రివ్యూ: మిస్ట‌ర్ మ‌జ్ను
రివ్యూ: మిస్ట‌ర్ మ‌జ్ను
న‌టీన‌టులు: అఖిల్ అక్కినేని, నిధి అగ‌ర్వాల్‌, ప్రియ‌ద‌ర్శి, నాగ‌బాబు, సుబ్బ‌రాజు, హైప‌ర్ ఆది, సితార‌, ప‌విత్ర లోకేష్‌, విద్యుల్లేక రామ‌న్ త‌దిత‌రులు
సాంకేతిక‌వ‌ర్గం: సంగీతం: త‌మన్‌, పాటలు: శ్రీమణి, ఛాయాగ్ర‌హ‌ణం: జార్జ్‌ సి. విలియమ్స్‌, కూర్పు: నవీన్‌ నూలి, క‌ళ‌: అవినాష్‌ కొల్లా, నృత్యాలు: శేఖర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి.
సంస్థ‌: శ‌్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌
విడుద‌ల‌: 25 జ‌న‌వ‌రి 2019


ప్రేమ‌క‌థ‌ల్లో ఒదిగిపోవ‌డంలో అక్కినేని కుటుంబ క‌థానాయ‌కుల‌కి ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మొద‌లుకొని నాగార్జున‌, నాగ‌చైత‌న్య... ఇలా అంద‌రూ ప్రేమ‌క‌థ‌లతో మెప్పించిన‌వాళ్లే. ఆ కుటుంబానికి చెందిన అఖిల్ కూడా త‌న వ‌య‌సుకు త‌గ్గ‌ట్టుగానే ప్రేమ‌క‌థ‌ల‌తో ప్ర‌యాణం చేస్తున్నాడు. ఆయ‌న మాస్ క‌థ‌తోనే ప్ర‌యాణం మొద‌లుపెట్టినా అది స‌రైన ఫ‌లితాన్నివ్వ‌లేదు. ఆ త‌ర్వాత ప్రేమ‌క‌థ‌తో `హ‌లో` చేసి ప‌రాజ‌యం ప్ర‌భావం నుంచి బ‌య‌ట‌కొచ్చేశాడు. మూడో చిత్రం కోసం మ‌రోసారి ప్రేమ‌క‌థ‌నే ఎంచుకొని `మిస్ట‌ర్ మ‌జ్ను` చేశాడు. మ‌రి ఆ చిత్రం ఎలా ఉందో తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే...


* క‌థ‌..
క‌నిపించిన అమ్మాయినంతా ప్రేమ‌లో దించేస్తుంటాడు విక్ర‌మ్ కృష్ణ అలియాస్ విక్కీ (అఖిల్ అక్కినేని). వాళ్ల‌తో షార్ట్‌టైమ్ రిలేష‌న్ కొన‌సాగిస్తూ స‌ర‌దా గ‌డుపుతుంటాడు. నిక్కీ (నిధి అగ‌ర్వాల్‌) మాత్రం త‌న జీవితంలోకి వ‌చ్చేవాడు శ్రీరాముడిలా ఉండాల‌ని క‌ల‌లు కంటూ ఉంటుంది. ఊహించ‌ని రీతిలో ఈ ఇద్ద‌రూ ప్రేమ పేరుతో ఒక్క‌ట‌వుతారు. మ‌రి భిన్న మ‌న‌స్త‌త్వాలున్న వాళ్ల ప్ర‌యాణం ఎంత‌వ‌ర‌కు సాగింది? విక్కీ అమ్మాయిల చుట్టూ తిరుగుతుంటాడ‌ని తెలిసినా నిక్కీ ఎలా ప్రేమించింది? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

