రివ్యూ: యన్.టి.ఆర్‌ -కథానాయకుడు

చిత్రం: ఎన్టీఆర్‌-కథానాయకుడు
నటీనటులు: బాలకృష్ణ, విద్యాబాలన్‌, రానా, సుమంత్‌, భరత్‌రెడ్డి, దగ్గుబాటి రాజా వెన్నెల కిషోర్‌, పూనమ్‌ బాజ్వా, మంజిమా మోహన్‌, నరేష్‌, మురళీశర్మ, క్రిష్‌, రవికిషన్‌, శుభలేఖ సుధాకర్‌, రవిప్రకాష్‌, చంద్ర సిద్ధార్థ, భానుచందర్‌, ప్రకాష్‌రాజ్‌, కె.ప్రకాష్‌, ఎన్‌.శంకర్‌, దేవి ప్రసాద్‌ తదితరులు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ వీఎస్‌
ఎడిటింగ్‌: అర్రం రామకృష్ణ
సంభాషణలు: బుర్రా సాయిమాధవ్‌
నిర్మాత: నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
సంస్థ: ఎన్‌బీకే ఫిల్స్మ్‌, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా
విడుదల తేదీ: 09-01-2019


ఎన్టీఆర్ అంటేనే ఓ చ‌రిత్ర‌. న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా ఆయ‌న తెలుగు ప్ర‌జ‌ల‌పై చెరిగిపోని ముద్ర వేశారు. ప్ర‌తి తెలుగువాడి జీవితంతోనూ ముడిప‌డిన వ్య‌క్తిగా చ‌రిత్ర‌కెక్కారు. తొలి భార‌తీయ సూప‌ర్‌స్టార్‌గా గుర్తింపు పొంది... తెలుగువారి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌గా నిలిచిన ఆయ‌న చ‌రిత్ర సినిమాగా తెర‌కెక్కింది. ఈ చిత్రానికి కొబ్బ‌రికాయ కొట్టిన‌ప్ప‌ట్నుంచే అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. తెలుగులోనే తెర‌కెక్కినా పొరుగు భాష‌లు కూడా ఈ చిత్రం గురించి ఆస‌క్తిక‌రంగా ఎదురు చూశాయి. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తెర‌కెక్కిన మ‌రో ప్రతిష్ఠాత్మ‌క‌మైన చిత్ర‌మిది. ఎన్టీఆర్ పాత్ర‌లో ఆయ‌న త‌న‌యుడు బాల‌కృష్ణ న‌టించ‌డంతో పాటు... ఈ చిత్రం కోసం నిర్మాత‌గా కూడా మారారు. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకొందాం...


క‌థేంటంటే:

ఎన్టీఆర్ జీవితం అంద‌రికీ తెలిసిందే. తెలుగువాళ్ల‌కి ఆయ‌న గురించి తెలుసుకోవ‌డం జీవితంలో ఓ భాగంగా జ‌రుగుతుంటుంద‌ని చెబుతుంటారు. అది నిజం కూడా. అయితే భావిత‌రాల‌కి కూడా ఎన్టీఆర్ గురించి తెలిసేలా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఎన్టీఆర్ అంటే వెండితెర వేల్పు, ప్ర‌జ‌ల క‌ష్టాల్ని చూసి చ‌లించిన మ‌హానాయ‌కుడు. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే ఆయ‌న అస‌లు క‌థానాయ‌కుడు ఎందుకు కావాల‌నుకొన్నారు? అంద‌రూ ఆయ‌న్ని తెర‌పై చూసి దేవుడితో స‌మానంగా చూస్తున్న త‌రుణంలో ఆయ‌న ఆ సినిమా రంగాన్ని వ‌దిలిపెట్టి ప్ర‌జా జీవితంలోకి రావాల‌ని ఎందుకనుకొన్నారు? ఆయ‌న క‌థానాయ‌కుడిగా ఎదిగిన తీరు ఎలాంటిది? ఆ ప్ర‌యాణంలో ఎలాంటి క‌ష్ట‌న‌ష్టాల్ని ఎదుర్కొన్నారు? కుటుంబం నుంచి ఎలాంటి స‌హ‌కారం అందింది? ఆయ‌న నాయ‌కుడిగా ప్ర‌జ‌లమ‌ధ్య‌కి ఎలా వ‌చ్చారు? తదిత‌ర విష‌యాలు తెలియాలన్నింటినీ ఈ చిత్రంలో చూపించారు.


