రివ్యూ: హిప్పీ
రివ్యూ: హిప్పీ
నటీనటులు:కార్తికేయ, దిగంగనా సూర్యవంశీ, జేడీ చక్రవర్తి, జజ్బాసింగ్‌, వెన్నెల కిశోర్‌, శ్రద్ధాదాస్‌ తదితరులు
సంగీతం: నివాస్‌ కే ప్రసన్న
సినిమాటోగ్రఫీ: రాజశేఖర్‌
కూర్పు: ప్రవీణ్‌ కేఎల్
నిర్మాణ సంస్థ: వీ క్రియేషన్స్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టీఎన్‌ కృష్ణ
విడుదల తేదీ: 6-06-2019


వాస్త‌విక‌త‌తో కూడిన చిత్రాల‌దే ప్ర‌స్తుతం హ‌వా. అలాంటి క‌థ‌తో తెర‌కెక్కిన `ఆర్‌.ఎక్స్‌.100`తో వెలుగులోకి వ‌చ్చాడు కార్తికేయ‌. ఆయ‌న మ‌రోసారి స‌హ‌జ‌త్వంతో కూడిన ప్రేమ‌క‌థ‌ని ఎంచుకొని `హిప్పీ` చేశాడు. యువ‌త‌రం ప్రేక్ష‌కులే ల‌క్ష్యంగా చేసిన చిత్ర‌మ‌ని ప్ర‌చార చిత్రాల‌తోనే అర్థ‌మైంది. మ‌రి `హిప్పీ`లో ఎలాంటి ప్రేమ‌క‌థ ఉంది?  కార్తికేయ మ‌రో విజ‌యాన్ని సొంతం చేసుకున్న‌ట్టేనా?  తెలుసుకుందాం ప‌దండి..

* క‌థేంటంటే..
హిప్పీ దేవ‌దాస్ అలియాస్ దేవ (కార్తికేయ‌) స్వ‌త‌హాగా బాక్స‌ర్‌. ఒక కంపెనీలో ప‌నిచేస్తుంటాడు. అత‌న్ని స్నేహ (జజ్బాసింగ్‌) ప్రేమించ‌డంతో ఆమెతో డేటింగ్ చేస్తుంటాడు. దేవ మాత్రం  అముక్త మాల్య‌ద (దిగంగ‌న సూర్య‌వంశీ)తో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డిపోతాడు. ఆమె అందం, ఆలోచ‌న‌ల్ని చూసి ఫిదా అయిపోయిన దేవ త‌న మ‌న‌సులో విష‌యాన్ని బ‌య‌ట‌పెడ‌తాడు. కానీ ఆమె మాత్రం ఎంత‌కీ ఒప్పుకోదు.  అముక్త‌ని ప్రేమిస్తున్నంత కాలం సంతోషంగా గ‌డిపిన దేవ‌, ఆమె తిరిగి ప్రేమించ‌డం మొద‌లు పెట్ట‌గానే తన స్వేచ్ఛ‌ని కోల్పోతాడు. ఒక ద‌శ‌లో ఆత్మ‌హ‌త్య‌కి కూడా ప్ర‌య‌త్నిస్తాడు. కొన్నాళ్లు స‌హ‌జీవ‌నం చేసిన ఆ ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగింది? వారి ప్రేమాయ‌ణం పెళ్లి వ‌ర‌కు వెళ్లిందా?  లేదా?  వీరి ప్రేమ‌క‌థ‌ని దేవ బాస్ అయిన  అర‌వింద్ (జేడీ చ‌క్ర‌వ‌ర్తి) ఎలాంటి మ‌లుపు తిప్పాడు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

* ఎలా ఉందంటే..
చెప్పుకోద‌గ్గ క‌థంటూ లేకుండా, కేవ‌లం క‌థ‌నంతోనే న‌డిచే చిత్ర‌మిది. కాక‌పోతే ఆ క‌థ‌నం కూడా  ప్రేక్ష‌కుల ఊహ‌ల‌కి త‌గ్గ‌ట్టుగా సాగ‌డంతో ఏ ద‌శ‌లోనూ ఆస‌క్తి రేకెత్త‌దు. ల‌వ్‌లో ప‌రాజితులుగా మిగిలిన‌వాళ్లే ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవాల‌నుకుంటారు. ప్రేమలో విజేత‌గా నిలిచినా ఓ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌కి పూనుకుంటాడు. అదే ఈ సినిమా ప్ర‌త్యేక‌త‌. ఒక అమ్మాయిని మ‌నం ప్రేమిస్తే ఆ అనుభూతి స్వ‌ర్గంలాగా ఉంటుంది, అదే అమ్మాయి మ‌న‌ల్ని తిరిగి ప్రేమించ‌డం మొదలుపెడితే స్వ‌ర్గం కోల్పోయిన‌ట్టుగా ఉంటుందనే అంశం చుట్టూ ద‌ర్శ‌కుడు ఈ క‌థ అల్లాడు. కానీ ఆ అంశాన్ని చెప్ప‌డానికి త‌గిన బేస్ లేక‌పోవ‌డంతో క‌థ లేకుండా తీసిన సినిమా అనిపిస్తుంది.  మ‌ల్టీప్లెక్స్ ప్రేక్ష‌కులు కాసేపే కాల‌క్షేపం చేస్తారేమో కానీ... సామాన్య ప్రేక్ష‌కుడికి మాత్రం ఇందులో చాలా విష‌యాలు క‌నెక్ట్ కావు. క‌థ ఆస‌క్తిక‌రంగానే మొద‌లైనా...  స‌న్నివేశాలు సాగుతున్న‌కొద్దీ ఇందులో క‌థంటూ ఏమీ లేద‌నే విష‌యం అర్థ‌మ‌వుతుంది. ద్వితీయార్థంలోనైనా ఏమైనా మ‌లుపులుంటాయా అంటే అవి కూడా  ప్రేక్ష‌కుడి ఊహ‌ల‌కి త‌గ్గ‌ట్టుగానే సాగుతుంటాయి. హాస్యం, భావోద్వేగాలు కూడా అంతంత మాత్ర‌మే. దాంతో సినిమా ఏ ద‌శ‌లోనూ ఆస‌క్తిక‌రంగా అనిపించ‌దు. విన‌డానికి ఇబ్బందిక‌రంగా అనిపించే చాలా సంభాష‌ణ‌లు ఇందులో ఉన్నాయి. ఆర్.ఎక్స్‌.100తో కార్తికేయ‌కి ఎలాంటి ఇమేజ్ వ‌చ్చిందో, అందుకు త‌గ్గ‌ట్టుగానే స‌న్నివేశాల్ని  రూపొందించాడు ద‌ర్శ‌కుడు. కానీ బ‌ల‌మైన క‌థ లేకుండా ఏం చేసినా ప్ర‌భావం అంతంత మాత్ర‌మే అని ఈ చిత్రం నిరూపిస్తుంది.


