'ఎఫ్ 2' రివ్యూ
చిత్రం: ఎఫ్‌2(ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌)
నటీనటులు: వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, ఝాన్సీ, ప్రియదర్శి, అనసూయ, బ్రహ్మాజీ, రఘుబాబు, అన్నపూర్ణ, వై.విజయ, నాజర్‌ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి
ఎడిటింగ్‌: బిక్కిని తమ్మిరాజు
నిర్మాత: దిల్‌రాజు
దర్శకత్వం: అనిల్‌ రావిపూడి
సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
విడుదల: 12-01-2019


వెంకటేష్ అన‌గానే కుటుంబ వినోద‌మే గుర్తుకొస్తుంది. చాలా రోజుల త‌ర్వాత ఆయ‌న‌కి నేప‌థ్యంతో కూడిన క‌థ `ఎఫ్‌2` రూపంలో ద‌క్కింది. వెంకీకి ఈసారి యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్ కూడా తోడ‌య్యాడు. ఇద్ద‌రూ సంక్రాంతి అల్లుళ్లుగా మారిపోయారు.  మ‌రి వాళ్ల‌తో యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఎలా సంద‌డి చేయించాడు?  వినోదంపై ప‌ట్టున్న ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఈ చిత్రంతో మ‌రో విజ‌యాన్ని అందుకున్న‌ట్టేనా?  తెలుసుకుందాం ప‌దండి...


* క‌థేంటంటే..
 
వెంకీ (వెంక‌టేష్‌)  ఒక ఎమ్మెల్యే ద‌గ్గ‌ర పీఏగా ప‌నిచేస్తుంటాడు. హారిక (త‌మ‌న్నా)ని చూశాక ఆమె ఎన్ని కండిష‌న్లు పెట్టినా, పెళ్లికి ఒప్పుకుంటాడు. అయితే పెళ్ల‌య్యాక ఇద్ద‌రి మ‌ధ్య కీచులాట‌లు మొద‌ల‌వుతాయి. మొద‌ట ఫ‌న్‌గా అనిపించిన పెళ్లి జీవితం, ఆ త‌ర్వాత ఫ్ర‌స్ట్రేష‌న్‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంది. ఇంత‌లో హారిక చెల్లెలు హ‌నీ (మెహ‌రీన్‌) వ‌రుణ్‌యాద‌వ్ (వ‌రుణ్‌తేజ్‌)ని ప్రేమిస్తుంది. ఆ ఇంట్లో ఆడ‌వాళ్లు మ‌గాళ్ల‌ని చెప్పు చేత‌ల్లో పెట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తార‌ని... పెళ్లి చేసుకుంటే స్నేహితుల‌కి, కుటుంబానికి దూరం కావ‌ల్సి వ‌స్తుంద‌ని వారిస్తాడు వెంకీ. కానీ వ‌రుణ్ యాద‌వ్ అవ‌న్నీ విన‌కుండా పెళ్లి చేసుకోవ‌డానికే సిద్ధ‌మ‌వుతాడు.  పెళ్లి ప‌నులు జ‌రుగుతుండ‌గానే అటు అమ్మానాన్న‌ల‌కీ, ఇటు కాబోయే భార్య‌కీ  స‌ర్దిచెప్ప‌లేక  స‌మ‌స్య‌ల్ని ఎదుర్కుంటాడు. అప్పుడు వెంకీ చెప్పిందే నిజ‌మ‌ని న‌మ్మి, ప‌క్కింటి వ్య‌క్తి (రాజేంద్ర‌ప్ర‌సాద్‌) స‌ల‌హాతో ముగ్గురూ క‌లిసి యూర‌ప్ వెళ్లిపోతారు. అక్క‌డికి వెళ్లాక ఏం జ‌రిగింది?  వెంకీ, అత‌ని భార్య మ‌ళ్లీ క‌లిశారా లేదా? వ‌రుణ్‌కీ, హ‌నీకీ పెళ్లి జ‌రిగిందా? త‌దిత‌ర విష‌యాలు తెలియాల్ని తెర‌పై చూడాల్సిందే. 
 

* ఎలా ఉందంటే..
 
