రివ్యూ: నువ్వు తోపురా
రివ్యూ: నువ్వు తోపురా
న‌టీన‌టులు: సుధాక‌ర్ కోమాకుల‌, నిత్య‌శెట్టి, నిరోషా, వ‌రుణ్‌సందేశ్‌, బ‌బ‌ర్ద‌స్త్ రాకేష్ త‌దిత‌రులు
సాంకేతిక‌వ‌ర్గం: సంగీతం : సురేష్‌ బొబ్బిలి, పీఏ దీపక్‌, ఛాయాగ్ర‌హ‌ణం: వెంక‌ట్ దిలీప్‌, ప్ర‌కాష్ వేలాయుధ‌న్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్: తోట త‌ర‌ణి, క‌థ‌, మాట‌లు: అజ్జు మ‌హ‌కాళి,
నిర్మాత‌: శ‌్రీకాంత్‌, దర్శకత్వం : బి. హరినాథ్‌ బాబు
విడుద‌ల‌: 3 మే 2019

తెలంగాణ యాస మాట్లాడుతూ `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌`లో నాగ‌రాజ్‌గా ఆక‌ట్టుకున్నాడు సుధాక‌ర్ కోమాకుల‌. ప‌క్కింటి కుర్రాడిలాంటి ఇమేజ్‌ని సంపాదించిన ఆయ‌న ఆ త‌ర్వాత రెండు చిత్రాలు చేశారు. కానీ ఏదీ ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది. ఈసారి అమెరికా నేప‌థ్యంలో సాగే `నువ్వు తోపురా` అనే చిత్రం చేశారు. ఈ సినిమా ప్ర‌చార చిత్రాల్లో సుధాక‌ర్ పాత్ర... `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌`లో నాగ‌రాజ్ పాత్ర‌నే గుర్తు చేసింది. ఆ పాత్ర స్ఫూర్తితో రూపుదిద్దుకున్న స‌రూర్ న‌గ‌ర్ సూరి క‌థే... `నువ్వు తోపురా`. మ‌రి సూరి క‌థేమిటి? సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం...

* క‌థ‌
సూరి (సుధాక‌ర్‌కోమాకుల‌) స‌రూర్ న‌గ‌ర్ కుర్రాడు. చిన్న‌ప్పుడే తండ్రి చనిపోవ‌డంతో త‌ల్లి (నిరోషా) అన్నీ తానై పెంచుతుంది. బీటెక్ పూర్తి చేయ‌కుండా... కుటుంబాన్ని ప‌ట్టించుకోకుండా స్నేహితుల‌తో క‌లిసి తిరుగుతుంటాడు సూరి. ర‌మ్య (నిత్య శెట్టి)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. ర‌మ్య ఉన్నత చ‌దువుల కోసం అమెరికా వెళ్లిపోవ‌డంతో సూరికి దూర‌మ‌వుతుంది. ఇంత‌లో ఒక సాంస్కృతిక కార్య‌క్ర‌మంలో డ‌ప్పు వాయించ‌డం కోసం సూరికి అమెరికా వెళ్లే అవ‌కాశం వ‌స్తుంది. అక్క‌డికి వెళ్లాక అత‌ని జీవితంలో ఎలాంటి మార్పు వ‌చ్చింది? బంధాల విలువ ఎలా తెలుసుకొన్నాడు? అక్క‌డే బ‌త‌కాల్సి రావ‌డంతో అందుకోసం ఎలాంటి పోరాటం చేశాడు? సూరి, ర‌మ్య ఒక్క‌ట‌య్యారా లేదా? అనే విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.


