రివ్యూ: నోటా
రివ్యూ: నోటా
సినిమా పేరు: నోటా
న‌టీన‌టులు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మెహ్రీన్, స‌త్య‌రాజ్, నాజ‌ర్, సంచ‌న న‌ట‌రాజ‌న్‌, య‌షికా ఆనంద్‌, అన‌స్తాసియా, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు
క‌థ‌: షాన్ క‌రుప్పుసామి
సంగీతం: శ్యామ్ సిఎస్‌
ఛాయాగ్ర‌హ‌ణం: శంతన్‌ కృష్ణ‌ణ్ ర‌విచంద్ర‌న్
కూర్పు: రేమాండ్ డెరిక్ క్రాస్టా
నిర్మాణం: కేఈ జ్ఞాన‌వేల్ రాజా
ద‌ర్శ‌కత్వం: ఆనంద్ శంక‌ర్
సంస్థ‌: స‌్టూడియో గ్రీన్
విడుద‌ల‌: 05-10-2018

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థ‌ల ఎంపిక‌లో వైవిధ్యం ప్ర‌ద‌ర్శిస్తుంటారు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న ఆయ‌న తొలి అడుగుల్లోనే రాజ‌కీయ ప్ర‌ధాన‌మైన క‌థ‌తో `నోటా` చేయ‌డంతో అంద‌రిలోనూ ఆస‌క్తి ఏర్ప‌డింది. ఈ చిత్రంతోనే విజ‌య్ త‌మిళ‌నాట అడుగుపెట్టారు. యువ‌త‌రంలో మంచి క్రేజ్ సంపాదించుకొన్న విజ‌య్ దేవ‌ర‌కొండ యువ ముఖ్య‌మంత్రి పాత్ర‌లో ఎలా ఒదిగిపోయారో... నోటా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకొందాం ప‌దండి...

* క‌థ
వ‌రుణ్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) ఓ ముఖ్య‌మంత్రి కొడుకు. కానీ ఎక్క‌డా త‌న తండ్రి పేరు చెప్పుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌డు. ముఖ్య‌మంత్రి వాసుదేవ్ (నాజ‌ర్‌) ఓ కేసు విష‌యంలో విచార‌ణ‌ని ఎదుర్కోవ‌ల్సి వ‌స్తుంది. కోర్టు తీర్పు వెలువ‌డేంత‌వ‌ర‌కు త‌న త‌న‌యుడైన వ‌రుణ్‌ని ముఖ్య‌మంత్రిని చేయాల‌నుకుంటాడు వాసుదేవ్‌. అలా రాత్రికి రాత్రే సీఎం అవుతాడు వ‌రుణ్‌. అయితే కోర్టు తీర్పు వాసుదేవ్‌కి వ్య‌తిరేకంగా రావ‌డం... జైలుకి వెళ్ల‌డం... ఆ త‌ర్వాత కూడా ఆయ‌న‌పై బాంబు దాడి జ‌ర‌గ‌డంతో వ‌రుణ్ పూర్తిస్థాయిలో సీఎంగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాల్సి వ‌స్తుంది. రాజ‌కీయాలంటే ఏమాత్రం అవ‌గాహ‌న లేని వ‌రుణ్‌కి వ‌రుస‌గా స‌వాళ్లు ఎదురవుతున్న‌ప్పుడు ఏం చేశాడు? ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకొన్నాడు? వాసుదేవ్‌పై బాంబు దాడి జ‌ర‌గ‌డానికి కార‌ణం ఎవ‌రు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

