రివ్యూ: చిత్రలహరి
రివ్యూ: చిత్రలహరి
నటీనటులు: సాయి ధరమ్‌ తేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేతా పేతురాజ్, సునీల్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌ తదితరులు
సాంకేతికవర్గం: కూర్పు: ఎ.శ్రీకర్‌ప్రసాద్, ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కళ: ఎ.ఎస్‌.ప్రకాష్, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్‌ (సీవీఎమ్‌), దర్శకత్వం: కిషోర్‌ తిరుమల.
సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్‌
విడుదల: 12 ఏప్రిల్‌ 2019


కొన్ని సినిమాలు చూసి బయటిస్తున్నప్పుడు.. అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇంకేదో తక్కువైనట్టు అనిపిస్తుంది. ‘చిత్రలహరి’ విషయంలోనూ అంతే. వరుస పరాజయాలతో సతమతమవుతున్న సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. తొలి చిత్రంతో విజయాన్ని అందుకొన్నా... ఆ తర్వాత పరాజయాన్నే చవిచూసిన కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ కూడా ఇటీవల విజయం అందుకోలేదు. ఇలా విజయం కోసమే ఎదురు చూస్తున్న కథానాయకుడు, దర్శకుడు, నిర్మాతలు కలిసి ‘చిత్రలహరి’ చేశారు. ఈ చిత్ర కథ కూడా విజయం నేపథ్యంలోనే సాగడం విశేషం. మరి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం...

* కథ..
విజయ్‌కృష్ణ (సాయిధరమ్‌ తేజ్‌) చిన్నప్పట్నుంచీ చురుకే. కానీ విజయం రుచి ఎలా ఉంటుందో తెలియదు. ఏం చేసినా అందులో పరాజయమే. ఎలాగైనా గెలుపు రుచి చూడాలనే ప్రయత్నంలో ఉన్న అతని జీవితంలోకి లహరి (కల్యాణి ప్రియదర్శన్‌) వస్తుంది. కానీ ఆ బంధం ఎంతో కాలం నిలవదు. అలా ప్రేమ పరంగా కూడా పరాజితుడిగా మిగిలిపోతాడు విజయ్‌. రోడ్డు ప్రమాదాల్లో బాధితులకి తోడ్పడేలా ఓ డివైజ్‌ని తయారు చేసే పనిలో ఉన్న అతని జీవితంలోకి మరో అమ్మాయి స్వేచ్ఛ (నివేతా పేతురాజ్‌) వస్తుంది. మరి ఆమె విజయ్‌ని ఎలా ప్రభావితం చేసింది? విజయ్‌ తన జీవితంలో అనుకొన్న లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా? దూరమైన లహరి మళ్లీ తిరిగి వచ్చిందా? లేదా? లహరికీ, స్వేచ్ఛకీ మధ్య సంబంధమేంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


* విశ్లేషణ..
దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్‌ బాగుంది. ఆయన రాసుకొన్న పాత్రలు కూడా బలంగానే ఉన్నాయి. కానీ ఆ కాన్సెప్ట్‌ని కథగా చెప్పడంలోనూ... పాత్రలకి తగ్గట్టుగా బలంగా సన్నివేశాల్ని రాసుకోవడంలోనూ దర్శకుడు చేసిన ప్రయత్నాలే ఫలించలేదు. దాంతో అన్నీ ఉన్నా ఇందులో ఏదో వెలితిగా అనిపిస్తుంది. దర్శకుడు కిషోర్‌ సున్నితమైన కథలే చెబుతుంటాడు. కానీ వాటిలో బలమైన భావోద్వేగాలు, వినోదం పండేలా చూపిస్తుంటారు. కథల్లో సంఘర్షణ కనిపిస్తుంటుంది. ఇక్కడ కూడా అదే తరహా ప్రయత్నమే చేశారు కానీ.. కుదరలేదు. విజయం కోసం తపించే కుర్రాడి కథ కావడం... అది అందరికీ కనెక్ట్‌ అయ్యే విషయమే కావడంతో ప్రేక్షకుడు నేరుగా సినిమాలో లీనమవుతాడు. సన్నివేశాలు కాస్త నిదానంగా సాగుతున్నట్టు అనిపించినా కథ, పాత్రల ఔచిత్యమే అలా ఉంటుంది కాబట్టి అది కూడా పెద్దగా ఇబ్బందేమీ అనిపించదు. మధ్యలో హాస్యం పరంగా కూడా లోటు రాకుండా చూసుకొన్నారు. కానీ భావోద్వేగాల విషయంలోనే ఆయన చేసిన కసరత్తులు ఈసారి సరిపోలేదు. విరామం సమయంలో హీరోహీరోయిన్ల మధ్య బ్రేకప్‌ సన్నివేశాలొస్తాయి. అందులో మాటలు మెప్పిస్తాయి తప్ప... ఒక జంట విడిపోతున్నప్పుడు పండాల్సిన భావోద్వేగాల్ని మాత్రం ఆ సన్నివేశాలు రాబట్టలేకపోయాయి. ద్వితీయార్థంలోనైనా కథలో ఏమైనా సంఘర్షణ ఉందా అంటే అక్కడ కూడా నిరాశే. ప్రేక్షకుడు సులభంగా ఊహంచే సన్నివేశాల్నే తెరపై చూపించాడు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి చేసిన సందడి మినహా కథలో సంఘర్షణ కానీ, మలుపులు కానీ ఏమీ ఉండవు. పతాక సన్నిî ేశాల్లో కూడా బలం లేదు. కానీ అక్కడ సక్సెస్‌ గురించి సంభాషణలు మాత్రం ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా వినోదం పంచే సన్నివేశాలు.. నాయకానాయికల పాత్రలు, సందేశం ప్రేక్షకులకు కాలక్షేపాన్నిస్తాయి.

