రివ్యూ: డిస్కోరాజా
చిత్రం: డిస్కోరాజా

న‌టీన‌టులు: ర‌వితేజ‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌, న‌భా న‌టేష్, తాన్య హోప్‌, బాబీ సింహా, రాంకీ, సునీల్‌, న‌రేష్, స‌త్య‌, గిరిబాబు, అన్నపూర్ణమ్మ త‌దిత‌రులు.

ఛాయాగ్రహ‌ణం
: కార్తీక్ ఘ‌ట్టమ‌నేని

మాట‌లు
: అబ్బూరి ర‌వి 

స‌ంగీతం
: త‌మ‌న్‌

నిర్మాత‌
: రామ్ తాళ్లూరి

ద‌ర్శక‌త్వం
: వి.ఐ.ఆనంద్

సంస్థ‌
: ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

విడుద‌ల‌
: 24 జ‌న‌వ‌రి 2020


ర‌వితేజ - వి.ఐ.ఆనంద్‌.  - ఈ క‌ల‌యికే ఆస‌క్తిని రేకెత్తించింది. `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా`, `ఒక్క క్ష‌ణం`లాంటి సినిమాల్ని తీసి ప్రేక్ష‌కుల‌కి  థ్రిల్‌ని పంచారు వి.ఐ.ఆనంద్‌.  అలాంటి ద‌ర్శ‌కుడు... ర‌వితేజ‌తో క‌లిశాడంటే `ఎలాంటి సినిమా చేస్తారా?` అనే ఉత్సుక‌త ప్రేక్ష‌క‌ల్లో వ్య‌క్త‌మ‌వ్వ‌డం ఖాయం. ర‌వితేజ కూడా మొద‌ట ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాడ‌ట‌. కానీ డిస్కోరాజా అని పేరు చెబుతూ, ఈ క‌థ వినిపించాక ఆయ‌న గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. మాస్ క‌థ‌ల‌కి పెట్టింది పేరైన క‌థానాయ‌కుడు ర‌వితేజ. ఆయ‌న‌కి ఈమ‌ధ్య వ‌రుస‌గా ప‌రాజ‌యాలే. మ‌రి ఆచితూచి ఎంచుకుని చేసిన ఈ సినిమా ఎలా ఉంది? ఈ క‌ల‌యికపై ఉన్న అంచ‌నాల‌కి త‌గ్గ‌ట్టుగానే ప్రేక్ష‌కుల‌కి వినోదం పంచారా? త‌దిత‌ర విష‌యాల్ని తెలుసుకుందాం ప‌దండి...
క‌థ:
డిస్కోరాజ్ (ర‌వితేజ‌) ఒక డాన్‌. 1980వ ద‌శ‌కంలో మ‌ద్రాస్‌లో  అత‌ను చెప్పిందే వేదం. రాజ‌కీయ నాయ‌కులు కూడా డిస్కోరాజ్ ద‌గ్గ‌రికి వ‌స్తుంటారు. ఆ ద‌శ‌లో న‌కిలీల‌కి పెట్టింది పేరైన బ‌ర్మా సేతు (బాబీ సింహా) రంగంలోకి దిగుతాడు. ఇద్ద‌రి మ‌ధ్య ఆధిప‌త్య పోరు మొద‌ల‌వుతుంది.  త‌న తెలివి తేట‌ల‌తో సేతుని జైలుకు పంపుతాడు డిస్కో. ఇంత‌లో హెలెన్ (పాయ‌ల్ రాజ్‌పుత్‌) ప్రేమ‌లో ప్రేమ‌లో ప‌డ‌తాడు డిస్కోరాజ్‌. ఆమె కోసం, ఆమె గ‌ర్భంలో ఉన్న బిడ్డ కోసం డాన్ జీవితానికి పుల్‌స్టాప్ పెట్టేసి, ల‌డాఖ్ వెళ‌తాడు. అక్క‌డికి వెళ్లిన డిస్కోరాజ్ హ‌త్య‌కి గుర‌వుతాడు. ఇంత‌కీ ఆ హ‌త్య ఎవ‌రు చేశారు?  35 యేళ్ల త‌ర్వాత అదే రూపు రేఖ‌ల‌తో క‌నిపించిన వాసు (ర‌వితేజ‌)కీ, డిస్కోరాజాకీ మ‌ధ్య సంబంధ‌మేమిటి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


