రివ్యూ: 118
చిత్రం: 118
నటీనటులు: కల్యాణ్‌రామ్‌, నివేదా థామస్‌, షాలిని పాండే, నాజర్‌, హర్షవర్థన్‌, ప్రభాస్‌ శ్రీను తదితరులు
సంగీతం: శేఖర్‌ చంద్ర
ఎడిటింగ్‌: తమ్మిరాజు
సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్‌
నిర్మాత: మహేష్‌ ఎస్‌ కోనేరు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.వి.గుహన్‌
బ్యానర్‌: ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ: 01-03-2019


క‌ల్యాణ్‌రామ్ విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్ర‌యాణం చేస్తున్నారు. `నా నువ్వే` అంటూ ఆమ‌ధ్య ఓ ప్రేమ‌క‌థలో న‌టించిన ఆయ‌న ఈసారి థ్రిల్ల‌ర్ క‌థ‌ని ఎంచుకుని `118` చేశారు . ఒక ప‌క్క త‌న శైలి మాస్ క‌మ‌ర్షియల్ సినిమాలు చేస్తూనే... అప్పుడ‌ప్పుడు ఇలా కొత్త ర‌క‌మైన క‌థ‌ల్ని ఎంచుకుంటున్నారు. `118`తో ప్ర‌ముఖ ఛాయాగ్రాహ‌కుడు కె.వి.గుహ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌వ‌డంతో... ఈ క‌ల‌యిక ఆస‌క్తి రేకెత్తించింది. ట్రైల‌ర్ విడుద‌ల త‌ర్వాత మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. మ‌రి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం...


* క‌థ‌
గౌత‌మ్ (క‌ల్యాణ్‌రామ్‌) ఒక టెలివిజ‌న్ ఛాన‌ల్‌లో రిపోర్టర్‌గా ప‌నిచేస్తుంటాడు. అత‌న్ని మ‌ర‌ణం అంచున ఉన్న ఓ యువ‌తికి సంబంధించిన కల వెంటాడుతుంటుంది. ఆ క‌లలోలాగే నిజ జీవితంలోనూ దృశ్యాలు క‌నిపిస్తుంటాయి. దాంతో గౌత‌మ్ తాను కంటున్న క‌ల నిజ‌మ‌ని... క‌ల‌లో క‌నిపించే యువ‌తి కూడా ఎక్క‌డో ఉంటుంద‌ని న‌మ్ముతాడు. క‌లతోపాటే ప్ర‌యాణం చేయ‌డానికి సిద్ధ‌మైన గౌత‌మ్‌కి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? 118 అనే సంఖ్య‌కీ, ఈ క‌ల‌కీ సంబంధ‌మేమిటి? గౌత‌మ్‌కీ... ఆద్య (నివేదా థామ‌స్‌), మేఘ (షాలిని పాండే) అనే అమ్మాయిల‌కీ మ‌ధ్య సంబంధమేమిటి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

* విశ్లేష‌ణ‌..
థ్రిల్ల‌ర్ సినిమాల‌కి కొన్ని ప్ర‌త్యేక‌మైన ల‌క్ష‌ణాలుంటాయి. క‌థ ప్రేక్ష‌కుడి ఊహ‌కు అంద‌కూడ‌దు, అదే స‌మ‌యంలో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగే స‌న్నివేశాలు అవ‌స‌రం. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు కె.వి.గుహ‌న్ మంచి క‌స‌ర‌త్తులే చేశారు. క‌థ ఆరంభించిన విధానం... క‌ల వెన‌క నిజాన్ని క‌నుక్కునే ప్ర‌య‌త్నంలో ఉన్న క‌థానాయ‌కుడికి అనూహ్య‌మైన సంఘ‌ట‌న‌లు ఎదుర‌వడం ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది. తొలి స‌గభాగం సినిమా ల‌క్ష‌ణానికి త‌గ్గ‌ట్టుగా థ్రిల్లింగ్‌గా సాగుతుంది. త‌ర్వాత ఏమ‌వుతుందో అనే ఆస‌క్తిని పెంచ‌డంలో ద‌ర్శ‌కుడు స‌ఫ‌ల‌మ‌య్యాడు. ఒక మంచి క్రైమ్ థ్రిల్ల‌ర్ చూసిన అనుభూతి క‌లుగుతుంది.


