రివ్యూ: మార్ష‌ల్
చిత్రం: మార్షల్‌
నటీనటులు: శ్రీకాంత్‌, అభయ్‌, మేఘ చౌదరి, రష్మి
సంగీతం: యాదగిరి వరికుప్పల
సినిమాటోగ్రఫీ: స్వామి ఆర్‌.ఎం.
ఎడిటింగ్‌: చోటా కె ప్రసాద్‌
నిర్మాత: అభయ్‌ అడకా
రచన,దర్శకత్వం: జైరాజా సింగ్‌
బ్యానర్‌: ఏవీఎల్‌ ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ: 13-09-2019

ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల వ‌ర‌కూ తీసుకురావ‌డం చాలా క‌ష్ట‌మైపోతోంది. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌క నిర్మాతలే ఒప్పుకొంటున్నారు. క‌థ‌లో వైవిధ్యం, క‌థ‌నంలో కొత్త‌ద‌నం లేక‌పోతే సినిమాల్ని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా చిన్న సినిమాల్ని. వాటిని ముందుండి న‌డిపించాల్సింది కొత్త‌ద‌న‌మే. అయితే కొంత‌మంది పాయింట్ వ‌ర‌కూ కొత్త‌గానే ఆలోచిస్తున్నారు. దాన్ని రెండున్న‌ర గంట‌ల సినిమాగా అందించే ప్ర‌య‌త్నంలో త‌ప్పులు చేస్తున్నారు. దాంతో వాళ్లు ప‌డిన‌ క‌ష్ట‌మంతా వృథా అయిపోతుంది. ‘మార్ష‌ల్’ కోసం ద‌ర్శ‌కుడు ఎంచుకున్న పాయింట్‌లో కొత్త‌ద‌నం ఉంది. మ‌రి దాన్ని తీసిన విధానం ఎలా ఉంది? ఇంత‌కీ ఈ మార్ష‌ల్ ఏం చెబుతున్నాడు?


* క‌థేంటంటే..
శివాజీ (శ్రీ‌కాంత్‌) ఓ సూప‌ర్ స్టార్‌. త‌న సినిమాలన్నీ హిట్టే. ల‌క్ష‌ల్లో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఆ అభిమానుల్లో అభి (అభ‌య్‌) ఒక‌డు. త‌నో మెడిక‌ల్ రిప్రెజెంటిటీవ్‌. అక్కా- బావ అంటే ప్రాణం. అయితే వాళ్ల‌కు పిల్ల‌లు పుట్ట‌రు. ఓ ఆసుప‌త్రిలో అధునాత‌న‌ వైద్యంతో పిల్ల‌లు పుడుతున్నార‌ని తెలిసి త‌న అక్క‌ని అక్క‌డికి పంపిస్తాడు. కానీ.. వైద్యుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల అక్క కోమాలో వెళ్లిపోతుంది. మరోవైపు త‌ను ప్ర‌మోట్ చేసిన బ్యూటీ క్యాప్సిల్ వాడ‌డం వ‌ల్ల కొంత‌మంది అమ్మాయిలు అనారోగ్యం పాలై ఆసుప‌త్రిలో చేర‌తారు. ఇంకోవైపు హైద‌రాబాద్‌లోని కొంత‌మంది అమ్మాయిల‌పై ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు జ‌రుగుతుంటాయి. వీట‌న్నింటికీ కార‌ణం ఎవ‌రు? అస‌లు హైద‌రాబాద్ న‌గ‌రంలో ఏం జ‌రుగుతుంది? మెడిక‌ల్ మాఫియా వెనుక ఉన్న పెద్ద మ‌నుషులు ఎవ‌రు? అనేదే ‘మార్ష‌ల్’ క‌థ‌.

* ఎలా ఉందంటే..
ఇదో మెడిక‌ల్ మాఫియా క‌థ‌. స్టార్‌గా చ‌లామ‌ణీ అవుతున్న ఓ బ‌డా ‘బాబు’... ఆ ముసుగులో ఏం చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు? అనేదాని చుట్టూ మార్ష‌ల్ తిరుగుతుంది. తాను ఎంత‌గానో ఆరాధించే ఓ సూప‌ర్ స్టార్‌ గుట్టు ర‌ట్టు చేయ‌డానికి ఓ అభిమాని చేసే ప్ర‌య‌త్నం మార్ష‌ల్‌. పాయింట్‌గా మంచిదే. అయితే.. దాన్ని తెర‌పైకి తీసుకొచ్చే విష‌యంలో ద‌ర్శ‌కుడు పెద్ద‌గా తడబడ్డాడు. హిరోషిమా - నాగ‌సాకి పై జ‌రిగిన అణుబాంబు దాడిని గుర్తు చేస్తూ టైటిల్ కార్డ్స్ వేశారు. దాంతో ప్రారంభం నుంచే కాస్త ఆస‌క్తి రేగుతుంది. అమ్మాయిలపై బ‌ల‌వంతంగా ప్ర‌యోగాలు చేయ‌డం, అందులో క‌థానాయ‌కుడి అక్క కూడా ఇరుక్కుపోవ‌డంతో క‌థకి మ‌రింత బ‌లం వ‌చ్చినట్లైంది. అయితే ఈ మ‌ధ్యలో న‌డిపించిన స‌న్నివేశాలే బోరింగ్‌గా ఉంటాయి. హీరో, హీరోయిన్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్ పేల‌వంగా సాగుతుంది. కామెడీ కూడా ఏమాత్రం వ‌ర్క‌వుట్ కాలేదు. ప్ర‌యోగాలు, సైన్స్ అంటూ క‌థ‌ని అక్క‌డక్క‌డే తిప్పారు.