భార్యాభ‌ర్త‌ల జీవితాన్ని ఆవిష్క‌రించే చిత్ర‌మిది. భ‌ర్త నుంచి భార్య ఏం కోరుకుంటుంది?  భార్యతో భ‌ర్త ఎలా మెల‌గాల‌నే విష‌యాల్ని ద‌ర్శ‌కుడు మంచి హాస్యంతో మేళ‌వించి చెప్పారు. ఇందులో చెప్పుకోద‌గ్గ క‌థేమీ లేదు. కానీ ఆ చిన్న క‌థ‌నే చ‌క్క‌గా మ‌లిచి, సంద‌ర్భోచితంగా హాస్యం పండించ‌డంలో ద‌ర్శ‌కుడు స‌ఫ‌ల‌మ‌య్యాడు. దాంతో ప్ర‌తి స‌న్నివేశం స‌ర‌దాగా సాగుతుంది.  ఎమ్మెల్యే పీఏ పాత్ర‌లో వెంక‌టేష్, బోర‌బండ‌కి చెందిన బ‌స్తీ కుర్రాడిగా వ‌రుణ్‌తేజ్ పాత్ర‌లు చేసే సంద‌డితోనూ...  ఆత్మాభిమానం ఉన్న అమ్మాయిగా త‌మ‌న్నా, ఆమె చెల్లెలిగా మెహ‌రీన్ పాత్ర‌ల ప‌రిచ‌యం, ఆ నేప‌థ్యంలో పండే వినోదంతోనూ ప్ర‌థ‌మార్థం  ప‌రుగులు పెడుతుంది. తెర‌పై క‌నిపించే ప్ర‌తి పాత్రకీ ఒక ప్రాధాన్యం ఉండ‌టం, అవి చ‌క్క‌టి వినోదాన్ని పండించ‌డం ఈ సినిమా ప్ర‌త్యేక‌త‌. ఫ్ర‌స్ట్రేష‌న్ స‌న్నివేశాల్లోనూ బోలెడంత ఫ‌న్ ఉంటుంది.  ఇక ద్వితీయార్థం క‌థ మొత్తం యూర‌ప్‌లోనే సాగుతుంది. నాయ‌కానాయిక‌లంతా ఒక చోటే చేరి, ఫ్ర‌స్ట్రేష‌న్‌తో ఎత్తులు పైఎత్తులు వేసుకొంటారు. ఆ నేప‌థ్యంలో పుట్టే వినోదం బాగా న‌వ్విస్తుంది. కాక‌పోతే ఆ మోతాదు ప్ర‌థ‌మార్థం స్థాయిలో ఉండ‌దు. వెన్నెల కిషోర్‌, సుబ్బ‌రాజు, స‌త్యం రాజేష్ త‌దిత‌ర హాస్య‌న‌టులున్నా వారి పాత్ర‌లు పెద్దగా న‌వ్వించ‌వు. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌లు క‌లిసి చేసే సంద‌డే ఈ సినిమాకి కీల‌కం. చాలా రోజుల త‌ర్వాత వెంక‌టేష్ త‌న మార్క్ వినోదాన్ని ఈ చిత్రంలో పండించారు. వ‌రుణ్‌తేజ్ తెలంగాణ యాస మాట్లాడుతూ త‌న‌కి కొత్త జోన‌ర్ అయినా క‌థ‌కి, పాత్ర‌కి న్యాయం చేశాడు. ద్వితీయార్థంలో నాజ‌ర్‌, ప్ర‌కాష్‌రాజ్ పాత్ర‌లు సినిమాకి కీల‌కంగా మార‌తాయి. సంక్రాంతి అల్లుళ్లుగా తెర‌పైకొచ్చిన వెంకీ, వ‌రుణ్‌లు మాత్రం పండ‌గ సంద‌డికి త‌గ్గ‌ట్టుగానే న‌వ్వించారు. 

* న‌టీన‌టులు.. సాంకేతిక‌త‌..
క‌థానాయ‌కులు వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్‌లు చేసే సంద‌డే ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. క‌థానాయిక‌లు కూడా ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల్లో క‌థానాయ‌కుల‌తో స‌మానంగా క‌నిపిస్తూ న‌వ్వులు పంచారు. వెంక‌టేష్‌కి ఇలాంటి క‌థ‌లు, పాత్ర‌లు కొట్టిన‌పిండే. తెర‌పై క‌నిపించిన ప్ర‌తీసారీ న‌వ్వించారు. వ‌రుణ్ న‌ట‌న కూడా మెప్పిస్తుంది. త‌మ‌న్నా, మెహ‌రీన్‌లు అక్కాచెల్లెళ్లుగా మెప్పించారు.  ర‌ఘుబాబు, అన్న‌పూర్ణ‌మ్మ‌, వై.విజ‌య, ఝాన్సీ, ప్ర‌గ‌తి త‌దిత‌రులంతా పాత్ర‌ల‌కి పూర్తి న్యాయం చేశారు. ద్వితీయార్థంలో ప్ర‌కాష్‌రాజ్‌, నాజ‌ర్ పాత్ర‌లు కూడా మెప్పిస్తాయి.  సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంటుంది. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం క‌థ‌లో జోష్‌కి త‌గ్గ‌ట్టుగానే ఉంది. స‌మీర్‌రెడ్డి కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగానే ఉన్నాయి. ర‌చ‌యిత‌గా, దర్శ‌కుడిగా అనిల్ రావిపూడి మ‌రోసారి త‌న ప్ర‌తిభ‌ని చాటి చెప్పాడు. ప్ర‌తి సంద‌ర్భంలోనూ వినోదం పండించ‌డం కోసం ప్ర‌య‌త్నించిన తీరు మెప్పిస్తుంది.  క‌థ ప‌రంగా ద్వితీయార్థంలోనే కాస్త బిగి కోల్పోయిన‌ట్టు అనిపిస్తుంది. 


 బ‌లాలు
+ వెంక‌టేష్ కామెడీ
+ ప్ర‌థ‌మార్ధం
+ డైలాగ్‌లు, నిర్మాణ విలువ‌లు

 
బ‌ల‌హీన‌త‌లు
- ద్వితీయార్ధం
- పాట‌లు
- క‌థ‌

 * చివ‌రిగా:
పాత క‌థ‌లకి కొత్త హంగులు జోడించి విజ‌యాల్ని అందుకోవ‌చ్చ‌ని యువ ద‌ర్శ‌కులు అప్పుడ‌ప్పుడు నిరూపిస్తూనే ఉన్నారు. అలాంటి మ‌రో ప్ర‌య‌త్న‌మే ఈ చిత్రం. పొస‌గ‌ని భార్యాభ‌ర్త‌ల మ‌న‌సుల నేప‌థ్యంలో ఇదివ‌ర‌కు చాలా క‌థ‌లొచ్చాయి. ఇది కూడా ఆ తాను ముక్కే.  క‌థ  పాత‌దే అయినా ప్రేక్ష‌కుడి వినోదానికి మాత్రం లోటు రాకుండా రూపొందిన చిత్ర‌మిది.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.