రివ్యూ: ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌
సినిమా: ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌
నటీనటులు: ఆది, సాషా చెత్రి, అనీషా కురువిల్లా, మనోజ్‌ నందన్‌, అబ్బూరి రవి, కార్తీక్‌ రాజు, పార్వతీశం, నిత్య నరేష్‌, కృష్ణుడు, రావు రమేశ్‌ తదితరులు
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
సినిమాటోగ్రాఫర్‌: జైపాల్ రెడ్డి
కూర్పు: గర్రీ బీహెచ్‌
నిర్మాతలు: ప్రతిభ అడవి, కేశవ్‌ ఉమా స్వరూప్‌, పద్మనాభరెడ్డి
దర్శకుడు: అడవి సాయికిరణ్‌
విడుదల తేదీ: 18-10-2019


గత కొన్నేళ్లుగా సరైన బ్రేక్‌ కోసం ఎదురుచూస్తున్నారు యువ కథానాయకుడు ఆది. ఈ ఏడాది వచ్చిన ఆయన ‘బుర్రకథ’, ‘జోడీ’ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. తాజాగా ఆది కమాండోగా రూపొందిన సినిమా ‘ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌’. 1980లో కశ్మీర్‌లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఇది తెరకెక్కింది. ఉగ్రవాదం నేపథ్యంలో సాగే కథ, కథనాలతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ అంటే ఏంటి? కమాండోగా ఆది నటన ఆకట్టుకుందా? ఈ సినిమా ఆయన కెరీర్‌కు ప్లస్ అయ్యిందా?

* కథేంటంటే..
ఇది కశ్మీరీ పండిట్‌ల ఊతకోతకు సంబంధించిన కథ. ఉగ్రవాద సంస్థకు ముఖ్య నాయకుడు ఘాజీ బాబా (అబ్బూరి రవి). హైదరాబాద్‌ వచ్చిన ఘాజీబాబాను కమాండో ఆపరేషన్‌లో అర్జున్‌ పండిట్‌ (ఆది) అరెస్టు చేస్తాడు. ఘాజీబాబాను విడిపించటానికి అతని ప్రధాన అనుచరుడైన ఫారూఖ్‌ (మనోజ్‌ నందన్‌) ఒక పథకం రచిస్తాడు. ఓ కేంద్రమంత్రి కూతురిని కిడ్నాప్‌ చేసి, ఘాజీబాబాను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తాడు. అయితే, ఈ విషయం ముందే పసిగట్టిన అర్జున్‌ కేంద్రమంత్రి కుమార్తె కిడ్నాప్‌ కాకుండా రక్షిస్తుంటాడు. మరి ఫారూఖ్‌ ఆ అమ్మాయిని కిడ్నాప్‌ చేశాడా? ఉగ్రవాదులకు, కమాండో ఆఫీసర్‌ అర్జున్‌ పండిట్‌కు మధ్య జరిగిన పోరులో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? అన్నదే కథ.


* ఎలా ఉందంటే:
అరెస్టయిన ఘాజీబాబాను విడిపించటానికి సెంట్రల్‌ మినిస్టర్‌ కుమార్తెను కిడ్నాప్‌ చేయటమే ఉగ్రవాదుల లక్ష్యం. దానికి వాళ్లు పెట్టుకున్న పేరు ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్’. ఈ కిడ్నాప్‌ జరగడానికి ముందు.. జరిగిన తర్వాత నడిచే సన్నివేశాలే ఈ కథకు మూలం. ఉగ్రవాదుల నాయకుడు అరెస్టయినప్పుడు ఎలాంటి డ్రామా నడుస్తుంది? వాళ్లని విడిపించటానికి ఉగ్రవాదాలు ఎలాంటి ప్రణాళికలు రచిస్తారు? ఇలాంటి సన్నివేశాలన్నీ ఇది వరకే చాలా సినిమాల్లో చూశాం. ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ అందుకు ఏమాత్రం మినహాయింపు కాదు. దేశభక్తి అనేది చాలా బలమైన కమర్షియల్ ఎలిమెంట్‌. దాన్ని సరైన రీతిలో తెరకెక్కిస్తే ఏ సినిమా అయినా నిలబడుతుంది. దర్శకుడు కూడా అలాంటి ప్రయత్నమే చేయాలనుకున్నాడు. కానీ, దానికి సరిపోయే భావోద్వేగాలను కథలో మేళవించడంలో తడబడ్డాడు.
* ఎవరెలా చేశారంటే..
ఆదికి ఇది కొత్త రకమైన పాత్ర. అర్జున్‌ పండిట్‌గా చాలా సీరియస్‌గా కనిపించాడు. అయితే, తనలో ఉన్న నటుడిని పూర్తిగా బయటపెట్టే పాత్ర అయితే కాదు. ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించిన అబ్బూరి రవి రచయితగానే తెలుసు. తనలో ఓ నటుడు ఉన్నాడని ఈ సినిమా నిరూపిస్తుంది. అబ్బూరి రవి మాత్రమే కాదు.. దర్శకుడితో సహా చాలా మంది టెక్నిషియన్లు ఇందులో నటులుగా కనిపిస్తారు. ఎయిర్‌టెల్‌ పాపగా అందరికీ సుపరిచితమైన సాషా చెత్రికు కథానాయికగా ఇదే తొలి చిత్రం. అయితే, గుర్తుండిపోయే పాత్ర మాత్రం కాదు. మనోజ్‌నందన్‌ కూడా ప్రతినాయకుడిగా మెప్పించాడు. మిగిలిన వారంతా తమ పరిధి మేరకు నటించారు.


* సాంకేతికంగా..
కథ, కథనాల్లో ఇంకాస్త బలం ఉంటే బాగుండేది. కమాండో ఆపరేషన్‌ కథలు ఎలా సాగుతాయో ‘ఉరి’లాంటి చిత్రాల్లో చూశాం. అంత ఇంటెలిజెన్సీ ఈ సినిమాలో కనిపించదు. సన్నివేశాల సాగదీత వల్ల కథ, కథనాల్లో గాఢత లోపించింది. ఇలాంటి చిత్రాలకు పాటలు నప్పవు. నిడివి పెంచటానికి తప్ప మరి దేనీకి ఉపయోగపడలేదు. దర్శకుడు వినోదం కోసం చేసిన ప్రయత్నాలు ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతంలో శబ్దాలు మరీ ఎక్కువయ్యాయి. బడ్జెట్‌ పరంగా పరిమితులను దృష్టిలో పెట్టుకుని నిర్మాణం విషయంలో రాజీపడినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.


* బలాలు
+ కథా నేపథ్యం
+ యాక్షన్‌ సన్నివేశాలు
+ పతాక సన్నివేశాలు
బలహీనతలు
- కథనం
- కాలేజీ సన్నివేశాలు
- నిర్మాణ విలువలు
* చివరిగా..
‘ఆపరేషన్‌’ ఇంకాస్త బాగా చేయాల్సింది!


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.