రివ్యూ: ‘మహానటి’
చిత్రం: మహానటి
నటీనటులు: కీర్తిసురేష్‌.. దుల్కర్‌ సల్మాన్‌.. సమంత.. విజయ్‌ దేవరకొండ.. రాజేంద్రప్రసాద్‌.. తనికెళ్ల భరణి.. భానుప్రియ.. మాళవికా నాయర్‌.. కాజల్‌ అగర్వాల్‌.. షాలిని పాండే.. తులసి.. దివ్యవాణి తదితరులు
అతిథి పాత్రలు: మోహన్‌బాబు.. నాగచైతన్య.. నాని.. ప్రకాష్‌రాజ్‌.. బ్రహ్మానందం.. నరేష్‌.. క్రిష్‌.. శ్రీనివాస్‌ అవసరాల.. సందీప్‌ వంగా.. తరుణ్‌ భాస్కర్‌ తదితరులు
సంగీతం: మిక్కీ జె. మేయర్‌
ఛాయాగ్రహణం: డానీ శాంచెజ్‌ లోపెజ్‌
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
మాటలు: సాయి మాధవ్‌ బుర్రా
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి
స్క్రీన్‌ప్లే: సిద్ధార్థ్‌ శివస్వామి
నిర్మాత: స్వప్నాదత్‌.. ప్రియాంక దత్‌
దర్శకత్వం: నాగ్‌ అశ్విన్‌
బ్యానర్‌: వైజయంతీ మూవీస్‌, స్వప్న మూవీస్‌
విడుదల తేదీ: 09-05-2018

మీరెలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు? అని ఏ కథానాయికనైనా, ప్రశ్నిస్తే.. ‘గ్లామర్‌ రోల్స్‌తో పాటు, సావిత్రిలా నటనకు ప్రాధాన్యం ఉన్న ఒక్క పాత్రనైనా నా కెరీర్‌లో చేయాలనుకుంటున్నా’. దాదాపు అందరు కథానాయికలూ చెప్పే సమాధానం ఇదే. తరాలు మారినా చెరిగిపోని, మాసిపోని, మెరుపుపోని నటనా చాతుర్యం ఆమెది. కళ్లతోనే హావభావాలు పలికించగలిగిన అతి కొద్దిమంది నటీమణుల్లో సావిత్రిది అగ్రస్థానం అనడంలో ఎలాంటి సందేహం లేదు. తొలితరం కథానాయికల తర్వాత తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ఓ వెలుగు వెలిగిన ధ్రువతార సావిత్రి. ఆమె కన్నా ముందు చిత్ర పరిశ్రమలో చాలా మంది కథానాయికలు ఉన్నారు.. ఆ తర్వాత చాలా మంది వచ్చారు.. కానీ, సావిత్రి మాత్రమే ‘మహానటి’ అయ్యారు. అంతటి గొప్ప నటీమణి జీవితం ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’. నటీనటుల ఎంపిక దగ్గరి నుంచి ప్రచార చిత్రాల వరకూ ప్రతిదీ విభిన్నంగా తీర్చిదిద్దారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? సావిత్రిగా టైటిల్‌ రోల్‌ పోషించిన కీర్తిసురేష్‌ ఏ మేరకు ఆకట్టుకుంది? అతిరథ మహారథులు పోషించిన అతిథి పాత్రలు ఎలా ఉన్నాయి?

కథేంటంటే: బెంగళూరులోని చాళుక్య హోటల్‌లో తీవ్ర అనారోగ్యం పాలై కోమాలోకి వెళ్లిపోయిన సావిత్రి (కీర్తి సురేష్‌)ను ఆస్పత్రిలో చేరుస్తారు. ఆవిడ సాధారణ మహిళ అనుకొని అందరు పేషెంట్లలాగే చూస్తారు. అయితే, ఆమె ‘మహానటి’ సావిత్రి అని తర్వాత తెలుస్తుంది. అభిమానులు ఆస్పత్రికి పోటెత్తుతారు. అప్పటి నుంచి ఏడాది పాటు ఆమె కోమాలోనే ఉండిపోతుంది. ఆ సమయంలోనే ప్రజావాణి పత్రికలో విలేకరిగా చేరుతుంది వాణి(సమంత). ఆమెకు సావిత్రి కథ రాసే బాధ్యతను అప్పగిస్తారు. ఫొటో జర్నలిస్ట్‌ విజయ్‌ ఆంటోనీ(విజయ్‌ దేవరకొండ)తో కలిసి ఆమె పరిశోధన మొదలు పెడుతుంది. కోమాలోకి వెళ్లడానికి ముందు సావిత్రి ఏం చేసింది? బెంగళూరులో శంకరయ్యను కలవడానికి వచ్చిన సావిత్రికి ఏం జరిగింది? అసలు శంకరయ్య ఎవరు? తదితర విషయాలను వాణి ఎలా వెలుగులోకి తీసుకొచ్చిందనేది ‘మహానటి’ చిత్రం.