 కాక‌పోతే ద్వితీయార్థంలో అక్క‌డ‌క్క‌డా సాగ‌దీత‌తోపాటు... చూపించిన స‌న్నివేశాల్నే మ‌ళ్లీ చూపించ‌డం అంత‌గా మెప్పించ‌దు. క‌ల‌కి సంబంధించిన స‌న్నివేశాలు లాజిక్‌కి దూరంగా సాగుతున్న‌ట్టు అనిపిస్తాయి. క‌థానాయ‌కుడు త‌న‌కి ఎదురైన స‌వాళ్లని ఛేదించ‌డం కోసం మ‌ళ్లీ క‌ల‌పైనే ఆధార‌పడే స‌న్నివేశాలు సాదాసీదాగా అనిపిస్తాయి. లాజిక్‌ల గురించి ఆలోచించ‌కుండా సినిమా చూస్తే ప‌ర్వాలేదు కానీ... క‌థానాయ‌కుడికి ఉన్న క్యూరియాసిటీలాగా వాటి గురించి ఆరా తీయ‌డం మొద‌లుపెడితే మాత్రం ఆస్వాదించ‌లేం.

 * న‌టీన‌టులు.. సాంకేతిక‌త‌ 
కె.వి.గుహ‌న్ ద‌ర్శ‌కుడిగా తొలి ప్ర‌య‌త్నం చేసినా.. ప్ర‌తి విష‌యంలోనూ స్ప‌ష్టత ప్ర‌ద‌ర్శించారు. తొలి స‌గ‌భాగం వ‌ర‌కు సినిమా చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ఒక అనుభ‌వ‌జ్ఞుడైన ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన‌ట్టు అనిపిస్తుంది. ద్వితీయార్థం విష‌యంలోనూ అలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకునుంటే ఈ సినిమా ఫ‌లితం మ‌రోలా ఉండేది. స్వ‌త‌హాగా చాయాగ్రాహ‌కుడు కావ‌డంతో ఆ విభాగంలో కె.వి.గుహ‌న్ త‌న ప్ర‌త్యేక‌త‌ని ప్ర‌దర్శిస్తూ స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. సంగీతం బాగుంది. పాట‌తో పాటు, నేప‌థ్య సంగీతం మెప్పిస్తుంది. మిర్చి కిరణ్ మాట‌లు ప‌ర్వాలేద‌నిపిస్తాయంతే. నిర్మాణ విలువలు ఉన్న‌తంగా ఉన్నాయి. న‌టీన‌టులుల్లో క‌ల్యాణ్‌రామ్, నివేదాల అభిన‌యం మెప్పిస్తుంది. నివేదా కనిపించేది కాసేపే అయినా ఆ ప్ర‌భావం సినిమా అంతా ఉంటుంది. షాలిని పాండే అందంగా క‌నిపించింది. ప్రభాస్ శ్రీను, రాజీవ్ క‌న‌కాల‌, చ‌మ్మ‌క్ చంద్ర, నాజ‌ర్ త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు మెప్పిస్తాయి.

                                   

* చివరిగా..
క‌ల‌లు నిజ‌మ‌వ‌డం అనేది ఆస‌క్తిక‌ర‌మైన అంశం. అలాంటి ఆస‌క్తినే పంచుతుంది ఈ సినిమా. ఒక కొత్త ప్ర‌య‌త్నం చేసింది చిత్ర‌బృందం. అయితే చివ‌రి వ‌ర‌కు థ్రిల్‌ని పంచ‌డంలో మాత్రం చిత్రం విఫ‌ల‌మైంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.