రివ్యూ: ఖైదీ
చిత్రం: ఖైదీ
నటీనటులు: కార్తి, నరైన్‌, జార్జ్‌ మార్యన్‌, రమణ, వాట్సన్‌ చక్రవర్తి తదితరులు
సంగీతం: శామ్‌ సీ.ఎస్‌.
ఎడిటింగ్‌: ఫిలోమిన్‌ రాజ్‌
నిర్మాత: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు
దర్శకత్వం: లోకేశ్‌ కనకరాజు
బ్యానర్‌: డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, వివేకానంద ఫిల్మ్స్‌
విడుదల తేదీ: 25-10-2019


కార్తి ఇప్పుడు తమిళ హీరో కాదు.. ఎప్పుడో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోయారు. ఆయన నటించిన ప్రతి చిత్రం తెలుగులోనూ విడుదలవుతుంటుంది. తెలుగు ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన కథలను ఎంచుకుంటారు. దర్శక-నిర్మాతలు సైతం అందుకు అనుగుణంగానే సినిమాలను తెరకెక్కిస్తుంటారు. ఈ ఏడాది ఇప్పటికే ‘దేవ్‌’తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆయన మరోసారి విభిన్న కథ ‘ఖైదీ’తో ముందుకు వచ్చారు. కామెడీ, పాటలు ఇవేవీ లేకుండా లోకేశ్‌ కనకరాజు దర్శకత్వంలో ఆయన నటించి ‘ఖైదీ’ ఎలా ఉంది? తమిళ నేటివిటీతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించింది? 

కథేంటంటే
:
దిల్లీ (కార్తి) పదేళ్లు జైలు శిక్ష అనుభవించి విడుదలవుతాడు. ఆశ్రమంలో ఉన్న తన కుమార్తెను చూసేందుకు తహతహలాడుతుంటాడు. అయితే, అనుకోని పరిస్థితుల్లో ఒక పోలీస్‌కు సహాయం చేయాల్సి వస్తుంది. అక్కడి నుంచి దిల్లీకి సమస్యలు ఎదురవుతాయి. దిల్లీ, పోలీసు అధికారిని అడ్డుకోవటానికి ఓ ముఠా ప్రయత్నిస్తుంటుంది. ఆ ముఠా నుంచి పోలీసు అధికారిని రక్షించి, పోలీసు డిపార్ట్‌మెంట్‌ పరువు కాపాడే బాధ్యతను దిల్లీ తన భుజాలపై వేసుకుంటాడు. అసలు దిల్లీ ఎవరు? ఎందుకు జైలుకు వెళ్లాడు? అతడిని, పోలీసు అధికారిని తరుముతున్న ఆ ముఠా కథేంటి? దిల్లీ తన కూతురిని చూడగలిగాడా? లేదా? అన్నదే  కథ.


ఎలా ఉందంటే..?
:
ఒక వాస్తవిక కోణంలో నడిచే కథ ఇది. కేవలం నాలుగు గంటల వ్యవధిలో కొన్ని జీవితాలు ఎలా సంఘర్షణలో పడ్డాయి? అనుకోని పరిస్థితుల వల్ల ఏ సంబంధమూ లేని మనుషులు ఎలా ఇరుక్కుపోయారు? వాటి నుంచి ఎలా బయట పడ్డారు? అనేదే ‘ఖైదీ’. ఈ కథలో విచిత్రం ఏంటంటే.. కథానాయకుడు ఒక్కడే కాదు, చాలా పాత్రలు తమది కాని సమస్యను భుజంపై మోస్తూ, పరిష్కారం కోసం అన్వేషిస్తుంటాయి. దాంతో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఏర్పడింది. జైలు నుంచి విడుదలైన ఒక ఖైదీ, తాను ఇది వరకెప్పుడూ చూడని కన్న కూతురిని చూడటానికి చేసే ప్రయాణంలో ఎన్ని అనూహ్య మలుపులు ఎదురయ్యాయన్నది తెరపై చూడవచ్చు. అయితే, తండ్రీ కూతుళ్ల అనుబంధానికి ఓ స్మగ్లింగ్‌ నేపథ్యాన్ని ఎంచుకోవడం దర్శకుడు చేసిన తెలివైన పని. మొదటి సన్నివేశం చివరి వరకూ ఎప్పుడేం జరుగుతుందా? అన్న ఉత్కంఠతను ప్రేక్షకులకు కలిగించడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. ఈ కథలో రొమాన్స్‌కు చోటు లేదు. కథానాయిక పాత్రే లేదు. వినోదం కోసం పక్కదారి పట్టలేదు. కేవలం కథను కథగా చూపించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం మెచ్చుకోదగినది.