ఎలా ఉందంటే: తరతరాలుగా గుర్తుండిపోయే నటి సావిత్రి. ఆమె జీవితాన్ని పలు రచనలు రకరకాల కోణాల్లో ఇప్పటికే ఆవిష్కరించాయి. అయితే నవ తరానికి కూడా సావిత్రి జీవితం గురించి తెలిసేలా, తెలిసిన వాళ్లు కూడా మరొకసారి ఆమెకు సంబంధించిన జ్ఞాపకాలను నెమరేసుకునేలా అందంగా తెరకెక్కించిన చిత్రమే మహానటి. జీవిత కథల్ని తెరకెక్కించాలంటే తగిన పరిశోధన అవసరం. వాస్తవికత ఉట్టిపడుతూనే ఆయా కథల్లో తగిన డ్రామా పండాలి. ఆ నేపథ్యం కూడా తెరపై పక్కాగా కనిపించాలి. ఆ విషయంలో దర్శకుడు. నూటికి నూరుపాళ్లు విజయం సాధించాడు. సావిత్రి వ్యక్తిగత జీవితంతో పాటు, ఆమె నట జీవితం లోతుల్లోకి తొంగిచూసి కథను రాసుకున్నాడు దర్శకుడు. ఒక కంట్లో నుంచే కన్నీళ్లు రావాలని, అది కూడా రెండు చుక్కల కన్నీరే కార్చాలని దర్శకుడు కేవీ రెడ్డి చెప్పడం సావిత్రి గ్లిజరిన్‌ వాడకుండా రెండంటే రెండు చుక్కలే కన్నీళ్లు కార్చడం లాంటి సన్నివేశంతో మొదలు పెడితే దాదాపుగా ఆద్యంతం సినిమా ప్రేక్షకుల కళ్లు చెమ్మగిల్లేలా చేస్తుంది. దశాబ్దాల నట ప్రయాణం.. 300 సినిమాలతో కూడిన సుదీర్ఘ ప్రయాణం సావిత్రిది. ఆ జీవితం మొత్తాన్ని తెరపై చూపించాలంటే సాహసంతో కూడుకున్న పనే. కానీ, దర్శకుడు సావిత్రి బాల్యం మొదలుకొని, ఏ దశను వదిలి పెట్టకుండా జీవితం మొత్తాన్ని తెరపై చూపించాడు.


తొలి సగభాగంలో బాల్యంతో పాటు, నాటకజీవితం, సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు, నటిగా ఎదిగే క్రమం, ప్రేమ, పెళ్లి వరకూ చూపించారు. చాలా సన్నివేశాలు సరదాగా మరికొన్ని సన్నివేశాలు హృద్యంగా సాగుతూ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. తను అనుకొన్నది సాధించేవరకూ వదలిపెట్టని సావిత్రి నైజాన్ని చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ద్వితీయార్ధంలో జెమినీ గణేశన్‌తో కలిసి జీవితాన్ని మొదలు పెట్టడం, పెళ్లి తర్వాత కూడా ఆమె నటిగా ఓ వెలుగు వెలగడం ఆ తర్వాత వైవాహిక జీవితంలో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాలు తదితర విషయాలను చూపించారు. వీటన్నింటి మధ్యలోనే ఆమె నటనా వైభవాన్ని ‘మాయాబజార్‌’, ‘మిస్సమ్మ’, ‘మూగ మనసులు’ తదితర చిత్రాల్లోని ఘట్టాలతో చూపించిన విధానం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. విజయ్‌ ఆంటోనీ, వాణి పాత్రల్లో సావిత్రి పాత్రను ముందుకు నడిపించిన విధానం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. పతాక సన్నివేశాల్లో సమంత నటన, ఆమె మాటలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. మొత్తంగా సావిత్రి జీవితానికి గొప్ప నివాళిలా నిలిచే చిత్రమిది.

