రివ్యూ: మన్మథుడు 2
న‌టీన‌టులు: నాగార్జున‌, ర‌కుల్‌ప్రీత్ సింగ్‌, ల‌క్ష్మి, వెన్నెల‌ కిషోర్‌, రావు ర‌మేష్‌, ఝాన్సీ, దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు
దర్శకత్వం: రాహుల్ ర‌వీంద్రన్‌
నిర్మాత‌లు: నాగార్జున, పి.కిర‌ణ్‌
సంగీతం: చైత‌న్య భ‌రద్వాజ్‌
ఛాయాగ్రహ‌ణం: ఎం.సుకుమార్‌
ప్రొడక్షన్‌ డిజైన‌ర్స్‌: ఎస్‌.రామ‌కృష్ణ‌, మౌనిక‌
స్క్రీన్‌ప్లే: రాహుల్ ర‌వీంద్రన్, స‌త్యానంద్‌
కూర్పు: ఛోటా కె.ప్రసాద్‌, బి.నాగేశ్వర రెడ్డి
సంభాష‌ణ‌లు: కిట్టు విస్సా ప్రగ‌డ‌, రాహుల్ ర‌వీంద్రన్‌
నిర్మాణ సంస్థలు: మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 స్టూడియోస్‌
విడుద‌ల‌: 9-8-2019


నాగార్జున రొమాంటిక్ కామెడీ చిత్రాల్లో చ‌క్క‌గా ఒదిగిపోతుంటారు. ప‌దిహేడేళ్ల కింద‌ట వ‌చ్చిన `మ‌న్మ‌థుడు` గురించి ఇప్ప‌టికీ మాట్లాడుకుంటున్నామంటే కార‌ణం అదే. ఇన్నాళ్ల త‌ర్వాత కూడా ఆయ‌న రూపం మార‌లేదు. అందుకే రెండోసారి ఆయ‌న‌లోని మ‌న్మ‌థుడిని బ‌య‌టికి తీసుకొచ్చారు... `మ‌న్మ‌థుడు2` చిత్రంతో.  ఫ్రెంచి చిత్రం ` ఐ డు`కి రీమేక్‌గా రూపొందిన చిత్ర‌మిది. మ‌ధ్య వ‌య‌స్కుడి ప్రేమ‌క‌థతో రూపొందింది.  సున్నితత్వంతో కూడిన అంశాలు, కామెడీనే ఈ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం కాబ‌ట్టి `చి.ల‌.సౌ`తో మెప్పించిన రాహుల్ ర‌వీంద్ర‌న్‌ని ద‌ర్శ‌కుడిగా ఎంచుకొని ఈ చిత్రం  చేశారు నాగ్‌. మ‌రి ఆయ‌న రెండో మ‌న్మ‌థుడి అవ‌తారం ఎలా ఉంది?  తొలి సినిమా స్థాయిలో న‌వ్వించారో లేదో తెలుసుకునేముందు క‌థ‌లోకి వెళదాం. 
* క‌థేంటంటే..
సాంబ‌శివ‌రావు అలియాస్ సామ్ (నాగార్జున‌) పోర్చుగ‌ల్‌లోని కసాండ్రాలో సుగంధ ప‌రిమ‌ళాలు త‌యారు చేసే వ్యాపారంలో కొన‌సాగుతుంటాడు.  త‌రాల ముందు అక్క‌డికి వెళ్లి స్థిర‌ప‌డిన తెలుగు కుటుంబం ఆయ‌న‌ది. దేశానికి దూరంగా ఉండ‌టంతో వారి కుటుంబంలో అనుబంధం, ఆప్యాయ‌త‌లు ఎక్కువ‌గా ఉంటాయి. త‌ల్లి, అక్క‌లు, చెల్లెళ్లతో  క‌లిసి జీవిస్తుంటాడు. ప్రేమలో విఫ‌ల‌మైన ఆయ‌న ఆ త‌ర్వాత ప్రేమపైన న‌మ్మ‌క‌మే కోల్పోతాడు. ప్రేమ ఊసెత్త‌కుండా అంద‌మైన అమ్మాయిల‌తో చ‌నువుగా గ‌డుపుతూ జీవితాన్ని ఆస్వాదిస్తుంటాడు. ఇంట్లో మాత్రం  ఆయ‌న అస‌లు రూపం తెలియ‌దు. కానీ వ‌య‌సు మీద ప‌డిపోవ‌డంతో కుటుంబ స‌భ్యులు పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యిస్తారు. కానీ అది ఇష్టం లేని సామ్ ఒక కొత్త నాట‌కానికి తెరతీస్తాడు. తాను అవంతిక (ర‌కుల్‌)ని ప్రేమించాన‌ని ఆమెని ఇంటికి తీసుకొస్తాడు. కానీ ఆమె త‌న‌కున్న స‌మ‌స్య‌ల‌వ‌ల్ల సామ్‌తో ఓ ఒప్పందం కుదుర్చుకుని ఆయ‌న ఇంటికి వ‌స్తుంది. వ‌చ్చాక సామ్ కుటుంబానికి మ‌రింత ద‌గ్గ‌ర‌వుతుంది? ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది?  ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేర‌కు పెళ్లికి ముందు అవంతిక సామ్‌కి దూరంగా వెళ్లిపోయిందా లేదా?  సామ్ పెళ్ల‌యిందా లేదా? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే. 


