రివ్యూ: రాగ‌ల 24 గంట‌ల్లో
న‌టీన‌టులు:
సత్యదేవ్, ఈషా రెబ్భ, శ్రీరామ్, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ, కృష్ణభగవాన్, టెంపర్ వంశీ, అజయ్, అనురాగ్, రవి వర్మ, రవిప్రకాష్, మానిక్ రెడ్డి,
అదిరే అభి తదితరులు,

సాంకేతిక‌వ‌ర్గం:
కథ: వై.శ్రీనివాస్ వర్మ, మాటలు: కృష్ణభగవాన్, సంగీతం: రఘు కుంచె, పాటల రచయితలు: భాస్కరభట్ల, శ్రీమణి, ఛాయాగ్ర‌హ‌ణం: గరుడవేగ అంజి, క‌ళ‌:
చిన్నా, కూర్పు: తమ్మిరాజు, పోరాటాలు: విక్కీ, నృత్యాలు: స్వర్ణ, భాను, నిర్మాత‌: శ్రీనివాస్ కానూరు, ద‌ర్శ‌క‌త్వం: శ్రీనివాస్ రెడ్డి.

సంస్థ‌: శ‌్రీకార్తికేయ సెల్యూలాయిడ్స్‌,
విడుద‌ల‌: 22 న‌వంబ‌రు 2019.


శ్రీనివాస్‌రెడ్డి అన‌గానే కామెడీ సినిమాలే గుర్తుకొస్తాయి. వాటిపై ఆయ‌న చూపించిన ప్ర‌భావం అలాంటిది. ఆయ‌న ఈసారి కొత్త‌గా థ్రిల్ల‌ర్ క‌థ‌పై దృష్టిపెట్టారు. అలా ద‌ర్శ‌కులు ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ పంథా మార్చి కొత్త ర‌క‌మైన ప్ర‌య‌త్నాలు చేయ‌డం మంచిదే అంటారు సినిమా పెద్ద‌లు. మ‌రి శ్రీనివాస్‌రెడ్డి చేసిన థ్రిల్ల‌ర్ చిత్రం `రాగ‌ల 24 గంట‌ల్లో` ఎలా ఉంది? ప్రేక్ష‌కుల‌కి ఏమాత్రం కొత్త‌ద‌నం పంచుతుందో తెలుసుకునేముందు క‌థ‌లోకి వెళదాం...

@ క‌థ‌
రాహుల్ (స‌త్య‌దేవ్) ఒక ప్ర‌ముఖ యాడ్ ఫిల్మ్ మేక‌ర్‌. త‌న చుట్టూ వంద‌ల మంది మోడ‌ల్స్ ఉన్నా ఆయ‌న మాత్రం అనాథ అయిన విద్య (ఈషారెబ్బా)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ ఇంట్లోకి జైలు నుంచి పారిపోయి వ‌చ్చిన ముగ్గురు క‌రుడు గ‌ట్టిన నేర‌స్తులు చొర‌బ‌డ‌తారు. పోలీసుల నుంచి త‌ప్పించుకునేందుకు ఆ ఇంట్లోని ఒక వార్డ్ రోబ్‌లో దాక్కునేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అందులో రాహుల్ శవం ఉండ‌టంతో భ‌య‌ప‌డ‌తారు. ఆ శ‌వం త‌న భ‌ర్త‌దే అని, త‌న‌ని నేనే చంపాన‌ని విద్య చెబుతుంది. రాహుల్‌ని విద్య చంపాల్సిన అవ‌స‌రం ఎందుకొచ్చింది? నిజంగా ఆమే చంపిందా? నేర‌స్తులు ఆ ఇంట్లోకే ఎందుకు చొర‌బ‌డ్డారు? నేర‌స్తులు పోలీసుల‌కి చిక్కారా లేదా? వాళ్లు చేసిన నేరం ఏమిటి? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

