రివ్యూ: ఎన్జీకే
నటీనటులు: సూర్య, సాయిపల్లవి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, దేవరాజ్‌, బాలా సింగ్‌ తదితరులు
సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా
సినిమాటోగ్రఫీ: శివకుమార్‌ విజయన్‌
కూర్పు: ప్రవీణ్‌
నిర్మాణ సంస్థ: డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సెల్వ రాఘవన్‌
విడుదల: 31-05-2019

సూర్య - శ్రీరాఘ‌వ క‌ల‌యిక ఆస‌క్తిని రేకెత్తించింది. ఈ ఇద్ద‌రూ క‌లిసి రాజ‌కీయ నేప‌థ్యంలో సినిమా చేస్తున్నార‌న‌గానే అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. ద‌ర్శ‌కుల్లో శ్రీరాఘ‌వకి ప్ర‌త్యేక‌మైన శైలి ఉంది. ప్రేక్ష‌కుల్ని అబ్బుర‌ప‌రిచేలా ఆయ‌న సినిమాల్ని రూపొందిస్తుంటారు. సూర్య కూడా ఒక మామూలు క‌థ‌ని సైతం త‌న న‌ట‌న‌తో మ‌రో స్థాయికి తీసుకెళుతుంటాడు. అలా ఈ ఇద్దరూ కూడా `ఎన్.జి.కె` గురించి మ‌రింత ప్ర‌త్యేకంగా ఎదురు చూసేలా చేశారు. మ‌రి సినిమా ఎలా ఉంది? సూర్య‌, శ్రీరాఘ‌వ ఎలాంటి మేజిక్‌ని ప్ర‌ద‌ర్శించారు? తెలుసుకుందా పదండి...


కథ‌:
నంద గోపాల కృష్ణ అలియాస్ ఎన్‌.జి.కె (సూర్య‌) శృంగ‌వ‌ర‌పు కోట‌లో సేంద్రీయ వ్య‌వ‌సాయం చేస్తుంటాడు. ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేసినా.. కార్పొరేట్ సంస్థ‌లో మంచి ఉద్యోగం వ‌చ్చినా ఆ జీవితాన్ని వ‌దిలిపెట్టి ప‌ల్లెలో త‌ల్లిదండ్రులు, భార్య (గీతాకుమారి)తో క‌లిసి జీవిస్తుంటాడు. ఎవ‌రికి ఏ స‌హాయం అవ‌స‌ర‌మైనా తానున్నానంటూ ముందుండే ఎన్‌.జి.కె ఊళ్లో మంచి పేరు సంపాదిస్తాడు. అయితే అత‌ని సేంద్రీయ వ్య‌వ‌సాయం వ‌ల్ల స్థానిక ఎమ్మెల్యే త‌న ఆదాయానికి గండి ప‌డుతోంద‌ని, దాడి చేయిస్తాడు. బ‌ల‌వంతంగా ఎన్‌.జి.కెని, అత‌ని మ‌నుషుల్ని పార్టీలోకి చేర్పించుకుంటాడు. అంత‌టితో వ‌దిలిపెట్ట‌కుండా ఎన్‌.జి.కెతో వ్య‌క్తిగ‌త ప‌నులు చేయించుకుంటూ క‌క్ష తీర్చుకోవ‌డం మొద‌లుపెడ‌తాడు. బాగా చ‌దువుకున్న ఎన్‌.జి.కె ఎమ్మెల్యేకి స‌హాయకుడిగా ప‌నిచేస్తూనే, రాజ‌కీయంగా తానూ ఎద‌గాల‌నుకుంటాడు? అందుకోసం ఏం చేశాడు? అత‌ని ఎత్తుగ‌డ‌లు రాజ‌కీయ చ‌ద‌రంగంలో విజేత‌గా నిలిపాయా? ఎన్‌.జి.కె ప్ర‌యాణంలో వ‌నిత (ర‌కుల్ ప్రీత్ సింగ్‌) పాత్ర ఏమిటి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