* విశ్లేష‌ణ‌

పాత క‌థ‌ల‌కే కొత్త హంగుల్నిజోడిస్తున్న కాలం ఇది. ఇలాంటి ద‌శ‌లో ఓ కొత్త నేప‌థ్యంతో కూడిన క‌థాంశం దొరికిందంటే  ద‌ర్శ‌కులు దాన్ని మ‌రో స్థాయికి తీసుకెళుతుంటారు. ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ ఎవ‌రూ స్పృశించ‌ని అంశాన్నే ఎంచుకున్నాడు. కానీ దానికి సాధార‌ణ‌మైన స‌న్నివేశాల్ని జోడించాడు. దాంతో స‌గ‌టు ప్ర‌తీకార క‌థగా మిగిలిపోయిందే త‌ప్ప క‌థాంశంలోని కొత్త‌ద‌నం ప్ర‌భావం ప్రేక్ష‌కుడిపై ఏ ద‌శ‌లోనూ ప‌డ‌నీయ‌లేదు.  సైన్స్ ఫిక్ష‌న్ అంశాల‌తో క‌థ‌ని మొద‌లుపెట్టాడు ద‌ర్శ‌కుడు. ఆరంభ స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. బాడీ ఫ్రీజ్ అయిన విధానం, ల్యాబ్‌ల్లో ప్ర‌యోగాలు, మృత‌దేహానికి ఊపిరి పోయ‌డం వంటి స‌న్నివేశాలు ఆస‌క్తిని రేకెత్తిస్థాయి. క‌థ‌లో తొంద‌ర‌గా లీన‌మ‌య్యేలా చేస్తాయి.  మృత‌దేహం మ‌ళ్లీ ప్రాణం పోసుకున్నాక పండే వినోదం,  ఆ నేప‌థ్యంలో పండే డ్రామా ఆక‌ట్టుకుంటుంది. ఇక  బాబీ సింహా ఎప్పుడైతే క‌థ‌లోకి వ‌స్తాడో అప్ప‌ట్నుంచి సినిమా మ‌రో స్థాయికి వెళ్లిపోతుంది. విరామం స‌మ‌యంలో వ‌చ్చే స‌న్నివేశాల్లో ఆ మృత‌దేహం ఎవ‌రిది? ప‌్రాణం పోసుకున్న వ్య‌క్తి ఎవ‌ర‌నేది తెలియ‌డం మంచి మ‌లుపు. ద్వితీయార్థంలో క‌థ మ‌ళ్లీ ఫ్లాష్ బ్యాక్‌కి వెళుతుంది. అక్క‌డ డిస్కోరాజాకీ, బ‌ర్మా సేతుకీ మ‌ధ్య ఆధిప‌త్య పోరుతోపాటు... డిస్కోరాజ్ - హెలెన్ ప్రేమ‌క‌థ ఆక‌ట్టుకుంటాయి.  కానీ అంత‌కుముందు చూపించిన సైన్స్ ఫిక్ష‌న్ అంశాల్ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేయ‌డంతో ఇదొక సాధార‌ణ ప్ర‌తీకార క‌థ‌లాగా మారిపోతుంది త‌ప్ప‌, కొత్త‌ద‌నం క‌నిపించ‌దు. అక్క‌డ్నుంచి స‌న్నివేశాల‌న్నీ కూడా ప్రేక్ష‌కుడి ఊహ‌కు త‌గ్గ‌ట్టుగానే సాగిపోతుంటాయి. ప‌తాక స‌న్నివేశాల్లో మ‌లుపు ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంది. కానీ అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్ట‌మంతా జ‌రిగిపోయింది. దాంతో  ఆ స‌న్నివేశాలు కాస్త న‌వ్విస్తాయి,ఆశ్చ‌ర్యానికి గురిచేస్తాయేమో కానీ... సినిమాపై పెద్దగా ప్ర‌భావం మాత్రం చూపించ‌లేక‌పోయింది.  ర‌వితేజ న‌ట‌న, ఆయ‌న క‌నిపించిన విధానం మాత్రం మెప్పిస్తుంది. 


