రివ్యూ: మీకు మాత్రమే చెప్తా
చిత్రం: మీకు మాత్రమే చెప్తా
న‌టీన‌టులు: తరుణ్ భాస్కర్, అనసూయ భరద్వాజ్, అభినవ్ గౌతమ్‌, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ త‌దిత‌రులు.
ఛాయాగ్రహ‌ణం: మదన్ గుణదేవా
సంగీతం: శివకుమార్
క‌ళ‌: రాజ్కుమార్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: అనురాగ్ పర్వతినేని
నిర్మాతలు: విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ
రచన-దర్శకత్వం: షమ్మీర్ సుల్తాన్

క‌థానాయ‌కుడిగా స్టార్‌డ‌మ్ సొంతం చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ నిర్మాణంలోనూ రాణించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. త‌న‌ని `పెళ్లిచూపులు`తో క‌థానాయ‌కుడిని చేసిన ద‌ర్శ‌కుడు త‌రుణ్‌భాస్క‌ర్‌ని, ఈసారి విజ‌య్ తాను నిర్మించిన `మీకు మాత్ర‌మే చెప్తా`తో హీరోగా ప‌రిచ‌యం చేశారు. కొత్త ద‌ర్శ‌కుడు  షమ్మీర్ సుల్తాన్‌కి  ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, త‌రుణ్‌భాస్క‌ర్‌, అన‌సూయ‌... త‌దిత‌రులంతా  సినిమాలో భాగం కావ‌డం... ప్ర‌చార చిత్రాలు ఆస‌క్తిని రేకెత్తించ‌డంతో `మీకు మాత్ర‌మే చెప్తా`పై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి సినిమా ఎలా ఉందో తెలుసుకునేముందు క‌థ‌లోకి వెళ‌దాం...

* క‌థేంటంటే..
వీడియో జాకీలుగా ప‌నిచేసే రాకేష్ (త‌రుణ్ భాస్క‌ర్), కామేష్ (అభిన‌వ్ గోమఠం) మంచి స్నేహితులు. ఇద్ద‌రూ తాము ప‌నిచేస్తున్న ఛాన‌ల్‌కి టీఆర్పీ రేట్లు రావడం కోసం ర‌క‌ర‌కాల ఐడియాల‌తో వీడియోలు చేస్తుంటారు. రాకేష్ సెల్‌ఫోన్‌లో ర‌హ‌స్య‌మైన ఒక  వీడియో ఉంటుంది. బెడ్ రూమ్ నేప‌థ్యంలో ఒక అమ్మాయితో తీసిన వీడియో అది. `మ‌త్తు వ‌ద‌ల‌రా నిద్దు మ‌త్తు వ‌ద‌ల‌రా` అనేది ఆ వీడియో పేరు.  బ‌య‌టికి రాద‌నుకున్న ఆ వీడియో లీక‌వుతుంది.  మ‌రికొన్ని గంట‌ల్లో ప్రేమించిన యువ‌తి డాక్ట‌ర్  స్టెఫీ(వాణి భోజ‌న్‌)తో పెళ్లికి సిద్ధ‌మ‌వుతుండ‌గా ఆ వీడియో బ‌య‌టికి రావ‌డంతో కంగారుప‌డిపోతాడు రాకేష్‌. తాను మంచి వాడిన‌ని స్టెఫీని ఒప్పించిన రాకేష్ త‌న పెళ్లి ఎక్క‌డ ఆగిపోతుందో అని భ‌య‌ప‌డిపోతాడు. ఆ వీడియోని తొల‌గించేందుకు కామేష్‌తో క‌లిసి రంగంలోకి దిగుతాడు. ఆ క్ర‌మంలో ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి?  ఆ వీడియోని స్టెఫీ చూసిందా లేదా?  లేదా?  పెళ్లి జ‌రిగిందా లేదా? వీళ్ల క‌థ‌తో సంయుక్త (అన‌సూయ‌)కి సంబంధ‌మేమిటి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