ఎలా ఉందంటే:

ఎన్టీఆర్ జీవితం ప్ర‌త్యేక‌మైన‌ది. ఆయ‌న ప్ర‌యాణంలో ఎన్నో మ‌లుపులు, మ‌రెంతో నాట‌కీయ ప‌రిణామాలు. వాట‌న్నింటినీ ఎంతో స‌హ‌జంగా తెర‌కెక్కించి ఎంతో మంది ఆరాధ్య‌దైవంలా భావించే ఎన్టీఆర్ జీవితాన్ని క‌ళ్ల‌కు క‌ట్టారు క్రిష్‌. ఎన్టీఆర్ అంటే క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు మాత్ర‌మే కాదు. అంత‌కుమించి అని ఈ చిత్రం చాటి చెబుతుంది. ఆయ‌న సాహ‌సం, ఆయ‌న నిజాయ‌తీ, కుటుంబానికి... సాటి మ‌నుషుల‌కి ప్రాధాన్య‌మిచ్చిన తీరుని అద్భుతంగా తెర‌పై చూపించారు ద‌ర్శ‌కుడు. ఆద్యంతం భావోద్వేగ‌భ‌రితంగా సాగుతుంది చిత్రం. క‌థ ఎన్టీఆర్ అర్థాంగి బ‌స‌వ‌తార‌కం కోణంలోనే సాగుతుంది. ఎన్టీఆర్ స‌బ్‌రిజిస్ట్రార్ కార్యాల‌యంలో ఉద్యోగంలో చేర‌డం, అక్క‌డ అవినీతిని జీర్ణించుకోలేక సినిమా రంగంలోకి అడుగుపెడ‌తారు. మ‌ద్రాస్‌కి వెళ్లాక అక్క‌డ ప‌డిన సినిమా క‌ష్టాల త‌ర్వాత `మ‌న‌దేశం`, `ప‌ల్లెటూరిపిల్ల` చిత్రాల‌తో క‌థానాయ‌కుడిగా ఎద‌గ‌డం నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. ఎన్టీఆర్‌కి స్టార్‌డ‌మ్‌ని తీసుకొచ్చిన `పాతాళ‌భైర‌వి` సినిమా నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాల త‌ర్వాత సినిమా గ‌మ‌న‌మే మారిపోతుంది. ప్ర‌తి ఐదు నిమిషాల‌కోసారి ఎన్టీఆర్ పోషించిన పౌరాణిక, జాన‌ప‌ద పాత్ర‌లు... వాటి విష‌యంలో ఎన్టీఆర్ చేసిన సాహ‌సాల్ని చూపించారు. అవన్నీ కూడా క‌ళ్లు చెమ్మ‌గిల్లేలా చేస్తాయి. మ‌రోప‌క్క ఎన్టీఆర్‌, బ‌స‌వ‌తార‌కం మ‌ధ్య అన్యోన్య దాంప‌త్యం... ఎన్టీఆర్ - ఏఎన్నార్‌ల మ‌ధ్య సోద‌ర‌, మైత్రీ బంధం నేప‌థ్యం కూడా హృద‌యాల్ని హ‌త్తుకుంటుంది. కృష్ణుడి పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపించే స‌న్నివేశాలు... సీతారామ క‌ల్యాణం కోసం ఆయ‌న తీసుకొన్న నిర్ణ‌యం... రావ‌ణుడి పాత్ర కోసం ఆయ‌న చేసిన సాహ‌సం... త‌న‌యుడు ఇక లేడ‌ని తెలిసినా నిర్మాత న‌ష్ట‌పోకూడ‌ద‌ని న‌టించ‌డం... ఆ బాధ మ‌రిచిపోవాల‌ని రోజూ మూడు షిఫ్టుల్లో సినిమాలు చేయాల‌ని నిర్ణ‌యించ‌డం వంటి స‌న్నివేశాలు రోమాలు నిక్క‌బొడుచుకొనేలా చేస్తాయి. ఇక ద్వితీయార్థంలో భావోద్వేగాలు మ‌రింత బ‌లంగా పండాయి. యువ క‌థానాయ‌కులొచ్చినా ఆయ‌న ప్రేక్ష‌కుల అభిరుచుల‌కి త‌గ్గ‌ట్టుగా సినిమాలు చేయ‌డం, అందుకోసం ఆయ‌న చేసిన సాహ‌సాలు, క‌థ‌ల ఎంపిక‌లో ఆయ‌న ప్ర‌ద‌ర్శించిన చాతుర్యం, స‌మాజంలో జ‌రిగే సంఘ‌ట‌న‌ల్ని తెర‌పై చూపించి ప్రేక్ష‌కుల్ని చైత‌న్యం చేసిన ధీర‌త్వం ద్వితీయార్థంలో క‌నిపిస్తుంది. రాయ‌ల‌సీమ క‌రువు, దివిసీమ ఉప్పెన నేప‌థ్యం, అది చూసి చ‌లించి పోయిన ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు ముందుకు క‌దిలిన విధానాన్ని కూడా ఆస‌క్తిక‌రంగా తెర‌పైకి తీసుకొచ్చారు ద‌ర్శకుడు. ఎన్టీఆర్ వ్య‌క్తిగ‌త‌, న‌ట జీవితంలోని ప్ర‌ధాన‌మైన మ‌లుపుల‌న్నింటినీ చ‌క్క‌గా తెర‌పైకి తీసుకొచ్చారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాప‌న‌తో చిత్రం ముగుస్తుంది.


