రివ్యూ: క‌నులు క‌నులు దోచాయంటే
తారాగణం: దుల్క‌ర్ స‌ల్మాన్‌, రీతూవ‌ర్మ‌, రక్షణ్, నిరంజని అహతియాన్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ తదితరులు.
సాంకేతిక వ‌ర్గం: ఛాయాగ్ర‌హ‌ణం: కె.ఎం.భాస్క‌ర‌న్‌, సంగీతం: మ‌సాలా కాఫీ, నేప‌థ్య సంగీతం: హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌, కూర్పు: ప్రవీణ్ ఆంటోనీ, క‌ళ: ఆర్.కె. ఉమాశంకర్, ద‌ర్శ‌క‌త్వం: దేసింగ్ పెరియసామి,
నిర్మాణం: వయాకామ్18 స్టూడియోస్ & ఆంటో జోసెఫ్ ఫిలిం కంపెనీ,
విడుద‌ల‌: 28-02-2020,
సంస్థ‌: కె.ఎఫ్.సి. ఎంటర్టైన్మెంట్స్.


దుల్క‌ర్ స‌ల్మాన్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. `ఓకే బంగారం`తో ఆక‌ట్టుకున్న ఆయ‌న `మ‌హాన‌టి`తో ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా ప్ర‌భావం చూపించారు. ఆయ‌న ఒక భాష‌కంటూ ప‌రిమితం కాకుండా ద‌క్షిణాది నుంచి హిందీ వ‌ర‌కు ఆయా క‌థ‌ల్నిబ‌ట్టి ప‌లు భాష‌ల్లో న‌టిస్తుంటారు. ఇటీవ‌ల త‌మిళం, తెలుగు భాష‌ల్ని ల‌క్ష్యంగా చేసుకుని ఓ చిత్రం చేశారు. ఇది దుల్క‌ర్ న‌టించిన 25వ చిత్రం కావ‌డం విశేషం. తెలుగులో `క‌నులు క‌నుల‌ను దోచాయంటే` పేరుతో విడుద‌లైన ఈ సినిమా ఎలా ఉంది? దుల్క‌ర్ మ‌రోసారి త‌న ప్ర‌భావం చూపించాడా? త‌దిత‌ర విష‌యాల్ని తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం

క‌థేంటంటే?
స్నేహితులైన సిద్ధార్థ్‌ (దుల్కర్‌ సల్మాన్‌), కల్లిస్‌ (రక్షణ్‌) సుల‌భంగా డ‌బ్బు సంపాదించే మార్గాల్ని ఎంచుకుని జ‌ల్సాగా గ‌డుపుతుంటారు. వీళ్ల జీవితంలోకి మీరా (రీతు వర్మ), శ్రేయా (నిరంజని) వ‌స్తారు. మీరా వ‌ల్ల సిద్ధార్థ్ త‌న ఆలోచ‌న‌ల్ని మార్చుకుంటాడు. ఇక గోవా వెళ్లి ఆమెతో కొత్త జీవితాన్ని మొద‌లు పెట్టాల‌నుకుంటాడు. ఈ ఇద్ద‌రు స్నేహితులు తాము ప్రేమించిన అమ్మాయిల‌తో గోవా వెళ్లాక ఏం జ‌రిగింది? ఎవ‌రినైనా సుల‌భంగా బురిడీ కొట్టించే తెలివి తేట‌లున్న ఈ ఇద్ద‌రు కుర్రాళ్లు ఎవ‌రి చేతిలో ఎలా మోస‌పోయారు? వీళ్ల జీవితాల్ని పోలీస్‌ కమిషనర్‌ ప్రతాప్‌ సింహా (గౌతమ్‌ మీనన్‌) ఎలా మ‌లుపు తిప్పాడు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