* ఎవ‌రెలా చేశారంటే..
కార్తికేయ న‌ట‌న, హిప్పీగా ఆయ‌న క‌నిపించిన విధానం బాగుంది. `ఆర్‌.ఎక్స్‌.100`లో  చేసిన పాత్ర‌కి భిన్నంగా మ‌రింత ఉత్సాహంగా క‌నిపించాడు.  కాక‌పోతే ఆయ‌న దేహాన్ని చూపెట్ట‌డంపై మ‌రీ ఎక్కువ శ్ర‌ద్ధ తీసుకొన్న‌ట్టున్నారు ద‌ర్శ‌కుడు. రొమాంటిక్ స‌న్నివేశాల్లో `ఆర్‌.ఎక్స్‌.100`ని మ‌రోసారి గుర్తు చేశాడు హీరో. దిగంగ‌న అందం, న‌ట‌న చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ఆమె ప్ర‌తీ స‌న్నివేశంలోనూ అందంగా క‌నిపించింది. ద్వితీయార్థంలో ఆమె న‌ట‌న కూడా మెప్పిస్తుంది. బాస్ అర‌వింద్ పాత్రలో  జేడీ చ‌క్ర‌వ‌ర్తి ఒదిగిపోయాడు. తెలంగాణ యాస మాట్లాడుతూ ఆయ‌న పండించిన హాస్యం మెప్పిస్తుంది. కానీ ఆయ‌నతో చెప్పించిన సంభాష‌ణ‌లు కొన్ని ప్రేక్ష‌కుల‌కు మింగుడు ప‌డ‌ని విధంగా ఉంటాయి. జ‌జ్బాసింగ్‌, శ్ర‌ద్ధాదాస్ చిన్న పాత్ర‌ల్లో మెరిశారు. వెన్నెల‌కిషోర్. బ్ర‌హ్మాజీ గ్యాంగ్ పెద్ద‌గా హాస్యం పండించ‌లేక‌పోయింది. సాంకేతికంగా సినిమా ప‌ర్వాలేద‌నిపిస్తుంది. నివాస్ కె.ప్ర‌స‌న్న బాణీల కంటే నేప‌థ్య సంగీతం బాగుంది. రాజ‌శేఖ‌ర్ కెమెరా ప‌నిత‌నం చిత్రానికి ప్ర‌ధాన బ‌లం. ప్ర‌వీణ్ ద్వితీయార్థంలో త‌న కత్తెర‌కి మ‌రింత ప‌దును పెట్టాల్సింది. క‌థ‌నం ప‌రంగా ద‌ర్శ‌కుడి ప‌నిత‌నం అక్క‌డ‌క్క‌డా మెప్పిస్తుంది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. 


బ‌లాలు

+ దిగంగ‌న అందం
+ యాక్షన్
+ నేప‌థ్య సంగీతం
+ ఛాయాగ్రహ‌ణం

బ‌ల‌హీన‌త‌లు
- క‌థ‌, క‌థ‌నం
- కామెడీ
- ప‌తాక స‌న్నివేశాలు

* చివ‌రిగా..
మ‌గ‌త‌నం క‌ట్ అయిందంటూ క‌థానాయిక క‌థ‌ని మొద‌లుపెడుతుంది. నాకు మ‌గ‌త‌నం ఉంద‌ని నిరూపిస్తూ క‌థానాయ‌కుడు క‌థ‌ని ముగిస్తాడు. అలాంటి స‌న్నివేశాల‌తో సాగే న‌వత‌రం ప్రేమ‌క‌థ ఇది. ప్రేమ గురించి కొత్త‌గా చెప్పిందేమీ లేక‌పోయినా... ఒక జంట జీవితాల్లోని అనుభ‌వాల స‌మాహారంగా ఈ సినిమా సాగుతుంది. యాక్ష‌న్ స‌న్నివేశాలు, అక్క‌డ‌క్క‌డా హాస్యం, క‌థానాయిక అందంతో కాసింత కాల‌క్షేపం మిన‌హా ఇందులో చెప్పుకోద‌గ్గ విష‌య‌మేమీ లేదు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.