రివ్యూ: రాక్షసుడు
నటీనటులు:
బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, రాజీవ్‌ కనకాల, కాశీ విశ్వనాథ్, కేశవ్‌ దీపక్, రవిప్రకాష్‌ తదితరులు.

సాంకేతిక బృందం:
ఛాయాగ్రహణం: వెంకట్‌ సి.దిలీప్
సంగీతం: జిబ్రాన్
కథ, కథనం: రామ్‌కుమార్
నిర్మాణం: కోనేరు సత్యనారాయణ 
దర్శకత్వం: రమేష్‌ వర్మ
సంస్థ: హవీష్‌ లక్ష్మణ్‌ కోనేరు ప్రొడక్షన్స్‌ 
విడుదల: 2 ఆగస్టు 2019.


అన్ని సినిమాల్నీ రీమేక్  చేయ‌డానికి సాధ్యం కాదు. కొన్ని నేటివిటీతో ముడిప‌డి ఉంటాయి. మ‌రికొన్ని మాతృక‌లోని ఆత్మ‌ని  మ‌రోసారి ఆవిష్క‌రించ‌లేని విధంగా ఉంటాయి. అలాంటి సినిమాల విష‌యంలో ఆచితూచి అడుగేయాల్సిందే. కొన్ని మాత్రం మార్పులు చేర్పులు అవ‌స‌రం లేని విధంగా... ఎక్క‌డైనా ఎవ‌రైనా తీసుకోవ‌చ్చనేలా ఉంటాయి. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన  `రాచ్చ‌స‌న్‌` అలాంటి సినిమానే.  కానీ తెలుగులో కొన్నిసార్లు ఇలాంటి క‌థ‌ల్నీ ఇమేజ్ పేరుతోనూ, క‌మ‌ర్షియ‌ల్ అంశాల పేరుతోనూ  మార్చేస్తుంటారు. ఆ క్ర‌మంలోనే అస‌లు క‌థ ప‌క్క‌దారి ప‌డుతుంటుంది. `రాక్ష‌సుడు` విష‌యంలో మాత్రం ప‌క్కాగా  మాతృక‌ని అనుస‌రించారు. మ‌రి ఈ చిత్రం బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌కి ఎలాంటి ఫ‌లితాన్నిస్తుంది?  సినిమా ఎలా ఉంది? త‌దిత‌ర విష‌యాల్ని తెలుసుకుందాం ప‌దండి.. 

క‌థ
అరుణ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌) ల‌క్ష్యం ద‌ర్శ‌కుడు కావాల‌న్న‌ది. త‌న ద‌గ్గ‌రున్న క్రైమ్ క‌థ‌తో ప‌రిశ్ర‌మ‌లో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల్నికలుస్తూ  ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. కానీ ఆ ప్ర‌య‌త్నం ఫ‌లించ‌దు. ఇంత‌లో కుటుంబ స‌భ్యుల ఒత్తిడి మేర‌కు ఎస్సై ఉద్యోగంలో చేర‌తాడు. త‌న స్టేష‌న్ ప‌రిధిలో స్కూలు పిల్ల‌ల హ‌త్యోదంతాలు క‌ల‌కలం సృష్టిస్తాయి. ఆ కేసుని ఛేదించే క్ర‌మంలో త‌న క్రైమ్ క‌థ‌ల కోసం చేసిన ప‌రిశోధ‌న అక్క‌రకొస్తుంది. హంత‌కుడు ఎలాంటోడో పై అధికారుల‌కి చెబుతాడు. కానీ వాళ్లు అరుణ్ మాట‌ల్ని లెక్క‌చేయ‌రు. ఇంత‌లో అరుణ్ మేన‌కోడ‌లు కూడా హ‌త్య‌కి గుర‌వుతుంది. ఈ కేసు విష‌యంలోనే అరుణ్‌ని పైఅధికారులు సస్పెండ్ కూడా చేస్తారు. కానీ ఈ కేసుని ఎలాగైనా ఛేదించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న అరుణ్ హంత‌కుడి కోసం వేట కొన‌సాగిస్తాడు. ఆ క్ర‌మంలో ఎలాంటి విష‌యాలు తెలిశాయి? అస‌లు హంతుకుడు ఎవ‌రు? అత‌న్ని అరుణ్ ఎలా ప‌ట్టుకున్నాడ‌నేది తెర‌పైనే చూడాలి. 


