రివ్యూ: బుర్రకథ
నటీనటులు: ఆది, నైరా షా, రాజేంద్ర ప్రసాద్‌, పోసాని కృష్ణమురళీ, పృథ్వీ తదితరులు
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రాఫర్: రామ్‌ ప్రసాద్‌
కూర్పు: ఎం.ఆర్‌ వర్మ
నిర్మాత: హెచ్‌ కె. శ్రీకాంత్ దీపాల
దర్శకత్వం: డైమండ్ రత్నబాబు
విడుదల తేదీ: 05-07-2019


‘ప్రేమకావాలి’తో తెరంగేట్రం చేసి హిట్‌ అందుకున్నారు ఆది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ.. ఆయన కెరీర్‌కు సరైన బ్రేక్‌ రాలేదు. ఈ నేపథ్యంలో రచయిత డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘బుర్రకథ’. ‘ఒక మనిషి.. రెండు బుర్రలు’ కథాంశంతో రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం మెప్పించిందా?, ఆదికి హిట్‌ ఇచ్చిందా?

* కథేంటంటే..
అభిరామ్‌ (ఆది) రెండు మెదడులతో పుడుతాడు. మనిషి ఒక్కడే అయినా రెండు రకాల ఇష్టాలు ఉంటాయి. ఒకరేమో పక్కా మాస్‌, ఇంకొకరు పక్కా క్లాస్‌. ‘అభి’కి అల్లరి ఎక్కువ, ‘రామ్‌’కి భక్తి ఎక్కువ. రామ్ సన్యాసం తీసుకోవాలి అనుకుంటాడు. అభి.. హ్యాపీ (మిస్తీ)ని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. మరి అభికి నచ్చిన అమ్మాయి రామ్‌కి కూడా ఎలా నచ్చింది? అభి, రామ్‌లు ఇద్దరూ ఒక్కరిలా ఎప్పటి నుంచి ఆలోచించడం మొదలు పెట్టారు అనేదే కథ.


* ఎలా ఉందంటే..

ఒక సెల్‌ఫోన్‌లో రెండు సిమ్‌లు ఉన్నట్లే.. ఒక వ్యక్తికి రెండు మెదడులు ఉంటే, అవి రెండు రకాలుగా ఆలోచిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి ‘బుర్రకథ’ పుట్టింది. ఇదే విషయాన్ని దర్శకుడు ఇది వరకే చెప్పారు. ఈ ఆలోచన గమ్మత్తుగా ఉంది. కానీ, దాన్ని తెరమీద అంతే అందంగా, అంతే అర్థమయ్యేలాగా చూపించగలిగితే మరింత బాగుండేది. కథలో ఉండే కొత్తదనం సన్నివేశాల్లోనూ ఉన్నప్పుడే ఆ చిత్రానికి బలం చేకూరుతుంది. దర్శకుడి ఆలోచన బాగుంది కానీ, దాన్ని తెరపై చూపేటప్పుడు ఇబ్బంది పడ్డాడు. ఒక వ్యక్తిలో ఇద్దరు అనే కథాంశాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే తొలి సన్నివేశం నుంచే గందరగోళం మొదలవుతుంది. అభిరామ్‌ ఒక్కరైనప్పుడు.. రెండు రకాల ఆలోచనలు, ఇష్టాలు ఎందుకు ఉంటాయి? అని ప్రేక్షకుడు ఆలోచిస్తే ఈ కథలో ఏ మాత్రం లీనం కాలేడు. అభి, రామ్‌ ఇద్దరూ వేరు అనుకుంటే దర్శకుడు చెబుతున్న విషయాన్ని సులభంగా అర్థం చేసుకోగలడు.


ఏ సినిమాకైనా వినోదం ప్రధానం. ఈ కథలో వినోదం పండించేందుకు కావాల్సినంత ఆస్కారం ఉంది. దర్శకుడు కూడా అందుకు తగిన ప్రయత్నాలే చేశారు. కానీ, అవి ఏవీ ఫలించలేదు. పృథ్వీ ఎపిసోడ్‌, కథానాయికని ప్రేమలో దింపేందుకు హీరో చేసే హంగామా, షాపింగ్‌ మాల్‌లో ఆంటీల గురించి చెప్పిన ఉపన్యాసం, స్వాముల దగ్గర చెప్పిన క్లాసు.. ఇవన్నీ మరీ వెటకారంగా ఉంటాయి. సినిమాలో పేరడీలు ఎక్కువ అయ్యాయి. మరోవైపు విలన్‌ ఎపిసోడ్‌ కూడా ఈ కథకు దూరంగా అతుకుల బొంతలా అనిపించింది. అభి, రామ్‌ల మధ్య ఘర్షణ, ఎప్పుడు ఏ పాత్ర బయటికి వస్తుందో తెలియని తికమక.. ఈ చిత్రంలో వినోదాన్ని పంచిపెట్టే అంశాలు. విలన్‌ పాత్ర ఫన్నీగానే ఉన్నా.. దాన్ని గుర్తొచ్చినప్పుడే వాడుకున్నారు దర్శకుడు. కథానాయిక పాత్రకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం, ద్వితీయార్ధంలో సన్నివేశాలు నత్తనడకన సాగడం ‘బుర్రకథ’లోని ప్రధానమైన మైనస్‌లు. యాక్షన్‌ ఎపిసోడ్‌లు మాత్రం మాస్‌ను ఆకట్టుకుంటాయి.

* ఎవరేలా చేశారంటే..
అభి, రామ్‌గా రెండు పాత్రలను పోషించారు ఆది. ఈ పాత్రలు ఆయనలోని ఎనర్జీకి చక్కగా సరిపోతాయి. సినిమా మొత్తం ఈ రెండు పాత్రలే ప్రధానంగా కనిపిస్తాయి. డ్యాన్స్‌లు, ఫైట్‌లలో ఎప్పటిలాగే రాణించాడు. కథానాయిక పాత్రను కూడా కొత్తగా డిజైన్‌ చేయాలని దర్శకుడు ప్రయత్నించినప్పటికీ ఆ పాత్ర తేలిపోయింది. కేవలం పాటలకు ముందే కనిపించింది. రాజేంద్ర ప్రసాద్‌ ఓ సరదా తండ్రి పాత్రలో మరోసారి మెప్పించారు. పోసాని, పృథ్వీ పాత్రలు రొటీన్‌గానే సాగుతాయి. సాయి కార్తీక్‌ పాటలు కాస్త ఉపశమనం కల్గిస్తాయి. మాస్‌, మెలోడీ అన్నీ ఈ ఆల్బమ్‌లో ఉండేలా చేసుకున్నారు. డైమండ్‌ రత్నబాబు స్వతహాగా రచయిత,అందుకే సంభాషణ పరంగా ఎక్కడా లోటు చేయలేదు. కానీ కథ, కథనాల బాటను ఎంచుకోవడం వల్ల అనుకున్న లక్ష్యం వైపు ‘బుర్రకథ’ని నడిపించలేకపోయారు.


బలాలు

+ ఎంచుకున్న కథ
+ కాన్సెప్ట్‌
+ అక్కడక్కడా కాస్త కామెడీ

బలహీనతలు
- కథనం
- ద్వితీయార్ధం

* చివరిగా.. రెండు బుర్రల కథ.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.