రివ్యూ: జార్జ్ రెడ్డి
రివ్యూ: చిత్రం: జార్జిరెడ్డి

నటీనటులు: సందీప్‌ మాధవ్‌, అభయ్‌, సత్యదేవ్‌, శత్రు, మనోజ్‌ నందన్‌, ముస్కాన్‌ తదితరులు ,

సాంకేతికవర్గం:

సంగీతం: సురేష్‌ బొబ్బిలి, హర్షవర్థన్‌ రామేశ్వర్‌(నేపథ్య సంగీతం),

సినిమాటోగ్రఫీ: సుధాకర్‌ యక్కంటి,

కళ: గాంధీ నడికుదురు,

ఎడిటింగ్‌: జె.ప్రతాప్‌ కుమార్‌,

నిర్మాత: అప్పిరెడ్డి, సంజీవ్‌రెడ్డి,

దర్శకత్వం: జీవన్‌రెడ్డి,

బ్యానర్‌: మిక్‌ మూవీస్‌, సిల్లీ మాంక్స్‌, అభిషేక్‌పిక్చర్స్‌,

విడుదల తేదీ: 22-11-2019.

జార్జ్‌రెడ్డి... విద్యార్థి నాయ‌క‌త్వం - రాజ‌కీయాలు తెలిసిన‌వాళ్ల‌కు ఈ పేరు సుప‌రిచ‌త‌మే. ఐదు ద‌శాబ్దాల క్రితం ఉస్మానియా యూనివ‌ర్సిటీలో మోగిన విప్ల‌వ గొంతుక జార్జ్‌రెడ్డిది. అత‌ని పేరుతో ఓ సినిమా వ‌స్తోందంటే.. త‌ప్ప‌కుండా అంద‌రిలోనూ ఆస‌క్తి క‌లుగుతుంది. అత‌ని క‌థ‌ని ఎలా చూపించారో తెలుసుకోవాల‌న్న కోరిక క‌లుగుతుంది. అందుకే `జార్జ్‌రెడ్డి` సినిమాపై తెలుగు ప్రేక్ష‌కులు,ప‌రిశ్ర‌మ దృష్టి సారించింది. ప్ర‌చార చిత్రాలు సైతం దానికి ధీటుగా ఉండ‌డంతో అంచ‌నాలు పెరిగాయి. మ‌రి ఈ `జార్జ్‌రెడ్డి` ఎలా ఉన్నాడు? ద‌ర్శ‌కుడు చ‌రిత్ర‌ని ఎంత వ‌ర‌కూ క‌ళ్ల‌కు క‌ట్టారు?

* క‌థేంటంటే..?
జార్జ్ రెడ్డి (శాండీ)ది చిన్న‌ప్ప‌టి నుంచీ అన్యాయాల‌న్ని ఎదుర్కొనే స్వ‌భావం. అమ్మ చెప్పే క‌థ‌లు వింటూ... అందులో ఉన్న నీతిని బుర్ర‌కు ఎక్కించుకుంటుంటాడు. అనేక ప్ర‌శ్న‌లు వేస్తూ... కొత్త విష‌యాల్ని క‌నుక్కోవాల‌న్న తాప‌త్ర‌యంతో ఉంటాడు. యుద్ధ విద్య‌ల్లోనూ ప్రావీణ్యం సంపాదిస్తాడు. చ‌దువంటే పిచ్చి. ఉస్మానియా యూనివ‌ర్సిటీలో చేరి, అక్క‌డి త‌ప్పుల్ని ప్ర‌శ్నిస్తాడు. విద్యార్థుల‌లో చైత‌న్యం ర‌గిలిస్తాడు. అక్క‌డ ఓ నాయ‌కుడిగా ఎదుగుతాడు. రైతుల స‌మ‌స్య‌పై స‌మ‌ర సంఖం మోగిస్తాడు. ఈ చైత‌న్యాన్ని దేశంలో ఉన్న అన్ని యూనివ‌ర్సీటీల‌కూ తెలిసేలా చేస్తాడు. అలా... జార్జ్‌రెడ్డి పేరు మార్మోగిపోతుంది. ఉస్మానియా క్యాంప‌స్‌లో ఉధృత్త ప‌రిస్థితులు త‌లెత్తుతాయి. శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య కూడా త‌లెత్తుతుంది. ఈ నేప‌థ్యంలో జార్జ్‌రెడ్డిని కొంత‌మంది ప‌ధ‌కం ప్ర‌కారం హ‌త్య చేస్తారు. ఇదంతా జ‌రిగిన క‌థే. దాన్నే తెర‌పై చూపించారు.