* విశ్లేష‌ణ‌
రాజ‌కీయం ప్ర‌ధాన‌మైన క‌థ‌ల్లో కావ‌ల్సినంత డ్రామాకి ఆస్కారం ఉంటుంది. అదొక ఆస‌క్తిక‌ర‌మైన ఆట‌. సాగుతున్న‌కొద్దీ క‌థ ర‌క్తిక‌డుతుంటుంది. ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త వినోదం పంచుతుంది. అయితే అందుకు త‌గ్గ‌ట్టుగా స‌న్నివేశాలు రాసుకోవాలి, అవి ప‌క్కాగా తెర‌పైకొచ్చేలా జాగ్ర‌త్తలు తీసుకోవాలి. ఆ విష‌యంలో `నోటా` కొంత మేరే ప్ర‌భావం చూపించింది. తొలి స‌గ‌భాగం వ‌ర‌కు పండిన డ్రామా మాత్ర‌మే ఆక‌ట్టుకుంటుంది. ద్వితీయార్థంలో క‌థ‌, క‌థ‌నాలు చ‌ప్ప‌గా సాగుతాయి. ఒక సాధార‌ణ యువ‌కుడు అనుకోకుండా ముఖ్య‌మంత్రి కావడం... ఆ త‌ర్వాత స‌వాళ్లు ఎదుర‌వ‌డం వంటి విష‌యాలతో ఆరంభం నుంచే క‌థ ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ద‌ర్శ‌కుడు నేరుగా ప్రేక్ష‌కుల్ని క‌థ‌లోకి తీసుకెళ్లాడు. ఆ త‌ర్వాత వాసుదేవ్‌కి వ్య‌తిరేకంగా కోర్టు తీర్పు వెలువ‌డ‌టం... అల్ల‌ర్లు, వాటిని అదుపు చేసేందుకు యువ ముఖ్యమంత్రి తీసుకొన్న నిర్ణ‌యాలు ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేస్తాయి. ప్ర‌థ‌మార్థం వ‌ర‌కు చాలా చోట్ల `భ‌ర‌త్ అనే నేను` సినిమాని గుర్తు చేస్తుంది. అయినా విజ‌య్ దేవ‌ర‌కొండ మార్క్ న‌ట‌న‌, క‌థా నేప‌థ్యం ఓ కొత్త సినిమాని చూస్తున్న అనుభూతికి గురిచేస్తాయి. అయితే ఆ జోరు ద్వితీయార్థంలో కొన‌సాగ‌క‌పోవ‌డం సినిమాకి మైన‌స్‌గా మారింది. త‌న తండ్రి విదేశాల్లో దాచిన డ‌బ్బు గుట్టు, స్వామీజీ చేసిన కుట్ర, ప్ర‌తిఘ‌ట‌న నేప‌థ్యంలో బ‌ల‌మైన స‌న్నివేశాల్ని తీర్చిదిద్దే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ ద‌ర్శ‌కుడు అటువైపు దృష్టిపెట్ట‌లేదు. సీరియ‌స్‌గా సాగే ఈ త‌ర‌హా క‌థ‌ల్లో వాణ‌జ్యాంశాల కోసం ప్ర‌య‌త్నించ‌కూడ‌దు. ఆ నియ‌మాన్ని ద‌ర్శ‌కుడు పాటించిన‌ప్ప‌టికీ క‌థ‌లో మాత్రం సీరియ‌స్ నెస్ క‌నిపించ‌లేదు. త‌మిళ‌నాట రాజ‌కీయ పరిస్థితుల్ని ప్ర‌తిబింబిస్తూ క‌థ సాగుతుంది కాబ‌ట్టి త‌మిళ ప్రేక్ష‌కులు ఈ సినిమాకి మ‌రింత క‌నెక్ట్ అవుతారు.


* న‌టీన‌టులు...సాంకేతిక‌త‌
విజ‌య్ దేవ‌రకొండ యువ ముఖ్య‌మంత్రి పాత్ర‌లో ఒదిగిపోయాడు. మంచి భావోద్వేగాలు ప‌లికించారు. ఆయ‌న న‌ట‌నే చిత్రానికి బ‌లాన్నిచ్చింది. వాస్త‌విక‌త‌తో కూడిన ఈక‌థ‌లో అదే త‌ర‌హాలో త‌న పాత్ర‌ని పండించే ప్ర‌య‌త్నం చేశారు. మెహ‌రీన్ పాత్ర‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. అతిథి పాత్ర త‌ర‌హాలో అలా క‌నిపించి ఇలా మాయ‌మ‌వుతుంది. యువ ముఖ్య‌మంత్రిని న‌డిపించే మ‌హేంద్ర పాత్ర‌లో స‌త్య‌రాజ్ ఒదిగిపోయారు. వ్య‌తిరేక ఛాయ‌ల‌తో కూడిన, రాజ‌కీయ నాయ‌కుడు వాసుదేవ్ పాత్ర‌లో నాజ‌ర్ చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కురాలి వార‌సురాలిగా సంచ‌న న‌ట‌రాజ‌న్, క‌థానాయ‌కుడి స్నేహితుడిగా ప్రియ‌ద‌ర్శి, వాసుదేవ్ అనుచ‌రుడిగా ఎమ్‌.ఎస్‌.భాస్క‌ర్ వారి వారి పాత్ర‌ల‌కి న్యాయం చేశారు. కెమెరా ప‌నిత‌నం, సంగీతం ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ఆనంద్ శంక‌ర్ ప‌నితీరు ప్ర‌థ‌మార్థం వ‌ర‌కు మెచ్చుకునేలా ఉంది. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి.

* చివ‌రిగా...
విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న‌తో ప్ర‌థ‌మార్థం వ‌ర‌కు బాగుంద‌నిపించే స‌గ‌టు రాజ‌కీయ క‌థ ఇది. విజ‌య్ లాంటి ఓ యువ న‌టుడు ముఖ్యమంత్రిగా క‌నిపించ‌డం త‌ప్ప‌... సినిమాలో కొత్త‌గా ప్రేక్ష‌కుల్ని అబ్బుర‌ప‌రిచే విష‌యాలేమీ లేవు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.