రివ్యూ : ది లయన్‌ కింగ్‌
చిత్రం: ది లయన్‌ కింగ్‌
వాయిస్‌ క్యాస్ట్‌: నాని, పి.రవిశంకర్‌, జగపతిబాబు, బ్రహ్మానందం, అలీ, లిప్సిక తదితరులు
సంగీతం: హ్యాన్స్‌ జిమ్మర్‌
సినిమాటోగ్రఫీ: కలెబ్‌డెస్‌ఛానల్‌
ఎడిటింగ్‌: మార్క్‌ లివోల్సీ, ఆడమ్‌ గ్రెస్టల్‌
నిర్మాత: జాన్‌ ఫెవరూ, జెఫ్రీ సిల్వర్‌, కారెన్‌ గిల్‌క్రిస్ట్‌
దర్శకత్వం: జాన్‌ ఫెవరూ
బ్యానర్‌: వాల్‌డిస్నీ స్టూడియోస్‌
విడుదల తేదీ: 19-07-2019
చిన్నప్పుడు ‘పంచతంత్ర’ కథలు చదువుతుంటే మనకు భలేగా ఉంటుంది. ఇప్పటికీ ఆ పుస్తకాలు కొత్త హంగులతో నేటి తరం పిల్లలను అలరిస్తున్నాయి. సింహం-చిట్టెలుక, సింహం-కుందేలు ఇలా ఎన్నో కథలు మనకు తెలుసు. అవే కథలు తెరపై కనిపిస్తే చిన్నారుల ఆనందానికి అవధులే ఉండవు. అలా 90వ దశకంలో ప్రపంచవ్యాప్తంగా చిన్నా-పెద్దా తేడాలేకుండా అలరించిన యానిమేషన్‌ చిత్రం ‘ది లయన్‌ కింగ్‌’. ఇప్పుడు అదే యానిమేషన్‌ కథ సరికొత్త హంగులను అద్దుకుని ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సరికొత్త అనుభూతిని పంచనుంది. ఎందుకంటే ఇందులోని పాత్రలకు నాని, జగపతిబాబు, రవిశంకర్‌, బ్రహ్మానందం, అలీ వంటి మనకు తెలిసిన స్టార్లు తమ గొంతును అందించారు. మరి నేడు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? అప్పటికీ ఇప్పటికీ చిత్రంలో ఉన్న తేడా ఏంటి?

* కథేంటంటే..
1994లో విడుదలైన ‘ది లయన్‌ కింగ్‌’ చూసిన వారికి కథ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఒక అడవి. ఆ అడవికి ముఫాసా అనే సింహం (రవిశంకర్‌)రాజు. అతని పాలనలో ఆ అడవి సుభిక్షంగా ఉంటుంది. అనవసర వేట నిషిద్ధం. అన్ని జంతువులు కలిసే ఉంటాయి. అన్నీ ముఫాసాకు విధేయతగా ఉంటాయి. ఒకరోజు ముఫాసా భార్య సరాభి ఒక మగ సింహానికి జన్మనిస్తుంది. దానికి సింబా(నాని) అనిపేరు పెడతారు. అంతేకాదు, తన తర్వాత అడవికి సింబానే రాజుని ప్రకటిస్తాడు.ఆ అడవికి వారసుడిని చూసేందుకు అన్ని జంతువులు వచ్చి ఆశీర్వదిస్తాయి. ఇదంతా ముఫాసా సోదరుడైన స్కార్‌(జగపతిబాబు)కు నచ్చదు. ఎప్పటికైనా సింహాసనాన్ని దక్కించుకోవాలని ఎదురుచూస్తుంటాడు. సింబాకు నాలా(లిప్సిక) పరిచయం అవుతుంది. ఇద్దరూ కలిసి అడవిలో స్వేచ్ఛగా తిరుగుదామంటే ముఫాసా అందుకు ఒప్పుకోడు. అలా ఒకరోజు తండ్రికి చెప్పకుండా బయటకు వెళ్లిన సింబా ప్రమాదంలో పడతాడు. సింబాను కాపాడే క్రమంలో ముఫాసా చనిపోతాడు. దీంతో సింబాను భయపెట్టి స్కార్‌ ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటాడు. అప్పుడు పారిపోయిన సింబా ఏమయ్యాడు. పుంబా(బ్రహ్మానందం), టిమోన్‌(అలీ)లతో పరిచయం ఎలా ఏర్పడింది. తానొక రాజు కొడుకునని మర్చిపోయిన సింబాకు ఆ సంగతి ఎవరు గుర్తు చేశారు? తిరిగి తన రాజ్యాన్ని సింబా ఎలా దక్కించుకున్నాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


