రివ్యూ: జెర్సీ
రివ్యూ: జెర్సీ
రివ్యూ: జెర్సీ
సినిమా పేరు: జెర్సీ
నటీనటులు: నాని, శ్రద్ధా శ్రీనాథ్‌, సత్యరాజ్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, రాహుల్‌ రామకృష్ణ, సంపత్‌ రాజ్‌, ప్రవీణ్‌ తదితరులు
సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌
కూర్పు: నవీన్‌ నూలి
సినిమాటోగ్రఫీ: సాను వర్గీస్‌
నిర్మాత: సూర్య దేవర నాగవంశీ
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్‌ తిన్ననూరి
నిర్మాణ సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీ: 19-04-2019నేచురల్‌ స్టార్‌ నాని ఎంచుకునే కథలో ఏదో మ్యాజిక్‌ ఉంటుంది. ఒకటి, రెండు సినిమాలు తప్ప దాదాపుగా నాని కెరీర్‌లో నటించిన చిత్రాలన్నీ మంచి విజయం అందుకున్నవే. గతేడాది ‘దేవదాస్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ఇప్పుడు ‘జెర్సీ’లో నటించారు. ఆయన క్రికెటర్‌ పాత్రలో నటించడం, 1980ల కాలం నాటి నేపథ్యం కావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన ఈరోజు విడుదలైన ‘జెర్సీ’ చిత్రం ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో చూద్దాం.


* కథేంటంటే..
అర్జున్(నాని) ఓ క్రికెటర్.. సారా(శ్రద్ధా శ్రీనాథ్‌)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఎంత బాగా ఆడినా జాతీయ జట్టులో స్థానం రాకపోవడంతో 26 ఏళ్ల వయసులోనే క్రికెట్ కి దూరం అవుతాడు. స్పోర్ట్స్ కోటాలో వచ్చిన జాబ్ కూడా పోతుంది. మరోపక్క సారా జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. వీరిద్దరికీ ఓ కొడుకు(నాని) పుడతాడు. నాని తన పుట్టిన రోజున అర్జున్‌ను జెర్సీ గిఫ్ట్‌గా అడుగుతాడు. ఐదొందల రూపాయల జెర్సీని కొనేందుకు అర్జున్ చేయని ప్రయత్నమంటూ ఉండదు. ఇదే సమయంలో అర్జున్‌కు.. సారాకు మధ్య చిన్న చిన్న గొడవలు అవుతాయి. తన కొడుకు అడిగిన జెర్సీ కొనిపెట్టలేకపోయానన్న కసితో చివరికి తాను వదిలేసిన క్రికెట్‌ను మళ్లీ మొదలెడతాడు. 36 ఏళ్ల వయసులో మళ్లీ జాతీయ క్రికెట్ జట్టులో స్థానం కోసం రంగంలోకి దిగుతాడు. మరి అర్జున్‌ ప్రయత్నం సఫలమైందా... తన కొడుకు నాని ఆనందం కోసం అర్జున్ ఏం చేశాడు అన్నదే కథ!


* ఎలా ఉందంటే..
క్రికెట్‌లోనూ, జీవితంలోనూ ఫెయిల్‌ అయిన అర్జున్‌ అనే యువకుడి కథ ఇది. తన కొడుకు నాని కోసం అపజయాల అడ్డంకులను దాటుకుని, గెలవడానికి ప్రయత్నం మొదలు పెడతాడు అర్జున్‌. ఆ ప్రయత్నంలో రెండున్నర గంటల పాటు మనల్ని భావోద్వేగాల నావలో తీసుకెళ్తాడు. అర్జున్‌ అనే పాత్ర చుట్టూ ‘జెర్సీ’ కథ నడుస్తుంది. అతని ఎమోషన్స్‌, అతని కుటుంబం అతనికి ఇష్టమైన క్రికెట్‌ ఇవే కథలో కీలకంగా కనిపిస్తాయి. సాధారణంగా నాని సినిమా అంటే వినోదం.. ఎనర్జిటిక్‌ సన్నివేశాలు అనుకుంటారు. ఇప్పటివరకూ నాని ఇలాంటి సినిమాలే చేశారు. అయితే, ఆయన ఎమోషన్‌ను ఎంత బాగా పండించగలరో చూపించిన సినిమా ఇది. క్రికెట్‌ అనే ఆటకు, తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌ జోడించిన తెరకెక్కించిన చిత్రమిది. ప్రతి సినిమాలోనూ సినిమాటిక్‌ లిబర్టీస్‌ ఉంటాయి. ఉన్న దాన్ని మరింత గ్లామర్‌గా చూపించడానికి ప్రయత్నిస్తారు. కానీ, గౌతమ్‌ తిన్ననూరి మాత్రం ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశాడు. జీవితంలో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక, సంపాదనకు కూడా నోచుకోలేని ఓ క్రీడాకారుడి భావోద్వేగాలు ఎలా ఉంటాయో మనసుకు హత్తుకునేలా చూపించాడు. కేవలం రూ.500 పెట్టి జెర్సీ కొనిపెట్టడానికి ఓ తండ్రి పడే ఆవేదన, ప్రయత్నం తొలి భాగంలో కనిపిస్తాయి.

