రివ్యూ: నాట‌కం
చిత్రం: నాటకం
నటీనటులు: ఆశీష్‌ గాంధీ, అషిమా నర్వాల్‌, తోట‌ప‌ల్లి మ‌ధు తదితరులు
సంగీతం: సాయి కార్తీక్‌
సినిమాటోగ్రఫీ: గరుడవేగ అంజి
ఎడిటర్‌: మణికాంత్‌
నిర్మాత: శ్రీ సాయిదీప్‌ చాట్ల, రాధికా శ్రీనివాస్‌, ప్రవీణ్‌ గాంధీ, ఉమ కూచిపూడి
దర్శకత్వం: కళ్యాణ్‌జీ గోగన
బ్యానర్‌: రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
విడుదల:28-09-2018

ఆర్‌.ఎక్స్. 100 లాంటి విజ‌యాలు చిన్న సినిమాల‌పై మ‌ళ్లీ న‌మ్మకాన్ని పెంచేశాయి. హీరో ఎవ‌రైతే ఏంటి? కొత్త ద‌ర్శ‌కుడైతే ఏంటి? బాగుంటే చాలు.. వ‌సూళ్లు కురుస్తాయ‌న్న భ‌రోసాని ఇస్తున్నాయి. ప్రచార చిత్ర‌మో, టైటిల్‌ కాస్త కొత్త‌గా క‌నిపిస్తే చాలు.. ‘ఓసారి చూసొద్దాం’ అని ఫిక్స‌వుతున్నారు ప్రేక్ష‌కులు. అలా పేరుతో, ప్ర‌చార చిత్రంతో అంద‌రి దృష్టినీ ఆక‌ట్టుకున్న చిత్రం ‘నాట‌కం’. మ‌రి ఈ సినిమా... చిన్న చిత్రాల విజ‌య ప‌రంప‌ర‌ని కొన‌సాగించిందా? ఈ నాట‌కం ఎందుకు? ఎవ‌రి కోసం..?


* క‌థేంటంటే..
చింత‌ల‌పూడి గ్రామంలో ఆవారాగా తిరిగేస్తుంటాడు బాల‌ కోటేశ్వ‌ర‌రావు (ఆశీష్ గాంధీ). తిన‌డం, తిర‌గ‌డం, రాత్ర‌యితే.. నాన్న‌తో క‌లిసి మందు కొట్ట‌డం త‌ప్ప ఇంకేం ప‌నులూ ఉండ‌వు. పెళ్లి చేసుకుందామంటే పిల్ల కూడా దొర‌క‌దు. అయితే.. పార్వ‌తి (అషిమా న‌ర్వాల్‌)ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. పార్వ‌తికి ఎవ్వ‌రూ ఉండ‌రు. అనాథ. పార్వ‌తి కూడా కోటిని ప్రేమిస్తుంది. ఇలా అంతా ప్ర‌శాంతంగా ఉంది అనుకుంటున్న ద‌శ‌లో ఆ ఊర్లోకి ఓ దొంగ‌ల ముఠా ప్ర‌వేశిస్తుంది. ఇంట్లో ప్ర‌వేశించి దోచుకెళ్ల‌డం, ఆ ఇంట్లో వాళ్ల‌ని చంప‌డ‌మే ఈ దొంగ‌ల ముఠా ప‌ని. అంత‌కు ముందే ఓ ఊర్లో ప్ర‌వేశించి.. 72మందిని కిరాత‌కంగా చంపేసిన ఈ ముఠా కోసం పోలీసులు కూడా గాలిస్తుంటారు. మ‌రి చింత‌ల‌పూడి గ్రామంలో ఈ ముఠా సృష్టించిన విధ్వంసం ఏమిటి? వాళ్ల‌ని కోటి ఎలా అడ్డుకున్నాడు? అనేదే ‘నాట‌కం’ క‌థ‌.
* ఎలా ఉందంటే..
క‌థ‌ని ప్రారంభించిన విధానం బాగుంది. ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం, దానికి త‌గ్గ‌ట్టుగానే క‌థానాయ‌కుడి వేష‌భాష‌లు ఇవ‌న్నీ ఆక‌ట్టుకుంటాయి. పార్వ‌తిని చూసి మ‌న‌సు ప‌డ‌డం.. వాళ్లిద్ద‌రి రొమాన్స్‌, ముద్దులు ఇవ‌న్నీ కుర్ర‌కారుకి న‌చ్చుతాయి. ఈ ప్రేమ‌క‌థ‌ని మున్ముందు ఎలా న‌డుపుతాడా? అనే ఆస‌క్తి నెల‌కొంటుంది. కానీ... అంత వ‌ర‌కే ఆలోచించిన ద‌ర్శ‌కుడు.. ఆ త‌ర‌వాత కూడా ప‌టిష్ట‌మైన క‌థ‌ని రాసుకోలేక‌పోయాడు. దొంగ‌ల ముఠాని తొలి స‌న్నివేశాల్లో భ‌యంక‌రంగా చూపించి.. పార్వతీ పురంలో అంత‌కు మించిన విధ్వంసం సృష్టిస్తార‌న్న బిల్డ‌ప్పు ఇచ్చి.. వాళ్ల‌ని క్లైమాక్స్ వ‌ర‌కూ ట‌చ్ చేయ‌లేదు. ఈ ప్రేమ‌క‌థ‌ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కాక ఏవేవో ప్ర‌య‌త్నాలు చేశాడు. మ‌ధ్య‌లో ఈ చిత్రం హార‌ర్ కోణంలో కూడా సాగుతుంది. అయితే ఆ స‌న్నివేశాలు, అందులోంచి వ‌చ్చిన ఎమోష‌న్లు ఏవీ స‌రిగా పండ‌లేదు.


