రివ్యూ: అమృతరామమ్‌

చిత్రం: అమృతరామమ్‌

నటీనటులు: రామ్‌ మిట్టకంటి, అమితా రంగనాథ్‌, శ్రీజిత్‌ రంగాధరన్‌, జేడీ చెరుకూరి తదితరులు

సంగీతం: ఎన్‌ఎస్‌ ప్రసు

సినిమాటోగ్రఫీ: సంతోష్‌ సనమోని

ఎడిటింగ్‌: కార్తీక్‌ శ్రీనివాస్‌

నిర్మాత: ఎస్‌.ఎన్‌.రెడ్డి

రచన, దర్శకత్వం: సురేందర్‌ కొంటాడ్డి

బ్యానర్‌: పద్మజ ఫిల్మ్స్‌

విడుదల: జీ5 ఎంటర్‌టైన్‌మెంట్‌కరోనా మహమ్మారి విజృంభణతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు అన్నీ మూతపడ్డాయి. లాక్‌డౌన్‌ ఎత్తినా థియేటర్లు ఎప్పుడు తెరుస్తారన్నది ప్రశ్నార్థకమే. ఇటువంటి పరిస్థితుల్లో ప్రేక్షకుడికి వినోదాన్ని పంచుతున్నాయి ఓటీటీ ఫ్లాట్‌ఫాంలు. తమ ఓటీటీ ఫ్లాట్‌ఫాం వేదికగా సినిమా విడుదల చేయాలని మంచి ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. భారీ బడ్జెట్‌ చిత్రాలను ఓటీటీ వేదికగా విడుదల చేయలేని పరిస్థితి. దీంతో చిన్న చిత్రాల నిర్మాతలు వీటివైపు చూస్తున్నారు. అలా థియేటర్‌లో విడుదల కావాల్సిన ‘అమృతరామమ్‌’ జీ5 ఓటీటీ వేదికగా విడుదలైంది. ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? కొత్త నటీనటులు ఎలా అలరించారు?


కథేంటంటే:

రామ్‌ (రామ్‌ మిట్టకంటి) ఆస్ట్రేలియాలో మాస్టర్స్‌ పూర్తి చేసి, తన చదువుకు సరిపడా ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటాడు. అదే సమయంలో అమృత (అమిత రంగనాథ్‌) మాస్టర్స్‌ చదివేందుకు ఆస్ట్రేలియా వస్తుంది. స్నేహితుడి సూచన మేరకు అమృతను రిసీవ్‌ చేసుకునేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తాడు రామ్‌. తొలి చూపులోనే అతడిని చూసి ప్రేమలో పడుతుంది అమృత. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. అలా కాలం గడుస్తున్న సమయంలో అమృత తీసుకున్న నిర్ణయం ఇరువురి మధ్య గొడవకు దారి తీస్తుంది. వారి గొడవకు కారణం ఏంటి? అమృత అలా ఎందుకు చేసింది? నిజం తెలిసిన రామ్‌ ఏం చేశాడు? చివరకు ఇద్దరూ కలిశారా? లేదా? అన్నది కథ!


ఎలా ఉందంటే:

ఇదొక ప్రేమకథ. పోస్టర్లు, ట్రైలర్‌ ద్వారా ఆ విషయాన్ని చిత్ర బృందం చెప్పకనే చెప్పింది. ఇప్పటి వరకూ ప్రేక్షకులు అనేక ప్రేమకథలను వెండితెరపై చూశారు. అలాంటి ప్రేమకథల్లో ఇదీ ఒకటి. ప్రేమంటే ఒకరికి నచ్చినట్టు ఒకరు, ఒకరి కోసం ఒకరు ఉండటం కాదని, ఒకరిలో ఒకరు ఉండటం అన్న చిన్న కాన్సెప్ట్‌తో దీన్ని తెరకెక్కించారు. రామ్‌ను చూసిన తొలిచూపులోనే అమృత ప్రేమలో పడటం, ప్రేమను వ్యక్త పరుచుకోవడం, వారి మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాలతో ప్రథమార్ధమంతా సాగుతుంది. అదే సమయంలో ప్రేమికుల మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్థలను కూడా చూపించాడు దర్శకుడు.

