రివ్యూ: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌
న‌టీన‌టులు: న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం: స‌్క్రీన్‌ప్లే: న‌వీన్ పొలిశెట్టి,
సంగీతం: మ‌ఆర్క్ కె.రాబిన్‌, సాహిత్యం: కె.కె,
ఛాయాగ్ర‌హ‌ణం: స‌న్నీ కూర‌పాటి, క‌ళ‌: క‌్రాంతి ప్రియం,
నిర్మాత‌: రాహుల్ యాద‌వ్ న‌క్కా,
క‌థ‌, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె.
సంస్థ‌: స‌్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌


హాలీవుడ్‌లో డిటెక్టివ్ సినిమాలు త‌ర‌చుగా వ‌స్తుంటాయి. కొన్ని డిటెక్టివ్ పాత్ర‌లు బ్రాండ్‌గా కూడా మారిపోయాయి.  తెలుగులో మాత్రం ఆ నేప‌థ్యంలో వ‌చ్చే సినిమాలు అరుదు. డిటెక్టివ్ సినిమా అంటే ఇప్ప‌టికీ చిరంజీవి చేసిన `చంట‌బ్బాయ్‌`నే గుర్తు చేసుకుంటుంటాం. మ‌ధ్య‌లో మ‌రికొన్ని సినిమాలు వ‌చ్చినా... `చంటబ్బాయ్‌` స్థాయిలో ఆక‌ట్టుకున్న సినిమాలు క‌నిపించ‌వు. చాలా రోజుల త‌ర్వాత ఆ పాత్ర‌ని గుర్తు చేస్తూ `ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ‌` ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. న‌వీన్ పొలిశెట్టి ఇందులో క‌థానాయ‌కుడు.  యూ ట్యూబ్ వీడియోల‌తో పేరు తెచ్చుకున్న న‌వీన్ తొలిసారి క‌థానాయ‌కుడిగా  న‌టించారు. విడుద‌ల‌కి ముందే ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకున్నాయి. మ‌రి సినిమా ఎలా ఉంది?  కొత్త ఏజెంట్ మెప్పించాడా?  లేదా?  తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

* క‌థేంటంటే?
నెల్లూరులో పాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ పేరుతో ఓ డిటెక్టివ్ సంస్థ‌ని న‌డుపుతుంటాడు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (న‌వీన్ పొలిశెట్టి). ఆయ‌న ద‌గ్గ‌ర స్నేహ (శ్రుతిశ‌ర్మ) అప్రెంటిస్‌గా ప‌నిచేస్తుంటుంది. త‌న తెలివి తేట‌ల‌తో ఎలాంటి కేసుల్నైనా ఇట్టే ఛేదిస్తుంటాడు ఆత్రేయ‌. కానీ అత‌ని ద‌గ్గ‌రికి ఎప్పుడూ చిల్ల‌ర కేసులే వ‌స్తుంటాయి. రైల్వే ట్రాక్ ద‌గ్గ‌ర గుర్తు తెలియ‌ని శ‌వాల గురించి స్నేహితుడు చెప్ప‌డంతో అక్క‌డికి వెళ‌తాడు. అనుమానుతుడిగా పోలీసులు అత‌న్ని అరెస్ట్ అవుతాడు. జైల్లో ఓ పెద్దాయన త‌న కూతురు హ‌త్య‌కి గురైంద‌ని చెబుతాడు. అందుకు సంబంధించి మూడు సెల్‌ఫోన్ నెంబ‌ర్లు ఇస్తాడు. వాటితో కేసుని ఛేదించేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్ర‌మంలో ఎలాంటి విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి? ఆ మూడు నెంబ‌ర్లు ఎవ‌రివి?  నిజంగా ఆ పెద్దాయ‌న కూతురు హ‌త్య‌కి గురైందా లేదా?  ఆత్రేయ కేసుని ఛేదించాడా లేదా? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.  


* ఎలా ఉందంటే?

