రివ్యూ: కల్కి
నటీనటులు: రాజశేఖర్‌, అదా శర్మ, నందితా శ్వేత, నాజర్‌, అశుతోష్‌ రాణా, శత్రు, సిద్ధు జొన్నల‌గ‌డ్డ, రాహుల్ రామ‌కృష్ణ, చరణ్‌ దీప్‌, పూజిత పొన్నాడ తదితరులు
సంగీతం: శరవణన్‌ భరద్వాజ్‌
కూర్పు: గౌతమ్‌ నేరుసు
సినిమాటోగ్రఫీ: దాశ‌ర‌థి శివేంద్ర
సమర్పణ: శివానీ, శివాత్మిక ఫిలింస్‌
నిర్మాత: సి. కల్యాణ్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రశాంత్‌ వర్మ
విడుదల తేదీ: 28-06-2019

`గ‌రుడ‌వేగ‌`తో మ‌ళ్లీ విజ‌యాల బాట ప‌ట్టారు రాజ‌శేఖ‌ర్‌. ఆ విజ‌యాన్ని నిలబెట్టుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న అడుగులు వేస్తున్నారు.  ప‌లువురు ద‌ర్శ‌కులు చెప్పిన క‌థ‌లు విని... చాలా రోజుల విరామం త‌ర్వాత `క‌ల్కి` కోసం రంగంలోకి దిగారు. ప్ర‌శాంత్ వ‌ర్మ ఆ చిత్రానికి ద‌ర్శ‌కుడు.  `అ!`తో ఆక‌ట్టుకున్న యువ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మతో రాజ‌శేఖ‌ర్ సినిమా అన‌గానే అంద‌రిలోనూ ఆస‌క్తి ఏర్ప‌డింది.  పేరు, ప్ర‌చార చిత్రాల‌తో మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. మ‌రి అందుకు త‌గ్గ‌ట్టుగా సినిమా ఉందా?  తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే... 


* క‌థేంటంటే..

కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే న‌ర్స‌ప్ప (అశుతోష్ రాణా) చెప్పిందే వేదం.  పెరుమాండ్లు (శ‌త్రు)తో క‌లిసి ఎన్నో అరాచ‌కాల‌కి పాల్ప‌డుతుంటాడు. త‌మ్ముడు శేఖ‌ర్‌బాబు (సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌) మాత్రం అన్న‌లా కాకుండా, మంచి మ‌న‌సున్నోడ‌ని ఊరి జ‌నం న‌మ్ముతుంటారు. అనుకోకుండా న‌ర్స‌ప్ప‌, పెరుమాండ్లు మ‌ధ్య విభేదాలొస్తాయి. ఊరు త‌గ‌ల‌బ‌డిపోతుంది. ఇంత‌లోనే ప‌ట్నం నుంచి వ‌చ్చిన  శేఖ‌ర్‌బాబు హ‌త్య‌కి గుర‌వుతాడు. త‌మ్ముడికి మంచి పేరు రావ‌డంతో త‌ట్టుకోలేని నర్స‌ప్పే ఆ హ‌త్య చేయించాడ‌ని కొంత‌మంది, ఊళ్లో దెయ్యం  చంపింద‌ని కొంత‌మంది, కాదు  కాదు... పెరుమాండ్లే  చంపాడ‌ని ఇలా చాలా ర‌క‌రాలుగా ప్ర‌చారం సాగుతుంటుంది. ఆ హ‌త్య కేసుని నిగ్గు తేల్చ‌డానికే  ఐపీఎస్ అధికారి క‌ల్కి (రాజ‌శేఖ‌ర్) ఊళ్లోకి అడుగుపెడ‌తాడు. మ‌రి ఆ క్ర‌మంలో క‌ల్కికి ఎలాంటి విష‌యాలు తెలిశాయి?  పాత్రికేయుడు దేవ‌ద‌త్తా (రాహుల్ రామ‌కృష్ణ ) కేసు ప‌రిశోధ‌న‌లో ఎలా సాయం చేశాడు?  కొల్లాపూర్ సంస్థానం క‌థేమిటి?  త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పైనే చూడాలి.
 

* ఎలా ఉందంటే..