ఎవ‌రెలా చేశారంటే:

ఎన్టీఆర్ పాత్ర‌లో ఆయ‌న త‌న‌యుడు బాల‌కృష్ణ ఒదిగిపోయారు. ముఖ్యంగా సినిమా గెట‌ప్పుల్లో ఎన్టీఆర్‌నే గుర్తు చేశారు. పౌరాణిక పాత్ర‌ల్ని పోషించ‌డంలో త‌న తండ్రి వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకున్నారు బాల‌కృష్ణ‌. అందుకే సంభాష‌ణ‌ల ద‌గ్గ‌ర్నుంచి, వేషం, హావ‌భావాల వ‌ర‌కు త‌న తండ్రిని గుర్తు చేస్తూ న‌టించారు. ఎన్టీఆర్ వ‌య‌సులో ఉన్న‌ప్ప‌టి స‌న్నివేశాల్లో మాత్రం బాల‌కృష్ణే క‌నిపిస్తుంటారు. ఏఎన్నార్ పాత్ర‌లో సుమంత్ ఒదిగిపోయారు. అచ్చం త‌న తాత‌లాగే క‌నిపించారు. బ‌స‌వ‌తార‌కం పాత్ర ఈ సినిమాకి ఆయువుపట్టు. ఆ పాత్ర‌లో విద్యాబాల‌న్ చాలా బాగా న‌టించారు. ఆమె క‌ళ్ల‌తోనే భావోద్వేగాలు ప‌లికించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. ఎన్టీఆర్ సోద‌రుడు త్రివిక్ర‌మ‌రావుగా ద‌గ్గుబాటి రాజా, త‌న‌యుడు హరికృష్ణగా క‌ల్యాణ్‌రామ్ పాత్ర‌ల‌కి కూడా ప్రాధాన్యం ఉంది. ఇందులో కొన్ని పాత్ర‌ల ప‌రిధి త‌క్కువే అయినా... ప్ర‌తి పాత్ర ప్రేక్ష‌కుడికి గుర్తుండిపోతుంది. అందుకోసం ద‌ర్శ‌కుడు తీసుకొన్న జాగ్ర‌త్త‌లు, న‌టీన‌టుల ఎంపికని మెచ్చుకోకుండా ఉండ‌లేం. బాల‌కృష్ణ చిన్న‌ప్ప‌టిపాత్ర‌లో ఆయ‌న మ‌న‌వ‌డు ఆర్య‌వీర్ మెరిశాడు. చంద్ర‌బాబు నాయుడి పాత్ర ప‌తాక స‌న్నివేశాల్లో ప‌రిచ‌య‌మ‌వుతుంది. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. జ్ఞాన‌శేఖ‌ర్ కెమెరా ప‌నిత‌నం, ఎమ్‌.ఎమ్‌.కీర‌వాణి సంగీతం, సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటాయి. ప్ర‌తి స‌న్నివేశంలోనూ బ‌ల‌మైన సంభాష‌ణ‌లు వినిపిస్తాయి. ద‌ర్శ‌కుడు క్రిష్ క‌థ‌ని చెప్పిన విధానం ఆక‌ట్టుకుంటుంది. సినిమా జీవితాన్ని, వ్య‌క్తిగ‌త జీవితాన్ని స‌మంగా తెర‌పై ఆవిష్క‌రించిన విధానం మెప్పిస్తుంది. నిర్మాణ విలువ‌లు కూడా సినిమాకి నిండుత‌నాన్ని తెచ్చింది.బ‌లాలు

క‌థ‌, భావోద్వేగాలు

ఎన్టీఆర్ పోషించిన పాత్ర‌ల నేప‌థ్యంలో స‌న్నివేశాలు

ఎన్టీఆర్ కుటుంబ నేప‌థ్యం

ఎన్టీఆర్ - ఏఎన్నార్ మ‌ధ్య స‌న్నివేశాలు

సంభాష‌ణ‌లు, న‌టీన‌టులు

బ‌ల‌హీన‌త‌లు

- యువ ఎన్టీఆర్ గెట‌ప్పుల్లో బాల‌కృష్ణ

* చివ‌రిగా

`ఎన్టీఆర్ కథానాయ‌కుడు`... ఇది సినిమా కాదు చ‌రిత్ర
సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.