* ఎలా ఉందంటే..
న‌వ‌తరానికి బాగా రిలేట్ అయ్యే క‌థనే ఎంచుకొన్నాడు ద‌ర్శ‌కుడు.  కొత్తత‌రం కొత్త ర‌క‌మైన ఆలోచ‌న‌ల‌తో వ‌స్తార‌ని మ‌రోమారు నిరూపించే క‌థాంశం. ప్ర‌తి ఒక్క‌రి సెల్‌ఫోన్‌లో ర‌హ‌స్యాలు ఉంటాయి. అవి బ‌య‌టికొస్తే ఎలాంటి ప‌రిణామాలు ఏర్ప‌డ‌తాయి? అది కూడా పెళ్లికి ముందైతే ఎలా ఉంటుంద‌నేది ఆస‌క్తిక‌ర‌మై విష‌యాలు. వీటి నుంచే వినోదం పుట్టించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు.  క‌థ‌గా చూస్తే ఇందులో చెప్పుకోద‌గ్గ విష‌య‌మేదీ లేదు.  కానీ కొత్త‌గా అనిపించే ఆ నేప‌థ్యాన్ని ఎంచుకొని, సంద‌ర్భాల నుంచే వినోదం పండేలా చూసుకున్నాడు ద‌ర్శ‌కుడు.  దానికి ష‌మ్మీర్ సుల్తాన్‌, త‌రుణ్ భాస్క‌ర్ క‌లిసి రాసుకున్న మాట‌లు కూడా బాగా తోడ‌య్యాయి. చెప్పుకోద‌గ్గ క‌థ లేక‌పోయినా వినోదం పండించ‌డం క‌త్తిమీద  సామే. ఆ విష‌యంలో ద‌ర్శ‌కుడు ప‌నిత‌నాన్ని, ఆయ‌న ర‌చ‌నా ప‌టిమ‌ని మెచ్చుకోవ‌ల్సిందే.  ఆరంభంలో స‌న్నివేశాలు కాస్త నిదానంగా సాగుతున్న‌ట్టు అనిపించినా.. వీడియో విష‌యం బ‌య‌టికొచ్చిన‌ప్ప‌ట్నుంచి  సినిమా ప‌రుగులు పెడుతుంది.  వీడియోని తీసేయించాల‌ని క‌థానాయ‌కుడు ప‌డే త‌ప‌న‌... మ‌ధ్య‌లో ఎలాగైనా తాను ప్రేమించిన అమ్మాయి త‌న‌కే ద‌క్కేలా చూసుకోవాల‌ని వారియ‌ర్‌లాంటి ల‌వ‌ర్ అడ్డుత‌గ‌ల‌డం... త‌న ప్ర‌య‌త్నాలు ఎంత‌కీ నెర‌వేర‌క‌పోగా మ‌రోవైపు లీకైన ఆ వీడియో వ్యూస్ అంత‌కంత‌కూ  పెరుగుతుండ‌డం ఉత్కంఠ రేకెత్తిస్తాయి. ఈ హ‌డావుడి మ‌ధ్య నుంచే హాస్యం రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. దాంతో స‌న్నివేశాల‌న్నీ కూడా స‌ర‌దాగా సాగిపోతుంటాయి. ప్ర‌థ‌మార్థం వ‌ర‌కు స‌మ‌స్యేమీ లేక‌పోయినా...  ద్వితీయార్థంలోనే ఇక కొత్త‌గా చెప్పాల్సిందేమీ క‌నిపించ‌దు. దాంతో స‌న్నివేశాల‌న్నీ అక్క‌డ‌క్క‌డే తిరిగిన‌ట్టుగా, చూసిందే చూపిస్తున్న‌ట్టుగా అనిపిస్తుంది.  క‌థానాయ‌కుడు పెళ్లి మంట‌పంపైన ఉన్న‌ప్పుడు వ‌చ్చే స‌న్నివేశాలు ఏమంత‌గా ఆక‌ట్టుకోవు.  క‌థ‌లో ఏదైనా మ‌లుపు  ఉంటుందేమో అనుకుంటే... ద‌ర్శ‌కుడు వాటిని ప‌తాక స‌న్నివేశాల్లో చూపెట్టాడు. కానీ ఆ మ‌లుపు పెద్ద‌గా ఆక‌ట్టుకోదు. పైగా అప్ప‌టిదాకా ఉన్న ఫీల్ పోయేలా చేస్తుందా మ‌లుపు.  ఒక చిన్న క‌థాంశాన్ని తీసుకొని  సినిమాగా తీర్చిదిద్దిన వైనం మాత్రం మెచ్చుకోద‌గ్గ‌ది. ద‌ర్శ‌కుడు కొత్తే అయినా కామెడీలో మంచి ప‌ట్టుని ప్ర‌ద‌ర్శించాడు.  


