రివ్యూ: ఏబీసీడీ

న‌టీన‌టులు: అల్లు శిరీష్‌, రుక్స‌ర్ థిల్లాన్‌, భ‌ర‌త్‌, నాగ‌బాబు, రాజా, కోట శ్రీనివాస‌రావు, శుభ‌లేఖ సుధాక‌ర్‌, వెన్నెల‌కిషోర్ త‌దితరులు
సాంకేతిక వ‌ర్గం: ద‌ర్శ‌క‌త్వం: స‌ంజీవ్ రెడ్డి, నిర్మాత‌లు: మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని, సంగీతం: జుదా సాందీ, ఛాయాగ్ర‌హ‌ణం: రామ్‌,
కూర్పు: న‌వీన్ నూలి, స‌మ‌ర్ప‌ణ‌: డి.సురేష్‌బాబు
సంస్థ: మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌
విడుద‌ల‌: 17 మే 2018.

మ‌ల‌యాళం సినిమాలు తెలుగులో త‌ర‌చుగా రీమేక్ అవుతుంటాయి. స‌గ‌టు జీవితాల్ని ప్ర‌తిబింబించే క‌థా వ‌స్తువులతోనే అక్క‌డ ఆస‌క్తిక‌రంగా చిత్రాల్ని తీర్చిదిద్దుతుంటారు. అందుకే తెలుగు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆ క‌థ‌ల్ని మ‌న ప్రేక్ష‌కుల‌కి కూడా చెప్పాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటారు. అందులో భాగంగా రూపొందిన చిత్ర‌మే `ఏబీసీడీ`. మ‌ల‌యాళంలోకూడా ఇదే పేరుతో తెర‌కెక్కింది. అక్క‌డ దుల్క‌ర్ స‌ల్మాన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రంలో, త‌నకి త‌గ్గ క‌థే ఉంద‌ని భావించి ఎంతో న‌మ్మ‌కంతో న‌టించారు అల్లు శిరీష్‌. మ‌రి సినిమా ఎలా ఉంది? `శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు`, `ఒక్క క్ష‌ణం` చిత్రాల‌తో న‌ట‌న ప‌రంగా ఆక‌ట్టుకున్న అల్లు శిరీష్ ఈ చిత్రంతో విజ‌యాన్ని అందుకున్న‌ట్టేనా? తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.


* క‌థ‌
అమెరికాలో పుట్టి పెరిగిన కుర్రాడు అర‌వింద్ అలియాస్ అవి (అల్లు శిరీష్‌). పాతికేళ్ల కింద‌ట ఇండియా నుంచి వెళ్లి మిలియ‌నీర్‌గా ఎదిగిన విద్యాప్ర‌సాద్ (నాగ‌బాబు) త‌న‌యుడు. డబ్బంటే లెక్క‌లేని అర‌వింద్ విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చు చేస్తూ... జ‌ల్సాగా జీవితం గ‌డుపుతుంటాడు. ఎలాగైనా త‌న కొడుక‌కి డ‌బ్బు విలువ తెలిసేలా చేయాల‌ని ఇండియాకి పంపిస్తాడు. బాషా (భ‌ర‌త్‌)తో క‌లిసి ఇండియాలో అడుగు పెట్టాక ఇద్ద‌రూ నెల‌కి కేవ‌లం రూ: 5 వేలు మాత్రమే ఖ‌ర్చు పెడుతూ ఎంబీఏ పూర్తి చేయాల‌ని ష‌ర‌తు విధిస్తాడు విద్యాప్ర‌సాద్‌. డాల‌ర్ల మ‌ధ్య పెరిగిన అవి నెల నెలా రూ: 5 వేల‌తో ఎలా నెట్టుకొచ్చాడు? ఈ ప్ర‌యాణంలో అవి డ‌బ్బు విలువ తెలుసుకొన్నాడా లేదా? భార్గ‌వ్ (రాజా), నేహా (రుక్స‌ర్ మీర్‌)లతో అర‌వింద్‌కి సంబంధ‌మేమిటి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