*విశ్లేష‌ణ‌
తీగ లాగితే డొంక క‌దిలింద‌నే మాటని నేరాల విష‌యంలో త‌ర‌చూ  వింటూనే ఉంటాం. కానీ లాగ‌డానికి ఆ తీగే దొర‌క్క‌పోతే?  నేరాలు చేసే హంతకుడు ఎలాంటి క్లూ ఇవ్వ‌కుండా తాను చేయాల‌నుకొన్న‌ది చేస్తే? అక్క‌డే క‌థ అడ్డం తిరుగుతుంది. ఈ క‌థ‌లో కూడా అంతే. హ‌త్య‌లు చేస్తున్న‌ది సైకో అని తెలుసు. కానీ అత‌ను ఎందుకు చేస్తున్నాడు? ఎలా చేస్తున్నాడ‌నేదే ఎవ‌రికీ అంతుచిక్క‌దు.  ఆ క్ర‌మంలో ఎన్నెన్నో అనుమానాలు, ఎవ‌రెవ‌రిపైనో అనుమానాలు. కానీ అస‌లు విష‌యం మాత్రం మ‌రొక‌టి ఉంటుంది. అలా తొలి స‌గ‌భాగం మొత్తం ప్ర‌శ్న‌ల‌తోనే సాగుతుంది. ద్వితీయార్థంలోనే అస‌లు క‌థ ఉంటుంది. క‌థ‌కి బేస్‌గా ఆరంభ స‌న్నివేశాల్ని వాడుకొన్నా, ఆ త‌ర్వా త వెంట‌నే క‌థ‌లోకి వెళుతుంది సినిమా. హంతకుడి కోసం సాగే వేట, ఆ క్ర‌మంలో రేకెత్తే అనుమానాలు, వాటిని నివృత్తి చేసుకునేందుకు జ‌రిగే పరిశోధ‌న ఆస‌క్తిని రేకెత్తిస్తుంది.  చాలా స‌న్నివేశాలు ప్రేక్ష‌కుడిని సీటు అంచున కూర్చోబెడ‌తాయి. ద్వితీయార్థంలో ఒక చిన్న క్లూ ఆధారంగా సైకోని వెంటాడే వైనం ఆక‌ట్టుకుంటుంది. సైకో నేప‌థ్యం కూడా ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ఆ త‌ర్వాత స‌న్నివేశాలే సాగ‌దీత‌గా మారిపోయాయి.  ప‌తాక స‌న్నివేశాల్లో మ‌రికొన్ని మ‌లుపులతో సినిమాని న‌డిపించారు. అప్ప‌టికే హంతుకుడెవ‌రో తెలిసిపోవ‌డంతో థ్రిల్ పండ‌లేదు. దాంతో స‌న్నివేశాలు సాగ‌దీత‌లా మారిపోయాయి.  కానీ ఒక ప‌రిశోధ‌నాత్మ‌క థ్రిల్ల‌ర్‌కి ఉండాల్సిన ల‌క్ష‌ణాల‌న్నీ ఈ సినిమాలో ఉన్నాయి. మాతృక‌ని ప‌క్కాగా అనుస‌రించి ప్రేక్ష‌కుల్ని థ్రిల్‌కి గురిచేశాడు ద‌ర్శ‌కుడు. * న‌టీన‌టులు..సాంకేతిక బృందం 
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కొత్తగా విధుల్లోకి చేరిన ఎస్సై పాత్రల్లో చక్కగా ఒదిగిపోయాడు. కుటుంబ నేపథ్యం, భావోద్వేగాలకి సంబంధించిన సన్నివేశాల్లోనూ పాత్రకి తగ్గట్టుగా నటించాడు. అనుపమ పరమేశ్వరన్‌ పాత్ర పరిమితమే. రాజీవ్‌ కనకాల, కాశీ విశ్వనాథ్‌ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. కీలకమైన క్రిస్టోఫర్‌ పాత్రలో శరవణన్‌ నటించాడు. మరికొన్ని కీలకమైన పాత్రల్లో తమిళ నటులు కనిపించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. వెంకట్‌ సి దిలీప్‌ ఛాయాగ్రహణం, జిబ్రాన్‌ సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. దర్శకుడు రమేష్‌ వర్మ కథపై ఆద్యంతం పట్టుని ప్రదర్శించాడు. దాంతో సినిమా ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగుతుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.* చివరిగా:  క‌థనంతో ర‌క్తిక‌ట్టించే చిత్ర‌మిది. ప‌తాక స‌న్నివేశాల్లో మిన‌హా `రాక్ష‌సుడు` అడుగ‌డుగునా ఉత్కంఠ‌కి గురిచేస్తుంది.  


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.