విశ్లేష‌ణ‌..
మ‌ధ్య వ‌య‌స్కుడి ప్రేమ‌క‌థ ఇది. క‌థ కంటే కూడా త‌న వ‌య‌సుకు త‌గ్గ పాత్ర అని నాగార్జున  ఈసినిమాపై మ‌క్కువ పెంచుకొన్న‌ట్టున్న‌ట్టున్నారు.  పాత్ర, ఆయ‌న లుక్ వ‌ర‌కు మెప్పిస్తుందేమో కానీ... క‌థ ప‌రంగా చూస్తే మాత్రం ఇందులో కొత్త‌ద‌నం కొర‌వ‌డిన‌ట్టు స్ప‌ష్టమ‌వుతుంది.  ప్లే బాయ్ పాత్ర‌, అందులో నాగ్ చేసే సంద‌డి, దాంతో పండే కామెడీతో ప్ర‌థ‌మార్థం స‌ర‌దా స‌ర‌దాగా సాగుతుంది. అయితే కొన్నిచోట్ల మాత్రం కామెడీ కోసం చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌క‌పోవ‌డంతో ఆ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు బోర్ కొట్టేస్తాయి.  బ‌ల‌వంతంగా న‌వ్వించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతుంది. `చి.ల‌.సౌ`తో ప్రేక్ష‌కుల‌కు స‌హ‌జ‌మైన వినోదాన్ని అందించిన  రాహుల్ ర‌వీంద్ర‌న్ ఇందులో మాత్రం ఆ ప్ర‌భావం చూపించ‌లేక‌పోయారు. అలాగే మ‌న్మథుడుని, అందులోని కామెడీని మ‌న‌సులో పెట్టుకొని థియేట‌ర్‌కి వెళ్లిన ప్రేక్ష‌కుల‌కు కొద్దివ‌ర‌కే సంతృప్తినిస్తుందీ చిత్రం. న‌యా మ‌న్మ‌థుడిగా నాగ్ చేసే సంద‌డి ఆక‌ట్టుకున్నా, కామెడీ విష‌యంలో మాత్రం మోతాదు త‌గ్గిన‌ట్టు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది.  విరామానికి ముందు స‌న్నివేశాలు కాస్త ఆక‌ట్టుకున్నా, ద్వితీయార్థంలో క‌థంతా కూడా ప్రేక్ష‌కుడి ఊహ‌కు త‌గ్గ‌ట్టుగానే సాగుతుంది. ప‌తాక స‌న్నివేశాల్లో భావోద్వేగాలు, అక్క‌డ సందేశం కాస్త హృద‌యాల్ని హ‌త్తుకొంటుంది.  ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ క‌థ‌,క‌థ‌నాల విష‌యంలో చేసిన క‌స‌ర‌త్తులు స‌రిపోలేదు. ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టుగా సినిమా ఉండాల‌నే ఆలోచ‌న‌తో...  ద్వంద్వార్థాలతో కూడిన సంభాష‌ణ‌ల్ని ఎక్కువ‌గా వినియోగించ‌డం కుటుంబ ప్రేక్ష‌కుల్ని ఇబ్బంది పెట్టే విష‌య‌మే.  


