రివ్యూ: బేవ‌ర్స్‌
రివ్యూ: బేవ‌ర్స్‌
న‌టీన‌టులు: రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సంజోష్‌, హ‌ర్షిత, మ‌ధునంద‌న్, ప్ర‌తాప్ త‌దిత‌రులు.
సాంకేతిక‌వ‌ర్గం: ఛాయాగ్ర‌హ‌ణం: కె.చిట్టిబాబు, సంగీతం: సునీల్ క‌శ్య‌ప్‌, నిర్మాత‌లు: పొన్నాల‌ చందు, డా.ఎం.ఎస్.మూర్తి, ఎమ్ అర‌వింద్, స‌మ‌ర్ప‌ణ‌: కాసం, ద‌ర్శ‌క‌త్వం: ర‌మేష్ చెప్పాల
విడుద‌ల‌: 12 అక్టోబ‌రు 2018
సంస్థ‌: ఎస్.ఎస్.కె ఎంటర్‌టైన్ మెంట్స్


రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రమ‌న‌గానే `ఆ న‌లుగురు`, `మీ శ్రేయోభిలాషి`, `ఓన‌మాలు` వంటి చిత్రాలు గుర్తుకొస్తాయి. స్వ‌యంగా రాజేంద్ర‌ప్ర‌సాదే ఆ చిత్రాల్నే గుర్తు చేస్తూ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో మాట్లాడ‌టంతో `బేవ‌ర్స్‌`పై ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. మ‌రి ఆ ఆస‌క్తికి త‌గ్గ‌ట్టే సినిమా ఉందో లేదో తెలుసుకుందాం
ప‌దండి...

* క‌థ
ల‌క్కీ (సంజోష్‌)ని చుట్టు ప‌క్క‌ల అంతా బేవ‌ర్స్ కుర్రాడిగా చూస్తుంటారు. కానీ అత‌నో ఇంజినీరింగ్ ప‌ట్ట‌భ‌ద్రుడు. త‌న‌కి ఇష్ట‌మైన ఏరో నాటిక‌ల్ వైపు వెళ్లి పై చ‌దువులు చ‌ద‌వాల‌నుకుంటాడు. కానీ తండ్రి స‌త్య‌మూర్తి (రాజేంద్ర‌ప్ర‌సాద్‌) అడ్డు చెప్ప‌డంతో పాటు, ఆయ‌న కోరిక మేర‌కు గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతుంటాడు. చెల్లెలు సిరిని సంతోషంగా చూసుకోవాల‌నేదే ల‌క్కీ ఆశ‌యం. అయితే చెల్లిలి పెళ్లి విష‌యంలో ల‌క్కీకీ, ఆయ‌న తండ్రికీ మ‌ధ్య గొడ‌వలు జ‌ర‌గుతుంటాయి. ఈ క్ర‌మంలోనే నా పెళ్లి విష‌యంలో గొడ‌వ‌లు ప‌డొద్దండంటూ సిరి ఆత్మ‌హ‌త్య చేసుకుంటుంది. తండ్రీకొడుకులు గొడ‌వ‌లు ప‌డ‌టంతోనే సిరి ఆత్మ‌హ‌త్య చేసుకుందా? లేక ఆమెకి పెళ్లంటే ఇష్టం లేదా? అస‌లు ఆ ఆత్మ‌హ‌త్య‌కి కార‌ణ‌మేమిటి? సిరి మ‌ర‌ణం త‌ర్వాత ల‌క్కీలో ఎలాంటి మార్పు వ‌చ్చింది? ఈ క‌థ‌లో అస‌లు బేవ‌ర్స్ ఎవ‌రు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