* ఎలా ఉందంటే...?
ద‌ర్శ‌కుడు చ‌రిత్ర‌కు కాస్త సినిమా ప‌రిభాష జోడించి తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు. జార్జ్‌రెడ్డి బాల్యం, ఎదిగిన క్ర‌మం, త‌న‌లో పోరాట త‌త్వం... ఇవ‌న్నీ యువ‌త‌రంలో స్ఫూర్తిని నింపే అంశాలే. ఆ స‌న్నివేశాల‌న్నీ చ‌క్క‌గా ఆవిష్క‌రించుకుంటూ క‌థ‌లోకి తీసుకెళ్లాడు. ఉస్మానియా నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు ఈ సినిమాపై మ‌రింత ఆస‌క్తిని క‌లిగిస్తాయి. అక్క‌డి విద్యార్థుల స‌మ‌స్య‌లు, రాజ‌కీయాలు, రౌడీయిజం అన్నీ అప్ప‌టి ప‌రిస్థితుల్ని క‌ళ్ల‌కు క‌ట్టాయి. వాటి మ‌ధ్య విద్యార్థి నాయ‌కుడిగా జార్జ్‌రెడ్డి ఎదిగిన క్ర‌మం తెర‌పైకి తీసుకొచ్చారు. ద‌ర్శ‌కుడు వాస్త‌విక ధోర‌ణి అవ‌లంభిస్తూనే, కాస్త సినిమాటిక్ ప‌రిభాష‌లోకి ఈ క‌థ‌ని మ‌లిచే ప్ర‌య‌త్నం చేశాడు. కొన్ని స‌న్నివేశాలు సుదీర్ఘంగా సాగుతాయి. అవ‌స‌రం లేదేమో అనుకునే స‌న్నివేశాలూ వ‌స్తుంటాయి. దాని వ‌ల్ల నిడివి పెరుగుతూ పోయింది.


ద్వితీయార్థం ఇంకొంచెం ఇబ్బంది పెడుతుంది. క‌థంతా అక్క‌డ‌క్క‌డే తిరుగుతున్న‌ట్టు అనిపిస్తుంది. జార్జ్ రెడ్డి జీవితంలో సినిమాల‌కు స‌రిప‌డే మ‌లుపులేం ఉండ‌వు. జార్జ్ రెడ్డి క‌థ‌ని పుస్త‌కాల‌లో చ‌దివిన వాళ్ల‌కైతే ఈ క‌థ కొట్టిన‌పిండే. వాళ్ల‌కు సైతం కొత్త‌గా క‌నిపించే అంశాలుండ‌వు. ప్ర‌తీసారీ విద్యార్థులు, వాళ్ల గొడ‌వ‌లే చూపించ‌డంతో విసుగు పుడుతుంటుంది. పాట‌ల జోలికి వెళ్ల‌క‌పోవ‌డం, జార్జ్‌రెడ్డి అనే పాత్ర‌ని దాటి మ‌రో కోణంలోకి వెళ్ల‌క‌పోవ‌డం ఈ చిత్రానికి ప్ల‌స్ అనుకోవాలి. ప‌తాక స‌న్నివేశాలు ఉద్వేగ భ‌రితంగా సాగుతాయి. జార్జ్‌రెడ్డిని శ‌త్రువులు అంతమొందించిన స‌న్నివేశాలు కంట‌త‌డి పెట్టిస్తాయి. మొత్తానికి ఓ గొప్ప పోరాట యోధుడ్ని, స్ఫూర్తివంతుడినీ చూసిన అనుభూతి అయితే క‌లుగుతుంది.

* ఎవ‌రెలా చేశారంటే..?
జార్జ్ రెడ్డి పాత్ర‌లో శాండీ క‌నిపించారు. త‌న‌కు పెద్ద‌గా అనుభ‌వం లేక‌పోయినా - ఈ పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశార‌నే అనుకోవాలి. జార్జ్ రెడ్డి ఎలా ఉంటాడో చాలామందికి తెలీదు. ఆయ‌న‌కు సంబంధించిన కొన్ని ఛాయా చిత్రాలే అందుబాటులో ఉన్నాయి. అందుకే శాండీని తీసుకొచ్చి జార్జ్ రెడ్డి అని చెప్పినా జ‌నం న‌మ్మేస్తారు.కాబ‌ట్టి ఆ పాత్ర‌లో న‌టించ‌డం మ‌రింత సుల‌భం అయ్యింది. ద‌ర్శ‌కుడు చేసిన మ‌రో మంచి ప‌ని ఏమిటంటే... దాదాపుగా అంద‌రినీ కొత్త‌వాళ్ల‌నే ఎంచుకోవ‌డం. వాళ్ల‌కు ఎలాంటి ఇమేజ్ లేక‌పోవ‌డం వ‌ల్ల ఎలాంటి పాత్ర‌లో అయినా ఇమిడిపోగ‌లిగారు. స‌త్య‌దేవ్‌, మ‌నోజ్ నందం, చైత‌న్య కృష్ణ‌... ఇలా ఎవ‌రికి వాళ్లు త‌మ పాత్ర‌ల్లో రాణించారు. స‌త్య‌దేవ్ పాత్రే మ‌రీ అర్థాంత‌రంగా ముగిసిపోయింద‌నిపిస్తుంది.

సాంకేతిక నిపుణుల ప‌నితీరు ఆక‌ట్టుకుంది. పాట‌లు చాలా తక్కువ‌. ఓ పాట మిన‌హా మిగిలిన రెండూ క‌థా ప‌రంగా సాగేవే. కెమెరా ప‌నిత‌నం, క‌ళా ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ ఆక‌ట్టుకుంటాయి. జార్జ్ రెడ్డి క‌థ‌ని మ‌రీ.. సినిమాటిక్ స్వేచ్ఛ‌ని తీసేసుకోకుండా ఉన్న‌ది ఉన్న‌ట్టుగా తెర‌కెక్కించ‌డంలో ఆయ‌న విజ‌య‌వంతం అయ్యారు.

* బ‌లాలు

జార్జ్‌రెడ్డి
సాంకేతిక నిపుణుల ప్ర‌తిభ‌

* బ‌ల‌హీన‌త‌లు
సాగ‌దీత‌
భావోద్వేగాలు పండ‌క‌పోవ‌డం

* చివ‌రిగా: ఓ విద్యార్థి నాయ‌కుడి జీవిత గాధ‌


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.