రివ్యూ: ప్రేమకథా చిత్రమ్‌ 2

చిత్రం: ప్రేమకథా చిత్రమ్‌2

నటీనటులు: సుమంత్‌ అశ్విన్‌, నందితా శ్వేత, సిద్ధి ఇద్నానీ, ప్రభాస్‌ శ్రీను, విద్యుల్లేఖ రామన్‌ తదితరులు

సంగీతం: జీవన్‌ బాబు

సినిమాటోగ్రఫీ: సి.రామ్‌ ప్రసాద్‌

ఎడిటింగ్‌: ఎస్‌.బి.ఉద్ధవ్‌

నిర్మాత: ఆర్‌ సుదర్శన్‌రెడ్డి

దర్శకత్వం: హరి కిషన్‌

బ్యానర్‌: ఆర్‌పీఏ క్రియేషన్స్‌

విడుదల తేదీ: 06-04-2019


హారర్‌ కామెడీ జోనర్‌ చిత్రాలలో కొత్త ట్రెండ్‌ సృష్టించింది... ‘ప్రేమకథా చిత్రమ్’‌. ఆ సినిమా తర్వాత ఇదే జోనర్‌లో చాలా కథలొచ్చాయి. వెళ్లాయి. నూటికి ఒకటో, రెండో ప్రేక్షకుల మెప్పుని పొందగలిగాయి. మిగిలినవన్నీ... వృథా ప్రయాసలుగా మిగిలిపోయాయి. ఇప్పుడు ‘ప్రేమ కథా చిత్రమ్‌’కి కొనసాగింపుగా పార్ట్‌ 2 వచ్చింది. మరి... తొలి సినిమా ఫలితాన్ని సీక్వెల్‌ అందుకోగలిగిందా, లేదా? అప్పటి వినోదం... ఇప్పుడూ కనిపించిందా? భయ పెట్టిన అంశాలేంటి?

కథేంటంటే..:
సుధీర్‌ (సుమంత్‌ అశ్విన్‌) చలాకీ కుర్రాడు. డిగ్రీ చదువుతుంటాడు. అదే కాలేజీలోనే చదువుతున్న బిందు (సిద్ధి ఇద్నానీ) సుధీర్‌ని ప్రేమిస్తుంది. సుధీర్‌నో చెప్పడంతో మనస్తాపానికి గురై, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. అయితే తను మరో అమ్మాయిని ప్రేమించానని, తననే పెళ్లి చేసుకుంటానని బిందుతో చెప్తాడు సుధీర్‌. ఈలోగా సుధీర్‌కి ఇంట్లో ఓ సంబంధం ఖాయం చేస్తారు. నందు (నందిత శ్వేత)తో పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. ఆ పెళ్లి తనకు ఇష్టం లేదని సుధీర్‌ తెగేసి చెప్పడంతో - చిత్ర ఆత్మహత్య చేసుకుంటుంది. సుధీర్‌ అనుకోకుండా ఓ ఫామ్‌ హౌస్‌కి వెళ్తాడు. అక్కడ రకరకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. ఓ దెయ్యం రాత్రి పూట మాత్రమే కనిపిస్తూ, సుధీర్‌నీ, అతని మిత్ర బృందాన్నీ భయపెడుతుంటుంది. ఇంతకీ ఆ దెయ్యం వెనుక ఉన్న కథేమిటి? చిత్ర ఆత్మహత్య చేసుకోవడానికి ఉన్న బలమైన కారణం ఏమిటి? అనేదే ‘ప్రేమకథా చిత్రమ్‌ 2’.