* విశ్లేష‌ణ‌
స‌మాజంలో చోటు చేసుకొనే కొన్ని సంఘ‌ట‌న‌ల్ని ప్ర‌తిబింబించే క‌థ ఇది. త‌ల్లిదండ్రుల మ‌న‌సుల్ని పిల్ల‌లు... పిల్ల‌ల మ‌న‌సుల్ని త‌ల్లిదండ్రులు అర్థం చేసుకోవాల‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. ఇందులో ఉన్న థ్రిల్లింగ్ అంశ‌మే సినిమాకి కీల‌కం. మిగ‌తాదంతా కూడా సాదాసీదాగా అనిపిస్తుంది. ఇలాంటి క‌థ‌లకి భావోద్వేగాలు కీల‌కం. అయితే అవి ఎక్క‌డా పండ‌లేదు. క‌థ‌, క‌థ‌నాలు... పాత‌ల్ని తీర్చిదిద్ద‌డంలో జ‌రిగిన లోపమే అందుకు కార‌ణం. హాస్యం కోసం ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ అవి ఫ‌లించ‌లేదు. రాజేంద్ర‌ప్ర‌సాద్ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో చెప్పిన స్థాయిలో అయితే ఈ సినిమా లేదు. ఆయ‌న పాత్ర‌లో కూడా పెద్ద‌గా మెరుపులేమీ లేవు. క‌థానాయ‌కుడు రౌడీల‌తో గొడ‌వ ప‌డ‌టం... గ్రూప్స్ ప్రిప‌రేష‌న్ అంటూ కాలేజీలోకి ఓ పోకిరీలాగా అడుగుపెట్టి క‌థానాయిక ఆరాధ్య (హ‌ర్షిత‌) వెంట‌ప‌డ‌టం, త‌న అల్ల‌రి ప‌నుల‌తో తండ్రిని ఇరుకున పెట్టడం వంటి స‌న్నివేశాల‌తోనే ప్ర‌థ‌మార్థం గ‌డుస్తుంది. క‌థానాయిక‌ని నాలుగైదు స‌న్నివేశాల్లో టీజ్ చేసిన క‌థానాయ‌కుడు, ఆ త‌ర్వాత త‌న ప్రేమ‌ని అంగీక‌రించ‌డం లేదని బాధ‌ని వ్య‌క్తం చేస్తూ స్నేహితుల‌తో క‌లిసి మ‌ద్యం తాగుతాడు. అస‌లు క‌థానాయిక ఎందుకు ప్రేమించాలో కూడా అర్థం కాదు. ఆ త‌ర్వాత ఆమె ఎందుకు క‌థానాయ‌కుడితో ప్రేమ‌లో ప‌డుతుందో కూడా అర్థం కాదు. క‌థానాయ‌కుడి చెల్లెలు సిరి చ‌నిపోవ‌డ‌మే సినిమాలో అస‌లు మ‌లుపు. ప్రేక్ష‌కుడిని థ్రిల్‌కి గురిచేసే అంశాలు అక్క‌డ్నుంచే మొద‌ల‌వుతాయి. సిరి హ‌త్య వెన‌క కార‌ణాలు తెలిసేకొద్దీ క‌థ‌నం ఆస‌క్తిక‌రంగా మారుతుంది. ఆ హ‌త్య‌కి కార‌కుడైన వ్య‌క్తిని ప‌సిగ‌ట్టి, ప‌గ తీర్చుకోవ‌డంతో క‌థ సుఖాంత‌మ‌వుతుంది. సినిమాలో ప‌తాక స‌న్నివేశాలే కీల‌కం.

* న‌టీన‌టులు... సాంకేతిక‌త‌
స‌త్య‌మూర్తి పాత్ర‌లో ఒదిగిపోయే ప్ర‌య‌త్నం చేశారు రాజేంద్ర‌ప్ర‌సాద్‌. కానీ ఆ పాత్ర, దాని చుట్టూ అల్లుకున్న స‌న్నివేశాల్లోనూ, క‌థ‌లోనూ బ‌లం లేక‌పోవ‌డంతో రాజేంద్ర‌ప్ర‌సాద్ క‌ష్టం ఫ‌లించ‌లేదు. ద్వితీయార్థంలో మాత్రం ఆయ‌న ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. కొత్త క‌థానాయ‌కుడు సంజోష్ ప్ర‌తి స‌న్నివేశంలోనూ ఒకే త‌ర‌హా హావ‌భావాలు ప్ర‌ద‌ర్శించారు. క‌థానాయిక హ‌ర్షిత అందంగా క‌నిపించిందంతే. మ‌ధునంద‌న్ వెనీలా అంటూ హంగామా చేశాడు. ప్ర‌తాప్ సైకో పాత్ర‌లో ఆక‌ట్ట‌కున్నాడు. మిగిలిన పాత్ర‌ల గురించి చెప్పుకోవ‌ల్సినంత ఏమీ లేదు. సాంకేతికంగా సినిమా ఫ‌ర్వాలేదనిపిస్తుంది. చిట్టిబాబు కెమెరా ప‌నిత‌నం బాగుంది. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం ఆక‌ట్టుకుంటుంది. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి. ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కుడిగా ర‌మేష్ చెప్పాల సినిమాపై ఏమాత్రం ప్ర‌భావం చూపించ‌లేక‌పోయారు. మాట‌ల ప‌రంగా చాలా క‌స‌ర‌త్తులే చేశారు కానీ... అవేవీ అత‌క‌లేదు.

* చివ‌రిగా
ఒక థ్రిల్ల‌ర్‌గా వినోదం పంచేంత శ‌క్తి ఉన్న క‌థ ఇది. కానీ క‌థ‌నంలో బ‌లం లేక‌పోవ‌డంతో ఆద్యంతం సాగ‌దీత వ్య‌వ‌హారంలా మారింది. ప‌తాక స‌న్నివేశాలు కాస్త మ‌న‌సుల్ని హ‌త్తుకుంటాయి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.