రివ్యూ: మిఠాయి
రివ్యూ: మిఠాయి

సినిమా పేరు: మిఠాయి
న‌టీన‌టులు: ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌, కమల్ కామరాజు, భూషణ్ కల్యాణ్, రవి వర్మ, అజయ్ ఘోష్, అర్ష, శ్వేతా వర్మ, అదితి మ్యాకల్, విజయ్ మరార్, గాయత్రి గుప్తా త‌దిత‌రులు
ఛాయాగ్రహణం: రవివర్మన్ నీలమేఘం
సంగీతం: వివేక్ సాగర్
కూర్పు: గ్యారీ బి.హెచ్
సాహిత్యం: కిట్టు విస్సా ప్రగడ
మాటలు: ప్రశాంత్ కుమార్, బి. నరేష్
నిర్మాత: డాక్టర్ ప్రభాత్ కుమార్
దర్శకత్వం: ప్రశాంత్ కుమార్
సంస్థ‌: రెడ్ యాంట్ ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్స్‌
విడుద‌ల తేదీ‌: 22 ఫిబ్ర‌వ‌రి 2019


డార్క్ కామెడీ క‌థతో తెర‌కెక్కిన చిత్రంగా  ప్ర‌చారం చేసుకుంది... `మిఠాయి`. హాస్య‌న‌టుల్లో మంచి క్రేజ్ సంపాదించుకొన్న ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందిన చిత్రం కావడంతో విడుద‌ల‌కి ముందే సినిమా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాల్నే రేకెత్తించింది.  మ‌రి సినిమా ఎలా ఉంది?  రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి ఏ మేర‌కు న‌వ్వించారో తెలుసుకుందాం ప‌దండి... 


* క‌థేంటంటే..
సాయి (రాహుల్ రామ‌కృష్ణ‌), జానీ (ప్రియ‌ద‌ర్శి) చిన్న‌ప్ప‌ట్నుంచీ మంచి స్నేహితులు. కాస్త బ‌ద్ధ‌కం ఎక్కువ‌. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన సాయికి ఉద్యోగంపై విర‌క్తితో ఉంటాడు. జీతంతో బ‌త‌క‌డం కాకుండా...  కొత్త‌గా ఏదైనా చేయాల‌నే ఆలోచ‌న త‌న‌ది.  సాయి చెప్పే మాట‌లు వింటూ  జులాయిగా తిరుగుతుంటాడు జానీ. త‌న స్నేహితురాల్ని పెళ్లి చేసుకోవాల‌ని ఫిక్స్ అవుతాడు సాయి. ఆమె కోసం ప్ర‌త్యేకంగా న‌గ త‌యారు చేయిస్తాడు. అనుకోకుండా ఆ న‌గ దొంగ‌త‌నానికి గుర‌వుతుంది. న‌గ దోచేసిన ఆ దొంగ‌ని ప‌ట్టుకొన్నాకే పెళ్లి చేసుకోవాల‌ని ఫిక్స్ అవుతాడు సాయి. అందుకోసం త‌న ప్రాణ‌స్నేహితుడైన జానీతో క‌లిసి రంగంలోకి దిగుతాడు. మ‌రి జానీ అత‌నికి ఎలా సాయం చేశాడు?  ఇంత‌కీ సాయి పెళ్ల‌యిందా లేదా? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 


