రివ్యూ: ఎవ‌రు
న‌టీన‌టులు: అడివిశేష్‌, రెజీనా, న‌వీన్ చంద్ర, ముర‌ళీ శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్ త‌దిత‌రులు
ఛాయాగ్ర‌హ‌ణం: వ‌ంశీ ప‌చ్చిపులుసు
సంగీతం: శ్రీచ‌ర‌ణ్ పాకాల‌
క‌ళ‌: అవినాష్ కొల్ల‌
కూర్పు: గ్యారీ బి.హెచ్‌
సంభాష‌ణ‌లు: అబ్బూరి ర‌వి
నిర్మాత‌లు: పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె
ద‌ర్శ‌క‌త్వం: వెంక‌ట్ రాంజీ
విడుదల: 15-08-2019
సంస్థ‌: పీవీపీ సినిమా


తెలుగులో త‌ర‌చుగా ప్రేక్ష‌కుల ముందుకొస్తుంటాయి థ్రిల్ల‌ర్ చిత్రాలు. ఒక‌ప్పుడు ప‌రిమిత వ్య‌యంతో తెర‌కెక్కే సినిమాలే థ్రిల్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించేవి. ఇప్పుడు అగ్ర క‌థానాయ‌కులు కూడా ఆ క‌థ‌ల‌పై మ‌క్కువ చూపుతున్నారు. దీన్నిబ‌ట్టి తెలుగు చిత్ర‌సీమ‌పై థ్రిల్ల‌ర్ క‌థ‌లు ఎంత‌గా ప్ర‌భావం చూపిస్తున్నాయో అర్థమ‌వుతుంది. అన్ని సినిమాల ల‌క్ష్యం ప్రేక్ష‌కుల్ని థ్రిల్ చేయ‌డ‌మే అయినా... ఒకొక్కసారి ఒక్కో కొత్త ర‌క‌మైన క‌థ‌ని, నేప‌థ్యాన్ని రుచి చూపిస్తుండ‌టంతో వాటిపై ఎప్ప‌టిక‌ప్పుడు ఆస‌క్తి పెరుగుతూనే ఉంది. పొరుగు భాష‌ల్లోనూ ఇదే వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తున్నా.. తెలుగులో ఈ క‌థ‌ల్ని ఇష్ట‌ప‌డేవాళ్ల సంఖ్య బాగా పెరుగుతోంది. అడ‌వి శేష్ ఇదివ‌ర‌కు చేసిన `క్ష‌ణం`, `గూఢ‌చారి` చిత్రాల‌తో మంచి విజ‌యాల్ని అందుకొన్నారు. ఆయ‌న్నుంచి వ‌చ్చిన మ‌రో చిత్ర‌మే `ఎవ‌రు`. ప్ర‌చార చిత్రాలతో పాటు.. అడ‌వి శేష్ ఇదివ‌ర‌కు చేసిన సినిమాల ప్ర‌భావం వ‌ల్ల `ఎవ‌రు`పై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. మ‌రి చిత్రం ఎలా ఉందో తెలుసుకునేముందు క‌థేంటో చూద్దాం...