ఎలా ఉందంటే?
ఆరంభంలో సినిమాపేరుకు త‌గ్గ‌ట్టుగానే ఇదొక రొమాంటిక్ ప్రేమ‌క‌థ అనిపించినా... ఆ త‌ర్వాత ఆస‌క్తిక‌రంగా క్రైమ్ డ్రామాగా మారిపోతుంది. చ‌క్క‌టి మ‌లుపుతో త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఆస‌క్తిని రేకెత్తిస్తూ సినిమా సాగుతుంది. నేటి స‌మాజంలో జ‌రుగుతున్న దొంగ‌త‌నాలు ఆన్‌లైన్ మోసాల్ని క‌ళ్ల‌కి క‌ట్టే చిత్ర‌మిది. నిజానికి ఇలాంటి క‌థ‌ల్ని ఎక్కువ‌గా క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమాల్లా సీరియ‌స్‌గా మ‌లుస్తుంటారు. కానీ ద‌ర్శ‌కుడు తెలివిగా ప్రేమ‌క‌థ‌ని జోడించాడు. ఆ ప్ర‌య‌త్న‌మే ఈ సినిమాని ప్ర‌త్యేకంగా నిల‌బెట్టింది. ప్ర‌థ‌మార్థమంతా హీరో హీరోయిన్ల మ‌ధ్య మంచి కెమిస్ట్రీతోనూ, హీరో తెలివిగా చేసే మోసాల‌తోనూ స‌ర‌దాగా, ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌తాప్ సింహా పాత్ర తెర‌పైకొచ్చాక ఉత్కంఠ మ‌రింత పెరుగుతుంది. క్ర‌మంగా సినిమా నేర నేప‌థ్యంతో కూడిన ఓ సీరియ‌స్ సినిమాగా మారిపోతుంది. ఇంత‌లోనే మ‌రో మ‌లుపు సినిమా గ‌మనాన్నే మార్చేస్తుంది. క‌థానాయ‌కుడి పాత్ర అలా న‌డుచుకుంటుందంటే దీని వెన‌క బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంటుంద‌నే ఆలోచ‌న‌తో ద్వితీయార్థంలోకి తీసుకెళ‌తాడు ద‌ర్శ‌కుడు. కానీ స‌హ‌జ‌త్వాన్నే న‌మ్ముకున్న ఆయ‌న ప్రేక్ష‌కుడి అంచ‌నాల‌కి భిన్నంగా క‌థ‌, క‌థ‌నాల్ని మ‌లిచాడు. ప్ర‌థ‌మార్థంలో మ‌లుపుల్ని ఒకొక్క‌టిగా రివీల్ చేసే క్ర‌మంలో మ‌రిన్ని మ‌లుపుల‌తో, మ‌రింత ఉత్కంఠ ఏర్ప‌డేలా స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. దాంతో స‌గ‌టు క్రైమ్ క‌థా చిత్రాల‌కి భిన్నమైన అనుభ‌వాన్ని పంచుతుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో దొంగ‌త‌నం నేప‌థ్యంలో తీసిన స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. అయితే అంత తెలివిగా న‌డుచుకునే హీరో మోస‌పోవ‌డం అనేదే ప్రేక్ష‌కుడికి అంత‌గా న‌మ్మ‌శ‌క్యంగా అనిపించ‌దు. ప‌తాక స‌న్నివేశాల్లోనూ కాస్త బిగి త‌గ్గిన‌ట్టు అనిపిస్తుంది.


ఎవ‌రెలా చేశారంటే?
దుల్క‌ర్ స‌ల్మాన్ మ‌రోసారి త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. సిద్ధార్థ్ పాత్ర‌లో ఆయ‌న చాలా హుషారుగా క‌నిపించాడు. రీతూవ‌ర్మ‌తో క‌లిసి ప్రేమ‌క‌థ‌లో ఒదిగిపోయిన విధానం కూడా ఆక‌ట్టుకుంటుంది. రీతూ వ‌ర్మ పోషించిన మీరా పాత్ర‌లో ప‌లు కోణాలు క‌నిపిస్తాయి. అవి ప్రేక్ష‌కుల్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా ఉంటాయి. ఆ పాత్ర‌లో ఆమె అభిన‌యం కూడా ఆక‌ట్టుకునేదే. ఇక నిరంజ‌ని, క‌ల్లిస్ అక్క‌డ‌క్క‌డా న‌వ్విస్తారు. గౌత‌మ్ మేన‌న్ పోలీస్ క‌మిష‌న‌ర్ పాత్ర‌లో ఆక‌ట్టుకున్నాడు. ముఖ్యంగా ప్ర‌థ‌మార్థంలో ఆయ‌న న‌ట‌న మెప్పిస్తుంది. ద్వితీయార్థంలో ఆ పాత్ర‌ని మ‌రీ డ‌మ్మీగా మార్చేయడంతో దాని ఔన్న‌త్యం దెబ్బ‌తిన్న‌ట్ట‌యింది. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. కె.ఎం.భాస్క‌ర‌న్ కెమెరాప‌నిత‌నం, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ నేప‌థ్య సంగీతం చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. రెండు పాట‌లు, వాటి చిత్ర‌ణ కూడా మెప్పిస్తాయి. ద్వితీయార్థంలో స‌న్నివేశాలు అక్క‌డ‌క్క‌డా సాగ‌దీత‌గా అనిపిస్తాయి. ద‌ర్శ‌కుడు దేసింగ్ పెరియ‌సామి క‌థ‌, క‌థ‌నాల‌పై ఆద్యంతం ప‌ట్టు ప్ర‌ద‌ర్శించిన‌ట్టు అనిపించినా... కీల‌క‌మైన ద‌శ‌ల్లో త‌డ‌బ‌డిన‌ట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా ప‌తాక స‌న్నివేశాల్లో.

 బ‌లాలు
దుల్క‌ర్‌, రీతూ న‌ట‌న‌
ప్ర‌థ‌మార్థంలో గౌత‌మ్ మేన‌న్ పాత్ర‌
క‌థ‌, మ‌లుపులు

 బ‌ల‌హీన‌త‌లు
ప‌తాక స‌న్నివేశాలు

 చివ‌రిగా: ఇందులో జోడీ ప్రేక్ష‌కుల మ‌న‌సుల్నీ దోచేస్తుంది 


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.