* నటీనటులు... సాంకేతికత
తన కథలతోనూ..పాత్రలతోనూ కథానాయకుల బాడీ లాంగ్వేజ్‌ని మార్చేస్తుంటాడు కిషోర్‌ తిరుమల. ఈ చిత్రంతోనూ సాయిధరమ్‌ తేజ్‌ని కొత్తగా చూపించారు. ఆ పాత్ర కోసం ఎంతో పరిణతితో కూడిన నటనని ప్రదర్శించాడు తేజ్‌. ఆయన ఈ సినిమాతో తన పేరుని సాయితేజ్‌గా మార్చుకున్నారు. వినోదం, భావోద్వేగాల పరంగా కూడా మెప్పిస్తాడు. కల్యాణి ప్రియదర్శన్‌ తన పాత్ర పరిధి మేరకు చక్కటి అభినయం ప్రదర్శించింది. ఆమె సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకుంది. పాత్ర స్వభావం రీత్యా నివేతా పేతురాజ్‌ మొహంపై ఎప్పుడూ నవ్వుండదు కానీ... అందంగా కనిపించింది. ప్రాక్టికల్‌గా ఆలోచించే యువతి పాత్రలో ఆమె అభినయం కూడా మెప్పిస్తుంది. తొలి సగభాగం సినిమాలో సునీల్, ద్వితీయార్థంలో వెన్నెల కిషోర్‌ పంచిన కామెడీ సినిమాకి హైలెట్‌గా నిలిచింది. కొడుకుపై నమ్మకమున్న ఓ తండ్రిగా పోసాని చక్కటి అభినయం ప్రదర్శించారు. బ్రహ్మాజీ, రావు రమేష్, జయప్రకాష్‌ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. దేవిశ్రీప్రసాద్‌ పాటలు, నేపథ్య సంగీతంతో పాటు, కార్తీక్‌ ఘట్టమనేని కెమెరా పనితనం మెప్పిస్తుంది. దర్శకుడు కిషోర్‌ తిరుమల మాటల పరంగా మరోసారి ప్రత్యేకతని ప్రదర్శించారు. కథ పరంగానే ఆయన చేసిన కసరత్తులు సరిపోలేదు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.


బలాలు
+ మాటలు, సందేశం
+ హాస్యం
+ సంగీతం
+ నాయకానాయికల పాత్రలు

బలహీనతలు
- కొత్తదనం లేని కథ

* చివరిగా..
నవతరం ఇష్టపడే వాస్తవిక కథతో తెరకెక్కిన చిత్రమిది. అక్కడక్కడా నవ్వించే వినోదం... స్ఫూర్తినిచ్చే సందేశంతో కాలక్షేపాన్నిస్తుంది. సాయిధరమ్‌ తేజ్‌ ఈమధ్య కాలంలో చేసిన చిత్రాలకంటే ఉత్తమంగా అనిపిస్తుంది. ఎక్కువ అంచనాలతో వెళితే మాత్రం నిరాశపడక తప్పదు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.