ఎలా ఉందంటే:
‘ప్రేమకథా చిత్రమ్‌’ ఓ ఫామ్‌ హౌస్‌ నేపథ్యంలో సాగే కథ. ఇదీ అంతే. అంతకు మించి ఈ రెండు భాగాలకూ ఎలాంటి పోలికలూ లేవు. ప్రేమకథా చిత్రమ్‌ విజయవంతం అవ్వడానికి చాలా కారణాలున్నాయి. అప్పటికి ఆ జోనర్‌ కొత్త. భయం కంటే వినోదానికి పెద్ద పీట వేసి తీర్చిదిద్దిన సినిమా అది. భయం, వినోదం రెండూ ప్లస్‌ పాయింట్స్‌ అయ్యాయి. దానికి తోడు సంగీతం అదనపు బలం అయ్యింది. నటీనటులు తమ పరిధి మేర రాణించారు. అవన్నీ ఈ సినిమాలో మైనస్‌లుగా కనిపిస్తాయి. కథలో కొత్తదనం లేదు. సరికదా... కథనం కూడా నత్తనడకన సాగుతుంది. ఏ పాయింట్‌కీ లాజిక్‌ ఉండదు. చిత్ర ఆత్మహత్య చేసుకోవడానికి బలమైన కారణం కనిపించదు.
కాలేజీ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. ఫామ్‌ హౌస్‌లోకి కథ ఎంటర్‌ అయిన తరవాతైనా, సినిమా జోరందుకుంటుందనుకుంటే అదీ ఉండదు. రాత్రి సమయంలో దెయ్యం రావడం, మిత్రబృందం భయపడడం ఇవి అటు భయాన్నీ, ఇటు వినోదాన్నీ ఇవ్వలేకపోయాయి. ద్వితీయార్ధంలో కథనం మరింత నెమ్మదిస్తుంది. లాజిక్‌ లేని కథ, కథనాలు మరింత బోర్‌ కొట్టిస్తాయి. పతాక దృశ్యాలు కూడా అంతగా అతకలేదు. రకరకాల పాత్రలు తెరపైకి వస్తూ, పోతూ ఉంటాయి. కానీ ఏ పాత్రకీ దర్శకుడు న్యాయం చేయలేకపోయాడు. కథని మరో పది నిమిషాలు సాగదీయడానికి మాత్రమే పనికొచ్చాయి. ఇద్దరు
కథానాయికలున్నా ఎవ్వరికీ ఎలాంటి ప్రాధాన్యం ఉండదు.


ఎవరెలా చేశారంటే..:
ప్రేమకథలకు సుమంత్‌ అశ్విన్‌ చక్కగా సరిపోతాడు. తను చేసిన తొలి హారర్‌ కామెడీ సినిమా ఇది. కాలేజీ సన్నివేశాల్లో చలాకీగా నటించిన సుమంత్‌..హారర్‌ ఎపిసోడ్స్‌ వచ్చేసరికి తేలిపోయాడు. కొన్ని చోట్ల తన హావభావాలు మరింత ఓవర్‌గా అనిపిస్తాయి. ఎక్కడికి పోతావు చిన్నవాడాలో దెయ్యం రూపంలో నందితా శ్వేత ఓకే అనిపిస్తుంది. అయితే పతాక సన్నివేశాల్లో తన నటన కూడా చెప్పుకోదగిన స్థాయిలో లేదు. సిద్ది పాత్రనీ దర్శకుడు సరిగా తీర్చిదిద్దలేదు. సుమంత్‌ స్నేహితులుగా నటించినవాళ్లు మాత్రం ఓకే అనిపిస్తారు. నవ్వించే ప్రయత్నం చేశారు. మిగిలిన వాళ్లవన్నీ టైమ్‌ పాస్‌ పాత్రలే.
కథ, కథనాలలో లోపం స్పష్టంగా కనిపిస్తుంటుంది. హారర్‌ కామెడీ చిత్రాలలో బలమైన కథ అవసరం లేదు. కానీ... చిన్నపాటి లైన్‌ అయినా కాస్త ఆసక్తికరంగా ఉండాలి. కొన్ని మలుపులు అవసరం. వాటి కోసం దర్శకుడు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఓ ఫామ్‌ హౌస్‌, అందులో దెయ్యం, పగ, ప్రతీకారం అనే కాన్సెప్టుని దర్శకులు ఇప్పటికైనా మర్చిపోతే మేలేమో. జేబీ అందించిన నేపథ్య సంగీతం, కెమెరా పనితనం... ఇవేమీ ఈ కథని కాపాడలేకపోయాయి. నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రంగానే కనిపించాయి.

బలాలు
+ టైటిల్‌
+ అక్కడక్కడ కాస్త వినోదం

బలహీనతలు
- కథ, కథనం
- భయం లేకపోవడం
- నవ్వుల పాలైన కామెడీ

చివరిగా:
భయపెట్టని చిత్రమ్‌

గమనిక:
ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.