ఎవరెలా చేశారంటే: సావిత్రిగా కీర్తి సురేష్‌ నటించారు అనడం కంటే జీవించారు చెప్పాలి. లుక్‌ పరంగా బ్లాక్‌ అండ్‌ వైట్‌ షేడ్స్‌తో కూడిన సన్నివేశాల్లో అచ్చం సావిత్రిలానే కనిపించారు. సావిత్రి నటనను అనుకరించిన విధానం, ఆమె హావభావాలను పక్కాగా ఒంట బట్టించుకొని నటించిన వైనం చిత్రానికి ప్రాణం పోసింది. జెమినీ గణేశన్‌గా దుల్కర్‌ సల్మాన్‌ చాలా బాగా నటించారు. ‘కాదల్‌ మన్నన్‌’గా గుర్తింపు పొందిన జెమినీ శైలిలోనే దుల్కర్‌ హావభావాలను ప్రదర్శించాడు. ఆ పాత్ర కొన్ని చోట్ల వ్యతిరేక ఛాయలతో సాగుతున్నట్లు అనిపిస్తుంది. సావిత్రి పెదనాన్న పాత్రలో రాజేంద్రప్రసాద్‌ అభినయం ఆకట్టుకుంటుంది. పాత్రికేయురాలు వాణిగా సమంత, ఆమెకు సాయం చేస్తూనే ఆమెను ప్రేమించే ఫొటో జర్నలిస్ట్‌ విజయ్‌ ఆంటోనీగా విజయ్‌ దేవరకొండ ప్రశంసలు పొందే స్థాయిలో నటించారు. ఎస్వీ రంగారావుగా మోహన్‌బాబు కనిపించేది కొన్ని సన్నివేశాల్లోనైనా, ఆయన పాత్ర ప్రేక్షకులపై చక్కని ప్రభావం చూపిస్తుంది. ఏయన్నార్‌గా నాగచైతన్య తళుక్కున మెరుస్తారు. ఎన్టీఆర్‌ పాత్ర కూడా ఓ సన్నివేశంలో అలా కనిపిస్తుందంతే. సావిత్రి జీవితాన్ని ప్రభావితం చేసిన నిన్నటితరం సినీ ప్రముఖుల పాత్రలన్నీ తెరపై చూపించిన విధానం బాగుంది.


సాంకేతికంగా..: సాంకేతికంగా ఈ సినిమాకు నూటికి నూరు మార్కులు పడతాయి. తోట తరణి నేతృత్వంలో శివం రావు, అవినాష్‌లు ఆకాలం నాటి నేపథ్యాన్ని.. అందుకు సరిపోయే చక్కటి వాతావరణం సృష్టించారు. మిక్కీ జె.మేయర్‌ అందించిన పాటలు, నేపథ్య సంగీతం థియేటర్‌ నుంచి బయటకు వచ్చాక కూడా వెంటాడతాయి. ‘మూగ మనసులు’ ‘మహానటి’ పాటలు తెరపై చిత్రీకరించిన విధానం కూడా బాగుంది. డానీ కెమెరా పనితనం సినిమాకు జీవం పోసింది. కొన్ని బ్లాక్‌ అండ్‌ వైట్‌ సన్నివేశాలను చాలా బాగా తీర్చిదిద్దారు. ఆరోజులను గుర్తు చేసేలా రీల్‌ కెమెరాతో కొన్ని సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం సినిమాకు సహజత్వాన్ని తెచ్చి పెట్టింది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కథను అల్లిన విధానం సన్నివేశాలను తెరపైకి తీసుకొచ్చిన విధానం ఆయన అభిరుచికి, ప్రతిభకు అద్దం పడతాయి. సాయిమాధవ్‌ బుర్రా మాటలు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తాయి. ‘ప్రతిభ ఇంటి పట్టునే ఉండిపోతే ప్రపంచానికి పుట్టగతులు ఉండవు’ వంటి సంభాషణలు సినిమాలో చాలానే వినిపిస్తాయి. నిర్మాతలు స్వప్నదత్‌, ప్రియాంక దత్‌ కళకు, తపనకు, అభిరుచికి తార్కాణంగా నిలుస్తుంది ‘మహానటి’.

బలాలు
+ కథ, కథనం
+ కీర్తి, ఇతర నటీనటులు
+ సాంకేతిక బృందం పనితీరు

బలహీనతలు
- ద్వితీయార్ధంలో కొంచెం వేగం తగ్గడం

చివరిగా: ‘మహానటి’ సినిమా కాదు జీవితం

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

సంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.