* విశ్లేష‌ణ‌:
రాజ‌కీయ నేప‌థ్యంతో కూడిన స‌గ‌టు చిత్రాల్లో ఉండే ముడిస‌రుకే ఇందులో ఉంది. ఒక అనామ‌కుడు రాజ‌కీయాల్లో ఎద‌గ‌డమే ఈ చిత్ర క‌థ. అయితే ఇలాంటి క‌థ‌ల‌కి డ్రామా అవ‌స‌రం. ఎత్తులు పైఎత్తులు ప్రేక్ష‌కుడిని సీటు అంచున కూర్చోబెట్టేలా ఉండాలి. అప్పుడే ర‌క్తిక‌డ‌తాయి. కానీ ద‌ర్శకుడు ప‌ట్టు త‌ప్పిపోయాడు. అస‌లు ఈ చిత్రంతో తాను ఏం చెప్ప‌ద‌ల‌చుకొన్నాడో అనేలా సాగుతుంటాయి స‌న్నివేశాలు. క‌థ‌నంతో మేజిక్ చేయ‌గ‌ల దిట్ట శ్రీరాఘ‌వ‌. కానీ ఇక్క‌డ మాత్రం ఆ మేజిక్ ఏ ఒక్క స‌న్నివేశంలోనూ క‌నిపించ‌దు. ప్రేక్ష‌కుడికి పాత్ర‌ల్ని ప‌రిచ‌యం చేయ‌డానికే బోలెడంత స‌మ‌యం తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు. ఆ త‌ర్వాతైనా వేగం పెరిగిందా అంటే అదేం లేదు. ఒక మామూలు క‌థ‌ని, చాలా సాదాసీదాగా, నీరసంగా మొద‌లుపెట్టిన‌ట్టు అనిపిస్తుంది. నియోజ‌క‌వ‌ర్గ స్థాయి రాజ‌కీయాలు ఎలా ఉంటాయో చూపెట్టిన విధానం కాస్త ఆస‌క్తి రేకెత్తించిన‌ప్ప‌టికీ... ఆ త‌ర్వాత మ‌ళ్లీ మామూలే. ద్వితీయార్థంలోనైనా ఏదో ఒక బ‌ల‌మైన అంశాన్ని స్పృశించక‌పోతారా అని ఎదురు చూసినా అక్క‌డా నిరాశే. క‌థ ప‌రంగానూ, క‌థ‌నం ప‌రంగానూ ద‌ర్శ‌కుడు తేలిపోయాడు. దాంతో ద్వితీయార్థం మొత్తం సాగ‌దీత‌గా అనిపిస్తుంది. తెర‌పై క‌నిపించే స‌న్నివేశాల‌కి మ‌ధ్య‌లో లింక్ లేక‌పోవ‌డం.. అస‌లు లాజిక్‌ని ప‌క్క‌న‌పెట్టి స‌న్నివేశాల్ని అల్లుకోవ‌డంతో సినిమా ఏ ద‌శ‌లోనూ సాఫీగా సాగుతున్న‌ట్టు అనిపించదు. పెర్‌ఫ్యూమ్ వాస‌న వ‌స్తోందంటూ భార్య అనుమాన ప‌డే స‌న్నివేశాలు... ఎమ్మెల్యే కూడా కానీ ఓ యువ‌కుడు పార్టీ పెట్టి మ‌నిద్ద‌రినీ దెబ్బ తీస్తాడేమో అని ముఖ్యమంత్రి, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు మాట్లాడుకోవ‌డం... అత‌నిపై క‌క్ష క‌ట్టి చంపాల‌ని ప్ర‌య‌త్నించ‌డం... అది చేత‌కాక‌పోవ‌డంతో త‌ల్లిదండ్రుల్ని చంప‌డం లాంటి స‌న్నివేశాల‌న్నీ కూడా క‌థ‌కి ఏమాత్రం అత‌క‌లేద‌నిపిస్తుంది. చెప్పాల‌నుకొన్న విష‌యాన్ని కూడా, సూటిగా ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యాడు.


న‌టీన‌టులు... సాంకేతిక‌త‌:
సూర్య న‌ట‌నే చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ఆయ‌న ఎన్‌.జి.కె పాత్ర‌లో ఒదిగిపోయాడు. నేర్చుకుంటాను స‌ర్‌... అంటూ రాజ‌కీయాల్లోకి కొత్త‌గా అడుగుపెట్టిన ఓ యువ‌కుడిగా చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించాడు. భార్య పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి న‌టించింది. ఆమె పాత్ర‌లో స‌హ‌జ‌త్వం ఆక‌ట్టుకున్నా... ఆ పాత్ర‌ని తీర్చిదిద్దిన విధానమే మెప్పించ‌దు. ర‌కుల్‌ప్రీత్ సింగ్ పాత్ర ప‌రిధి త‌క్కువే. కానీ ఆమె ఉన్నంత‌లో చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించింది. ఎమ్మెల్యేగా న‌టించిన ఇళ‌వ‌ర‌సు మెప్పిస్తాడు. ఇక మిగిలిన పాత్ర‌ల గురించి చెప్పుకోవ‌ల్సిందేమీ లేదు. సాంకేతికంగా సినిమా బాగుంది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం, శివ‌కుమార్ విజ‌య‌న్ కెమెరా ప‌నిత‌నం సినిమాకి ప్రధాన బ‌లాలుగా నిలిచాయి. మామూలు క‌థ‌ల్ని సైతం త‌నదైన క‌థ‌నంతో క‌ట్టిప‌డేసే శ్రీరాఘ‌వ ప‌నిత‌నం ఈ సారి తేలిపోయింది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి.


చివరిగా:
నేనే రాజు నేనే మంత్రి, భ‌ర‌త్ అనే నేను, నోటా... ఇలా రాజ‌కీయం నేప‌థ్యంతో కూడిన చిత్రాల్ని త‌ర‌చుగా చూస్తున్నారు తెలుగు ప్రేక్ష‌కులు. ఈ క‌థ‌ల‌న్నింటికీ మూలం డ్రామానే. రాజ‌కీయం ఎందులోనైతే ర‌క్తిక‌ట్టిందో, ఆ సినిమాలు విజ‌య‌వంత‌మ‌య్యాయి. `ఎన్‌.జి.కె`లో కూడా ఎత్తులు, పైఎత్తులతో చాలా డ్రామానే న‌డుస్తుంటుంది. కానీ అవి ఎందుకనే కారణాన్ని మాత్రం బ‌లంగా చెప్ప‌లేక‌పోయారు. దాంతో స‌న్నివేశాల‌న్నీ కూడా ఒక ల‌క్ష్యం లేన‌ట్టుగా ముందుకు సాగుతూపోతాయి.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.