* క‌థేంటంటే..
 స‌మీర మ‌హా (రెజీనా) ఒక ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్తకి భార్య‌. రిసెప్ష‌నిస్టు నుంచి ఎదిగిన అమ్మాయి. అనుకోకుండా డీఎస్పీ అశోక్ (న‌వీన్‌చంద్ర‌)ని హ‌త్య చేస్తుంది. త‌న‌పై అత్యాచారానికి ఒడిగ‌ట్ట‌గా, స్వీయ ర‌క్ష‌ణ కోస‌మే కాల్చాన‌ని చెబుతుందామె. ఈ కేసుని ప‌రిశోధించ‌డానికి అవినీతి అధికారిగా ముద్ర‌ప‌డ్డ పోలీసు అధికారి విక్ర‌మ్ వాసుదేవ్ (అడివి శేష్‌) రంగంలోకి దిగుతాడు. స‌మీర నుంచి లంచం కూడా తీసుకుంటాడు. కోర్టులో ఎదురయ్యే ప్ర‌శ్న‌లు ఎలా ఉంటాయో, వాటిని ఎలా ఎదుర్కోవాలో చెబుతానంటూ ఈ కేసు పూర్వాప‌రాల్ని తెలుసుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తాడు విక్ర‌మ్. స‌మీర చెప్పిన విష‌యాలు... తాను అప్ప‌టికే సేక‌రించిన స‌మాచారంతో స‌రిపోక‌పోవ‌డంతో అస‌లు నిజాల్ని దాస్తున్నారంటూ వాటిని రాబ‌ట్టేందుకు ప్ర‌య‌త్నిస్తాడు. ఆ క్ర‌మంలో ఎలాంటి నిజాలు బ‌య‌టికొచ్చాయి? నిజంగా అశోక్‌ని స‌మీరే హ‌త్య చేసిందా? ఆమె క‌థ‌కీ, విక్ర‌మ్ వాసుదేవ్ ప‌రిశోధ‌న చేసిన మ‌రో కేసు విన‌య్ వ‌ర్మ (ముర‌ళీశ‌ర్మ‌) మిస్సింగ్‌కీ సంబంధ‌మేమిటి? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.


* ఎలా ఉందంటే..
క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమా అంటే ఎన్నో ప్ర‌శ్న‌లు, మ‌రెన్నో చిక్కుముడులు. ఒకొక్క చిక్కుముడి వీడేకొద్దీ ఒక్కో ప్ర‌శ్న‌కి జ‌వాబు దొరుకుతుంటుంది. ఇది కూడా అలాంటి క‌థే. కాక‌పోతే ఇందులోని ప్ర‌శ్న‌లు వేరు, చిక్కుముడులు వేరు. నేరం ఏంట‌నేది తెలుసు, ఎవ‌రు చేశార‌నేది తెలుసు. కానీ ఎలా చేశారు? ఎందుకు చేశారు? నిజంగా నిందితులు వాళ్లేనా కాదా? అనేవే ప్ర‌శ్న‌లు. ఆ ప్ర‌శ్న‌ల వెన‌క అస‌లు నిజాన్ని రాబ‌ట్టే విధానమే ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. తొలి స‌న్నివేశంలోనే హ‌త్య జ‌రుగుతుంది. దాంతో క‌థ‌ని నేరుగా మొద‌లు పెట్టిన‌ట్ట‌యింది. విక్ర‌మ్ వాసుదేవ్‌గా అడివిశేష్ ప‌రిచ‌యం కావడంతో క‌థ‌లో వేగం పుంజుకుంటుంది. విక్ర‌మ్ వాసుదేవ్ ప్ర‌శ్న‌, స‌మీర జ‌వాబుతో సన్నివేశాలు ర‌క్తిక‌డ‌తాయి. ఆ జ‌వాబు పూర్త‌య్యేలోపే ఇంకో అనుమానం, ఇంకో ప్ర‌శ్న‌, మ‌ళ్లీ క‌థ‌లో మ‌లుపు.... ఆ మ‌లుపు వెన‌క మ‌ర్మాలు బ‌య‌టికొచ్చేలోపే విక్ర‌మ్ తాను ప‌రిశోధించిన మ‌రో కేసు గురించి చెప్ప‌డం మొద‌లుపెడ‌తాడు. అందులో కూడా ఎన్నో సందేహాలు. అలా రెండు కేసులు, వాటిలో ఊహించ‌ని మ‌లుపుల‌తో సినిమా ప్ర‌థ‌మార్ధం వ‌ర‌కూ థ్రిల్లింగ్‌గా సాగుతుంది. ద్వితీయార్ధంలో ప్రేక్ష‌కుల్ని మ‌రింత థ్రిల్ చేయాల‌నుకున్న‌ట్టున్నాడు ద‌ర్శ‌కుడు. దాంతో మ‌లుపులు మ‌రీ ఎక్కువ‌య్యాయి. ఇప్ప‌టి వరకు సిచువేష‌న్స్ నా కంట్రోల్‌లోనే ఉన్నాయంటూ విక్ర‌మ్ వాసుదేవ్‌, స‌మీర ఎత్తులు పైఎత్తులు వేసుకున్న‌ప్ప‌టికీ.. డీఎస్పీ అశోక్‌, విన‌య్ వ‌ర్మ మిస్సింగ్‌ల‌కి అస‌లు కార‌ణం బ‌య‌టికొచ్చేంత వ‌ర‌కూ క‌థ ప్రేక్ష‌కుడి కంట్రోల్‌లోనే ఉంటుంది. కానీ ఆ త‌ర్వాత వ‌చ్చే సన్నివేశాలే కంట్రోల్ త‌ప్పి గంద‌ర‌గోళాన్ని రేకెత్తిస్తాయి. ప‌తాక స‌న్నివేశాల్లో ఊహించ‌ని మ‌రో మ‌లుపు ఆక‌ట్టుకుంటుంది. అదంతా భావోద్వేగాల కోస‌మే అన్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. కేవ‌లం థ్రిల్ పంచ‌డ‌మే కాకుండా, ప్ర‌తి మ‌లుపు వెన‌కా భావోద్వేగాలు పండేలా చూసుకున్నాడు ద‌ర్శ‌కుడు. ది ఇన్విజిబుల్ గెస్ట్, బ‌ద్లా సినిమాల స్ఫూర్తితో ఈ సినిమా తెర‌కెక్కింది. ఆ సినిమాల్ని చూడ‌ని ప్రేక్ష‌కులు మ‌రింత థ్రిల్ పీలవుతారు. ద్వితీయార్ధంలో రెజీనా జీవితం, అశోక్‌తో క‌లిసి చేసిన ప్ర‌యాణం ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. రెజీనా, న‌వీన్ చంద్ర మధ్య బోల్డ్‌గా సాగే స‌న్నివేశాలు యువ‌త‌రాన్ని ఆక‌ర్షించేవే.