తన తనయుడి ముందు హీరోలా మిగిలిపోవడానికి తన ప్రాణాలను సైతం లెక్క చేయని ఓ తండ్రి కథ ద్వితీయార్ధంలో కనిపిస్తుంది. విరామం తర్వాత కథ పూర్తిగా క్రికెట్‌ నేపథ్యంలో సాగుతుంది. పదేళ్ల క్రితం అర్జున్‌ ఏమైతే కోల్పోయాడో అవన్నీ అందుకునే దిశగా ప్రయత్నం మొదలు పెడతాడు. జాతీయ జట్టులో స్థానం కోసం అర్జున్‌ ఎంత కష్టపడతాడో తెరపై చూపించాడు. దాదాపు ప్రతి క్రీడా నేపథ్యం ఉన్న సినిమా సాగినట్టుగానే ‘జెర్సీ’ కూడా సాగుతుంది. ఒక ఓడిపోయిన వ్యక్తి గెలిస్తే, ఎలా ఉంటుందో ఈ కథ కూడా అలానే ఉంటుంది. అయితే, తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌, పతాక సన్నివేశాలు ఇందులో అదనంగా కనిపిస్తాయి. క్లైమాక్స్‌ కంటతడి పెట్టిస్తుంది. ఆ ముగింపు చూసిన తర్వాత గుండె బరువెక్కిన ఫీలింగ్‌ కలుగుతుంది. దర్శకుడు తను చెప్పాల్సిన పాయింట్‌ ఎక్కడా మిస్‌ కాకుండా, సైడ్‌ ట్రాక్‌లను నమ్ముకోకుండా, నిజాయతీగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇటీవల కాలంలో రెండున్నర గంటల పాటు ఒకే ఎమోషన్‌ చుట్టూ నడిచే సినిమా ‘జెర్సీ’నే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

* ఎవరెలా చేశారంటే..
నానిని ఇప్పటివరకూ ఉషారైన పాత్రలో చూశాం. తన కెరీర్‌లో తొలిసారి అందుకు భిన్నమైన పాత్ర పోషించాడు. ఒక విధంగా చెప్పాలంటే నాని వన్‌మెన్‌షో అని చెప్పవచ్చు. ఎమోషనల్‌ సీన్లలో తను ఎంత బాగా నటించగలడో ఈ సినిమాతో మరోసారి రుజువైంది. ఒక క్రికెటర్‌గా‌, ఒక ప్రేమికుడిగా ఎంత చక్కగా నటించాడో.. ఒక తండ్రి అంతే బాగా నటించాడు. ఒక కొడుకు కోసం సగటు తండ్రి పడే తపనను అద్భుతంగా చూపించాడు.


ఈ సినిమాలో కథానాయిక పాత్ర కూడా చాలా బలంగా ఉంటుంది. కేవలం గ్లామర్‌ కోసం ఆ పాత్రను ఎంచుకోలేదు. సారాగా శ్రద్ధా శ్రీనాథ్ నటన బాగుంది. కథలోని కీలక సన్నివేశాల్లో ఆమె హవాభావాలు బాగా పలికించింది. అర్జున్‌ తనయుడు నానిగా చేసిన బాలనటుడు కూడా చక్కగా నటించాడు. విరామ సన్నివేశాల్లో అతడి నటన అలరిస్తుంది. అర్జున్‌ కోచ్‌గా కనిపించిన సత్యరాజ్‌ తన కెరీర్‌లో మరో మంచి పాత్ర చేశాడు. సత్యరాజ్‌, నానిల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అనిరుధ్‌ రవిచంద్రన్‌ అందించిన సంగీతం చాలా బాగుంది. సినిమాలో డ్యూయట్‌లు‌, హీరో పరిచయగీతాలు అస్సలు కనిపించవు. దాదాపు ప్రతి పాట కథలో భాగంగానే వినిపిస్తుంది. నేపథ్య సంగీతంతో సినిమా మరింత రక్తికట్టింది. మాటల్లో నాటకీయత కన్నా, సహజత్వానికి పెద్ద పీట వేశాడు దర్శకుడు. తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్‌ బాగా చూపించాడు. ఖైరతాబాద్‌ రైల్వేస్టేషన్‌ సీన్‌ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. సాంకేతికంగా బాగుంది. క్రికెట్‌ సన్నివేశాలను చాలా సహజంగా చూపించారు. సినిమాటోగ్రాఫర్‌ సాను వర్గీస్‌ పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. నిర్మాణపరంగా సినిమాను చక్కగా తీర్చిదిద్దారు.

బలాలు
+నాని నటన
+తండ్రీ కొడుకు ఎమోషన్‌
+ పతాక సన్నివేశాలు
+సాంకేతిక విభాగం

బలహీనతలు
-స్లోనరేషన్‌

* చివరిగా..
‘జెర్సీ’ ఓ మంచి తండ్రి కథ.

సంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.