* న‌టీన‌టులు.. సాంకేతిక‌త‌
ర‌వితేజ ప‌లు కోణాల‌తో సాగే పాత్ర‌లో క‌నిపిస్తాడు. త‌న శైలిలో కామెడీ పంచ‌డంతో పాటు...  యాక్ష‌న్ ఘ‌ట్టాల్లోనూ, ప్రేమ‌క‌థ‌లోనూ చ‌క్క‌గా ఒదిగిపోయాడు. ప్ర‌థమార్థంలో వెన్నెల కిషోర్‌, తాన్య హోప్‌ల‌తో క‌లిసి ర‌వితేజ పంచే వినోదం మెప్పిస్తుంది.  ద్వితీయార్థంలో డిస్కోరాజ్‌గా పాత లుక్‌లో క‌నిపించ‌డం ఆక‌ట్టుకుంటుంది. బాబీ సింహా న‌ట‌న మ‌రో స్థాయిలో ఉంటుంది. ఆయ‌న బ‌ర్మా సేతు పాత్ర‌లో ఒదిగిపోయాడు. విల‌నిజం బాగా పండ‌టంతో ఆ ప్ర‌భావం హీరో పాత్ర‌పై కూడా ప‌డింది.   సునీల్ న‌ట‌న, ఆయ‌న పాత్ర‌ని తీర్చిదిద్దిన విధానం సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. పాయ‌ల్ రాజ్‌పుత్ బ‌ధిర యువ‌తిగా చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించింది. అందంతోనూ, పాత‌కాలంనాటి లుక్‌తోనూ క‌ట్టిపడేస్తుందామె. న‌భా న‌టేష్ పాత్ర‌కి పెద్దగా ప్రాధాన్యం లేదు. కానీ తొలి పాట‌లో ఆమె అందంగా క‌నిపించింది.  తాన్య హోప్ శాస్త్ర‌వేత్త‌ల గ్రూప్‌లో ఒక‌రిగాక‌నిపిస్తుందంతే.  సాంకేతిక విభాగం మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచింది. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ స‌న్నివేశాల్ని, ల‌డాఖ్ నేప‌థ్యాన్ని సినిమాకి త‌గ్గ టోన్‌లో చూపించారు. త‌మ‌న్ సంగీతం సినిమాకి మ‌రింత బ‌లాన్నిచ్చింది. ఇత‌ర విభాగాలు కూడా స‌మ‌ష్టిగా ప‌నిచేశాయి. ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ ఒక  కొత్త నేప‌థ్యంలో క‌థ‌ని రాసుకున్న విధానం బాగుంది కానీ, సినిమాపై సైన్స్ ఫిక్ష‌న్ ప్ర‌భావం త‌క్కువ‌గా ఉండ‌టంతో ఇదొక సాధార‌ణ ప్ర‌తీకార సినిమా అయింది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి.
 
చివ‌రిగా:
`స‌బ్జెక్ట్`తో కూడిన సినిమాలు అరుదు. ఇందులో మాత్రం `స‌బ్జెక్ట్‌` భ‌లే ఉంటుంది.  అదే బ‌లం కూడా. ఆ విష‌యాన్ని పాత్ర‌లు అడుగ‌డుగునా గుర్తు చేస్తుంటాయి కూడా.  అయినా ద‌ర్శ‌కుడు దాన్నే ప‌క్క‌న‌పెట్టేసి అంద‌రూ వెళ్లే అల‌వాటైన దారిలో సినిమాని న‌డిపించేశాడు.దాంతో మంచి స‌బ్జెక్ట్ వృథా అయిన ఫీలింగ్ క‌లుగుతుంది.  అయినా స‌రే... అక్క‌డ‌క్క‌డా ఆస‌క్తిక‌రంగా సాగే స‌న్నివేశాలు, ర‌వితేజ చేసే సంద‌డి, ఆయ‌న హుషారు మాత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి కాల‌క్షేపాన్నిస్తుంది. 

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.