* న‌టీన‌టులు... సాంకేతిక‌త‌
 నాగార్జున లుక్‌, ఆయ‌న పండించిన కామెడీ, భావోద్వేగాలు చిత్రానికి ప్ర‌ధాన బ‌లం. మ‌న్మ‌థుడిగా రొమాంటిక్ స‌న్నివేశాల‌తో  మ‌రోసారి త‌న ప్ర‌త్యేక‌త‌ని ప్ర‌ద‌ర్శించాడు. ర‌కుల్‌ప్రీత్ సింగ్ న‌ట‌న కూడా మెప్పిస్తుంది. ఆమె పాత్ర‌ని డిజైన్ చేసిన తీరు కూడా మెప్పిస్తుంది. గ్లామ‌ర్‌గా క‌నిపించ‌డంతో పాటు... కామెడీ, భావోద్వేగాల్ని కూడా చ‌క్క‌గా పండించింది ర‌కుల్‌. వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఆయ‌న క‌థానాయ‌కుడితో పాటే క‌నిపిస్తూ సంద‌డి చేస్తాడు. లక్ష్మి త‌ల్లి పాత్ర‌లో మెప్పించారు. ఝాన్సీ, దేవ‌ద‌ర్శిని, నిశాంతి, రావు ర‌మేష్ త‌దిత‌రుల పాత్ర‌ల ప‌రిధి మేర‌కు మెప్పించారు. ర‌కుల్‌, ఝాన్సీ మ‌ధ్య హాట్ స‌న్నివేశం చ‌ర్చ‌ని లేవ‌నెత్తుతుంది. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. నిర్మాణ విలువ‌లు అన్న‌పూర్ణ  స్టూడియోస్ స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి.  ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ సున్నిత‌మైన విష‌యాల్ని చ‌క్క‌గా డీల్ చేసిన‌ప్ప‌టికీ, క‌థ ప‌రంగా మ‌రింత సంఘ‌ర్ష‌ణ‌ని తీసుకురావ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు.  మాతృక‌ని తెలుగుకి త‌గ్గ‌ట్టుగా మార్చిన‌ప్ప‌టికీ, కామెడీ ప‌రంగా కూడా ఆయ‌న చేసిన క‌స‌ర‌త్తులు స‌రిపోలేదు.  సుకుమార్ కెమెరా ప‌నిత‌నం బాగుంది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ నేప‌థ్య సంగీతంతో మెప్పించాడు. పాట‌లు మాత్రం ప‌ర్వాలేద‌నిపిస్తాయంతే. 


బ‌లాలు
+ నాగార్జున, ర‌కుల్‌ల న‌ట‌న‌
+ వెన్నెల‌ కిషోర్ కామెడీ
+ భావోద్వేగాలు

బ‌ల‌హీన‌త‌లు
- న‌వ్వించ‌ని కొన్ని స‌న్నివేశాలు

* చివ‌రిగా..
తెలిసిన క‌థ‌కి కొత్త హంగులు, ట్రెండ్‌కి త‌గ్గ కామెడీని అద్దితే ఎలా ఉంటుందో అదే ఈ సినిమా.  నాగార్జున మ‌న్మ‌థుడి అవ‌తారం మ‌రోసారి మెప్పించిన‌ప్ప‌టికీ.. క‌థ‌, క‌థ‌నాలు, కామెడీ ప‌రంగా మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించ‌లేక‌పోయింది. స‌ర‌దాగా సాగుతూ, కాల‌క్షేపాన్నిచ్చే స‌గ‌టు చిత్రంగా `మ‌న్మ‌థుడు 2` నిలుస్తుంది.  
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.