రివ్యూ: రణరంగం
రివ్యూ: రణరంగం
చిత్రం: రణరంగం
నటీనటులు: శర్వానంద్‌, కల్యాణి ప్రియదర్శన్‌, కాజల్‌, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సుబ్బరాజు తదితరులు
దర్శకుడు: సుధీర్‌వర్మ:
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
నిర్మాణ సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌;
సంగీతం: ప్రశాంత్‌ పిళ్లై
విడుదల తేదీ: 15-08-2019


విభిన్న కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శర్వానంద్‌. ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’, ‘పడిపడిలేచె మనసు’ వంటి ప్రేమ కథా చిత్రాలతో అలరించాడు. అటు హస్య ప్రధాన, కుటుంబ కథా చిత్రాల్లోనూ మెరిశాడు. ఈ సారి ‘రణరంగం’తో గ్యాంగ్‌స్టర్‌గా ముందుకొచ్చాడు. ఇందులో శర్వా 25 ఏళ్ల కుర్రాడిగా, 45 ఏళ్ల వ్యక్తిగా కనిపించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం శర్వాకు హిట్‌ ఇచ్చిందా? యువ దర్శకుడు సుధీర్‌ వర్మ మరోసారి మ్యాజిక్‌ చేశాడా?

* కథేంటంటే..
1995లో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్న రోజులవి. విశాఖపట్నంలో దేవ (శర్వానంద్‌) బ్లాక్‌ టికెట్లు అమ్ముకుంటూ, స్నేహితులతో కాలక్షేపం చేస్తుంటాడు. దేవ ఓ అనాథ. స్నేహితులు, బ్లాక్‌ టికెట్లు తప్ప మరో ప్రపంచం తెలియదు. తన కాలనీలోని గీత (కల్యాణి ప్రియదర్శన్‌)ని చూసి ప్రేమిస్తాడు. బ్లాక్‌ టికెట్లు అమ్ముకోవడం కంటే బ్లాక్‌లో మద్యం అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చనే ఆశతో పక్క రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి అమ్ముతుంటాడు. దీంతో తనకు ఆదాయం పెరగడంతోపాటు శత్రువులు కూడా పెరుగుతుంటారు. వారి వల్ల దేవ స్నేహితులకు అపాయం ఏర్పడుతుంది. తనవారిని కాపాడుకోవడానికి శత్రువుల కంటే బలవంతుడిగా, ధనవంతుడిగా మారే ప్రయత్నం చేస్తాడు దేవ. ఆ ప్రయాణంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు, వెన్నుపోట్లు ఏంటి?తను కోల్పోయింది ఏంటి? తను సంపాదించింది ఏంటి? అనేదే కథ.
* ఎలా ఉందంటే..
‘గాడ్‌ఫాదర్‌’ సినిమా చూసి స్ఫూర్తి పొంది మణిరత్నం, రామ్‌గోపాల్‌ వర్మ నుంచి చాలా మంది దర్శకులు సినిమాలు తీశారు. అందులో ‘రణరంగం’ ఒక్కటి. ఓ అనాథ మాఫియా డాన్‌గా ఎదగడమే ఈ కథల సారాంశం. ‘రణరంగం’ అందుకు ఏ మాత్రం మినహాయింపు కాదు. ఓ కథని, పాత్రను స్ఫూర్తిగా తీసుకుని కొత్త కథలు రాసుకోవడం, కొత్త పాత్రలు సృష్టించుకోవడం తప్పేమీ కాదు. కానీ అవన్నీ నేటి ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా మలచుకోవాలి. పాత కథ మాటునే కొత్త విషయాన్ని చెబుతున్నామనే భ్రమనైనా కలిగించాలి. ఈ విషయంలో సుధీర్‌వర్మ తేలిపోయారు. ‘గాడ్‌ఫాదర్’‌, ‘నాయకుడు’, ‘సత్య’, ‘శివ’ లాంటి సినిమాలు చూసిన వారికి ‘రణరంగం’ కథలో కథనాయకుడి పాత్రలో ఏ మాత్రం కొత్తదనం కనిపించదు. కథని చాలా నెమ్మదిగా ప్రారంభించిన దర్శకుడు అసలు విషయంలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకుంటాడు. బ్లాక్‌లో టికెట్లు అమ్మడం, స్నేహితులతో పరాచకాలు, జైలులో తమాషా, గీతతో ప్రేమకథ.. వీటికి సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ఈ సినిమాకు సంబంధించినంత వరకు ఉపశమనం కలిగించే అంశాలు అవే.