ఒక హ‌త్య‌.. దాని వెన‌క కార‌ణాల నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. ఇలాంటి క‌థ‌లు ప్రేక్ష‌కుల‌కు కొత్తేమీ కాదు. కానీ క‌థా నేప‌థ్యం మాత్రం కొత్త‌దే.  ఒక  సంస్థానంతో ముడిపెట్టి క‌థ‌, క‌థ‌నాల్ని తీర్చిదిద్దిన విధానం ప్రేక్ష‌కులకు కొత్త‌ద‌నాన్ని పంచుతుంది. అయితే క‌థా విస్తృతే ప‌రిమితం. నిజానికి తెర‌పై ఈ  క‌థ  మొద‌ల‌య్యే  విధానం చూస్తే చాలా లోతైన‌దే అనిపిస్తుంది. స‌న్నివేశాలు ముందుకు సాగుతున్న‌కొద్దీ ఇందులో లేనిది క‌థే అనే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. హ‌త్య ఎవ‌రు చేసుంటార‌నే ఆస‌క్తి ప్రేక్ష‌కుడిలో మ‌రింత బ‌లంగా క‌లిగేలా ప‌లు పాత్ర‌ల్ని తెర‌పై చూపిస్తూ, వాటిని అనుమానాస్పదంగా చూపిస్తుంటారు. అస‌లు క‌థ, అస‌లు క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ ద్వితీయార్థంలోనే మొద‌ల‌వుతుంది. హ‌త్య కేసుని ఛేదించే క్ర‌మంలోనే కొల్లాపూర్ సంస్థానం, ఆసీమా క‌థ వెలుగులోకి వ‌స్తుంది. అవ‌న్నీ కూడా ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. అయితే కొన్ని మ‌లుపులు ప్రేక్ష‌కుడి ఊహ‌కు త‌గ్గ‌ట్టుగానే సాగుతుంటాయి. హ‌త్య ఎవ‌రు చేశార‌న్న విష‌యం ప‌తాక స‌న్నివేశాల్లో చూపించిన విధానం ఆక‌ట్టుకుంటుంది. సినిమాకి చివ‌రి ప‌దిహేను నిమిషాల స‌న్నివేశాలు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌.  అయితే ఆ ఊరికి ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్‌గా క‌ల్కినే ఎందుకొచ్చాడు? ఆయ‌న ఊళ్లోకి వ‌చ్చిందెప్పుడు? హ‌త్య ఎప్పుడు జ‌రిగింద‌నే విష‌యాలు మాత్రం ప్ర‌శ్న‌లుగానే మిగిలిపోతాయి.  1980 నేప‌థ్యాన్ని చూపించిన విధానం ఆక‌ట్టుకుంటుంది. 


* ఎవ‌రెలా చేశారంటే..

రాజ‌శేఖ‌ర్ త‌న‌కి అల‌వాటైన పోలీస్ పాత్ర‌లో క‌నిపిస్తారు.  యాక్ష‌న్ ఘట్టాల్లో త‌న మార్క్ న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించారు. రాహుల్ రామ‌కృష్ణ దేవ‌ద‌త్తా అనే పాత్రికేయుడి పాత్ర‌లో క‌నిపిస్తాడు. ఆయ‌న యాస‌, హావ‌భావాలు మెప్పిస్తాయి. హీరోతో పాటే ఎప్పుడూ తెర‌పై క‌నిపిస్తుంటారు. అశుతోష్ రాణా, శ‌త్రు చ‌క్క‌టి విల‌నిజం ప్ర‌ద‌ర్శించారు. సిద్ధు  జొన్న‌ల‌గ‌డ్డ పాత్ర బాగుంది. క‌థానాయిక‌లు ఆదాశ‌ర్మ‌, నందిత‌శ్వేత పాత్ర‌లు చిన్న‌వే. స్కార్లెట్ ఓ పాట‌లో అందాలు ఆర‌బోసింది. నందిత శ్వేత క‌థ‌లో కీల‌క‌మైన పాత్రని చేసి ఆక‌ట్టుకుంది. పూజిత పొన్నాడ‌, నాజర్‌, చరణ్‌దీప్ త‌దిత‌రులు ప‌రిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతికంగా సినిమా బాగుంది. దాశ‌ర‌థి శివేంద్ర థ్రిల్ల‌ర్ సినిమాకి కావ‌ల్సిన మూడ్‌ని క్రియేట్ చేసింది. ఆ విష‌యంలో  ఆర్ట్ విభాగం ప‌నిత‌నం కూడా మెప్పిస్తుంది. 80ల‌నాటి వాతావ‌ర‌ణాన్ని సృష్టించిన విధానం బాగుంది. శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్ సంగీతం ప‌ర్వాలేదనిపిస్తుందంతే. పాట‌లు గుర్తు పెట్టుకునేలా లేవు. ప్ర‌శాంత్ వ‌ర్మ టేకింగ్ బాగుంది కానీ... క‌థ‌, క‌థ‌నాల్ని ఆస‌క్తిక‌రంగా చెప్ప‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి. 

బ‌లాలు:
+ క‌థా నేప‌థ్యం
+ ప‌తాక స‌న్నివేశాలు
+ న‌టీన‌టులు

బ‌ల‌హీన‌త‌లు:
- ప్రథ‌మార్ధం
- క‌థ, క‌థ‌నం

* చివ‌రిగా..
 థ్రిల్ల‌ర్ చిత్రాల్లోని క‌థ‌లు వేగంగా ముందుకు సాగాలి. ఊహించ‌ని మ‌లుపులతో అడుగ‌డుగునా ఆస‌క్తిని రేకెత్తించాలి. ఈ సినిమా విష‌యంలో ఆ రెండూ లోటే. మ‌లుపులు చాలానే ఉంటాయి కానీ అవి గంద‌ర‌గోళానికి గురిచేస్తాయి త‌ప్ప థ్రిల్‌ని పంచ‌వు. క‌థలో కూడా లోతు లేక‌పోవ‌డంతో అక్క‌డ‌క్క‌డ మాత్ర‌మే మెప్పిస్తుందీ చిత్రం.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.