@ విశ్లేష‌ణ‌
మ‌లుపు మంచిదే. కానీ.. అది ప్రేక్ష‌కుడిని గుక్క‌తిప్పుకోనీయ‌ని స్థాయిలో ఉండ‌కూడ‌దు. ఒక మ‌లుపు, అది పంచే థ్రిల్‌ని ఆస్వాదించాకే మ‌రో మ‌లుపు రావాలి. అంతే కానీ.. ఒక‌టి త‌ర్వాత మ‌రొక‌టి వ‌చ్చిందంటే అస‌లేం జ‌రిగిందో ప్రేక్ష‌కుడికి ఒక ప‌ట్టాన అర్థం కాదు. ఈ సినిమా విష‌యంలో కూడా అదే జ‌రిగింది. థ్రిల్ల‌ర్ సినిమాకి కావ‌ల్సిన ల‌క్ష‌ణాల‌న్నీ ఇందులో ఉన్నాయి. తొలి స‌న్నివేశం నుంచే ప్రేక్ష‌కుడిలో ఆస‌క్తిని రేకెత్తించారు ద‌ర్శ‌కుడు. అయితే ఆ గాఢ‌త సినిమా మొత్తం కొన‌సాగేలా చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. దాంతో కొన్ని స‌న్నివేశాలు మెప్పించినా, కొన్ని చోట్ల మాత్రం సాదాసీదాగా ఒక స‌గ‌టు సినిమాలా అనిపిస్తుంది. నేర‌స్తులు సైతం భ‌య‌పడేలా తొలి స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు ద‌ర్శ‌కుడు. ఆ త‌ర్వాత మొద‌ల‌య్యే ఫ్లాష్‌బ్యాక్ మాత్రం చాలా సినిమాల్లో చూసిన‌ట్టే ఉంది. అయితే అందులో విద్య‌గా ఈషా అందం, సైకోగా స‌త్య‌దేవ్ అభిన‌యం క‌ట్టిప‌డేస్తుంది. కానీ థ్రిల్ల‌ర్ సినిమాకి వేగం కావాలి. అది ఈ సినిమాలో చాలా చోట్ల లోపించింది. ప్ర‌థ‌మార్థంలో క‌థంతా చెప్పిన ద‌ర్శ‌కుడు ద్వితీయార్థంలో మ‌లుపుల‌పైనే ఆధార‌ప‌డ్డారు. అయితే అవి ప్రేక్ష‌కుడిలో కొన్నిసార్లు గంద‌ర‌గోళానికి కార‌ణ‌మ‌వుతాయి. ప్ర‌థ‌మార్థం త‌ర‌హాలో ద్వితీయార్థంలో కూడా నేర‌స్తుల ఫ్లాష్‌బ్యాక్‌ని చెప్పించి, మ‌ళ్లీ అక్క‌డ ఒక పాట చూపించి సాగ‌దీశారు. అది మిన‌హాయిస్తే సినిమా ఆస‌క్తిక‌రంగానే సాగుతుంది. ఈషారెబ్బాని ప‌ల్లెటూరి అమ్మాయిగా, అనాథాశ్ర‌మంలో పెరిగిన అమ్మాయిగా ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడు ఆ త‌ర్వాత కారు డ్రైవ్ చేస్తూ మోడ్ర‌న్‌గా చూపించారు. ఏసీపీ పాత్ర‌ని కూడా సినిమాకి త‌గ్గ‌ట్టుగా మ‌లిచిన‌ట్టు అనిపిస్తుంది త‌ప్ప‌... అందులో స‌హ‌జ‌త్వం క‌నిపించ‌దు. త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఉత్సుక‌త రేకెత్తించ‌డంలో మాత్రం ద‌ర్శ‌కుడు విజ‌య‌వంత‌మ‌య్యాడు.


@ న‌టీన‌టులు.. సాంకేతిక‌త
ఈషారెబ్బా నాయికా ప్రాధాన్య‌మున్న పాత్ర‌తో ఆక‌ట్టుకుంది. స‌హ‌జమైన అందంతో క‌నిపించింది. అమాయ‌క‌త్వంతో కూడిన పాత్ర‌లో ఆమె అభిన‌యం మెప్పిస్తుంది. స‌త్య‌దేవ్ వ్య‌తిరేక ఛాయ‌ల‌తోకూడిన పాత్ర‌లో చాలా బాగా నటించాడు. సైకోగా ఆయ‌న అభిన‌యంలో మ‌రో కోణం క‌నిపిస్తుంది. ఏసీపీ న‌ర‌సింహ‌గా శ్రీరామ్ పాత్ర కూడా సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. ఈషా స్నేహితుడిగా గ‌ణేష్ వెంక‌ట్రామ‌న్, మోడ‌ల్‌గా ముస్కాన్ సేథీ, ప‌క్కింటి అంకుల్‌గా కృష్ణ‌భ‌గ‌వాన్, దాస్ పాత్ర‌లో ర‌వివ‌ర్మ త‌దితరులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. ఇందులో సాంకేతిక విభాగం ప‌రంగా ర‌ఘు కుంచె సంగీతం, అంజి కెమెరా ప‌నిత‌నం ప‌ర్వాలేద‌నిపిస్తాయి. న‌టుడు కృష్ణ‌భ‌గ‌వాన్ రాసిన మాట‌ల్లో అక్క‌డ‌క్క‌డా చ‌మ‌క్కులు వినిపిస్తాయి. శ్రీనివాస్‌వ‌ర్మ క‌థ బాగుంది. దాన్ని ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్ద‌డంలో ద‌ర్శ‌కుడు శ్రీనివాస్‌రెడ్డి తీసుకున్న జాగ్ర‌త్త‌లు మంచి ఫ‌లితాల్నే ఇచ్చాయి. నిర్మాణం ప‌రంగా సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.

@ చివ‌రిగా...
థ్రిల్ల‌ర్ ఏ పాత్ర ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో, ఏ పాత్ర ఎలాంటి మలుపుకు కార‌ణ‌మ‌వుతుందో ఊహించ‌లేం. ఇందులో కూడా అంతే. అస‌లు నేర‌స్తులు ఎవ‌రో చివ‌రి వ‌ర‌కు బ‌య‌టికి రాదు. హాస్య ప్ర‌ధాన‌మైన చిత్రాలు తీసిన శ్రీనివాస్‌రెడ్డి థ్రిల్ల‌ర్ క‌థ‌ల‌పై కూడా మంచి ప్ర‌భావం చూపించ‌గ‌ల‌ర‌ని నిరూపించిన చిత్ర‌మిది. థ్రిల్ల‌ర్ సినిమాల్ని ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల‌కు మంచి కాల‌క్షేపాన్నిచ్చే చిత్ర‌మిది. 


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.