* ఎలా ఉందంటే..
కథగా చూస్తే ఇది మనకు తెలిసిన కథే. ఎన్నో తెలుగు చిత్రాలు ఇలాంటి నేపథ్యంలో సాగాయి. అధికారం కోసం, ఆస్తుల కోసం సోదరుడి కొడుకైన చిన్నప్పటి హీరోను హత్య చేయడానికి విలన్‌ ప్రయత్నించడం, ఆ కుట్ర నుంచి హీరోను తప్పించే క్రమంలో అతని తండ్రి చనిపోవడం, బతికి బయటపడ్డ హీరో నిజం తెలుసుకుని మళ్ళీ విలన్‌పై పగ తీర్చుకోవడం. ఇది కొన్ని వందల సినిమాల్లో చూశాం. అయితే ఇక్కడ అడవి.. సింహం.. దాని కొడుకు.. వీటి చుట్టూ కథ నడుస్తుంది అంతే తేడా. సినిమాల్లో జంతువులు మాట్లాడుతుంటే అది చూస్తున్న ప్రేక్షకుడికి వచ్చే మజానే వేరుగా ఉంటుంది. పైగా ఆ జంతువులకు మనకు తెలిసిన నటులైన నాని, జగపతిబాబు, అలీ, బ్రహ్మానందంల వాయిస్‌లలో డైలాగులు చెబుతుంటే ప్రేక్షకుడు త్వరగా కథలో లీనమైపోతాడు. ‘ది లయన్‌ కింగ్‌’లో అదే జరిగింది. దీంతో ఎక్కడా మనం యానిమేషన్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలగదు. 1994లో వచ్చిన ‘ది లయన్‌ కింగ్‌’ ఎలా ఉందో ఫ్రేమ్‌ టు ఫ్రేమ్‌ అలాగే తెరకెక్కించాడు దర్శకుడు. ఎంతలా అంటే, ‘అవతార్‌’ తర్వాత ఆ స్థాయిలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ కనిపించిన చిత్రం ఇదేనని చెప్పవచ్చు. అంతలా కష్ట పడింది చిత్ర బృందం.

ప్రథమార్ధమంతా సింబా పెరగడం, ముఫాసా అతడికి రాజు లక్ష్యాన్ని, అడవి జీవన చక్రాన్ని వివరించడం తదితర సన్నివేశాలతో కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. ఆయా సన్నివేశాలన్నీ హృద్యంగా ఉంటాయి. ఎప్పుడైతే ముఫాసా చనిపోతాడో అప్పుడు కథ కీలక మలుపు తిరుగుతుంది. జంతువులు ముఫాసాను తొక్కి చంపే సన్నివేశం ప్రేక్షకుడిని కంటతడి పెట్టిస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయిన సింబా.. పుంబా, టిమోన్‌లతో కలిసి ఎలా నిజం తెలుసుకున్నాడు? తన రాజ్యానికి ఎలా వచ్చాడు తదితర సన్నివేశాలతో ద్వితీయార్ధం సాగుతుంది. చివరిగా రాజ్యానికి రాజు కావడంతో సినిమా ముగుస్తుంది.