* ఎవ‌రెలా చేశారంటే..
అడివిశేష్ అవినీతి పోలీసు అధికారి పాత్ర‌లో ఆక‌ట్టుకున్నారు. ప‌తాక స‌న్నివేశాల్లో ఆయ‌న న‌ట‌నలో మ‌రో కోణం క‌నిపిస్తుంది. ఆయ‌న సంభాష‌ణ‌లు ప‌లికే విధానంపై ఇంగ్లిష్ సినిమాల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. సంభాష‌ణ‌లు సామాన్య ప్రేక్ష‌కుడికి కూడా అర్థ‌మ‌య్యేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం అవ‌స‌రమ‌నిపిస్తుంది. రెజీనా న‌ట‌న‌కి ప్రాధాన్య‌మున్న పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగిపోయింది. క‌థంతా ఆమె చుట్టూనే న‌డుస్తుంది. అశోక్ పాత్ర‌లో న‌వీన్ చంద్ర ఒదిగిపోయిన విధానం కూడా ఆక‌ట్టుకుంటుంది. ముర‌ళీశ‌ర్మ‌, ప‌విత్రా లోకేష్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. ఆద‌ర్శ్ వ‌ర్మ పాత్ర‌లో న‌టించిన కుర్రాడు కూడా మెప్పిస్తారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ద‌ర్శ‌కుడు రాంజీ క‌థ‌పై పూర్తి ప‌ట్టుని ప్ర‌ద‌ర్శించారు. ద్వితీయార్ధంలో స‌న్నివేశాల్ని స‌ర‌ళ‌త‌రం చేసుంటే సినిమా గంద‌ర‌గోళం లేకుండా సాగేది. నిర్మాణ విలువలు ఉన్న‌తంగా ఉన్నాయి. వంశీ ప‌చ్చిపులుసు కెమెరా ప‌నిత‌నం, శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతం సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. నిజం, అబ‌ద్ధాల గురించి అబ్బూరి ర‌వి రాసిన మాట‌లు ఆక‌ట్టుకుంటాయి.


బ‌లాలు
+క‌థ‌లో మ‌లుపులు
+న‌టీన‌టులు
+ప‌తాక స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు
-ద్వితీయార్ధం మ‌లుపుల్లో గంద‌ర‌గోళం
-ఊహ‌కందే కొన్ని స‌న్నివేశాలు

* చివ‌రిగా..
‘ఎవ‌రు’ ఎవరో తెలిసే కొద్దీ థ్రిల్లే..!Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.