రివ్యూ:  హిట్‌
న‌టీన‌టులు:  విశ్వ‌క్‌సేన్‌, రుహానీ శ‌ర్మ‌, మురళీ శర్మ, నవీనా రెడ్డి, హరితేజ, శ్రీనాత్ మాగంటి, చైత‌న్య సగిరాజు, రవితేజ త‌దిత‌రులు.
సాంకేతిక వ‌ర్గం:
సంగీతం: వివేక్ సాగ‌ర్‌,
ఛాయాగ్ర‌హణం:  
మ‌ణికంద‌న్‌,
క‌ళ‌:
అవినాష్  కొల్లా,
కూర్పు:
గ‌్యారీ బి.హెచ్,
నిర్మాత‌:
ప‌్ర‌శాంతి త్రిపిర్నేని,
స‌మ‌ర్ప‌ణ‌:
నాని,
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  
శైలేష్ కొల‌ను,
సంస్థ‌: వాల్‌పోస్ట‌ర్ సినిమా
విడుద‌ల‌:  28 -02-2020.


ఇటీవల కాలంలో తెలుగు తెరపై థ్రిల్లర్‌ జోనర్‌ల హవానే కనిపిస్తోంది. ‘ఎవరు’, ‘రాక్షసుడు’, ‘మత్తు వదలరా’ ఇలా గతేడాది విజయవంతమైన చిత్రాల జాబితాను తిరగేస్తే ఎక్కువ క్రైమ్‌ థ్రిల్లర్‌ జోనర్‌లే కనిపిస్తాయి. చిన్న చిత్రాలను పట్టాలెక్కించే వారికి ఇప్పుడిది ఓ సెఫ్‌ జోనర్‌గానూ కనిపిస్తోంది. నాని నిర్మాతగా తెరకెక్కించిన ‘అ!’ కూడా ఇలాంటి వైవిధ్యభరిత ప్రయత్నమే. ఇది ఆయనకు జాతీయ స్థాయిలో పేరు తెచ్చిపెట్టింది. అందుకే ఈసారీ ఇదే పంథాలో ‘హిట్‌’ రూపంలో మరో క్రైమ్‌ థ్రిల్లర్‌ను చూపించే ప్రయత్నం చేశారు. ఈ చిత్రంతో శైలేష్‌ కొలను అనే మరో నూతన దర్శకుడ్ని తెరకు పరిచయం చేశారు. ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నుమాదాస్‌’ వంటి చిత్రాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న విశ్వక్‌ సేన్‌ను ఈ కథలోకి తీసుకురావడంతో సినిమాపై ముందు నుంచీ ఆసక్తి పెరిగింది. దీనికి తగ్గట్లుగానే ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మరి విడుదలకు ముందే ఇంత ఆసక్తిని రేకెత్తించిన ‘హిట్‌’ తన పేరును నిలబెట్టుకుందా? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? చూద్దాం పదండి..

క‌థేంటంటే?
ప్ర‌మాదాల్ని ముందే ఊహించి అరిక‌ట్టే హిట్ హోమిసైడ్‌ ఇంటర్వెన్షన్‌ టీమ్‌ (హిట్‌) టీమ్‌కి చెందిన ఓ పోలీస్ అదికారి విక్ర‌మ్ రుద్ర‌రాజు (విశ్వ‌క్‌సేన్‌). మాన‌సికంగా ఒక స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటాడు.  దాంతో అత‌న్ని గ‌తం వెంటాడుతుంటుంది. కొన్నిరోజులు ఉద్యోగానికి సెల‌వు పెట్టి విశ్రాంతి తీసుకోవాల‌నుకుంటాడు. ఇంత‌లోనే ప్రీతి అనే అమ్మాయి కిడ్నాప్ అవుతుంది.  ఆ వెంటనే ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేస్తున్న త‌న ప్రేయ‌సి డాక్ట‌ర్ నేహా  (రుహానీ) కూడా అదృశ్యం అవుతుంది. అప్పుడు విక్ర‌మ్ ఈ రెండు కేసుల్ని ఎలా ఛేదించాడు?  ఆయ‌న్ని వెంటాడుతున్న గ‌తం వెన‌క క‌థేమిటి?  త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