* ఎవరెలా చేశారంటే..
ఇందులో పాత్రలన్నీ విజువల్‌ ఎఫెక్ట్స్‌తో సృష్టించినవే. అయితే, వివిధ భాషల్లో ఒక్కో పాత్రకు ఒక్కో ప్రముఖ నటుడు డబ్బింగ్‌ చెప్పడం సినిమాకు ప్రధాన ఆకర్షణ. తెలుగులో సింబాకు యువ కథానాయకుడు నాని డబ్బింగ్‌ చెప్పారు. చిన్నప్పటి సింబాకు కాస్త ఫన్నీగా సంభాషణలు పలికిన నాని, సింహం పెద్దదైన తర్వాత పలికే సంభాషణలు గంభీరంగా ఉంటాయి. ఆ తేడాను స్పష్టంగా చూపించారు. ఇక ముఫాసాకు పి.రవిశంకర్‌, స్కార్‌కు జగపతిబాబులు చెప్పిన డబ్బింగ్‌ హైలైట్‌ అని చెప్పవచ్చు. సింహాల ముఖ కవళికలకు అనుగుణంగా వాళ్లు పలికిన సంభాషణలు నిజంగా అద్భుతం. కథలో లీనమైన ప్రేక్షకుడికి సింహాల్లో నిజంగా రవిశంకర్‌, జగపతిబాబులు పరకాయ ప్రవేశం చేశారేమో అనిపిస్తుంది. ఇక సినిమాలో ప్రధాన ఆకర్షణ పుంబా, టిమోన్‌ పాత్రలు. వీటికి తెలుగు హాస్యనటులు బ్రహ్మానందం, అలీ వాయిస్‌ ఇచ్చారు. సినిమాలో ఈ రెండు పాత్రల సందడే ఎక్కువ. వాటి మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు, అవి వేసే పంచ్‌ డైలాగ్‌లు ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్విస్తాయి. తెలుగులో కేకే రాసిన సంభాషణలు అద్భుతంగా ఉన్నాయి.

దర్శకుడు జాన్‌ ఫెవరూకు గతంలో ‘జంగిల్‌ బుక్‌’ను రీమేక్‌ చేసిన అనుభవం ఉంది. అది అందరికీ తెలిసిన కథే అయినా, దాన్ని లైవ్‌ యాక్షన్‌ సన్నివేశాలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌తో వెండితెరపైకి తీసుకొచ్చి ఘన విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు అదే దారిలో వెళ్లి ‘ది లయన్‌ కింగ్‌’ను మళ్లీ పునః సృష్టించాడు. ఈ విషయంలో దర్శకుడి ఆలోచనలకు డిస్నీ అద్భుత సహకారాన్ని అందించింది. ఫెవరూలో ఉన్న మరో కోణం ఎంటంటే ఎమోషనల్‌ సీన్స్‌ను గుండెకు హత్తుకునేలా చూపించడం. ‘జంగిల్‌బుక్‌’లో పలు సన్నివేశాలు కళ్లు చెమర్చేలా చేస్తాయి. ఇందులోనూ అంతే, ముఖ్యంగా ముఫాసా చనిపోయే సన్నివేశం మనల్ని కంటతడి పెట్టిస్తుంది. ఇక యానిమేషన్‌ ఫిలింతో పోలిస్తే, స్కార్‌ను మరింత క్రూరంగా చూపించాడు దర్శకుడు. ఇలాంటి సినిమాలకు ప్రధాన బలం సంగీతం. హ్యాన్స్‌ జిమ్మర్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఆస్కార్‌ అందుకునే స్థాయిలో ఉందా సంగీతం. ఇక డిస్నీ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల కాలంలో ఆ సంస్థ నుంచి వచ్చిన చిత్రాల్లో ఇది ది బెస్ట్‌ అని చెప్పవచ్చు.


బలాలు
+ విజువల్‌ ఎఫెక్ట్స్‌
+ నేపథ్య సంగీతం
+ తెలిసిన నటులు డబ్బింగ్‌ చెప్పడం

బలహీనతలు
- తెలిసిన కథే కావడం

* చివరిగా..
బాక్సాఫీస్‌ వద్ద సింబా ‘గర్జన’


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.