ప్రథమార్ధంలో అనేక లాక్‌లు వేసుకుంటూ వెళ్లిన దర్శకుడు ద్వితీయార్ధంలో వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే, ఫస్టాఫ్‌తో పోలిస్తే.. రెండో భాగంలో కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. చూసిన సన్నివేశాలనే మళ్లీ చూస్తున్నామా? అన్న భావన కూడా కలుగుతుంది. కథలో చెప్పడానికి విషయం లేదు కాబట్టి, సన్నివేశాలు అక్కడక్కడే తిరిగాయి. పతాక సన్నివేశాల్లో మాత్రం కథానాయకుడి ప్రయత్నం నెరవేరుతుందా? లేదా? అన్న ఉత్కంఠ కలుగుతుంది. కథను విషాదాంతంగా ముగిస్తాడేమోనని భయం కూడా కలుగుతుంది. తమిళ దర్శకులు ఎక్కువగా విషాదాంత క్లైమాక్స్‌కు ప్రాధాన్యం ఇస్తారు. అయితే, ఈసారి తెలుగు ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకున్నారమో! ఆ జోలికి వెళ్లలేదు.

ఎవరెలా చేశారంటే..?:
 కార్తీ ఎప్పుడూ మంచి కథలను ఎంచుకుంటారు. ఇటీవల ఆయన కూడా కమర్షియల్‌ బాట పట్టాడు. ఆ తప్పును దిద్దుకుంటూ తనదైన దారిలో ఓ మంచి కథను ఎంచుకున్నారు. ఇలాంటి నేపథ్యంతో కథలన చూడటం తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా కొత్త. ఖైదీ పాత్రలో కార్తి అత్యంత సహజమైన నటన ప్రదర్శించాడు. ఆ పాత్రలో కన్న కూతురిని చూడటానికి తపించే తండ్రి కనిపిస్తాడు. విపత్కర పరిస్థితులను ఎదురొడ్డే వీరుడు కనిపిస్తాడు. వాస్తవికంగా ఈ పాత్రను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కాస్త రఫ్‌గానే మలిచారు. ఆ సన్నివేశాల్లే కార్తి నటన మరింత నచ్చుతుంది.


కార్తి కూతురిగా నటించిన బాల నటి నటించిన తీరు సహజంగా ఉంది. ఈ కథలో చాలా మంది కొత్తవాళ్లే కనిపించారు. అయితే, వాళ్లంతా దర్శకుడి ఆలోచనలను తెరపై ప్రతిబింబిచడానికి తమవంతు కృషి చేశారు. కానిస్టేబుల్‌ పాత్రతో పాటు, లారీ క్లీనర్‌గా నటించిన కుర్రాడి నటన కూడా నచ్చుతుంది. దర్శకుడికి ఇది రెండో సినిమా. అయితే, చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా ఈ కథను నడిపించాడు. ప్రథమార్ధంలో ఎక్కడా విసిగించని బిగి శైలి ఆకట్టుకుంటుంది. ద్వితీయార్ధంలో ఏవైనా ఊహించని మలుపులు వస్తాయనుకున్న ప్రేక్షకుడికి నిరాశ తప్పదు. రాత్రి పూట జరిగే కథ ఇది. దానికి అనుగుణంగా ఫొటోగ్రఫీ చక్కగా అమరింది. నేపథ్య సంగీతం ప్రాణం పోసింది. సెకండాఫ్‌ అక్కడక్కడా నెమ్మదించినా, పతాక సన్నివేశాలను పకడ్బందీగా తీశారు. 

బలాలు

+ కథా నేపథ్యం

+ కార్తి నటన

+ ప్రథమార్ధం

బలహీనతలు

- నెమ్మదించిన ద్వితీయార్ధం

చివరిగా: వాస్తవిక కోణంలో సాగిన ‘ఖైదీ’ మెప్పిస్తాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.