రివ్యూ: న‌న్ను దోచుకుందువ‌టే
రివ్యూ: న‌న్ను దోచుకుందువ‌టే
నటీనటులు: సుధీర్ బాబు, నభా నటేశ్, నాజర్, తులసి, వేణు, రవి వర్మ, జీవా, వర్షిణి, సౌందర రాజన్, సుదర్శన్ తదితరులు.
సాంకేతిక వర్గం, ఛాయాగ్రహణం: సురేష్ రగుతు, సంగీతం: అజనీష్ బి లోకనాథ్, కళ: శ్రీకాంత్ రామిశెట్టి, కూర్పు: ఛోటా కె ప్రసాద్, నిర్మాత - సుధీర్ బాబు, దర్శకత్వం: ఆర్.ఎస్. నాయుడు
సంస్థ: సుధీర్ బాబు ప్రొడక్షన్స్
విడుదల: 21, సెప్టెంబర్ 2018

మ‌న క‌థానాయ‌కులు నిర్మాత‌లుగా మార‌డం కొత్తేమీ కాదు. చాలామంది క‌థానాయ‌కుల‌కి సొంత నిర్మాణ సంస్థ‌లు ఉన్నాయి. తాజాగా ఆ జాబితాలో సుధీర్‌బాబు కూడా చేరారు. ఆయ‌న తొలి ప్ర‌య‌త్నంగా ఆర్‌.ఎస్‌.నాయుడు అనే ఓ కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేస్తూ `న‌న్ను దోచుకుందువ‌టే` తీశారు. క‌థానాయ‌కుడిగా `స‌మ్మోహ‌నం`తో మంచి విజ‌యాన్ని అందుకున్న ఆయ‌న, నిర్మాత‌గా కూడా కొత్త బాధ్య‌త‌ల్ని భుజాన వేసుకొని చేసిన ఈ సినిమాతో ఏ మేర‌కు ఆక‌ట్టుకున్నాడో తెలుసుకొందాం పదండి...


* క‌థ‌
ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో మేనేజ‌ర్ కార్తీక్ (సుధీర్‌బాబు). ప్ర‌మోష‌న్‌పై అమెరికా వెళ్లాల‌నేది ఆయ‌న క‌ల‌. అందుకోసం చాలా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప‌నిచేస్తుంటాడు. త‌న ఆఫీసులో ప‌నిచేసేవాళ్లు కూడా అలాగే ఉండాల‌నుకుంటాడు. ఏమాత్రం క్ర‌మ‌శిక్ష‌ణ లేక‌పోయినా ఆఫీసు నుంచి బ‌య‌టికి పంపుతుంటాడు. అలాంటి కార్తీక్ త‌న పెళ్లి విష‌యంలో ఇంట్లో చెప్పిన ఓ అబ‌ద్ధంవ‌ల్ల షార్ట్‌ఫిల్మ్‌లో న‌టించే ఇంజినీరింగ్ అమ్మాయి మేఘ‌న (న‌భా న‌టేష్‌)తో క‌లిసి ప్ర‌యాణం చేయాల్సి వ‌స్తుంది. కేవ‌లం న‌టించ‌డానికే జీవితంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ కార్తీక్ మ‌న‌సుకి మేఘ‌న ద‌గ్గ‌ర‌వుతుంది. మేఘ‌న కూడా కార్తీక్‌ని ఇష్ట‌ప‌డుతుంది. ఇంత‌లోనే త‌న ల‌క్ష్యం గుర్తు చేసుకొన్న కార్తీక్... మేఘ‌న‌ని దూరం పెట్టే ప్ర‌యత్నం చేస్తాడు. మ‌రి ఈ ఇద్ద‌రూ ఒక్క‌ట‌య్యారా లేదా? కార్తీక్ పెళ్లి గురించి త‌న ఇంట్లో అబ‌ద్ధం చెప్పాల్సిన అవ‌స‌రం ఎందుకొచ్చిందనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