@ విశ్లేష‌ణ‌
డ‌బ్బున్న‌వాడికి... ఆ డ‌బ్బు ప‌రంగా ఎలాంటి స‌మస్య ఎదురైనా ప్రేక్ష‌కుడికి ఆస‌క్తిక‌రంగానే ఉంటుంది. అలాంటి క‌థ‌ల్లో హాస్యం మేళ‌వించ‌డానికి కూడా వీలుంటుంది. మ‌ల‌యాళం `ఏబీసీడీ`లో అదే చేశారు కాబ‌ట్టే అక్క‌డ విజ‌య‌వంత‌మైంది. తెలుగులో మాత్రం ఆ ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. తెలుగు వాతావ‌ర‌ణానికి త‌గ్గ‌ట్టుగా స‌న్నివేశాల్లో మార్పులు చేసుకున్నారు కానీ... అందులో ఆత్మ‌ని మాత్రం య‌థాత‌థంగా తీసుకురాలేక‌పోయారు. దాంతో ఏ ద‌శ‌లోనూ సినిమా ఆస‌క్తి రేకెత్తించ‌దు. అక్క‌డ‌క్క‌డా కాసింత హాస్యం పండిందంతే. క‌థానాయ‌కుడు ఇండియాకి వ‌చ్చాక ప‌డే పాట్టు సినిమాకి ఆయువుపట్టు. కానీ ద‌ర్శ‌కుడు ఆ స‌న్నివేశాల‌పైనే త‌గిన స్థాయిలో దృష్టిపెట్ట‌లేక‌పోయారు. క‌థానాయ‌కుడు ఫైవ్ స్టార్ హోట‌ల్‌లో దిగ‌డం, అక్క‌డి నుంచి త‌ప్పించుకొనే ప్ర‌య‌త్నం వ‌ర‌కు వ‌ర‌కు స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగానే అనిపిస్తాయి. ఆ త‌ర్వాతే అస‌లు క‌థ గాడి త‌ప్పింది. బ‌స్తీలో జీవితం గ‌డిపే స‌న్నివేశాల్ని స‌హ‌జంగా చూపించ‌లేక‌పోయారు. నాయ‌కానాయిక‌ల మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాల్లోనూ బ‌లం లేదు. సినిమాలో స‌బ్ ప్లాట్‌గా వ‌చ్చే పొలిటిక‌ల్ నేప‌థ్యాన్నీ, క‌థానాయ‌కుడి ప్ర‌యాణంతో ముడిపెట్ట‌డం సినిమాకి కీల‌కం. కానీ అక్క‌డ కూడా స‌న్నివేశాలు అత‌క‌లేదు. దాంతో క‌థ‌, క‌థ‌నాల్లో సంఘ‌ర్ష‌ణ లోపించిన‌ట్టైంది. వెన్నెల కిషోర్ పండించే కామెడీనే సినిమాకి ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. కాఫీ విత్ కిషోర్ అంటూ ఆయ‌న చేసే సంద‌డి యూ ట్యూబ్‌లో ఓ వీడియో స్ఫూర్తితో రూపొందించిన‌దే అయినా... న‌వ్విస్తుంది. ప‌తాక స‌న్నివేశాలు ప‌ర్వాలేద‌నిపిస్తాయి.


 న‌టీన‌టులు... సాంకేతిక‌త‌
అల్లు శిరీష్ న‌ట‌న ప‌ర్వాలేద‌నిపిస్తుంది. భ‌ర‌త్‌తో క‌లిసి ఆయ‌న హాస్యం పండించిన విధానం, ప‌తాక స‌న్నివేశాల్లో న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. రుక్స‌ర్ థిల్లాన్ పాత్ర‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. కానీ ఆమె లుక్స్ ప‌రంగా ఆక‌ట్టుకుంటుంది. సిరివెన్న‌ల సీతారామశాస్త్రి త‌న‌యుడు ప్ర‌తినాయ‌క ఛాయ‌ల‌తో కూడిన యువ రాజ‌కీయ నాయ‌కుడు భార్గ‌వ్ పాత్ర‌లో క‌నిపించారు. తండ్రి పాత్ర‌లో నాగ‌బాబు, రాజ‌కీయ నాయ‌కులుగా శుభ‌లేఖ సుధాక‌ర్‌, కోట శ్రీనివాస‌రావు ప‌రిధి మేర‌కు చ‌క్క‌గా న‌టించారు. సాంకేతికంగా సినిమాకి పేరు పెట్ట‌లేం. రామ్ కెమెరా ప‌నిత‌నం, జుదా సాందీ సంగీతం ఆక‌ట్టుకుంటుంది. మెల్ల‌మెల్ల‌గా... పాటతోపాటు, నేప‌థ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువ‌లు సినిమాస్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి. సంజీవ్ రెడ్డి ర‌చ‌యిత‌గా ఆక‌ట్టుకొన్నా, ద‌ర్శ‌క‌త్వం ప‌రంగా మాత్రం ఆయ‌న మెప్పించ‌లేక‌పోయారు. క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా ఆయ‌న క‌స‌ర‌త్తులు చాల‌లేదు.

 చివ‌రిగా
రీమేక్ సినిమాలు చేసేట‌ప్పుడు... మాతృక‌ల్లో దొరికిన త‌ప్పుల్ని కూడా స‌రిదిద్దుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక్క‌డ మాత్రం మ‌రిన్ని త‌ప్పులే దొర్లాయి త‌ప్ప , మాతృకలోని ఆత్మ బ‌ట్వాడా కాలేదు. దాంతో సినిమా ఆద్యంతం సాదాసీదాగా అనిపిస్తుంది. అక్క‌డ‌క్క‌డా కాసిన్ని న‌వ్వులు పండ‌టం మిన‌హాయిస్తే, మిగిలిన స‌న్నివేశాలన్నీ ఏమాత్రం ఆస‌క్తి రేకెత్తించ‌కుండా, ప్రేక్ష‌కుడి ఊహ‌కు త‌గ్గ‌ట్టుగానే సాగుతుంటాయి.


                                 


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.