రివ్యూ: కర్త కర్మ క్రియ
 సినిమా పేరు: క‌ర్త క‌ర్మ క్రియ‌
నటీనటులు: వసంత్‌ సమీర్‌, సహెర్‌ అఫ్షా, రవి వర్మ, ‘జబర్దస్త్‌’ రాంప్రసాద్, రఘుబాబు, కాదంబరి కిరణ్‌, కాశీ విశ్వనాథ్‌, జయప్రకాశ్‌ రెడ్డి తదితరులు
సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్‌
కూర్పు: ప్రవీణ్‌ పూడి
నిర్మాత: చదలవాడ పద్మావతి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నాగు గవర
విడుదల తేదీ: 08-11-2018

                            

థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు ఉండాల్సిన ప్రథమ ల‌క్ష‌ణం.. చివ‌రి క్ష‌ణం వ‌ర‌కూ ఉత్కంఠ రేపుతూ క‌థ‌ని చెప్ప‌గ‌ల‌గ‌డం. అలాంటి క‌థ‌లే ఎంచుకోవాలి. లేదంటే ఆ ప్ర‌య‌త్న‌మే మానుకోవాలి. ఎక్క‌డో ఏదో చిన్న పాయింట్ ప‌ట్టుకుని.. దాన్ని రెండు గంట‌లు సాగ‌దీసి, చివ‌ర్లో ఓ ట్విస్టు పెడ‌తానంటే ఒప్పుకొనే రోజులు కావివి. నాగు గ‌వ‌ర ద‌ర్శ‌కత్వంలో రూపొందిన ‘క‌ర్త క‌ర్మ క్రియ’ కూడా ఓ థ్రిల్ల‌ర్ చిత్ర‌మే. మ‌రి ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను రెండు గంట‌ల పాటు థియేటర్‌లో కూర్చోబెట్టగలిగిందా? వాళ్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించిందా?

* క‌థేంటంటే..
సిద్ధు (స‌మీర్‌) ఓ సెల్ ఫోన్ మెకానిక్‌. ఉండేది బ‌స్తీలో. కానీ క‌ల‌లు గాల్లో ఉంటాయి. మైత్రి (సహె‌ర్ అఫ్షా) ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఇద్ద‌రూ ద‌గ్గ‌ర‌వుతున్న త‌రుణంలో మైత్రి అక్క దివ్య ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి సిద్ధుకు తెలుస్తుంది. ఈ విష‌యంలో త‌న‌కు స‌హాయం చేసిపెట్ట‌మంటుంది మైత్రి. అయితే.. ఈ ఆత్మ‌హ‌త్య‌కూ, న‌గ‌రంలో జ‌రిగిన మ‌రో రెండు ఆత్మ‌హ‌త్య‌ల‌కు ద‌గ్గ‌రి సంబంధం ఉంటుంది. అవి ఆత్మ‌హ‌త్య‌లు కావ‌ని, వాటి వెనుక ఎవ‌రో ఉన్నార‌న్న విష‌యం తెలుస్తుంది. మ‌రి వాటికి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ ఎవ‌రు? సిద్ధు వాళ్ల‌ని ప‌ట్టుకున్నాడా? ఈ కేసు విష‌యంలో రంగంలోకి దిగిన‌ ర‌వితేజ (ర‌వివ‌ర్మ‌) ఎలాంటి ఆధారాల్ని సంపాదించాడు? అనేదే క‌థ‌.


