రివ్యూ: ఎంత మంచివాడ‌వురా
న‌టీన‌టులు: క‌ళ్యాణ్‌రామ్‌, మెహ‌రీన్‌, సుహాసిని, న‌రేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, శ‌ర‌త్‌కుమార్‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, వెన్నెల కిషోర్‌, ప్ర‌వీణ్‌, సుద‌ర్శ‌న్‌, భ‌ద్రం త‌దిత‌రులు.
స‌ంగీతం: గోపీసుంద‌ర్‌,
ఛాయాగ్ర‌హ‌ణం: రాజ్ తోట‌,
కూర్పు: త‌మ్మిరాజు,
క‌ళ‌: రామాంజ‌నేయులు,
స‌మ‌ర్ప‌ణ‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌,
నిర్మాత‌లు: ఉమేష్ గుప్త‌, సుభాష్ గుప్త‌,
ద‌ర్శ‌క‌త్వం: స‌తీష్ వేగేశ్న.
సంస్థ‌: ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్‌
స‌మ‌ర్ప‌ణ‌: శ‌్రీదేవి మూవీస్‌
విడుద‌ల‌: 15 జ‌న‌వ‌రి 2020


ఈ యేడాది సంక్రాంతి సినిమాల ప‌రంప‌ర‌లో భాగంగా వచ్చిన చిట్ట‌చివ‌రి చిత్రం `ఎంత మంచివాడ‌వురా`. క‌ల్యాణ్‌రామ్ తొలిసారి చేసిన కుటుంబ క‌థా చిత్ర‌మిది. `శ‌త‌మానం భ‌వ‌తి`తో కుటుంబ క‌థ‌ల‌పై ప‌ట్టున్న దర్శ‌కుడు అనిపించుకున్న స‌తీష్ వేగేశ్న తెర‌కెక్కించారు. పండ‌గ‌కి భారీ బ‌డ్జెట్ చిత్రాల‌తో పాటు... ఒక‌ట్రెండు ప‌రిమిత వ్య‌యంతో తెర‌కెక్కే చిత్రాలు కూడా విడుద‌ల‌వుతుంటాయి. అగ్ర క‌థానాయ‌కుల‌తో పోటీప‌డుతూ విజ‌యాల్ని సొంతం చేసుకుంటుంటాయి. దాంతో పండ‌గ‌కి వ‌చ్చే ప్ర‌తి సినిమాపైనా ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు, ప్రేక్ష‌కులు అంచ‌నాలు పెంచుకుంటుంటారు. అలా విడుద‌ల‌కి ముందే అంద‌రిలోనూ ఆస‌క్తి పెంచినీ చిత్రం ఎలా ఉంది? క‌ళ్యాణ్‌రామ్ కుటుంబ క‌థ‌లో ఎలా ఒదిగిపోయాడు? తెలుసుకుందాం ప‌దండి...

* క‌థ
చిన్న‌ప్పుడే త‌ల్లిదండ్రుల్నికోల్పోతాడు బాలు (క‌ళ్యాణ్‌రామ్‌). బంధాల విలువేంటో తెలుసుకుంటూ పెరిగిన అత‌ను పెద్ద‌వాడ‌య్యాక ఒంట‌రి జీవితం అనుభ‌విస్తున్న‌వాళ్ల కోసం ఆల్ ఈజ్ వెల్ అనే సంస్థ‌ని ప్రారంభిస్తాడు. కొడుకు, మ‌న‌వ‌డు, కోడ‌లు.. ఇలా ఆ బంధాల్ని, భావోద్వేగాల్ని స‌ర‌ఫ‌రా చేయ‌డ‌మే ఈ సంస్థ ప‌ని. అయిన‌వాళ్ల‌కి దూరంగా బ‌తుకుతున్న ఎంతోమంది క‌ళ్ల‌లో ఆనందం నింపుతాడు బాలు. కొడుకుని కోల్పోయిన రాఘ‌వాచారి (త‌నికెళ్ల భ‌ర‌ణి) ఇంటికి బాలు వెళ్లాల్సి వ‌స్తుంది. ఆచార్య పేరుతో ఆ ఇంటికి వెళ్లాక బాలు ఎలాంటి ప‌రిస్థితుల్ని ఎదుర్కోవ‌ల్సి వ‌స్తుంది? రాఘ‌వాచారికి కొడుకు లేని లోటుని బాలు తీర్చాడా? ఎవ‌రూ లేని బాలు చివ‌రికి ఎంత‌మంది బంధాల్ని సంపాదించాడు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