ద్వితీయార్ధంలో క‌థ‌ని న‌డిపించ‌డానికి కావ‌ల్సిన స్కోప్ దొరికింది. విల‌న్ ఎవ‌రో దొరికిపోవ‌డంతో అత‌న్ని చ‌ట్టానికి ఎలా ప‌ట్టించార‌న్న‌ది ద్వితీయార్ధానికి కీల‌కంగా మారింది. విశ్రాంతి తర్వాత 10 నిమిషాలు క‌థ ర‌స‌వ‌త్త‌రంగానే సాగింది. అయితే స్ట్రింగ్ ఆప‌రేష‌న్ అంటూ స‌న్నివేశాల్ని సాగ‌దీసుకుంటూ వెళ్లారు. దాంతో ఆ ఆస‌క్తి కూడా స‌న్న‌గిల్లుతుంది. రొటీన్ స్క్రీన్‌ప్లేతో, అన‌వ‌స‌రపు స‌న్నివేశాల్ని విసిగించ‌డం వ‌ల్ల‌.. మంచి ఐడియా కూడా బోర్ కొట్టించేసింది. లాజిక్కులు లేని స‌న్నివేశాల‌కైతే లెక్క‌లేదు. సినిమాల్లో లాజిక్కులు వెదుక్కోవ‌డం అన‌వ‌స‌రం కాబ‌ట్టి, వాటి జోలికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిది.


* ఎవ‌రెలా చేశారంటే..
అభ‌య్‌కి ఇదే తొలి చిత్రం. ఓ అభిమానిగా, ఓ అక్క‌కు త‌మ్ముడిగా, అన‌వ‌స‌రంగా ఓ కేసులో చిక్కుకున్న నిందితుడిగా త‌న పాత్ర‌కు చాలా మైలేజీ ఉంది. అయితే ఇన్ని పార్శ్వాలున్న పాత్ర‌ని తొలి సినిమాతో మోయ‌డం క‌ష్టం. కొంత వ‌ర‌కూ ఈ విష‌యంలో మెప్పించాడు అభ‌య్‌. కొన్ని స‌న్నివేశాల్లో మాత్రం తేలిపోయాడు. శ్రీ‌కాంత్ నెగిటీవ్ టచ్ ఉన్న పాత్ర పోషించాడు. త‌న స్టైలింగ్ బాగుంది. కాక‌పోతే.. న‌టించ‌డానికి పెద్ద‌గా స్కోప్ దొర‌క‌లేదు. అందం, అభిన‌యం రెండు విష‌యాల్లోనూ మేఘా చౌద‌రి నిరాశ ప‌రిచింది.

పాట‌లు స్పీడు బ్రేక‌ర్లుగా మార‌తాయి. తొలి స‌గంలో మూడు పాట‌లొస్తే.. అందులో రెండింటిని ట్రిమ్ చేయొచ్చు. నేప‌థ్య సంగీతంలో హోరు ఎక్కువైంది. సినిమా రిచ్ గానే ఉంది. బాగా ఖ‌ర్చు పెట్టిన‌ట్టు అర్థం అవుతోంది. అయితే.. క‌థ‌నం విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త ప‌డాల్సింది. ద‌ర్శ‌క‌త్వ ప‌రంగా ఇంకాస్త మెరుగులు దిద్ది ఉంటే మంచి చిత్రం అయ్యేది.


బ‌లాలు
+శ్రీ‌కాంత్‌
+ మెడిక‌ల్ మాఫియా నేప‌థ్యం

బ‌ల‌హీన‌త‌లు
- క‌థ‌నం
- అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాలు

* చివ‌రిగా.. ‘మార్షల్‌’ ఆప‌రేష‌న్ ఫెయిల్‌
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.