ఫ్లాష్‌బ్యాక్‌ను, ప్రస్తుత కథను ముక్కలు ముక్కలుగా చేసి చూపించడం ప్రేక్షకులను కాస్త గందరగోళంలోకి పడేస్తుంది. అటు ఫ్లాష్‌బ్యాక్‌ను, ఇటు జరుగుతున్న కథను సంపూర్ణంగా ఆస్వాదించలేకపోతాడు. ద్వితీయార్ధాన్ని ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నా.. దర్శకుడు రొటీన్‌ స్క్రీన్‌ప్లేనే పాటించాడు. కథలో మలుపులు ఏమీ లేకపోవడంతో ద్వితీయార్ధం ఓ సాగదీతలా అనిపిస్తుంది. ఈ కథను ఇలానే ముగిస్తారేమో అనుకుంటున్న దశలో ఓ ఊహించని ట్విస్ట్‌ వచ్చి పడుతుంది. కానీ దాని వల్ల ఈ కథకు వచ్చే అదనపు ప్రయోజం ఏమీ కనిపించదు. అది కూడా కాస్తో, కూస్తో ‘రంగస్థలం’ ట్విస్ట్‌లా కనిపిస్తుంది. మొత్తానికి ‘గాడ్‌ఫాదర్‌’ సినిమాను స్ఫూర్తిగా తీసుకున్న దర్శకుడు దాన్ని ఈ తరానికి నచ్చేలా తీర్చిదిద్దడంలో విఫలం అయ్యాడు.

* ఎవరెలా చేశారంటే..
శర్వా రెండు విభిన్నమైన గెటప్‌లలో కనిపిస్తారు. 25 ఏళ్ల హుషారైన కుర్రాడిగా ఆయన నటించిన లవ్‌ ట్రాక్‌ బాగా నచ్చుతుంది. 45 ఏళ్ల వయసు వ్యక్తి పాత్రలోనూ చక్కగా ఒదిగిపోయారు. కల్యాణి ప్రియదర్శన్‌ అందంగా కనిపించారు. కాజల్‌ పాత్రను సరిగ్గా ఉపయోగించలేదు. ఆమెపై తెరకెక్కించిన ఒకే ఒక్క పాటను కూడా వృథా చేశారు. శర్వా స్నేహితులుగా నటించిన వారు చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. మురళీ శర్మ నటన గత చిత్రాలతో పోల్చితే కాస్త విభిన్నంగా ఉంటుంది. తొలి భాగంలో వినిపించే పాటలు హుషారుగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్టు సాగింది. ప్రొడక్షన్‌ డిజైనర్‌ రవీందర్‌ పనితనం ఆకట్టుకుంది. 1995 నేపథ్యాన్ని ఆయన తెరపై చాలా ప్రతిభావంతంగా చూపించగలిగారు. విశాఖ తీరంలో ఆయన వేసిన సెట్‌లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కెమెరా పనితనం వన్నె తెచ్చింది. దర్శకుడిగా, కథకుడిగా విఫలమైన సుధీర్‌వర్మ.. మాటల రచయితగా మాత్రం విజయం సాధించారు. చాలా సంభాషణలు ఆకట్టుకుంటాయి.


> బలాలు :
+ కథా నేపథ్యం
+ కళా దర్శకుడి ప్రతిభ
+ శర్వానంద్‌ నటన
+ నిర్మాణ విలువలు

> బలహీనతలు :
- కథ, కథనం - ద్వితీయార్ధం

* చివరిగా..
‘రణరంగం’ కొందర్నే మెప్పిస్తుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.