చిలిపిగా, మనసు గిలిగింతలు పెట్టేలా సాగాల్సిన ఆ సన్నివేశాలన్నీ కాస్త రొటీన్‌గా సాగుతాయి. అయితే, రామ్‌, అమృత మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాల్లో రొమాంటిక్‌పాళ్లు ఎక్కువయ్యాయి. ప్రధానంగా యువతను దృష్టిలో పెట్టుకుని ఆయా సన్నివేశాలను దర్శకుడు తీర్చిదిద్దాడు. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి చూడాలంటే కాస్త ఇబ్బందిగానే అనిపిస్తాయి.ద్వితీయార్ధంలోనైనా మనసుకు హత్తుకునే సన్నివేశాలపై దృష్టి పెట్టాల్సింది. కానీ, అవే చిన్న చిన్న కారణాలకు నాయకనాయికలిద్దరూ గొడవ పడటం, మళ్లీ కొద్దిసేపటికే సారీ చెప్పుకొని కలిసి పోవడం తదితర సన్నివేశాలతో సాగదీశాడు. మనసుకు హత్తుకునే బలమైన సన్నివేశం ఒక్కటీ కనిపించదు. రామ్‌కు తెలియకుండా అమృత తీసుకున్న నిర్ణయాల వల్ల వారి మధ్య దూరం పెరుగుతుంది. అయితే, విడిపోవాల్సినంత తప్పు అమృత చేసిందా? అనిపిస్తుంది. అందుకు బలమైన కారణాలు ఏవీ కనిపించవు. కేవలం రామ్‌ అహం దెబ్బతినడం తప్ప అక్కడ పెద్ద తప్పు జరిగినట్టు అనిపించదు. దీంతో ఆయా సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. పతాక సన్నివేశాలు మాత్రం కంటతడి పెట్టిస్తాయి. అమృత తీసుకున్న నిర్ణయం నిజ జీవితంలో ఎవరైనా తీసుకుంటారా?అనిపిస్తుంది. 
ఎవరెలా చేశారంటే:

చాలా కొద్దిమంది నటీనటులతో ఈ సినిమాను తెరకెక్కించారు. కథానాయకుడు రామ్‌ పర్వాలేదు. భావోద్వేగ సన్నివేశాల్లో ఇంకా మెరుగవ్వాలి. హీరోయిన్‌ అమిత రంగనాథ్‌ అందంగా కనిపించింది. రామ్‌పై ప్రేమను వ్యక్తపరిచే సన్నివేశాలు, పతాక సన్నివేశాల్లో ఆమె హావభావాలు బాగున్నాయి. మిగిలిన నటీనటులందరూ కొత్తవారే. ఎవరి పాత్ర పరిధిమేరకు వారు నటించారు.సంగీతం పర్వాలేదు. కథతో పాటే పాటలు సాగుతాయి. దాదాపు అన్నీ మెలోడీలే. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా మొత్తం ఆస్ట్రేలియాలో సాగుతుంది. అక్కడి అందాలను చక్కగా చూపించారు. దర్శకుడు సురేందర్‌ ఎంచుకున్న పాయింట్‌ కొత్తది కాకపోయినా, ఇంకాస్త బలంగా చూపించాల్సింది. రొమాంటిక్‌ సన్నివేశాలపై దృష్టి పెట్టిన దర్శకుడు భావోద్వేగ సన్నివేశాలపై పెట్టలేదు. మనసారా నవ్వుకునే హాస్య సన్నివేశం ఒక్కటీ కూడా లేకపోవడం ఈ సినిమాకు ప్రధాన లోపం. బడ్జెట్‌ పరిమితులు కూడా దృష్టిలో పెట్టుకుని సినిమా తీసినట్లు అర్థమవుతుంది. బలాలు

+ రొమాంటిక్‌ సన్నివేశాలు

+ హార్ట్‌ టచింగ్‌ క్లైమాక్స్‌


బలహీనతలు

- రొటీన్‌ పాయింట్‌

- హాస్యం లేకపోవడం

- సాగదీతగా అనిపించే కథనం


చివరిగా: కేవలం యువతను దృష్టిలో పెట్టుకుని తీసిన ‘అమృతరామమ్‌’Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.