ఎలా ఉందంటే?
నేర ప‌రిశోధ‌న నేప‌థ్యంలో సాగే  క‌థ ఇది. ఇలాంటి క‌థ‌ల‌తో  చాలా సినిమాలే వ‌చ్చాయి. అయితే ధ‌ర్యాప్తు అధికారి ఒక స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మ‌వుతూ,  కొత్త స‌వాళ్ల‌ని స్వీక‌రించ‌డ‌మే ఈ సినిమా ప్ర‌త్యేక‌త‌.   విక్రమ్‌ గతానికి సంబంధించిన కొన్ని ఉత్కంఠత కలిగించే విషాద సంఘటనలతో చిత్రాన్ని ఆసక్తికరంగా మొదలుపెట్టాడు దర్శకుడు. ఆ తర్వాత  హీరోకున్న  సమస్యను చూపించడం.. ఆ తర్వాత రెండు మర్డర్‌ కేసుల విషయంలో చిన్న చిన్న క్లూలతో ఆ కేసులను అతను ఛేదించే విధానంతో అతని శక్తియుక్తులను క్లుప్తంగా చూపించేశారు. అయితే వీటన్నింటి కన్నా క్లిష్టమైన సమస్య ప్రీతి మిస్సింగ్‌. ఇది తాను డ్యూటీలో లేని సమయంలో జరుగుతుంది. ఈ కేసును పరిష్కరించే క్రమంలోనే నేహా కూడా కనిపించకుండా పోయినట్లు తనకు అర్థమవుతుంది. ఇది తెలిశాక విక్రమ్‌కు దీని వెనుక ఏదో పెద్ద కుట్ర దాగి ఉందని అర్థమవుతుంది.  దాన్ని ప‌రిశోధించే క్ర‌మంలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌స్తుంటాయి. అవ‌న్నీ కూడా కొత్త అనుమానాల‌కి దారితీస్తుంటాయి. నేర ప‌రిశోధ‌న‌తో కూడిన క‌థ‌ల ఫార్ములానే అది. ఒక చిన్న అనుమానం, దాని నిగ్గు తేల్చ‌డం కోసం జ‌రిగే ప‌రిశోధ‌న‌, ఆ త‌ర్వాత దొరికే మ‌రో కొత్త ఆధారం... ఇలా సాగుతుంటుంది.  ఇదే త‌ర‌హాలోనే సాగే ఈ క‌థ‌కి, మధ్య మధ్యలో విక్రమ్‌ గతానికి సంబంధించిన సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ప్రధమార్థం మొత్తం  ఇన్వెస్టిగేషన్‌తోనే సాగుతుంది. విరామ స‌న్నివేశాల‌కి ముందు ఓ ఊహించని మలుపు వ‌స్తుంది. అక్కడి నుంచి క‌థ‌లో వేగం పెర‌గాల్సి ఉండ‌గా, మళ్లీ  ప్ర‌థ‌మార్థం త‌ర‌హాలోనే ఇన్వెస్టిగేష‌నే  కొన‌సాగ‌డం సాగ‌దీత‌గా అనిపిస్తుంది.  ప్రీతి మృత‌దేహం దొరికాక  డి.ఎన్‌.ఎ ప‌రీక్ష‌ల్లో వెల్ల‌డ‌య్యే విష‌యాలు, దాని చుట్టూ ఏర్ప‌డే అనుమానాలు ప్రేక్ష‌కుల్లో థ్రిల్‌కి గురిచేస్తాయి. దర్శకుడు ఆస‌క్తిని రేకెత్తించే చిక్కుముడుల‌తో స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. కానీ వీటిని ఒకొక్కటిగా విప్పి చూపించడానికి చాలా సమయం తీసుకున్నాడు. నేర పరిశోధన అంతా ఒక చోటే సాగ‌డంతో,  ప్రేక్షకులకు చూసిన సన్నివేశాన్నే మళ్లీ మళ్లీ చూసిన అనుభూతి కలుగుతుంటుంది.  ప్రీతిని హత్య చేయడానికి వెనకున్న కారణం అంత బలంగా అనిపించదు. ఇక సినిమా మొత్తం సీరియస్‌గా సాగుతుండటం, క్రైమ్‌ థ్రిల్లర్‌ కావడంతో వినోదానికి, పాటలకు ఎక్కడా ఛాన్స్‌ లేకుండా పోయింది. ఇక సినిమా ఆద్యంతం ఆసక్తిరేకెత్తించిన హీరో గతాన్ని సీక్వెల్‌ పేరుతో రివీల్‌ చేయకుండా వదిలేయడం ప్రేక్షకుల్లో ఓ అసంతృప్తిని మిగుల్చుతుంది.


* ఎవరెలా చేశారంటే..
నిజానికి ఈ కథలో చాలా పాత్రలే ఉన్నప్పటికీ సినిమా మొత్తం ఎక్కువగా విశ్వక్‌ చుట్టూనే తిరుగుతుంటుంది. కాబట్టి భాను చందర్, బ్రహ్మాజీ వంటి సీనియర్‌ నటులున్నా వాళ్ల పాత్రలు నామ మాత్రంగానే మిగిలిపోతాయి. ఇక ప్రియురాలిగా రుహానీ పాత్ర కేవలం అక్కడక్కడా రొమాంటిక్‌ సన్నివేశాలకే పరిమితమైపోయింది. అయితే పోలీస్‌ ఆఫీసర్‌గా విశ్వక్‌ నటనకు ఎక్కడా వంక పెట్టలేం. కానీ, సినిమా మొత్తం అతన్ని ఒకేరకమైన మూడ్‌లో చూడటం కాస్త కష్టంగా ఉంటుంది. ఇక సినిమాలో కాస్త స్కోప్‌ దొరికిన పాత్ర మరొకటేదైనా ఉందా? అంటే అది హరితేజకు మాత్రమే. షీలాగా ఆమె నటన ఆకట్టుకుంటుంది. దర్శకుడు క్రైమ్‌ థ్రిల్లర్‌కు సరిపడా కథను అందులో మలుపులను పక్కాగా రాసుకున్నప్పటికీ.. దాన్ని మరీ సాగతీతగా చూపించినట్లు అర్థమవుతుంది. దీనికి తోడు ఆయన రాసుకున్న ముగింపు గతంలో చాలా థ్రిల్లర్‌లలో చూసిన విధంగానే ఉంటుంది. కొత్తదనం కనిపించదు. ఎస్‌.మణికందన్‌ ఛాయాగ్రహణం పర్వాలేదనిపిస్తుంది. వివేక్‌ సాగర్‌ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.  

* బలాలు..
విశ్వక్‌సేన్ నటన
నేర పరిశోధన
కథలో మలుపులు

* బలహీనతలు..
సాగతీతగా అనిపించే సన్నివేశాలు
వినోదం, పాటలు లేకపోవడం

చివరగా:
‘హిట్‌’.. ఆ పేరుకు సరితూగలేదనిపిస్తుంది..


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.