* ఎలా ఉందంటే..
క‌థ చాలా సింపుల్‌గా ఉంది‌. మూడు ఆత్మ‌హ‌త్య‌ల‌కు ఒక్క‌డే క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌. అతన్ని పోలీసులు ఎలా ప‌ట్టుకున్నార‌న్న‌ది పాయింట్‌. దీన్ని ద‌ర్శ‌కుడు ఆస‌క్తిక‌రంగా చెప్ప‌డంలో విఫ‌లమ‌య్యాడు. అస‌లు క‌థ‌లోకి వెళ్ల‌డానికే చాలా స‌మ‌యం తీసుకున్నాడు. ఆ మాట‌కొస్తే... తొలి స‌గం వ‌ర‌కూ క‌థ అంగుళం కూడా ముందుకు క‌ద‌ల‌దు. దివ్య ఆత్మ‌హ‌త్య విష‌యంలో ర‌వితేజకు న‌లుగురిపై అనుమానం వస్తుంది. ఆ న‌లుగురినీ ఎలా విచారించాడు? ఎలాంటి క్లూస్‌ ప‌ట్టుకున్నాడ‌న్న‌ది సెకండ్‌ హాఫ్‌లో తెలుస్తుంది. అయితే ఆ విచార‌ణ ప్ర‌క్రియ కూడా ఎలాంటి థ్రిల్లింగ్ క‌లిగించ‌దు. చివ‌ర్లో ఏదైనా అద్భుత‌మైన ట్విస్ట్ వ‌స్తుందేమో అనుకుంటే అదీ లేదు. సినిమా మొద‌లైన కొంత‌సేప‌టికి ఓ పాత్ర‌పై ప్రేక్ష‌కుడికి అనుమానం క‌లుగుతుంది. అదే మెల్ల‌మెల్ల‌గా బ‌ల‌ప‌డుతూ వెళ్తుంది. చివ‌రికి ఆ ఆత్మహ‌త్య‌ల‌కు కూడా ఆ పాత్రే కార‌ణం అవుతుంది. మ‌ధ్య‌లోనే తేలిపోయిన ఈ క్రైమ్ స్టోరీని చివ‌రి వ‌ర‌కూ లాక్కెళితే ఆస‌క్తి ఎలా ఉంటుంది..? పైగా పోలీసుల ఇన్వెస్టిగేష‌న్ కూడా కొండ‌ని త‌వ్వి ఎలు‌క‌ను ప‌ట్టిన‌ట్టు సాగింది. క‌థ‌లో చెప్పాల‌నుకున్న అంశాలు ఎక్కువ ఉండ‌వు. దాంతో చెప్పిందే చెప్పి.. ద‌ర్శ‌కుడు కూడా విసిగించేశాడు. చివ‌రికి ‘ఈజీ మ‌నీ కోసం పాకులాడొద్దు... క‌ష్టాలు ప‌డ‌తారు’ అనే సందేశాన్ని ఇవ్వగలిగాడు.


* ఎవ‌రెలా చేశారంటే..
నాయ‌కా నాయిక‌లు ఇద్ద‌రూ కొత్త‌వారే. న‌ట‌న కూడా దానికి త‌గిన‌ట్టుగానే సాగింది. స‌మీర్ ఓకే అనిపిస్తాడు. సెహ‌ర్ కొన్ని ఫ్రేముల్లో చూడ్డానికి బాగుంది. సెకండ్‌ హాఫ్ మొత్తం ర‌వివ‌ర్మ‌దే. ఈ సినిమాలో త‌నే హీరో అనుకోవాలి. కాదంబ‌రి కిర‌ణ్‌, కాశీ విశ్వ‌నాథ్, జయప్రకాశ్‌ రెడ్డి చిన్న చిన్న పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. త‌క్కువ బ‌డ్జెట్‌లో తీసిన సినిమా ఇది. అయితే ఉన్నంత వ‌ర‌కూ క్వాలిటీ బాగానే ఉంది. పాట‌ల్లో ఏవీ గుర్తుండ‌వు. ఇలాంటి క‌థ‌ల్లో పాట‌ల్ని వీలైనంత వ‌ర‌కూ ప‌క్క‌న పెట్టాలి. ఆ ప్ర‌య‌త్నం జ‌ర‌గ‌లేదు. నాగు గవర ఎంచుకు‌న్న క‌థ చాలా చిన్న‌ది. రెండు గంట‌ల పాటు ప్రేక్ష‌కుడ్ని కూర్చోబెట్టే స‌త్తా మాత్రం ఈ క‌థ‌కు లేదు.


బ‌లాలు
+ ప‌తాక స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు
- క‌థ‌ క‌థ‌నం

* చివ‌రిగా..
థ్రిల్ త‌గ్గిన‌ థ్రిల్ల‌ర్‌ చిత్రం


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.