రివ్యూ: సాహో
చిత్రం: సాహో
తారాగణం:
ప్రభాస్‌, శ్రద్ధ కపూర్‌, వెన్నెల కిషోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆర్‌.మది; సంగీతం: తనిష్క్‌ బగ్చీ, గురు రాంద్వా, బాద్‌షా, జిబ్రాన్‌ (నేపథ్యం)
కూర్పు: ఎ.శ్రీకర్‌ ప్రసాద్‌; నిర్మాణం: యూవీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌
కథ, దర్శకత్వం: సుజీత్‌; విడుదల తేదీ: 30-08-2019


`బాహుబ‌లి` త‌ర్వాత  ప్ర‌భాస్ చేస్తున్న సినిమా అంటే అంచ‌నాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవ‌చ్చు. ఆ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకొనే `సాహో`ని ప‌ట్టాలెక్కించారు. ప్రేక్ష‌కుల్ని థ్రిల్ చేయాల‌ని  స్క్రీన్‌ప్లే ప్ర‌ధానంగా సాగే క‌థ‌ని ఎంచుకొన్నారు. `బాహుబ‌లి` చిత్రాల  త‌ర్వాత అందుకు పూర్తి భిన్నంగా సాగే  `సాహో`లాంటి సినిమాని చేయ‌డం  ప్ర‌భాస్ తీసుకొన్న తెలివైన నిర్ణ‌యం అని విడుద‌ల‌కి ముందు సినీ పండితులు విశ్లేషించారు. `బాహుబ‌లి`ని చూసిన ప్రేక్ష‌కులందరికీ త‌న త‌దుప‌రి సినిమా చేరాల‌ని... అందుకు త‌గ్గ గ్రాండ్‌నెస్ కూడా సినిమాలో ఉండాల‌నేది ప్ర‌భాస్‌, చిత్ర‌బృందం ఆలోచ‌న‌. ఇలా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో... భారీ హంగుల‌తో రూపుదిద్దుకొన్న సినిమానే `సాహో`. తొలి ప్ర‌చార చిత్రంతోనే అంచ‌నాలు పెంచుకొన్న సినిమా ఇది. విడుద‌ల‌కి ద‌గ్గ‌ర ప‌డుతున్న‌కొద్దీ దాని క్రేజ్ ఆకాశాన్ని తాకింది.  మ‌రి అందుకు త‌గ్గ‌ట్టుగానే సినిమా ఉందా? `బాహుబ‌లి` త‌ర్వాత ప్ర‌భాస్ తెర‌పై ఎలా క‌నిపించాడు? త‌దిత‌ర విష‌యాలు తెలుసుకొనేముందు క‌థ‌లోకి వెళ‌దాం... 


కథేంటంటే...
వాజా... గ్యాంగ్‌స్ట‌ర్స్‌కి పెట్టింది పేరైన న‌గ‌రం. అక్క‌డ నివ‌సించే రాయ్ (జాకీష్రాఫ్‌), దేవ‌రాజ్ (చుంకీపాండే) మ‌ధ్య యుద్ధం మొద‌ల‌వుతుంది. ముంబైకి వ‌చ్చిన రాయ్‌ని ప‌క్కా ప్ర‌ణాళిక‌తో అంతం చేస్తాడు దేవ‌రాజ్‌. దాంతో రాయ్  స్థానంలో అత‌ని కొడుకు విశ్వక్ (రాహుల్ విజ‌య్‌) ఆ సామ్రాజ్యాన్ని న‌డుపుతుంటాడు. విశ్వ‌క్‌ని కూడా మ‌ట్టుబెట్టి ఆ సామ్రాజ్యాన్ని సొంతం చేసుకోవాల‌నేది దేవ‌రాజ్ ప‌న్నాగం.  మరోవైపు ముంబయిలో రూ.రెండు వేల కోట్ల దొంగతనం జరుగుతుంది. ఆ కేసుని నిగ్గు తేల్చ‌డానికి అండ‌ర్ కవర్ పోలీసు అధికారిగా అశోక్‌ చక్రవర్తి (ప్రభాస్‌) రంగంలోకి దిగుతాడు. అక్క‌డే   క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన అమృతా నాయర్‌ (శ్రద్ధ కపూర్‌)తో  ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఆ త‌ర్వాత ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇంత‌లో క‌థ‌లో మ‌రో మ‌లుపు. అస‌లు రూ: 2 వేల కోట్ల దోపిడీ చేసిందెవ‌రు? వాజా గ్యాంగ్‌వార్‌కీ, ఆ దోపిడీకి సంబంధ‌మేమైనా ఉందా?  ఆ కేసుని అశోక్ చ‌క్ర‌వ‌ర్తి ఎలా ఛేదించాడు?  తాను చ‌నిపోతూ రాయ్ దాచిన ర‌హస్య‌మేమిటి? అది ఎప్పుడు ఎలా బ‌య‌టికొచ్చింది?  త‌దిత‌ర విషయాల్ని తెర‌పై చూడాల్సిందే. 


