్లే: జెఫ్‌ నాథన్సన్‌
సినిమాటోగ్రఫీ: పాల్‌ కెమరూన్‌
దర్శకత్వం: జొవచిమ్‌ రొనింగ్‌.. ఎస్పెన్‌ శాండ్‌బర్గ్‌
నిర్మాత: జెర్రీ బ్రక్‌హెమర్‌
నిర్మాణ సంస్థ: వాల్ట్‌ డిస్నీ స్టూడియోస్‌
విడుదల తేదీ: 26-05-2017

సముద్రపు దొంగల సాహసాల నేపథ్యంలో హాలీవుడ్‌లో వచ్చిన ‘పైరేట్స్‌ ఆఫ్‌ ది కరీబియన్‌’ సిరీస్‌ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పటివరకూ ఈ సిరీస్‌లో వచ్చిన నాలుగు చిత్రాలు హాలీవుడ్‌లో కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించాయి. హాలీవుడ్‌ చరిత్రలో బిలియన్‌ డాలర్ల వసూళ్ల మార్కు అందుకున్న 8 చిత్రాల్లో రెండు ఈ సిరీస్‌కి చెందినవే కావడం విశేషం. తాజాగా ఈ సిరీస్‌లో ఐదో చిత్రంగా ‘పైరేట్స్‌ ఆఫ్‌ ది కరీబియన్‌: డెడ్‌మెన్‌ టెల్‌ నో టేల్స్‌‌’ తెరకెక్కింది. కెప్టెన్‌ జాక్‌స్పారోగా మరోసారి జానీ డెప్‌ పాత్రలో నటించారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం ఎలా ఉందంటే..

కథేంటి?: డెవిల్స్‌ ట్రయాంగిల్‌లో బందీలుగా ఉన్న కెప్టెన్‌ సాలజర్‌(జేవియర్‌ బెర్డెమ్‌) ఆత్మతో పాటు అతడి ముఠా ఆత్మలు అక్కణ్నుంచి తప్పించుకుంటాయి. కెప్టెన్‌ జాక్‌స్పారో(జానీ డెప్‌) బృందంలోని ప్రతి ఒక్కరిని చంపి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి స్పారోకున్న మార్గం.. సముద్రం మొత్తాన్ని తన ఆధీనంలో ఉంచుకోగల అద్భుత శక్తులున్న ట్రిడెంట్‌ ఆఫ్‌ ప్రొసెడాన్‌ అనే ఆయుధాన్ని చేజిక్కించుకోవటం. దాని కోసం స్పారో ఎలాంటి సాహసాలు చేశాడన్నదే సినిమా.

ఎలా ఉందంటే..: ‘పైరేట్స్‌ ఆఫ్‌ ది కరీబియన్‌’ సిరీస్‌లో వస్తున్న చిత్రం అంటే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే భారీ నిర్మాణ విలువలతో సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేశారు. కానీ గత చిత్రాల స్థాయిని ఈ చిత్రం అందుకోలేకపోయిందనే చెప్పుకోవాలి. కొన్ని సన్నివేశాలు బోర్‌ కొట్టించేలా ఉన్నాయి. గత చిత్రాల్లో ఉండే కత్తి యుద్ధాలు.. భారీ ఓడల మీద యుద్ధాలు ఇందులో పెద్దగా కనిపించవు. ఇది అభిమానులను కొద్దిగా నిరాశకి గురిచేస్తుంది. కాకపోతే పాల్‌ కామెరూన్‌ కెమెరా పనితనం వాటన్నింటిని మరిచిపోయేలా చేస్తుంది. కరీబియన్‌ పట్టణ వీధులు.. సముద్రంలోని సన్నివేశాలు తన కెమెరాతో అద్భుతంగా చూపించారు. క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేసేలా ఉంటాయి.

ఎవరెలా చేశారంటే..: ‘పైరేట్స్‌ ఆఫ్‌ ది కరీబియన్‌’ సిరీస్‌ చిత్రాల్లో చెప్పుకోదగింది జానీ డెప్‌ నటన. ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ వచ్చిన చిత్రాల్లో భిన్న నటనతో ఆకట్టుకున్నాడు జానీ డెప్‌. ఈసారి కూడా కెప్టెన్‌ జాక్‌ స్పారోగా అదే హవాను కొనసాగించాడు. ప్రతీకార వాంఛతో రగిలిపోయే కెప్టెన్‌ సాలజర్‌ పాత్రలో జేవియర్‌ బెర్డెమ్‌ ఒదిగిపోయాడు. సినిమా మొత్తాన్ని డెప్‌.. బెర్డెమ్‌ తమ భుజాలపై వేసుకొని పోటాపోటీగా నటించారు. మిగిలిన నటులు తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు.

బలాలు
+ జానీ డెప్‌
+ సినిమాటోగ్రఫీ

బలహీనతలు
- బోర్‌ కొట్టే సన్నివేశాలు

చివరగా.. గత చిత్రాల స్థాయిని అందుకోలేని పైరేట్స్‌ ఆఫ్‌ ది కరీబియన్లు

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.