రివ్యూ: కౌసల్య కృష్ణమూర్తి
చిత్రం: కౌసల్య కృష్ణమూర్తి
నటీనటులు: ఐశ్వర్య రాజేశ్‌, రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌, ఝాన్సీ, వెన్నెల కిషోర్‌, శశాంక్‌, రవిప్రకాశ్‌ తదితరులు
సంగీతం: దిబు నిన్నాన్‌ థామస్‌
సినిమాటోగ్రఫీ: బి.ఆండ్ర్యూ
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత: కేఎ వల్లభ
సమర్పణ: కేఎస్‌ రామారావు
కథ: అరుణ్‌రాజా కామరాజ
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భీమినేని శ్రీనివాసరావు
బ్యానర్‌: క్రియేటివ్‌ కమర్షియల్స్‌
విడుదల తేదీ: 23-08-2019


ఓ భాష‌లో విజ‌య‌వంత‌మైన చిత్రాన్ని మ‌రో భాష‌లో దాని సొగ‌సు, భావ‌న‌, ఆత్మ పోకుండా తెర‌కెక్కించ‌డం ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. అయితే ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు భీమ‌నేని శ్రీ‌నివాస‌రావు అందివేసిన చేయి. ఆయ‌న తీసిన‌వ‌న్నీ దాదాపుగా రీమేక్‌లే. అందులో 75 శాతం విజ‌యాలున్నాయి. అందుకే మ‌రోసారి ఆయ‌న ముందుకు రీమేక్ క‌థే వెళ్లింది. త‌మిళంలో మంచి విజ‌యాన్ని అందుకున్న ‘క‌ణ’ని ఇప్పుడు ‘కౌస‌ల్య కృష్ణ‌మూర్తి’గా తెలుగులోకి తీసుకొచ్చారు. మ‌రి ఈసారి ఏమైంది? క‌ణ‌ని కౌస‌ల్య గుర్తుకు తెచ్చిందా? అక్క‌డి మ్యాజిక్ తెలుగులోనూ కొన‌సాగిందా, లేదా?

కథేంటంటే: కృష్ణ‌మూర్తి (రాజేంద్ర‌ప్ర‌సాద్‌) ఓ రైతు. త‌న‌కు వ్య‌వ‌సాయం అంటే ఎంతిష్ట‌మో.. క్రికెట్ అన్నా అంతే ఇష్టం. ఇండియా ఓడిపోతే అస్స‌లు త‌ట్టుకోలేడు. తండ్రిని చూసి తాను కూడా క్రికెట్‌పై మ‌క్కువ పెంచుకుంటుంది కౌసల్య (ఐశ్వ‌ర్య రాజేష్‌). ఇండియా త‌ర‌పున ఆడి, క‌ప్పు గెలిచి తండ్రి క‌ళ్ల‌లో ఆనందం చూడాల‌నుకుంటుంది. అమ్మ (ఝాన్సీ) మాత్రం మ‌గ‌పిల్ల‌ల‌తో ఆట‌లేంటి? అని అడ్డుకుంటూ ఉంటుంది. అబ్బాయిల‌తో క్రికెట్ ఆడుతుంటే ఊళ్లో వాళ్లు సూటిపోటి మాట‌లు అంటుంటారు. అయినా వాట‌న్నింటినీ త‌ట్టుకుని క్రికెట‌ర్‌గా అడుగులు వేస్తుంది కౌసల్య‌. మ‌రి తాను అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించిందా, లేదా? త‌న తండ్రి ఆనందం కోసం త‌న ల‌క్ష్యం కోసం కౌస‌ల్య ఎన్నికష్టాలు ప‌డింది?

ఎలా ఉందంటే: ‘క‌ణ‌’లో మంచి ఎమోష‌న్స్ ఉన్నాయి. మ‌న‌కు న‌చ్చే క్రికెట్ ఉంది. ఆ రెండింటినీ మిక్స్ చేసిన విధానం ఆక‌ట్టుకుంటుంది. ‘కౌసల్య కృష్ణ‌మూర్తి’ కూడా దాన్నే ఫాలో అయిపోయింది. మాతృక‌ను ఏమాత్రం మార్చ‌కుండా, య‌థావిధిగా చూపించే ప్ర‌య‌త్న‌మే చేశారు. క‌థ బ‌ల‌మైన‌ది కాబ‌ట్టి, మార్పులు చేసే సాహ‌సం చేయ‌లేదేమో..? ఓ అమ్మాయి క్రికెట‌ర్‌గా ఎదిగే తీరు, ఓ రైతు ప‌త‌నం.. ఇవి రెండూ ఒకే క‌థ‌లో ఇమిడ్చి, చివ‌ర్లో రైతుల్ని బ‌తికించండి, రైతుల్ని అప్పుల పాలు చేయొద్దు అంటూ సందేశం ఇచ్చిన వైనం అంద‌రికీ న‌చ్చుతుంది. ఓ క్రీడానేప‌థ్యం ఉన్న క‌థ‌ని ఎంచుకుని, దాన్ని స‌మ‌కాలీన రైతు ప‌రిస్థితుల‌కు మేళ‌వించి చెప్ప‌డం బాగుంది. ఆ క్రిడిట్ అంతా ‘కణ’ ర‌చ‌యిత‌ల‌కు, ద‌ర్శ‌కుడికీ దక్కుతుంది.


