రివ్యూ: హలో గురు ప్రేమ కోసమే

రివ్యూ:
హలో గురు ప్రేమ కోసమే
చిత్రం: హలో గురు ప్రేమ కోసమే
నటీనటులు: రామ్‌, అనుపమ పరమేశ్వరన్‌, ప్రణీత, ప్రకాష్‌రాజ్‌, మహేష్‌, సితార, వి.జయప్రకాష్‌, పోసాని కృష్ణమురళి, సత్య తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: విజయ్‌ సి చక్రవర్తి
ఎడిటర్‌: కార్తీక శ్రీనివాస్‌
నిర్మాత: శిరీష్‌, లక్ష్మణ్‌
సమర్పణ: దిల్‌రాజు
దర్శకత్వం: త్రినాథ రావు నక్కిన
బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
విడుదల తేదీ: 18-10-2018
ఇటీవల కాలంలో యువ కథానాయకుడు రామ్‌ కథల ఎంపిక పూర్తిగా మారిపోయింది. లవర్‌బాయ్‌గా కనిపిస్తూనే పూర్తి వినోదాత్మకంగా సాగే కథలను ఎంచుకుంటున్నాడు. పైగా రామ్‌లో ఉండే ఎనర్జీ ఏంటో చిత్ర పరిశ్రమకు బాగా తెలుసు. అందుకు తగినట్లుగానే దర్శక-నిర్మాతలు కథలను సిద్ధం చేస్తున్నారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన ప్రధాన బలం ఎంటర్‌టైన్‌మెంట్‌. మరి రామ్‌-త్రినాథరావు కలిస్తే ఆ వినోదం.. ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వీరికి దిల్‌రాజు వంటి నిర్మాత తోడైతే అదే ‘హలో గురు ప్రేమ కోసమే’. దసరా కానుకగా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వెండితెరపై రామ్‌ సందడి ఎలా ఉంది?


* కథేంటంటే..
కాకినాడలో పుట్టి పెరిగిన యువకుడు సంజూ(రామ్‌). అతడ్ని తల్లిదండ్రులు(సితార, జయప్రకాష్‌)లు చాలా గారాబంగా పెంచుతారు. చదువు పూర్తయ్యాక సంజూ ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వస్తాడు. తల్లికి స్నేహితుడైన విశ్వనాథ్‌(ప్రకాష్‌రాజ్‌) ఇంట్లో అతిథిగా ఉంటాడు. విశ్వనాథ్‌ ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి. సంజూ తన ట్రైనింగ్‌ సెంటర్‌లో రీతూ (ప్రణీత)ను చూసి లవ్‌లో పడతాడు. చిలిపి పనులతో ఆమెను తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఒకరోజు తల్లిదండ్రులను కలవడానికని ఇంటికి బయలుదేరిన సంజూ రైలులో అనుపమ(అనుపమ పరమేశ్వరన్‌)ను చూసి ఇష్టపడతాడు. ఆ ప్రయాణంలో అనుపమను కూడా సరదాగా ఆటపట్టిస్తాడు. ఆ ప్రయాణంలో అనుపమను ప్రేమిస్తున్నట్లు సంజూ తెలుసుకుంటాడు. అయితే, అప్పటికే కార్తీక్‌(నోయల్‌)తో అనుపమ నిశ్చితార్థం అయిపోతుంది. తాను అతిథిగా ఇంటికి వెళ్లిన విశ్వనాథ్‌ కుమార్తే అనుపమ అని సంజూకు తెలుస్తుంది. మరి చివరికి సంజూ తన ప్రేమను దక్కించుకున్నాడు? విశ్వనాథ్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడా?