ఎలా ఉందంటే...
`బాహుబ‌లి` త‌ర్వాత ప్ర‌భాస్ నుంచి అందుకు దీటైన సినిమానే ఊహిస్తారు ప్రేక్ష‌కులు. ఆ విష‌యాన్ని మ‌రీ సీరియ‌స్‌గా  పట్టించుకున్న చిత్ర‌బృందం... భారీ హంగుల‌పై  దృష్టిపెట్టినంత‌గా, క‌థ‌, క‌థ‌నాల‌పై శ్ర‌ద్ధ పెట్టలేదు.  ఆరంభంలో వాజా సిటీని చూపించ‌డం మొద‌లుకొనే గ్రాండియ‌ర్‌కి తెర‌లేచింది. కానీ ఆ స్థాయిలో క‌థ‌, క‌థ‌నాలు ఆక‌ట్టుకోవు. స్క్రీన్ ప్లే ప్ర‌ధాన‌మైన సినిమా చేయాల‌న్న‌దే చిత్ర‌బృందం ఆలోచ‌న అయిన‌ప్పుడు... అదే హైలెట్ కావాలి. కానీ అక్క‌డే లోటుపాట్లు ఎక్కువగా క‌నిపిస్తాయి. దాంతో సినిమా ప్రేక్ష‌కుల‌కు పూర్తిస్థాయిలో సంతృప్తినివ్వ‌దు. ప్ర‌థ‌మార్థంలో 2 వేల కోట్ల కేసుని డీల్ చేసే పోలీసు అధికారి పాత్ర‌లో ప్ర‌భాస్ క‌నిపిస్తుంటాడు కానీ... అందుకు త‌గ్గ ఇంటెలిజెన్స్ కానీ, అందుకు త‌గ్గ హీరోయిజం కానీ ఆ స‌న్నివేశాల్లో క‌నిపించ‌దు. దాంతో చ‌ప్ప‌గా సినిమా మొద‌లైన‌ట్టు అనిపిస్తుంది.  వినోదం ప‌రంగా కూడా పెద్ద‌గా దృష్టిపెట్ట‌లేదు. గ్యాంగ్‌స్ట‌ర్ సినిమాల‌కి యాక్ష‌న్‌తో పాటు, ట్విస్టులు, ఇంటెలిజెంట్‌గా ఎత్తుకు పైఎత్తు అన్న‌ట్టుగా సాగే స‌న్నివేశాలే ప్ర‌ధాన‌బ‌లం.  ఇందులో కూడా యాక్ష‌న్ ఉంది, ట్విస్టులు ఉన్నాయి. కానీ వాటిని ఆక‌ట్టుకునేలా తెర‌పైకి తీసుకురావ‌డంలో విఫ‌ల‌మైంది చిత్ర‌బృందం.  క‌థ‌లో వ‌చ్చే ప్ర‌తి మ‌లుపూ ప్రేక్ష‌కుల‌కు కిక్ ఇవ్వాల్సి ఉండ‌గా... అస‌లు ఆ మ‌లుపులే అర్థం కాని ప‌రిస్థితి. ప‌లు భాష‌ల్ని దృష్టిలో పెట్టుకుని క‌థ‌, క‌థ‌నాల్ని తీర్చిదిద్ద‌డంతో స‌మ‌స్య వ‌చ్చిందో లేక‌, ద‌ర్శ‌కుడే త‌డ‌బాటుకు గుర‌య్యాడో తెలియ‌దు కానీ... చాలా స‌న్నివేశాలు అంత‌గా అర్థం కాకుండా, ప్రేక్ష‌కుడి మ‌న‌సుల‌పై ఒక  ముద్ర‌న్న‌ది వేయ‌కుండానే ముందుకు సాగిపోతుంటాయి.  అలాంట‌ప్పుడు సినిమాపై ఎంత ఖ‌ర్చు పెడితే ఏం లాభం? ద్వితీయార్థంలో వ‌చ్చే యాక్ష‌న్ ఘ‌ట్టాలు మాత్రం  కాస్త ఆక‌ట్టుకుంటాయి. హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఆ స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు.  ద్వితీయార్థంలో మ‌లుపులు, ప్ర‌భాస్‌లోని మ‌రో కోణం కూడా ఆక‌ట్టుకుంటుంది.  యాక్ష‌న్‌లో  ర‌క‌ర‌కాల కోణాలు కనిపిస్తాయి. ఛేజింగ్‌లు, ఎడారిలో భారీ కాయుల‌తో చేసే పోరాటాలు, గ‌న్ ఫైట్లు... ఇలా అన్నీ ఆక‌ట్టుకునేవే. చీక‌టి సామ్రాజ్యం నేప‌థ్యంలో సాగే ఈ క‌థ‌ని అందుకు త‌గ్గ మూడ్‌తోనే చూపించారు. అన్ని హంగులూ కుదిరినా... క‌థ‌, క‌థ‌నాల్లో లోపాలు మాత్రం అడుగ‌డుగునా క‌నిపిస్తూనే ఉంటాయి. హాలీవుడ్ సినిమాల ప్ర‌భావం సినిమాపై బ‌లంగా ఉంది. యాక్ష‌న్ ఘ‌ట్టాల ప‌రంగానే కాదు, క‌థ‌.. క‌థ‌నాల‌కి కూడా హాలీవుడ్ సినిమాలే  స్ఫూర్తి అని అర్థ‌మ‌వుతుంది. ఎవరెలా చేశారంటే...