* విశ్లేష‌ణ‌
క‌థ‌... నేప‌థ్యం కొత్త‌గా ఉంటుంది. అమెరికా చుట్టూ సాగిన క‌థ‌లు చాలానే తెర‌పైకొచ్చాయి కానీ... ఇందులో స్పృశించిన కోణం కొత్త‌గా ఉంటుంది. అయితే దాన్ని మ‌రింత ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్ద‌డంలో చిత్ర‌బృందం విఫ‌ల‌మైంది. కొన్నిచోట్ల క‌థ‌ని విడిచి స‌న్నివేశాలు సాము చేశాయి. దాంతో ఈ చిత్రంతో ఏం చెప్ప‌ద‌ల‌చుకొన్నార‌నే ప్ర‌శ్న త‌లెత్తుతుంది. సరూర్‌న‌గ‌ర్ బ‌స్తీ త‌ప్ప మ‌రో ప్ర‌పంచం తెలియ‌ని కుర్రాడు అమెరికాకి వెళ్లాక అక్క‌డి ప‌రిస్థితులు ఏం నేర్పించాయనేదే ఈ క‌థ‌. కుటుంబాన్ని ప‌ట్టించుకోని ఆ కుర్రాడికి... అమ్మ, స్నేహితులు, మాతృదేశం విలువ ఏంటో అమెరికాకి వెళ్లాక ఎలా అర్థ‌మ‌య్యాయ‌న్న‌ది ఇందులో కీల‌కం. ఆరంభ స‌న్నివేశాలు స‌రూర్ న‌గ‌ర్ నేప‌థ్యంలోనే వ‌స్తాయి. గ‌ల్లీ కుర్రాళ్లతో క‌లిసి క‌థానాయ‌కుడు చేసే అల్ల‌రి... ప్రేమ‌లో ప‌డ్డాక క‌థానాయిక వెంట ప‌డుతూ చేసే సంద‌డి, ర‌మ్య త‌ల్లిదండ్రుల‌తో పెళ్లి గురించి మాట్లాడే స‌న్నివేశాలతో సినిమా స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోతుంది. క‌థ అమెరికాకి మారాక ఆస‌క్తి రేకెత్తుతుంది. క‌థ‌లో అనూహ్యంగా చోటు చేసుకునే మ‌లుపులు ప్రేక్ష‌కుడిని క‌థ‌లో లీనం చేస్తాయి. మ‌ధ్య‌లో వినోదం, సెంటిమెంట్ పండ‌టం సినిమాకి క‌లిసొచ్చే విష‌యం. నాయ‌కానాయిక‌లు ప్రేమ‌లో ప‌డే స‌న్నివేశాల్ని, క‌థానాయ‌కుడి క‌ష్టాల్ని... ఆయ‌న కుటుంబం నేప‌థ్యంలో భావోద్వేగాల్ని బ‌లంగా చూపించ‌లేపోయాడు ద‌ర్శ‌కుడు. ప‌తాక స‌న్నివేశాలు కూడా సాదాసీదాగా అనిపిస్తాయి. వ‌రుణ్ సందేశ్ ఇందులో ఒక కీల‌క పాత్ర‌లో మెరుస్తారు.


* న‌టీన‌టులు.. సాంకేతిక‌త‌
సుధాక‌ర్ కోమాకుల న‌ట‌న‌, ఆయ‌న పాత్ర సినిమాకి బ‌లం. బ‌స్తీ కుర్రాడిలా క‌నిపిస్తూ వినోదం పండించిన విధానం ఆక‌ట్ట‌కుంటుంది. సంభాష‌ణ‌లు చెప్పిన తీరు కూడా ఆక‌ట్టుకుంటుంది. నిత్య‌శెట్టి ఆమె పాత్ర ప‌రిధి మేర‌కు చ‌క్క‌గా న‌టించింది. నిరోషా మ‌ధ్య త‌ర‌గ‌తి త‌ల్లి పాత్ర‌లో ఒదిగిపోయారు కానీ ఆ పాత్ర‌ని బ‌లంగా తీర్చిదిద్ద‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యాడు. వ‌రుణ్‌సందేశ్ చాలా రోజుల త‌ర్వాత తెర‌పై క‌నిపించాడు. క‌థానాయ‌కుడికి స్నేహితుడిగా ద్వితీయార్థం మొత్తం క‌నిపిస్తాడు. ఆ పాత్ర ప్రేక్ష‌కుల‌కు స‌ర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. అమెరికాకి చెందిన ప‌లువురు న‌టులు తెర‌పై క‌నిపిస్తారు. సాంకేతికంగా సినిమా ప‌ర్వాలేద‌నిపిస్తుంది. అమెరికా అందాల్ని బాగా చూపించారు. అజ్జు మ‌హాకాళి స‌మ‌కూర్చిన క‌థ‌, సంభాష‌ణ‌లు సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. ద‌ర్శ‌కుడు హ‌రినాథ్ బాబు ప‌నిత‌నం అక్క‌డ‌క్క‌డా మెప్పిస్తుంది.

* చివ‌రిగా..
కొత్త ద‌నంతో కూడిన క‌థ, క‌థ‌నాలు స‌మ‌కూరినా.. వాటిని పూర్తిగా స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయిన సినిమా ఇది. స‌రూర్‌న‌గ‌ర్ కుర్రాడి ప్ర‌యాణమే అయినా... ఈ క‌థ‌తో చాలా విష‌యాలు చెప్ప‌డానికి ఆస్కార‌ముంది. ఆ దిశ‌గా స‌రైన క‌స‌ర‌త్తులు చేయ‌క‌పోవ‌డంతో... అక్క‌డ‌క్క‌డా వినోదం, భావోద్వేగాల‌తో కాల‌క్షేపం చేయించ‌డానికి ప‌రిమిత‌మైందీ చిత్రం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.