* ఎలా ఉందంటే..
దర్శకుడు త్రినాథ రావు నక్కిన గత మూడు చిత్రాలు వినోద ప్రధానమైనవే. ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించడంపై తనకు బలమైన నమ్మకం ఉంది. ‘హలో గురు ప్రేమ కోసమే’ విషయంలోనూ అదే పంథాను అనుసరించాడు. నిశ్చితార్థం అయిన అమ్మాయిని కథానాయకుడు పెళ్లి చేసుకోవడం అన్న కాన్సెప్ట్‌ చాలా సినిమాల్లో ఉంది. అదే ఈ చిత్రంలోనూ కనిపిస్తుంది. దానికి వినోదపు పూత పూసి, రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఏ ప్రేమ కథ అయినా అమ్మాయి-అబ్బాయి కోణం నుంచి సాగుతుంది. దానికి తండ్రి ప్రేమ కూడా ముడిపెట్టడం.. ఎక్కడా ఒక్క నెగిటివ్‌ క్యారెక్టర్‌ కూడా లేకుండా, అన్ని పాత్రలనూ పాజిటివ్‌ కోణంలోనే చూపించడం ఈ సినిమాలో కొత్తగా కనిపించిన అంశాలు. తొలి సన్నివేశాలన్నీ హాయిగా, సరదా సంభాషణలతో సాగిపోతాయి. రైలు ఎపిసోడ్‌, ట్రైనింగ్‌ సెంటర్‌ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, నటుడు సురేష్‌-రామ్‌ల మధ్య నడిచిన ఎపిసోడ్‌లు ఆద్యంతం నవ్విస్తాయి. ప్రథమార్ధంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ పండటానికి ఇవే ప్రధాన కారణంగా నిలిచాయి.
ద్వితీయార్ధంలో ప్రధాన ఆకర్షణగా కనిపించే పాయింట్‌ రామ్‌-ప్రకాష్‌రాజ్‌ల ఫ్రెండ్‌షిప్. ఒక తండ్రి తండ్రిగా ఉంటూ, తన కూతురు ప్రేమించే అబ్బాయితో ఫ్రెండ్‌షిప్‌ చేయడం అందరికీ నచ్చుతుంది. ఇలాంటి పాయింట్‌ ఎవరూ చూడలేదు. దీంతో ఆయా సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తాయి. కథలో సంఘర్షణ ఉంటే ఇలాంటి చిత్రాలు నిలబడతాయి. ఆ పాయింట్‌ ఇందులో కాస్త బలహీనంగా కనిపిస్తుంది. సంజూతో అనుపమ ప్రేమలో పడటానికి పెద్ద కారణాలు ఏవీ కనిపించలేదు. తొలి సగంలో ప్రణీత పాత్రను కూడా కేవలం సన్నివేశాలను పొడిగించుకోవడానికి వాడుకున్నదే. పతాక సన్నివేశాలను ఇంకా బలంగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. ఆ సన్నివేశాల్లో ‘పరుగు’ క్లైమాక్స్‌ ఛాయలు కనిపిస్తాయి. ఒక సక్సెస్‌ ఫార్ములాను దర్శకుడు ఎంచుకున్నాడు. దానికి తనదైన శైలిలో వినోదం జోడించి చూపించగలిగాడు. ‘హలో గురు ప్రేమ కోసమే’ అన్నది అందరికీ తెలిసిన కథే అయినప్పటికీ రెండున్నర గంటల పాటు ఏమాత్రం వినోదానికి ఢోకా లేకుండా చూసుకున్నాడు.

* ఎవరెలా చేశారంటే..
ఈ మధ్య లవర్‌బాయ్‌ పాత్రల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాడు రామ్‌. మరోసారి అలాంటి పాత్రనే ఎంచుకున్నాడు. తనదైన ధోరణిలో చాలా సహజంగా హుషారుగా నటించాడు. వినోదాత్మక సన్నివేశాల్లో తనదైన మార్కు కనిపిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్లను ఆటపట్టించే సన్నివేశాల్లో బాగా చేశాడు. అనుపమ తొలి సగంలో పెద్దగా మాట్లాడదు. డైలాగ్‌లు కూడా తక్కువే. ప్రీ క్లైమాక్స్‌లో మాత్రమే కొన్ని సంభాషణలు ఇచ్చారు. సినిమా అంతా ఆమె కోసమే సాగుతుంది. ఆమె పాత్రను ఇంకాస్త బలంగా రాసుకుని కథలో యాక్టివ్‌ చేస్తే బాగుండేది. ప్రణీత చాలా రోజుల తర్వాత మళ్లీ ఓ సినిమా చేసింది. అయితే, ఆమె గ్లామర్‌ ఎక్కడకు వెళ్లిపోయిందా? అనిపించింది. ముందే చెప్పినట్టే ఆ పాత్రను కొన్ని సరదాగా సాగే సన్నివేశాల కోసం వాడుకున్నారు. ప్రకాష్‌రాజ్‌ మరోసారి మంచి నాన్న పాత్రలో కనిపించాడు. రామ్‌-అనుపమ మధ్య సన్నివేశాల కంటే రామ్‌-ప్రకాష్‌రాజ్‌ల మధ్య సన్నివేశాలే ఎక్కువ. తెరపై వారిద్దరి సన్నివేశాలు అలరిస్తాయి. మిగిలిన వాళ్లవి అక్కడక్కడా కనిపించే పాత్రలే.
* సాంకేతికంగా..
దేవిశ్రీప్రసాద్‌ సంగీతం, పాటలూ బాగున్నాయి. కానీ, మరీమరీ గుర్తు చేసుకునేలా లేవు. విజయ్‌ సి చక్రవర్తి కెమెరా పనితనం బాగుంది. శ్రీనివాస్‌ ఎడిటింగ్‌ కూడా బాగుంది. అనవసర సన్నివేశాలు చాలా తక్కువ కనిపిస్తాయి. దిల్‌రాజ్‌ స్థాయిలో నిర్మాణ విలువలు బాగున్నాయి. త్రినాథరావు కథ చాలా సాధారణ మైనది. దానికి సంభాషణలు సన్నివేశాలు నటీనటుల ప్రతిభ బలాన్నిచ్చాయి. దీంతో ఆద్యంతం సినిమా వినోదాత్మకంగా సాగింది.
బలాలు
+ రామ్‌
+ వినోదాత్మక సన్నివేశాలు
+ రామ్‌-ప్రకాష్‌రాజ్‌ఎపిసోడ్‌లు
బలహీనతలు
- రొటీన్‌ కథ
- పతాక సన్నివేశాలు
* చివరిగా..
హలో గురు ‘టైమ్‌ పాస్‌’ కోసమే


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.