ప్ర‌భాస్ పాత్రే సినిమాకి బ‌లం. ఆయన పోలీసు ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌డంతో పాటు, మ‌రో కోణాన్ని కూడా చూపించాడు. భావోద్వేగాలు కూడా పండించాడు. `బాహుబ‌లి` త‌ర్వాత నాజూగ్గా మారిన ఆయ‌న తెర‌పై అందంగా , ఇదివ‌ర‌క‌టి కంటే కొత్త‌గా క‌నిపిస్తారు. ఆయ‌న చేసిన యాక్ష‌న్‌, ఆయ‌న లుక్ ఆక‌ట్టుకుంటుంది. శ్ర‌ద్ధా క‌పూర్ యాక్ష‌న్ ప‌రంగా బాగా క‌ష్ట‌ప‌డింది కానీ... ప్ర‌భాస్‌తో ఆమెకి కెమిస్ట్రీ కుద‌ర‌లేదు. ప్ర‌తినాయ‌కులు బోలెడంత మంది క‌నిపిస్తుంటారు.  వాళ్ల‌లో చుంకీ పాండే పాత్ర‌కి మాత్ర‌మే ప్రాధాన్యం ఉంది. కానీ ఆ పాత్ర‌ని మ‌రింత శ‌క్తివంతంగా తీర్చిదిద్ద‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. జాకీ ష్రాఫ్‌, మందిరాబేడీ, ఎల్విన్ శ‌ర్మ‌, వెన్నెల‌కిషోర్‌, అరుణ్ విజ‌య్‌, ముర‌ళీ శ‌ర్మ  వాళ్ల పాత్ర‌ల ప‌రిధి మేర‌కు మెప్పించారు. నీల్ నితిన్ ముఖేష్ పాత్ర, ఆయ‌న న‌ట‌న  ఆక‌ట్టుకుంటుంది.  బాహుబ‌లిలో వేల మందితో యుద్ధం చేసిన‌ట్టే... ప్ర‌భాస్ ఇందులో కూడా వంద‌ల మందితో ఫైట్లు చేస్తుంటాడు.  పాట‌లు చిత్రీక‌ర‌ణ ప‌రంగా మెప్పిస్తాయి కానీ... మరోసారి పాడుకోవడానికి మాత్రం గుర్తండేలా లేవు. మ‌ది కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. ఆయ‌న ప్ర‌తి స‌న్నివేశాన్నీ గ్రాండియ‌ర్‌గా, ఖ‌ర్చుకు త‌గ్గ‌ట్టుగా తెర‌పైన చూపించారు. పోరాట ఘ‌ట్టాలు మెప్పిస్తాయి. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. ద‌ర్శ‌కుడు సుజీత్ క‌థ‌, క‌థ‌నాల విష‌యంలో త‌డ‌బాబుకి గురయ్యారు. సంభాష‌ణలు కూడా ఏ మాత్రం మెప్పించ‌వు.  జిబ్రాన్ నేప‌థ్యం సంగీతం ప‌ర్వాలేద‌నిపిస్తుంది. శ్రీక‌ర్ ప్ర‌సాద్ కూర్పు, సాబు సిరిల్ క‌ళా ప‌నిత‌నం, క‌మ‌ల్ క‌ణ్ణ‌న్ విజువ‌ల్ ఎఫెక్ట్స్ సినిమాపై స్ప‌ష్ట‌మైన ప్ర‌భావం చూపిస్తుంటాయి. 


బలాలు
ప్రభాస్‌
యాక్షన్‌ సన్నివేశాలు
నిర్మాణ విలువలు

బలహీనతలు
వినోదం
పాటలు
స్క్రీన్‌ ప్లే

* చివరగా..
సినిమా గ్రాండియ‌ర్‌గా ఉండాల‌నుకోవ‌డంలో త‌ప్పేం లేదు. ప్ర‌పంచ సినిమా మ‌న  ప్రేక్ష‌కుడికి అందుబాటులోకి వ‌చ్చింది కాబ‌ట్టి అందుకు త‌గ్గ‌ట్టుగా మ‌నం కూడా తెర‌పైన హంగులు చూపించాల‌నుకోవ‌డం మంచిదే. కానీ క‌థ‌, క‌థ‌నాల్ని మించిన హంగులు, వాటికి మించిన గ్రాండియ‌ర్ మ‌రొక‌టి లేద‌నే విష‌యాన్ని ద‌ర్శ‌కులు త‌ప్ప‌నిసరిగా దృష్టిలో పెట్టుకోవాలని `సాహో` మ‌రోసారి గుర్తు చేస్తుంది.  Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.