* విశ్లేష‌ణ‌
కొత్త క‌థ‌ల కంటే కూడా, కొత్త స‌న్నివేశాల‌పై పట్టు ప్ర‌ద‌ర్శిస్తోంది యువ‌త‌రం. ద‌ర్శ‌కుడు ఆర్‌.ఎస్‌.నాయుడు కూడా అదే ప్ర‌య‌త్నం చేశాడు. పాత క‌థ‌కి, కొత్త నేప‌థ్యాన్ని జోడించి వినోదం పండించే ప్ర‌య‌త్నం చేసి, విజ‌య‌వంత‌మ‌య్యాడు. ప్రేమ‌, భావోద్వేగాల‌తో కూడిన ఓ సున్నిత‌మైన క‌థ ఇది. కార్తీక్ ఆఫీసు వాతావ‌ర‌ణాన్ని, ఆయ‌న ప‌ని విష‌యంలో ఎంత క్ర‌మ‌శిక్ష‌ణ‌గా ఉంటాడ‌నే విష‌యాన్ని చూపిస్తూ ఆరంభం నుంచే హాస్యం పండించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక క‌థానాయిక ఎంట్రీ ఇచ్చాక స‌న్నివేశాల్లో మ‌రింత వేగం పెరుగుతుంది. ఆమె షార్ట్‌ఫిల్మ్‌ల‌తో చేసే హంగామా, వాటిలోకి క‌థానాయ‌కుడిని భాగం చేసే వైనం ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్విస్తాయి. ఆ త‌ర్వాత నుంచి క‌థ‌లో కాస్త వేగం త‌గ్గిన‌ట్టనిపిస్తుంది. ద్వితీయార్థంలో మంచి డ్రామాతో పాటు, హాస్యానికీ చోటున్న‌ప్ప‌టికీ ద‌ర్శ‌కుడు ఆ దిశ‌గా దృష్టిపెట్ట‌లేక‌పోయారు. భావోద్వేగాల‌పైనే ఎక్కువ‌గా ఆధార‌ప‌డ్డారు. ప‌తాక స‌న్నివేశాల‌కి ముందు తండ్రీ కొడుకుల మ‌ధ్య పండిన భావోద్వేగాలు సినిమాకి కీల‌కం. ప‌తాక స‌న్నివేశాలు మ‌ళ్లీ ఊహ‌కు త‌గ్గ‌ట్టుగానే సాగుతాయి. క‌థానాయిక పాత్ర‌ని తీర్చిదిద్దిన విధానంపై ద‌ర్శ‌కుడు మ‌రికాస్త దృష్టిపెట్టుంటే బాగుండేది. నాయ‌కానాయిక‌ల మ‌ధ్య ఒక‌రిపై ఒక‌రికి ప్రేమ పుట్టే స‌న్నివేశాల్ని కూడా మ‌రింత బ‌లంగా చూపించుంటే ఫ‌లితం మ‌రోలా ఉండేది.* న‌టీన‌టులు.. సాంకేతిక‌త‌
సుధీర్‌బాబు మరోసారి త‌న పాత్ర‌లో ఒదిగిపోయారు. సీరియ‌స్‌గా క‌నిపిస్తూనే నవ్వించే ప్ర‌య‌త్నం చేశారు. భావోద్వేగాలు కూడా పండించారు. క‌థ ఎంపిక‌లో కూడా నిర్మాత‌గానూ, క‌థానాయ‌కుడిగా ఆయ‌న అభిరుచిని స్ప‌ష్టంగా చాటి చెప్పారు. న‌భా న‌టేష్ ప‌క్కింటి అమ్మాయిగా క‌నిపించింది. అభిన‌యం ప‌రంగా కూడా ప‌ర్వాలేద‌నిపిస్తుంది. నాజ‌ర్‌, తుల‌సి త‌దిత‌రులు భావోద్వేగాలు పండించే ప్ర‌య‌త్నం చేశారు. వైవాహ‌ర్ష‌, సుద‌ర్శ‌న్‌, గిరి, వేణు త‌దిత‌రులు న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. సుధీర్‌బాబు క‌థ, సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా నాణ్యంగా చిత్రాన్ని నిర్మించారు. సురేష్ రగుతు ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. అజ‌నీష్ లోక్‌నాథ్ నేప‌థ్య సంగీతం ప‌రంగా ఆక‌ట్ట‌కున్నారు. పాటలు మాత్రం అంత‌గా కుద‌ర‌లేదు. ఎడిటింగ్ ప‌రంగా మ‌రికాస్త‌దృష్టి పెట్టాల్సింది. ద‌ర్శ‌కుడు ఆర్‌.ఎస్‌.నాయుడు... స్వ‌త‌హాగా త‌ను చూసిన షార్ట్‌ఫిల్మ్ వాతావ‌ర‌ణం నేప‌థ్యంలోచ‌క్క‌టి స‌న్నివేశాల్ని రాసుకొన్నాడు. ద‌ర్శకుడిగా ఆయ‌న‌లో స్ప‌ష్ట‌త క‌నిపించింది. హాస్యంపైనా, భావోద్వేగాల పైనా త‌న ప‌ట్టుని చాటి చెప్పారు.

* చివ‌రిగా..
ఒక సున్నిత‌మైన క‌థ‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్ర‌థ‌మార్థం అంతా న‌వ్విస్తూ... ద్వితీయార్థంలో అక్క‌డ‌క్క‌డా హృద‌యాల్ని మెలిపెడుతూ సాగుతుంది. సాగ‌దీత‌గా అనిపించే కొన్ని స‌న్నివేశాల్ని మిన‌హాయిస్తే, మంచి కాలక్షేపాన్నిచ్చే చిత్ర‌మిది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.