* విశ్లేష‌ణ‌
బ‌ల‌మైన సందేశం, భావోద్వేగాల్ని పంచేందుకు ఆస్కార‌మున్న క‌థే ఇది. గుజ‌రాతీ చిత్రం `ఆక్సిజ‌న్‌`కి రీమేక్‌గా రూపొందింది. బంధాలతో ముడిప‌డిన కథే కాబ‌ట్టి కుటుంబ ప్రేక్ష‌కుల్ని మెప్పించొచ్చు. త‌న‌కి కాని క‌థ కావ‌డ‌మో, లేక ఇందులో ప్ర‌ధానాంశాన్ని అర్థం చేసుకోవ‌డంలో విఫ‌ల‌మయ్యాడో తెలియ‌దు కానీ ద‌ర్శ‌కుడు ఏ ద‌శ‌లోనూ సినిమాపై ప‌ట్టు ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయాడు. దాంతో సాగదీత‌గా, ఏమాత్రం ఆస‌క్తి లేకుండా స‌న్నివేశాలు ముందుకు సాగుతుంటాయి. పాత్ర‌ల‌న్నీ వ‌చ్చి పోతుంటాయి, న‌టులు ఎవ‌రి స్థాయిలో వాళ్లు సంద‌డి చేస్తూనే ఉంటారు కానీ... వాటి ప్ర‌భావం మాత్రం ప్రేక్ష‌కుడిపై ఏమాత్రం క‌నిపించ‌దు. క‌థ‌నంలో లోప‌మే అది. మెహ‌రీన్ ఫ్లాష్ బ్యాక్ మొద‌లు పెట్ట‌డంతో ఈ క‌థ మొద‌ల‌వుతుంది. అయితే అస‌లు క‌థ మాత్రం క‌థానాయ‌కుడికి సంబంధించిన నిజం తెలిసిన త‌ర్వాతే ఊపందుకుంటుంది. బంధాల్ని స‌ప్లై చేసే సంస్థ ఆల్ ఈజ్ వెల్‌ని ఏర్పాటు చేశాక... కొన్ని స‌ర‌దా స‌న్నివేశాలు సాగుతాయి. ఆచార్య‌గా హీరో ఎప్పుడైతే రాఘ‌వాచారి ఇంటికి వెళ‌తాడో అప్ప‌ట్నుంచి సినిమా మ‌రో క‌థ‌లోకి ప్ర‌వేశించిన‌ట్ట‌వుతుంది. అక్క‌డ ఇసుక మాఫియా నాయ‌కుడు గంగ‌రాజు(రాజీవ్ క‌న‌కాల‌)తో హీరో త‌ల‌ప‌డే నేప‌థ్యంలో విరామ స‌న్నివేశాలొస్తాయి. ద్వితీయార్థంలో కొన్ని మ‌లుపులు మాత్రం ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. బంధాల పేరుతో ఒక‌రి జీవితంలో మ‌రొక‌రు వెళితే ఏమ‌వుతుందో చెబుతూ ఆ నేప‌థ్యంలో కొన్ని స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. వ‌చ్చింది త‌న కొడుకు కాద‌ని రాఘ‌వాచారికి తెలిసిన‌ప్పుడు త‌లెత్తే సంఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు కూడా క‌దిలిస్తాయి. మున్నార్ ఎపిసోడ్‌లో వెన్నెల‌కిషోర్ హాస్యం కాస్త న‌వ్విస్తుంది. ప‌తాక స‌న్నివేశాలు మ‌ళ్లీ మామూలే. తెలుగు సినిమా ప‌డిక‌ట్టు సూత్రాల‌కి త‌గ్గ‌ట్టుగా సాగుతుంది. ద‌ర్శ‌కుడు క‌థ‌, క‌థ‌నాల్ని చెప్ప‌డంలో ఎలాంటి వైవిధ్యం ప్ర‌ద‌ర్శించ‌లేదు. దాంతో 90వ ద‌శ‌కంలో సినిమా చూసిన‌ట్టుగా అనిపిస్తుంది త‌ప్ప కొత్త‌ద‌నం ఎక్క‌డా క‌నిపించ‌దు.


* న‌టీన‌టులు.. సాంకేతిక‌త
క‌ల్యాణ్‌రామ్, మెహ‌రీన్ పాత్ర‌ల చుట్టూనే క‌థ న‌డుస్తుంది. వాళ్లిద్ద‌రూ పాత్ర‌ల్లో ఒదిగిపోయేందుకు ప్ర‌య‌త్నించారు. కుటుంబ క‌థ క‌ల్యాణ్‌రామ్‌కి కొత్త‌కావ‌డంతో ఆ ప్ర‌భావం సినిమాలో క‌నిపిస్తుంటుంది. మెహ‌రీన్ పాత్ర‌కి కూడా భావోద్వేగాలు పంచే అవ‌కాశం దొరికింది. పాట‌ల్లో ఆమె అందంగా క‌నిపించింది. త‌నికెళ్ల భ‌ర‌ణి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, సుహాసిని, శ‌ర‌త్‌బాబు, విజ‌య్ కుమార్ త‌దిత‌రులు ప‌రిధి మేర‌కు న‌టించారు. న‌రేష్, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీను, భ‌ద్రం త‌దిత‌రులున్నా వెన్నెల‌కిషోర్‌, సుద‌ర్శ‌న్ పాత్ర‌లే కాస్త న‌వ్విస్తాయి. సాంకేతిక విభాగంలో గోపీసుంద‌ర్ సంగీతం ఆక‌ట్టుకుంటుంది. ఏమో ఏమో, ఔనో కాదో తెలియ‌ని పాట‌లు అల‌రిస్తాయి. నేప‌థ్య సంగీతం ప‌ర్వాలేద‌నిపిస్తుంది. రాజ్‌తోట కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి. స‌తీష్ వేగేశ్న తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచుల‌కి త‌గ్గ‌ట్టుగా చిత్రాన్ని తీర్చిదిద్ద‌లేక‌పోయారు. స‌రైన మోతాదులో భావోద్వేగాలు పండించ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు.

*చివ‌రిగా:
`మేక‌ప్ వేస్తే గెట‌ప్ వ‌స్తుంది కానీ... ఎమోష‌న్ రాదు క‌దా` అనే ఓ డైలాగ్ ఈ సినిమాలో వినిపిస్తుంది. అది ఈ చిత్రానికి కూడా వ‌ర్తిస్తుంది. ఒక మంచి క‌థ దొరికింద‌ని కొనేస్తే చాల‌దు, అందులోని భావోద్వేగాల్ని అదే స్థాయిలో మ‌న కూడా రాబ‌ట్టాలి. అప్పుడే అనుకున్న ఫ‌లితం వ‌స్తుంది. అక్క‌డి క‌థ తెచ్చారు కానీ... ఆ భావోద్వేగాల్ని మాత్రం ఇందులో పండించ‌లేక‌పోయారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.