* ఎవ‌రెలా చేశారంటే..
త‌రుణ్‌భాస్క‌ర్‌లో మంచి న‌టుడున్నాడ‌ని ఈ సినిమా మ‌రోసారి చాటి చెబుతుంది. ఆయ‌న రాకేష్ పాత్ర‌లో చాలా స‌హ‌జంగా న‌టించాడు. వినోదం పండించిన తీరు కూడా మెచ్చుకోద‌గ్గ‌ది. అభిన‌వ్‌తో ఆయ‌న‌కి మంచి కెమిస్ట్రీ కుదిరింది. త‌రుణ్‌, అభిన‌వ్ గోమ‌ఠంల మీదే ఎక్కువ స‌న్నివేశాలుంటాయి. వాళ్ల హావావాలు కూడా న‌వ్విస్తాయి. స్టెఫీ పాత్ర‌లో వాణీ, కామేష్ ల‌వ‌ర్‌గా పావ‌ని గంగిరెడ్డి పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. మిగ‌తా న‌టులంతా కొత్త‌వాళ్లే.  వాళ్లంతా కూడా సినిమాకి కొత్త‌ద‌నాన్ని తీసుకొచ్చారు. అన‌సూయ సంయుక్త అనే పాత్ర‌లో న‌టించింది. ఆమె స్థాయికి త‌గ్గ పాత్రేమీ కాదు. విజ‌య్ దేవ‌ర‌కొండ, ఆయ‌న తండ్రి వ‌ర్ధ‌న్ దేవ‌ర‌కొండతో క‌లిసి ఈ సినిమాని నిర్మించారు.  క‌థ‌, తారాబ‌లానికి త‌గ్గ‌ట్టుగా ప‌రిమిత వ్య‌యంతో నిర్మించారు. శివ‌కుమార్ సంగీతం, మ‌ద‌న్ గుణ‌దేవా కెమెరా ప‌నిత‌నం ప‌ర్వాలేద‌నిపిస్తాయి. ద‌ర్శ‌కుడు షమ్మీర్ సుల్తాన్‌లో మంచి ప్ర‌తిభ ఉంది. ముఖ్యంగా ఆయ‌న కామెడీనిడీల్ చేసిన విధానం ఆక‌ట్టుకునేలా ఉంది.  


బ‌లాలు
హాస్యం
త‌రుణ్‌భాస్కర్‌, అభిన‌వ్ న‌ట‌న
+ క‌థ, నేప‌థ్యం

బ‌ల‌హీన‌త‌లు
-ద్వితీయార్థం
-నిర్మాణ విలువ‌లు

* చివ‌రిగా..
 కొత్త ఆలోచ‌న‌ల‌తో కూడిన సినిమానే. కానీ సినిమాకి క‌థా ప‌రిధి మ‌రింత విస్తృతంగా ఉండాలి.  ల‌ఘు చిత్రాల స్థాయి క‌థాంశాల‌తో సినిమా తెర‌కెక్కించాల‌ని చూస్తే అది ఎక్క‌డో ఒక‌చోట సాగ‌దీత‌లా మారిపోతుంది. ప్ర‌థ‌మార్థం వ‌ర‌కు న‌వ్వించి, ఆస‌క్తి రేకెత్తించిన ఈ సినిమా ద్వితీయార్థంలోకి వ‌చ్చేస‌రికి అక్క‌డ‌క్క‌డే త‌చ్చాడింది. దాంతో కాలక్షేపాన్నిచ్చే స‌గ‌టు సినిమాగా మిగిలిపోయింది. క‌థ‌కి మ‌రికొన్ని మెరుగులు దిద్ద‌డ‌మో లేదంటే జోడింపులో ఉండుంటే ఈ సినిమా ఫ‌లితం మ‌రో స్థాయిలో ఉండేదేమో.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.