ఒక నేరం చుట్టూ సాగే క‌థ ఇది. దాదాపుగా ప్ర‌తి థ్రిల్ల‌ర్ సినిమాలోనూ ఇలాంటి క‌థే ఉంటుంది. అయితే ఇందులో ద‌ర్శ‌కుడు క‌థ వెన‌క చ‌ర్చించిన విష‌యాలు, దాన్ని న‌డిపేందుకు ఉప‌యోగించుకొన్న నేప‌థ్యం ప్రేక్ష‌కుల‌కు కొత్త‌ద‌నాన్ని పంచుతుంది. ఆరంభ స‌న్నివేశాలు పాత్ర‌ల్ని ప‌రిచ‌యం చేస్తాయి. అస‌లు క‌థ‌లోకి వెళ్ల‌డానికి ద‌ర్శ‌కుడు చాలా స‌మ‌యం తీసుకొన్నాడు. అప్ప‌టిదాకా ఏజెంట్ చేసే గ‌మ్మ‌త్తైన ప‌నులే కాల‌క్షేపం. ఎప్పుడైతే అస‌లు క‌థ‌లోకి సినిమా ప్ర‌వేశిస్తుందో అప్ప‌ట్నుంచి ఆస‌క్తి మొద‌ల‌వుతుంది. కేసు ముందుకు సాగుతున్న‌కొద్దీ, చిక్కుముడులు ఒకొక్క‌టిగా బ‌య‌టికొస్తున్న‌కొద్దీ త‌ర్వాత ఏం జ‌రుగుతుందనే ఉత్సుక‌త రేకెత్తుతుంది. ద్వితీయార్థం సినిమా సాగే విధానం ప్రేక్ష‌కుల‌కు థ్రిల్‌కి గురిచేస్తుంది. అయితే ఆ థ్రిల్ కోసం అక్క‌డ‌క్క‌డా మ‌లుపులు ప‌రిమితికి మించిన అభిప్రాయం క‌లుగుతుంది.  కేసు ముగుస్తుంద‌న్న క్ర‌మంలోనే, ఆ కేసు మొత్తం ఏజెంట్ మెడ‌కు చుట్టుకోవ‌డంతో పాటు... మ‌రిన్ని కొత్త విష‌యాలు వెలుగులోకి వ‌స్తుండ‌డంతో సినిమా సుదీర్ఘంగా సాగుతున్న అభిప్రాయం క‌లుగుతుంది.  క్ర‌మం త‌ప్ప‌కుండా హాస్యం పండ‌టం ఒకింత మేల‌య్యింది. సెంటిమెంట్‌తోపాటు, ప‌తాక స‌న్నివేశాలు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. ప్రేక్ష‌కుల‌కు కొత్త‌ద‌నాన్ని పంచే చిత్ర‌మిది. ఇదివ‌ర‌కు వ‌చ్చిన డిటెక్టివ్ సినిమాల‌కి పూర్తి భిన్నంగా ఉంటుంది. అక్క‌డ‌క్క‌డా సాగ‌దీత‌గా అనిపించే కొన్ని స‌న్నివేశాలు మిన‌హాయిస్తే ఏజెంట్ చేసే సంద‌డి ఆక‌ట్టుకుంటుంది. 


* ఎవ‌రెలా చేశారంటే?
న‌వీన్ పొలిశెట్టి  త‌న న‌ట‌న‌తో ఏజెంట్ సాయిశ్రీనివాస పాత్ర‌కి ప్రాణం పోశాడు.  అందులో మ‌రొక‌రిని  ఊహించుకోలేం అన్న‌ట్టుగా ఉంది ఆయ‌న అభిన‌యం.  కామెడీ టైమింగ్‌లోనూ, సెంటిమెంట్ పండించ‌డంలోనూ ప‌రిణ‌తి ప్ర‌ద‌ర్శించారు.  ఆయ‌న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే కూడా స‌మ‌కూర్చ‌డం విశేషం. అందులోనూ ఆయ‌న ప‌నిత‌నం అడుగ‌డుగునా మెప్పిస్తుంది. శ్రుతిశ‌ర్మ  స్నేహ అనే అసిస్టెంట్  పాత్ర‌లో చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించింది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌తో పాటు సినిమా అంతా క‌నిపిస్తుంది.  ఈ రెండు పాత్ర‌లే సినిమాకి కీల‌కం. మిగిలిన పాత్ర‌ధారులు కూడా దాదాపుగా కొత్త‌వాళ్లే. కానీ వాళ్ల అభిన‌యంలో స‌హ‌జ‌త్వం ఉట్టిప‌డింది. మ‌రో డిటెక్టివ్‌గా సుహాస్ ఆక‌ట్టుకుంటాడు.  సాంకేతిక విభాగం చ‌క్క‌టి ప‌నితీరుని క‌న‌బ‌రిచింది. మార్క్ కె.రాబిన్ సంగీతంతో పాటు, స‌న్నీ కూర‌పాటి కెమెరా ప‌నిత‌నం చాలా బాగుంది. నెల్లూరు నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో ఆ వాతావ‌ర‌ణం ఉట్టిప‌డిందంటే కార‌ణం కళా విభాగం ప‌నితీరే. ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె  రాసుకున్న క‌థ‌, ఆయ‌న చిత్రాన్ని తెర‌పైకి తీసుకొచ్చిన విధానం చాలా బాగుంది. ఆయ‌న రాసిన మాట‌ల్లోనూ మెరుపులు క‌నిపిస్తాయి.  నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి. 

* బ‌లాలు
క‌థ‌, క‌థ‌నం
వినోదం
న‌వీన్ పొలిశెట్టి అభిన‌యం
సాంకేతిక‌త‌

* బ‌లహీన‌త‌లు
ద్వితీయార్థంలో మ‌లుపులు

* చివ‌రిగా..
కొత్త ద‌ర్శ‌కుల ఆలోచ‌న‌లు ఎంత తాజాగా ఉంటాయో మ‌రోమారు చాటి చెప్పిన చిత్ర‌మిది. కొత్త ర‌క‌మైన క‌థ‌, క‌థ‌నాలు, పాత్ర‌ల్ని తెర‌పై చూపిస్తూ ఆద్యంతం వినోదం పంచాడు ద‌ర్శ‌కుడు. న‌వీన్ పొలిశెట్టి రూపంలో మ‌రో మంచి న‌టుడిని అందించిందీ చిత్రం.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.