* ఎలా ఉందంటే..
ఇద్ద‌రు బ‌ద్ధ‌క‌స్తుల క‌థ ఇది. దొంగ‌ని వెదికేందుక‌ని ఇద్ద‌రు బ‌ద్ధ‌క‌స్తులు రంగంలోకి దిగితే ఎలా ఉంటుంద‌నే విష‌యాన్ని ఆసరాగా చేసుకొనే ఈ క‌థ రాసుకొన్నాడు ద‌ర్శ‌కుడు. నిజానికి ఇందులో క‌థంటూ ఏమీ లేదు.  ఒక చిన్న అంశాన్ని తీసుకొని దాని చుట్టూ స‌న్నివేశాలు రాసుకొన్నాడు ద‌ర్శ‌కుడు. క‌థ‌నంలో బిగి ఉంటే, ఇలాంటి చిన్న అంశాలు కూడా ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తాయ‌ని చాలాసార్లు రుజువైంది. కానీ ద‌ర్శ‌కుడు క‌థ‌నంపైన కూడా పెద్ద‌గా క‌స‌ర‌త్తులు చేయ‌లేదు. దాంతో సినిమా అంతా సాగ‌దీత‌గా... సాదాసీదాగా సాగుతున్న‌ట్టు అనిపిస్తుంది. రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శిలాంటి న‌టులున్న‌ప్పుడు ప్రేక్ష‌కులు మ‌రింత కామెడీని ఆశిస్తారు. కానీ ఆ విష‌యంపై కూడా ద‌ర్శ‌కుడు పెద్ద‌గా దృష్టిపెట్ట‌లేదు. ఇందులో ఏ ఒక్క స‌న్నివేశం కూడా బ‌లంగా న‌వ్వించ‌దు. తొలి స‌గ‌భాగం సినిమా మొత్తంలో విరామం  స‌మ‌యానికి వ‌చ్చే మ‌లుపుతోనే క‌థ‌లోకి అడుగుపెట్టిన‌ట్టు అనిపిస్తుంది. ద్వితీయార్థంలోనైనా  క‌థ‌నంతో  మేజిక్ చేశారేమో అని ఆశిస్తే, అది కూడా జ‌ర‌గలేదు. అక్క‌డ కూడా ప‌స లేని కామెడీతోనూ... స‌హ‌నాన్ని ప‌రీక్షించే సాగ‌దీత స‌న్నివేశాల‌తోనూ కాల‌క్షేపం చేయించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌ల న‌ట‌న‌, హావ‌భావాలే అక్క‌డ‌క్క‌డా న‌వ్వించాయి. పాత్ర‌ల్ని డిజైన్ చేసుకోవ‌డం వ‌ర‌కు ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ ప‌ర్వాలేద‌నిపించినా... మిగ‌తా విష‌యాల్లో మాత్రం తేలిపోయారు. దాంతో సినిమా ఏ ద‌శ‌లోనూ మెప్పించ‌దు. 


* ఎవ‌రెలా చేశారంటే..
ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ పాత్ర‌లే సినిమాకి కీల‌కం. వాళ్లు త‌మ అనుభ‌వాన్నంతా రంగ‌రించి న‌టించారు. ఏమీ లేని చోట కూడా న‌వ్వు తెప్పించే ప్ర‌య‌త్నం చేశారు. క‌మ‌ల్ కామ‌రాజు, అజ‌య్‌ఘోష్ త‌దిత‌రుల పాత్ర‌లు కూడా మెప్పిస్తాయి. ర‌వివ‌ర్మ‌, భూష‌ణ్‌, శ్వేత‌వ‌ర్మ‌, అదితి మ్యాక‌ల్ త‌దిత‌రులు ప‌ర్వాలేద‌నిపించారు. సాంకేతిక విభాగం ప‌నితీరు  అంతంత మాత్ర‌మే. వివేక్‌సాగ‌ర్ నేప‌థ్య సంగీతం వ‌ర‌కు, ర‌వివ‌ర్మ‌న్  కెమెరా పనిత‌నం కొన్నిచోట్ల  ఆక‌ట్టుకుంటుందంతే. ఎడిటింగ్ ప‌రంగా ప‌స లేదు. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టే ఉన్నాయి. దర్శ‌కుడు  ప్ర‌శాంత్ కుమార్ ప‌నిత‌నం మెప్పించ‌లేదు. 

బ‌లాలు
+ రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి న‌ట‌న‌
+ అక్క‌డ‌క్క‌డా హాస్యం

బ‌ల‌హీన‌త‌లు
- క‌థ‌, క‌థ‌నం
- సాగ‌దీత‌గా స‌న్నివేశాలు
- కొర‌వ‌డిన హాస్యం

చివ‌రిగా: ప్రేక్ష‌కుల అభిరుచుల‌కి త‌గ్గ‌ట్టుగా సినిమాలు తీయ‌డం అవ‌స‌ర‌మే. ర‌క‌ర‌కాల జోన‌ర్లు ప‌రిచ‌య‌మ‌వుతుంటాయంటే కార‌ణం అదే. అయితే ఏ జోన‌ర్  సినిమాకైనా క‌థే కీల‌కం. సినిమాలో బ‌ల‌మైన క‌థో... క‌థ‌న‌మో లేక‌పోతే, అది ఎలాంటి నేప‌థ్యంలో సాగినా మెప్పించ‌లేదు. ఆ విష‌యాన్ని మ‌రోమారు రుజువు చేసింది `మిఠాయి`. రుచి లేని మిఠాయి తింటే ఎలా ఉంటుందో, ఈ సినిమా చూసినా అలాంటి అనుభ‌వ‌మే ఎదుర‌వుతుంది.  Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.