తొలి భాగంలో అంబులెన్స్ సీన్‌, అమ్మాయిల్ని కిడ్నాప్ చేసే వ్య‌వ‌హారం, రెండో స‌గంలో ఓ అమ్మాయిని గ‌ర్భ‌వ‌తిని చేసి, క‌డుపు తీయించుకోవ‌డానికి బేరం పెట్టే సంద‌ర్భంలో వ‌చ్చే స‌న్నివేశం.. ఇవ‌న్నీ క‌థ‌కు అన‌వ‌స‌రం అనిపిస్తాయి. కేవ‌లం హీరో తాలుకూ యాక్ష‌న్ త‌డాఖాని చూపించ‌డానికే ఆ స‌న్నివేశాలు వాడుకున్నాడు ద‌ర్శ‌కుడు. మ‌ద్య‌పానం, శృంగారం, ర‌క్త‌పాతం ఇలా ఏ ర‌కంగానూ చూసుకున్నా.. మోతాదుకు మించే అనిపిస్తుంది. ప‌తాక స‌న్నివేశాల్లో క‌థానాయ‌కుడు క‌త్తి ప‌ట్టి విజృంభిస్తాడు. ఆ స‌న్నివేశంలో ర‌క్తం ఏరులైపారుతుంది. సినిమా అయిపోయింద‌నుకుంటే.. కోర్టు స‌న్నివేశంతో దాన్ని ఇంకాస్త పొడిగించారు. అక్క‌డ‌క్క‌డా మెరిసిన కొన్ని సంభాష‌ణ‌లు, క‌థానాయ‌కుడి వీర‌త్వం, మోటుద‌నం త‌ప్ప‌.. ఈ ‘నాట‌కం’ ఆశించినంత ర‌క్తిక‌ట్టించ‌లేకపోయింది.

* ఎవ‌రెలా చేశారంటే..
న‌టీన‌టులంతా కొత్త‌వారే. క‌థానాయ‌కుడు చూడడానికి నిజంగానే మొర‌టోడులా ఉన్నాడు. త‌న న‌ట‌న బాగుంది. ఏ ద‌శ‌లోనూ ఇబ్బంది ప‌డ‌లేదు. క‌థానాయిక‌లో అనుమెహ‌తా (ఆర్య హీరోయిన్‌), వేద రూపు రేఖ‌లు క‌నిపిస్తాయి. అందంగా ఉంది. ముద్దు స‌న్నివేశాల్లో న‌టించ‌డానికి అస్స‌లు మొహ‌మాట‌ప‌డలేదు. తాగుబోతు తండ్రిగా తోట‌ప‌ల్లి మ‌ధు న‌ట‌న కూడా ఆకట్టుకుంటుంది.


సాంకేతికంగా..
సాయికార్తీక్ పాట‌లు ఓకే అనిపిస్తాయి. తొలి పాట ‘యాడ బుట్టినావే’ న‌చ్చుతుంది. నేప‌థ్య సంగీతంలోనూ ప్రావీణ్యం చూపించాడు. కెమెరా ప‌నిత‌నం కూడా బాగుంది. ద‌ర్శ‌కుడు ఎంచుకున్న క‌థ‌లో అంతగా బ‌లం లేదు. కేవ‌లం స‌న్నివేశాల‌తో నెట్టుకురావాల‌నుకున్నాడంతే. అయితే బ‌ల‌మైన క‌థ లేన‌ప్పుడు అది కుద‌ర‌ని ప‌ని అని గ్ర‌హించ‌లేక‌పోయాడు.

బ‌లాలు
+ పాట‌లు
+ కెమెరాప‌నిత‌నం

బ‌ల‌హీన‌త‌లు
- క‌థ‌
- లాజిక్ లేని స‌న్నివేశాలు
- గంద‌ర‌గోళం

* చివ‌రిగా..
ర‌క్తి క‌ట్ట‌ని ‘నాట‌కం’


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.