క్రికెట్ నేప‌థ్యంలో సాగే సన్నివేశాల‌న్నీ బాగా తీశారు. అవి న‌చ్చుతాయి కూడా. ఓ సాధార‌ణ‌మైన అమ్మాయి, మారుమూల ప‌ల్లెటూరిలో పుట్టిన అమ్మాయి జాతీయ స్థాయి క్రికెట‌ర్‌గా ఎదిగిన వైనం స్ఫూర్తినిస్తుంది. తొలి స‌న్నివేశాలు స‌ర‌దాగా సాగిపోతూ, అక్క‌డ‌క్క‌డ ఎమోష‌న్‌తో మ‌న‌సుల్ని మెలిపెడుతూ సాగితే, ద్వితీయార్ధంలో ఉత్కంఠ‌త చోటు చేసుకుంటుంది. స‌మాజంలోని రైతు దుస్థితిని వేలెత్తి చూపిస్తూ, వాళ్ల‌ని గౌర‌వించ‌మ‌నే సందేశం పంచుతుంది. క‌థ‌లో భావోద్వేగాలు, తండ్రీ కూత‌ళ్లఎమోష‌న్‌, దేశ‌భ‌క్తి ఇవ‌న్నీ బాగా క‌లిసిపోయాయి. హీరో - హీరోయిన్ అంటూ ల‌వ్ ట్రాక్ ప్ర‌త్యేకంగా ఏమీ ఉండ‌దు. అది కూడా ఇరికించి ఉంటే, క‌థ ప‌క్క‌దోవ ప‌ట్టేది. అందుకే ఆ సాహ‌సం చేయ‌కుండా, క‌థ‌ని విడిచి వెళ్ల‌కుండా, క‌థ‌కు ఏం కావాలో అదే చేశారు, చూపించారు. క్రీడా నేప‌థ్యంలో సాగే సినిమాలు ఎలా ముగుస్తాయ‌న్న విష‌యంలో ప్రేక్ష‌కుల‌కు ఓ అవ‌గాహ‌న‌, అంచ‌నా ఉంది. ‘కౌసల్య కృష్ణ‌మూర్తి’ కూడా అచ్చం అలానే ముగుస్తుంది. ఎన్నో అవ‌మానాల్ని ఎదుర్కొన్న కౌస‌ల్య - విజేత‌గా నిల‌వ‌డం, తండ్రి క‌ల‌ను నెర‌వేర్చ‌డ‌మే క్లైమాక్స్‌. అదెలా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చడంలో ద‌ర్శ‌కుడు స‌ఫ‌లీకృతుడ‌య్యాడు.

ఎవ‌రెలా చేశారంటే: క‌ణ‌లో క్రికెట‌ర్‌గా న‌టించిన ఐశ్వ‌ర్య రాజేష్‌, ఇందులో త‌న పాత్ర తానే పోషించింది. నిజ‌మైన క్రికెట‌ర్‌లా క‌నిపించ‌డానికి త‌ను చాలా క‌ష్ట‌ప‌డింది. ఆ క‌ష్టం తెర‌పై క‌నిపిస్తుంది కూడా. ఐశ్వ‌ర్య‌నే మ‌ళ్లీ ఎంచుకోవ‌డం వ‌ల్ల ద‌ర్శ‌క నిర్మాత‌ల ప‌ని సుల‌భం అయ్యింది. ఆ పాత్ర‌లో మ‌రోసారి రాణించింది ఐశ్వ‌ర్య‌. రాజేంద్ర ప్ర‌సాద్ పాత్ర‌ని తీర్చిదిద్దిన విధానం, అందులో రాజేంద్రుడి న‌ట‌న త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. త‌న అనుభ‌వాన్నంత‌టినీ ఆయ‌న రంగ‌రించి మ‌రీ న‌టించారు. ఝాన్సీ పాత్ర కూడా గుర్తిండిపోతుంది. క‌ణ‌లో శివ కార్తికేయ‌న్ స‌న్నివేశాల‌న్నీ య‌ధావిధిగా వాడుకున్నారు. శివ కార్తికేయ‌న్ న‌ట‌న‌, ఆ పాత్ర ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది.


* సాంకేతికంగానూ ఈ సినిమా బాగుంది. పాట‌లు న‌చ్చుతాయి. కెమెరా వ‌ర్క్ ఆక‌ట్టుకుంటుంది. రైతుల గురించి చెప్పిన డైలాగులు చ‌ప్ప‌ట్లు కొట్టిస్తాయి. అయితే ‘క‌ణ‌’లోని స‌న్నివేశాల్ని స‌గానికి పైగా వాడుకున్నారు. దాంతో క‌ణ చూసిన వాళ్ల‌కు ఇది డ‌బ్బింగ్ సినిమాలా అనిపిస్తుంది. క‌థ‌లో మార్పులు చేర్పులు చేయ‌డానికి ద‌ర్శ‌కుడు ఏమాత్రం సాహ‌సం చేయ‌లేక‌పోయాడు.


బ‌లాలు
+ క‌థ‌, క‌థ‌నం
+ శివ‌ కార్తికేయ‌న్‌
+ తండ్రీ కూతుళ్ల ఎమోష‌న్‌

బ‌ల‌హీన‌త‌లు
- రీమేక్‌లో ఎలాంటి మార్పులూ చేయ‌క‌పోవ‌డం
- చాలా స‌న్నివేశాల్ని య‌థాతథంగా వాడుకోవడం

చివ‌రిగా: స్ఫూర్తినిచ్చిన కౌస‌ల్య‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.