* విశ్లేష‌ణ‌..
ప్రేమ‌క‌థ‌ల్లో సంఘ‌ర్ష‌ణ త‌ప్ప చెప్పుకోద‌గ్గ క‌థేమీ ఉండ‌దు. ఈ సినిమాకి కూడా అదే ఆధారం. భిన్న మ‌న‌స్తత్వాలున్న ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డ‌టం, ఆ త‌ర్వాత ఇద్ద‌రూ దూరం కావ‌డం... మ‌ళ్లీ ఆ రెండు మ‌న‌సులూ ప్రేమ కోసం ప‌రిత‌పించ‌డమే ఈ సినిమా. ఈ ప్ర‌యాణంలో బోలెడంత సంఘ‌ర్ష‌ణ‌తో పాటు, భావోద్వేగాలు కూడా బ‌లంగా పండే ఆస్కారం ఉంది. ద‌ర్శ‌కుడు కూడా ఆ విష‌యంపైనే దృష్టిపెట్టాడు కానీ... ఆశించిన మేజిక్ పండ‌లేదు. క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా సినిమాకి కావ‌ల్సిన హంగులు స‌మ‌కూర‌క‌పోవ‌డ‌మే అందుకు కార‌ణం. క‌థానాయ‌కుడి ప్లేబోయ్ పాత్ర‌, అత‌ని కుటుంబ నేప‌థ్యం, క‌థానాయిక‌తో క‌లిసి చేసే స‌ర‌దా ప‌నులు, ఆ త‌ర్వాత ఆమె ప్రేమ‌లో ప‌డ‌టం, ఆ వెంటనే దూరం కావ‌డం వంటి విష‌యాల‌తో ప్ర‌థ‌మార్థం ప‌ర్వాలేద‌నిపిస్తుంది. కానీ ద్వితీయార్థంలోనే చెప్ప‌డానికేమీ మిగ‌ల్లేదు. దాంతో స‌న్నివేశాల‌న్నీ సాగ‌దీత‌గా మారిపోయాయి. హైప‌ర్ ఆది, సుబ్బ‌రాజు, చిన్నారి అంత‌రంగాన్ని చెప్పే యానిమేష‌న్ పాత్ర చేసే సంద‌డి అక్క‌డ‌క్క‌డా న‌వ్వించ‌డం త‌ప్ప క‌థ ప‌రంగా ద్వితీయార్థంలో కొత్తద‌నం ఏమీ క‌నిపించ‌లేదు. దాంతో స‌న్నివేశాల‌న్నీ కూడా ప్రేక్ష‌కుడి ఊహ‌కు త‌గ్గ‌ట్టుగానే సాగిపోతుంటాయి. క‌థానాయ‌కుడి క్యారెక్ట‌రైజేష‌న్ బాగానే ఉన్నా... క‌థానాయిక పాత్రని తీర్చిదిద్దిన విధానంలో కూడా లోపాలు క‌నిపిస్తాయి. ముద్దు పెట్ట‌డానికి వెళ్లేస‌రికి క‌థానాయ‌కుడిని చెంప దెబ్బ కొట్ట‌డం మొద‌లుకొని... ప‌తాక స‌న్నివేశాల్లో ఆమె చెప్పే సంభాష‌ణ‌ల వ‌ర‌కు క‌థానాయిక పాత్ర న‌డుచుకొనే విధానం భిన్నంగా అనిపిస్తుంది. భావోద్వేగాలు కూడా స‌రిగ్గా పండ‌లేదు. `తొలిప్రేమ‌`తో పోలిస్తే క‌థానాయ‌కుడి పాత్రీక‌ర‌ణ‌, అక్క‌డ‌క్క‌డా సంభాష‌ణ‌లు మిన‌హా ర‌చ‌న ప‌రంగా వెంకీ అట్లూరి పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయారు. ప‌తాక స‌న్నివేశాలు కూడా సాదాసీదాగానే అనిపిస్తాయి.


* న‌టీన‌లులు.. సాంకేతిక‌త‌
అఖిల్ అక్కినేని ప్లేబోయ్‌గా ఆక‌ట్టుకున్నాడు. ఆ పాత్ర‌కి కావ‌ల్సినంత ఎన‌ర్జీని చూపించాడు. త‌న వ‌య‌సుకు త‌గ్గ పాత్ర కావ‌డం క‌లిసొచ్చింది. డ్యాన్సులు, ఫైట్లు ప‌రంగా కూడా మెప్పించాడు. భావోద్వేగాలు పండించే విష‌యంలో ఆయ‌న త‌ప్పులు బ‌య‌ట‌ప‌డుతుంటాయి. నిధి అగ‌ర్వాల్ పాత్ర‌కి చాలా ప్రాధాన్యం ఉంది. క‌థానాయ‌కుడితో స‌మానంగా తెర‌పై క‌నిపిస్తుంటుంది. ఆ పాత్ర‌కి త‌గ్గ‌ట్టుగానే ఆమె చ‌క్క‌గా న‌టించింది. ప్రియ‌ద‌ర్శి, సుబ్బ‌రాజ్‌, హైప‌ర్ ఆది త‌దిత‌రులు చేసిన కామెడీ సినిమాకి క‌లిసొచ్చింది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. జార్జ్ సి.విల‌య‌మ్స్ కెమెరా ప‌నిత‌నం, త‌మ‌న్ సంగీతం చిత్రానికి బ‌లాన్నిచ్చాయి. న‌వీన్ నూలి ఎడిటింగ్‌, అవినాష్ కళా వ‌భాగాల ప‌నితీరు కూడా మెప్పిస్తాయి. ద‌ర్శ‌కుడు మాట‌ల‌పై దృష్టిపెట్టినంత‌గా... క‌థ‌, క‌థ‌నాలు, సంఘ‌ర్ష‌ణ విష‌యంలో దృష్టిపెట్టుంటే ఈ సినిమా ఫ‌లితం మ‌రో స్థాయిలో ఉండేది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి.

* చివ‌రిగా..
అఖిల్ పాత్ర బాగుంది. ఆయ‌న న‌ట‌న‌లో ప‌రిణ‌తి క‌నిపిస్తుంది. వెంకీ అట్లూరి ర‌చ‌నలోనూ మెరుపులున్నాయి. అక్క‌డ‌క్క‌డా హాస్యం పండింది. ప్రేమ‌క‌థ‌ని కొత్త‌గా చెప్పాల‌న్న ప్ర‌య‌త్నం కూడా క‌నిపిస్తుంది. కానీ సినిమాకి ఆ హంగులు చాల‌లేదు. ముఖ్యంగా ద్వితీయార్థంలో కొత్త‌గా చెప్పిన విష‌యం కానీ, మ‌లుపులు కానీ లేక‌పోవ‌డంతో `మిస్ట‌ర్ మ‌జ్ను` స‌గ‌టు సినిమాగానే ముగుస్తుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.